Tuesday, 3 January 2012

నో టార్గెట్స్ ఇన్ 2012

ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరము వస్తుందనగానే, తాము మార్చుకోవలననుకొంటున్న అలవాట్లు, మరియు మొదలుపెడదమనుకొన్న పనులను కొత్త సంవత్సరము ప్రారంభం నుండి మొదలుపెట్టాలని అనుకుంటారు. కాని ఎంత మంది తాము అనుకొన్న విధముగా ఖచ్చితముగా చేయగలరో ఆ దేవుడికే తెలియాలి. ఇకపోతే నేను మాత్రము కొత్త సంవత్సరము వస్తుందనగానే, ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోలేదు. పెట్టుకోదలచుకోలేదు కూడా. ఎందుకంటే అవి అలోచించడానికి కూడా బద్దకం కాబట్టి. నిజమండీ, టార్గెట్స్ ఏర్పరచుకోవడానికి కనీసము ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే బద్దకం.. అలోచించి బుర్ర పాడుచేసుకోవడం ఎందుకని. ఇంకా చెప్పాలంటే అప్పటి వరకు చేస్తున్న కొన్ని కొన్ని పనులకు ఎగనామం పెట్టాను ఈ సంవత్సరములో. ఇంకా కొత్తగా ఏమి టార్గెట్ పెట్టుకుంటాము చెప్పండి.
 ఏదో ఒకటి చేస్తున్నామనిపించికోవడానికి ఉదయము పూట వాకింగ్ కి వెళ్తున్నాను. నిజానికి అసలు కారణము వేరే, అదేమిటంటే ఎక్కువసేపు పడుకుంటే బుగ్గలు పెరుగుతాయి అని నాకులాంటి ఎవరో తలకుమాసిన వెధవ నాతో గోకాడు. ఇక అప్పటి నుండి మన నిద్ర ఎక్కువయిపోతుందని బెంగపడిపోయి (అంటే బుగ్గలు పెరుగుపోతాయని) ఉదయము తొందరగా మెలకువ తెచ్చుకోవడం అలవాటు చేసుకొన్నాను. మరి బుగ్గలు తగ్గాయా? అని అడక్కండి.. అవి అలాగే ఉన్నాయిలెండి. ఇదిలా ఉండగా, ఇందకా పైన చెప్పుకొన్నట్టు అందరూ కొత్త సంవత్సర ప్రారంభం నుండి ఏదొక మంచి అలవాటు చేసుకోవాలని చూస్తే, నేను మాత్రము అప్పటి వరకు నాకున్న మంచి అలవాటయిన వాకింగ్ కి ఎగనామము పెట్టేసా.. అదేంటొ అప్పటి వరకు బాగానే చేసిన వాకింగ్ ని కరెక్టుగా ఈ నెల ఒకటి నుండే మానేసాను. విచిత్రం.. నాల్గు రోజులు వాకింగ్ మానివేస్తేనే, నా బుగ్గలు కొద్దిగా పెరుగినట్టుగా అనిపించిందండీ పొద్దున్న నా ముఖం అద్దంలో చూసుకొన్నప్పుడు. అదేంటొ వరుసబెట్టి కంటిన్యూగా వాకింగ్ కి వెళ్ళినప్పుడు బుగ్గలు కొంచెం కూడా తగ్గలేదు కాని ఓ నాల్గు రోజులు మానేస్తే పెరగడం ఎంత అన్యాయమండీ. ఏం చేస్తామండి మన ఖర్మ అలా తగలడింది. అందుకని రేపటి నుండి ఎలాగయిన మళ్ళి మొదలెట్టాలి వాకింగ్. అలా మనము టార్గెట్ కాని టార్గెట్ పెట్టుకున్నానండి ఈ వేళ. ఇకపోతే మొన్నటికి మా ఫ్రెండ్ ఒకడూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, "గత సంవత్సరములో చేసిన తప్పులు గురించి అలోచించి సమయము వృధా చేయకు, ఈ సంవత్సరము కొత్త తప్పులు ఎలా చేయాలా అని అలోచించు" అని మెసెజ్ పెట్టాడు. చదవగానే అహా ఎంత బాగా రాశాడనిపించిందండి.(నిజానికి మీకు కూడా అలానే అనిపించింది కదా). తప్పులు చేయడాన్ని అందరూ ఎంత నామోషిగా తీసుకుంటారు కానీ, నిజానికి తప్పులు చేయలంటే గట్స్ ఉండాలి కదండీ: విజయాలన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటే వస్తాయి. దాని కోసము బోలెడంతా స్కెచ్ తయారుచేసుకోవాలి. అదే తప్పులు చేయాలంటే అవేవి అవసరము లేదు. ఇంకా చెప్పాలంటే దానికి ఎటువంటి స్కెచ్ తయారుచేసుకొనవసరం లేదు. బాగుంది కదా నా ధియరీ.. పోయినేడాది బోలోడన్ని టార్గెట్స్ పెట్టేసుకొని, అందులో ఒకటి టార్గెట్ పూర్తి చేయలేక, పైగా నా టార్గెట్స్ మాట దేవుడెరుగు... నేను అసలు ఊహించని బోలెడన్ని ఫెయిలర్స్ నా గత సంవత్సర ఖాతాలోకి తన్నుకుంటు వచ్చేయడంతో నా ధియరీ ఈ విధముగా మారిపోయిందని మీరు అనుకోకండేయి. (నిజానికి అదే అసలు కారణం). అందుకని ఈ సంవత్సరము ఎన్ని ఫెయిల్యర్స్ చేయగలమో ఇప్పటి నుండి తెగ అలోచించడానికి కూడా బద్దకం వచ్చేస్తుందండి బాబు. ఈ లెక్కన మనకి ఈ సంవత్సరము ఏ చిన్న విజయము పొందినా, అది గొప్పదిగా మిగిలిపోవచ్చుననుకొంటా(అంటే ఈ సంవత్సరము మహేష్ బాబుకి దూకుడు లాంటి సాధారణ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా అనిపించి ఫీలయినట్టు) (మహేశ్ బాబు ఫాన్స్ కి కోపం వస్తే వార్కి నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను). అందుకని ఈ సంవత్సరము ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోకుండా ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి. కాని ఇప్పుఇప్పుడే తప్పుడు అలోచనలు వచ్చేస్తున్నాయండి నా బుర్రలోకి. వాకింగ్ కే తిన్నగా వెళ్ళి రావడం చేతకాలేదు కాని, జిమ్ కి వెళ్ళాలని తెగ ఉబలాటం వచ్చేస్తుంది ఈ మధ్య... అంతే కాదండొయ్, గ్రూప్ పరీక్షలకు కూడా రాసేయాలని తెగ అనిపిస్తుంది కూడా. ఈ సంవత్సరము పొద్దున్నే ఎవడి ముఖం చూసానో కాని. ఇలాంటి అలోచనలు వచ్చి, వాటిని అచరణలో పెట్టడం మొదలెడితే ఏమయిపోతానన్న బెంగ నాకి మధ్య ఎక్కువయిపోయింది.
 ఈ గ్రూప్ లు గొడవ అలా అయిందో లేదో... మరల ఇంకొక కొత్తగా బిజినెస్ స్టార్ చేయాలన్న అలోచన వచ్చేస్తుంది.. అయ్యబాబోయ్ నాకేదో దెయ్యం పట్టుకున్నట్టుంది ఈ వేళ... లేకపోతే ఇన్ని టార్గెట్స్ పెట్టుకుంటే నేను ఎలా బ్రతకాలని తెగ మధనపడిపోతుందండి నా అంతరాత్మ(చ్చ. వీడికో అంతరాత్మ కూడానా?). అలా అనకండి. ఈ మాట కనుక వాడు విన్నాడనుకొండి.. నిజంగానే వాటనన్నిటిని చేసేయాలంటాడు. కాబట్టి గమ్మున యుండండి. మీరు మాత్రము నాకు మల్లే కాకుండా మంచి మంచి టార్గెట్స్ పెట్టుకొండి... ఒక వేళ మీరు కూడా బొర్లాపడ్డారనుకొండి.. అప్పుడు మీరు కూడా నా ధియరీని ఫాలో అయిపోదురు కాని. సరేనా>>>
పి.ఎస్. బుడుగు బొమ్మలని నా అర్టికల్ లో వాడుకున్నందుకు బాపూ గార్కి క్షమపణలు చెప్పుకుంటూ...

No comments:

Post a Comment