Friday 25 November 2011

ఒకసారి ఏమైందంటే......

అది ఈ సంవత్సరం ఏప్రిల్ మాసము. రౌతులపూడిలో ఉంటున్న మా అన్నయ్య వాళ్ళ కూతురు మధుర మొదటి పుట్టిన రోజుకి ఖచ్చితంగా రమ్మని ఫోన్ చేసాడు. నాతో పాటుగా కలెక్టర్ ఆఫీసులో పని చేస్తున్న నా చిన్ననాటి దోస్త్ బాపూరావు ని కూడా రమ్మని కబురు చేసాడు. అప్పుడు ఆఫీసు పనితో బిజీగా ఉన్నప్పట్టికి వెళ్ళక తప్పలేదు. సాయంత్రం ఆఫీసు ఆయిన తర్వాత బాపూరావుతో కలసి వెళ్ళి, తిరిగి మళ్ళి వచ్చేయాలని అనుకొన్నాము.
ఇకపోతే రౌతులపూడిలో ఉన్న గవర్నమెంటు జనరల్ హస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ శ్రీహరి గారు మా అన్నయ్యకి స్నేహితుడు. ఆయనే కాదు, రౌతులపూడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మా అన్నయ్య తన స్నేహితులుగా చేసుకోనేవాడు. ఇంకా వివరముగా చెప్పాలంటే అతి ముఖ్యమైన వారందరిని తన స్నేహితుల జాబితాలో ఉండే విధముగా చూసుకొంటాడు. ఇలాంటి విషయాలలో మా అన్నయ్య చాలా ముందు చూపుతో ఉంటాడు. అంతే కాకుండా ఊళ్ళో ఉన్నవారందరితో మనవాడు చాలా టచ్ లో ఉంటాడు(రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవనుకుంటాను). అందు కారణముగా పుట్టినరోజు వేడుకకు అందరిని పిలిచాడు. మరియు మా రైస్ మిల్లు దగ్గర ఆ రోజు రాత్రికి వారందరికి గ్రాండ్ గా పార్టి ఎరేంజ్ చేసాడు. ఇక నేను బయలుదేరే ముందుగా నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు తెమ్మన్నరని అని చెప్పి "నీకు ఒక మెసెజ్ పంపుతాను, దానిని మందుల షాపులో తీసుకొని వచ్చేటప్పుడు పట్టుకురా" అని చెప్పి మెసెజ్ చేసాడు. మెసెజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో "Simmron Off" ఒక బాటిల్ అని రాసివుంది. ఆ మెసెజ్ లో మా వాడు తెమ్మని చెప్పిందేమోటొ మీకు తెలుసు ఉండవచ్చుమో కాని నాకు తెలియదు. ఎందుకంటే ఆ విషయములో నాకు అంత నాలెజ్ లేదు. అది ఒడ్కా బ్రాండ్ అని నాకు అసలు తెలియదు. మా అన్నయ్య సాధారణముగా తనకు కావలసిన మెడిసిన్స్ వాళ్ళ ఊరిలో దొరకపోతే నాకు మెసెజ్ పెట్టి సదరు మెడిసిన్స్ కాకినాడలో తీసుకొని పంపమనడం అలవాటు. ఆ విధముగా నేను ఎలాగూ రౌతులపూడి వస్తున్నాను కాబట్టి మెసెజ్ లో ఉన్న మెడిసిన్స్ తెమ్మని పురమాయించాడని భావించాను. అంటే వాడు పెట్టిన మెసెజ్ లొ అయిటమ్ ని నేను మెడిసిన్ గా భావించాను. పైగా మందుల షాపు అన్నాడు కాబట్టి అది ఖచ్చితముగా మెడిసిన్ ఆయివుంటుంది అని భావించాను. నిజము చెప్పాలంటే అసలు నేను ఆ మాత్రం కూడా ఆలోచించలేదు... ఇక సాయంకాలం ఆఫీసు ఆయిపోయిన తర్వాత బాపూరావు గాడితో రౌతులపూడికి బయలుదేరాను. దారిలో కనిపించిన మందుల షాపు దగ్గరకి వెళ్ళి, మా వాడు పంపిన మెసెజ్ చూపించి అందులో ఉన్న ఆయిటమ్ కావలని అడిగాము. ఆ అయిటమ్ ఏంటొ తెలియని బకారాలు మేము మాత్రమే అనుకుంటే, ఆ షాపు వాడు కూడా మాలానే బకారాల ఉన్నట్టున్నాడు.
మేము చూపించిన మెసెజ్ ని రెండు, మూడు సార్లు చదివి, ప్రక్కవాడిని అడిగి, చివరకు లేవని చెప్పి వేరే షాపుకు వెళ్ళమని సూచించాడు. సరే అని బయటకు వచ్చేసాము. నేను చూడనీ అని చెప్పి బాపూరావు కూడా మెసెజ్ చూసాడు. వాడికి లిక్కర్ బ్రాండ్స్ విషయములో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఆయినప్పటికి వాడికి స్ఫూరించలేదు అది లిక్కర్ లో ఒడ్కా చెందినదని.... మరల వేరే షాపుకి వెళ్ళితే అక్కడ లేదని చెప్పారు. దానితో ఒక ప్రక్క లేటు ఆయిపోతుందన్న భాద, ఇంకోక ప్రక్క ఆ అయిటమ్ దొరకలేదన్న బాధ ఎక్కువయిపోయాయి. ఈ లోపులో బాపురావు గాడు, మా వాడికి ఫోన్ చేసి ఆ అయిటమ్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోమని సలహా యిచ్చాడు. ఇది బాగానే ఉందనుకొని వెంటనే ఫోన్ చేసి, అన్న నువ్వు చెప్పిన మెడిసిన్ ఏ షాపులో దొరుకుతుందని అడిగా.. మా వాడికి అర్ద్రం కాలేదు నేను అన్నదేమిటో... దానితో తను పంపిన మెసెజ్ గురించి చెప్పా. ఆ తర్వాత అవతలి వైపు నుండి ఒక క్షణం నిశబ్దం, తర్వాత పెద్ద నవ్వు వినబడింది. అసలే చిరగ్గా ఉన్న నాకు దానితో ఇక చిరాకు వచ్చేసింది. అప్పుడు చెప్పాడు మా వాడు "నాయన అది మెడిసిన్ కాదు. అది ఒడ్కా బ్రాండ్... అది దొరికేది మందుల షాపులో కాదు బ్రాంది షాపులో". మరి మందుల షాపు అని చెప్పావు కదా అని అడిగాను ఉక్రోషంతో. మరి దానిని మందు షాపు కాకపోతే ఏమంటారని తిరిగి ప్రశ్నించాడు. దానిని బ్రాంది షాపు అనాలి అని చెప్పా నేను. అప్పటికే అవమానభారంతో నాకు మాట్లాడాలనిపించక ఫోన్ పెట్టేసి, మా వాడు అడిగిన బ్రాండ్ ..... తీసుకొని రౌతులపూడి బయలుదేరాను. అక్కడికి వెళ్ళిన ఆ విషయముతో మా డాక్టర్ గారితోటి మరియు అక్కడ ఉన్న వారందరికి చెప్పి ఒకటే నవ్వులు. మొదట్లో నాకు ఉక్రోషంగా అనిపించిన తర్వాత నేను కూడా వాళ్ళతో జతకలిపాను. ఇప్పటికి కూడా డాక్టర్ గారు, మా అన్నయ్య సదరు విషయమును గుర్తు చేసి ఏడిపిస్తుంటారు....

Thursday 24 November 2011

వారి నిర్లక్ష్య పాలనకు ఒక్క చెంప దెబ్బ సరిపోదు....

నిన్న కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్ పవార్ పై చెంప దెబ్బ పడిన ఉదంతానికి నేనేమి చింతించడం లేదు. పైగా అది చాలా తక్కువ చర్యగా భావిస్తున్నాను.. ఆ మాత్రమున నన్ను తప్పుగా అర్దం చేసుకోకండి. నిన్న శరద్ పవార్ పై పడిన దెబ్బ ఒక్క హర్విందర్ సింగ్ ది మాత్రమే కాదు, ఈ దేశ రాజకీయనాయకుల నిర్లక్ష్య పాలనకు ప్రతి సామాన్యుడు చేయలనుకొన్న పని అదే. కాని అసంఖ్యాక సామాన్యుల మనసులో ఉన్నదాన్ని హర్విందర్ సింగ్ చేసి చూపించాడు. దేశములో ఒక ప్రక్క తమ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించక, మరో ప్రక్క కూరగాయలు మరియు యితర వస్తువుల ధరలు సామాన్యుడినకు అందనంత ఎత్తులో ఊరేగితున్నప్పటికి, చీమ కుట్టునట్టు కూడా చలనం లేకుండా ఇంకా ఆ పదవినే పట్టుకు వేలాడుతున్న విలువల్లేని మనిషి అతను. ఒక వైపు దేశములో సామాన్యులు ఆకలి మరియు ధరల భారముతో అలమటిస్తూ ఉంటే, ఈయన గారు మాత్రము దేశానికి ఎందుకు కొరగాని క్రికెట్ అధ్యక్ష పదవిలో అంటగాగుచూ అమూల్యమైన సమయమును దానికే కేటాయిస్తున్న సదరు అమాత్యుల వారిని చెంప దెబ్బ కాకపోతే మరేమి చేయాలి. నిరసన తెలియజేయాలంటే చాలా మార్గాలున్నాయి. అంతేకాని ఇలాంటి దాడులకు దిగడం అనైతికము అంటూ, దాడి తదనంతరం పలువురు రాజకీయనాయకులు వ్యాఖ్యానించారు. కాని ఎప్పుడైనా సదరు దగాకోరు రాజకీయనాయకులూ ఏ నాడైనా సామాన్యుల రాజ్యాంగబద్ద నిరసనలను పట్టించుకొన్నారా?? ఏనాడు కూడా ఏ అమాత్యులు కూడా రాజ్యాంగ బద్దంగా తెలియజేసిన నిరసనను పరిగణనలోకి తీసుకొన్న దాఖలలు లేవు. అందుకే వారికి నిరసన ఈ విధముగా తెలియజేయవలసివచ్చింది. శరద్ పవార్ మీద పడ్డ దెబ్బ, ఒక్క అతని మీదే కాదు., అది మొత్తము ప్రభుత్వ మంత్రివర్గానికి అని తెలుసుకోవాలి. దానిని దేశములో ప్రతి సామాన్యుడి దెబ్బగా భావించాలి.. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రిగా ఎంతో భాద్యతగా వ్యవహరించవలసిన శరద్ పవార్, దానికి పూర్తి సమయమును కేటాయించకుండా లేదా దానికి రాజీనామా చేయకుండానే దేశానికి ఏ మాత్రము పనికిరాని క్రికెట్ అధ్యక్ష్య పదవిలు చేపట్టడం ఎందుకు?? ఒక వేళ దాని మీదే అంత మోజు ఉంటే వ్యవసాయ శాఖను వదులుకోవాలి. దానిని పూర్తి సమయమును కేటాయించగలిగే వేరొక రాజకీయనాయకుడికి అప్పగించడం మేలు.....

Tuesday 15 November 2011

పరులుకొక న్యాయము, తమవారికొక న్యాయమా?? ఎల్లో మీడియా వివక్ష.......

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆస్తులపై శ్రీమతి వై.ఎస్.విజయలక్ష్మి గారు వేసిన పిటిషన్ ఆధారముగా చంద్రబాబునాయుడు గారి హయాంలో జరిగిన కేటాయింపులు మరియు ఆయన అస్తులపై సి.బి.ఐ. ఎంక్వైరికి హైకోర్టు ఆదేశాలు యిచ్చింది. ఇది సాధారణమే... మన ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు మరియు యితర వ్యవస్దలు ఎవరిపని వారు చేసుకుపోతుంటాయి. ఆయితే ఇక్కడ ఒకే రకమునకు చెందిన విషయములో మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియా తన కధనాల్లో ఎంత తేడా చూపిస్తుందో చూస్తుంటే, మీడియా మీద అస్యహం వేయకుండా ఉండడం లేదు. మొన్నటికి మొన్న ఆక్రమ సంపాదన విషయములో జగన్ పై సి.బి.ఐ. ఎంక్వైరికి ఇదే కోర్టు అదేశించినప్పుడు మరియు ఇప్పుడు చంద్రబాబునాయుడు పై సి.బి.ఐ. ఎంక్వైరికి ఆదేశించినప్పుడు ఎల్లో మీడియా యొక్క రాతలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. జగన్ పై ఎంక్వైరికి ఆదేశించినప్పుడు మన చంద్రబాబునాయుడు గార్కి మరియు ఎల్లో మీడియాకు ప్రజాస్వామం పై నమ్మకం కల్గినట్టు, కోర్టు వర్గాలు నిజాయితిగా వ్యవహరించినట్టు అనేక కధనాలు ప్రచురించి, జగన్ పై ఎంక్వైరికి అదేశించినందుకే, అతనేదో పెద్ద నేరగాడు అనేటట్టు సి.బి.ఐ. ఎంక్వైరి మొదలుకాకముందే తీర్పులు ఇచ్చేసాయి. అదే కోర్టు ఇప్పుడు నారా చంద్రబాబునాయుడు గారిపై ఎంక్వైరికి అదేశించినప్పుడు మాత్రం, కోర్టుదే తప్పు అన్నట్టుగా కధనాలు వ్రాయడం ఎంత వరకు సబబు.. సి.బి.ఐ. ఎంక్వైరికి సహకరించి తన సచ్చీలత నిరూపించుకోవలసినదిగా జగన్ కి సూచించిన తెదేపా నేతలు, నేడు తమ అధినేతకు అదే సలహా యివ్వడం మాని, దీనిని దురుద్దేశపూర్విత చర్యగా అభివర్ణించడం ఏ సంస్కారము క్రిందకి వస్తుంది. జగన్ తప్పు చేశాడు కాబట్టి సి.బి.ఐ. ఎంక్వైరి అనగానే భయపడినట్టు తెలుస్తుంది.. అతని అక్రమ సంపాదనను నిగ్గు తేల్చి శిక్ష విధించే చర్యలు కోర్టులు చూసుకుంటాయి. మరి చంద్రబాబునాయుడు గారు నిజాయితిగా తన సచ్చీలత నిరూపించుకోవచ్చు కదా.... తమ మీద ఇరవై ఆరుకు పైగా కమిటిలు వేసారని, ఎవరు ఏమి పీకలేకపోయారని డాంబికాలు పలికే బదులు, నిజాయితిగా సి.బి.ఐ. ఎంక్వైరిని అహ్హానించవచ్చు కదా.... (ఇవన్నీ జగన్ విషయములో చంద్రబాబునాయుడు గారు వెలిబుచ్చిన విషయాలే).
జనాలు తాము రాసిందే నిజమని నమ్ముతారన్న భ్రమలో ఎల్లో మీడియా ఉంది. ఎల్లో మీడియా యొక్క ఈ రకమైన వివక్షను ఏనాడో పసిగట్టిన ప్రజలు సదరు ఎల్లో మీడియాను పూర్తి స్దాయిలో విశ్వసించడం లేదన్నది నిజము.... దీనిని గుర్తించుకొని ఎల్లో మీడియా కేవలం జరుగుచున్న విషయాలను యధాతదముగా మాత్రమే ప్రజలకు తెలియజేప్పెవిధముగా ఉండాలి/. అంతే కాని స్వంత తీర్పులు మరియు స్వంత కధనాలు ఇచ్చే విధముగా ఉండకూడదు..... మనకి కావలసినది సమాజములో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడమే. ... అంతే కాని వాటిపై ఎల్లో మీడియా యొక్క తీర్పులు అక్కరల్లేదు.....

Sunday 13 November 2011

చేతన్ భగత్ కన్నా గొప్ప రచయితలున్నారు మన దగ్గర.. కాని......

చేతన్ భగత్.... పరిచయం అక్కరలేని రచయిత... అతను రాసిన ఫైప్ పాయింట్ సమ్ వన్, త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ, టూ స్టేట్స్ లాంటి రచనలతో పేరు తెచ్చుకొన్న రచయిత.. ఈ రోజు అంద్రజ్యోతి పేపరులో ఆదివారము స్పెషల్ లో చేతన్ భగత్ ప్రోగాము గురించి వ్రాస్తే ఏమిటా గమనించా... అది చేతన భగత్ తన కొత్త రచన రివల్సుషన్స్. అనే పుస్తకమును లాంచ్ చేయడానికి హైదరబాద్ వచ్చిన సందర్బముగా వ్రాసిన అర్టికల్. అందులో ఇంకా సదరు పుస్తకావిష్కరణకి ముసలివాళ్ళు మరియు పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేరని, అందరూ యూతే అని.. ఇలాంటి సంఘటనలు మన పుస్తకావిష్కరణకి కానరావని అందులో రాసారు. అది చదవగానే నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే చేతన్ భగత్ కంటే బాగా వ్రాయగలిగే రచయితలు మనకి చాలా మంది ఉన్నారు. కాని వారందరూ చేతన్ భగత్ కున్నంత క్రేజ్ ఎందుకు సంపాదించుకోలేకపోయారు అన్నదానికి సమాధానము చాలా ఈజీగా దొరుకుతుంది. ఒకప్పుడు మరియు ఇప్పుడు కూడా మనకి గొప్ప రచనలంటే శ్రీశ్రీ, జాషువా, చలం మొదలగు వారు రాసిన పుస్తకాలే.. కాని వారు రాసిన పుస్తకాలు మరొక సాహితివేత్రలకు మాత్రమే అర్దమయ్యే విధముగా ఉంటాయి. అంటే వారి రచనలు కేవలం జనభాలో కొంత మంది తోటి సాహితివేత్తలకి మాత్రమే అర్దమయ్యేవిధముగా ఉండడం. అంటే వారి రచనలు మిగతా వారికి అర్దం కాని రీతిలో ఉంటాయి. అందువలన వారి రచనలు మొత్తము జనాలకి అర్దంకాలేదు. అందువలనే వారి రచనలు ఒక ప్రత్యేక వర్గానికి మాత్రమే పరిమితమయ్యాయి. కాని చేతన్ భగత్ మాత్రము అందరికి అర్దమయ్యేరీతిలో సింపుల్ లాంగ్వేజిలో రాయడం వలన అతని రచనలు ఎవరికైనా సులభంగా అర్దం చేసుకోగలుగుతున్నారు. అంటే అలాంటి రచయితలు మన దగ్గర లేరా?? అన్న ప్రశ్నకు ఉన్నారనే చెప్పాలి.. ఆ విధముగా వ్రాసే వాళ్ళలో మధుబాబు, యుద్దనపూడి సులోచనరాణి, యండమూరి వీరేంద్రనాధ్ లాంటి అద్బుత రచయితలున్నారు.. వారి రచనలు కూడా చేతన్ భగత్ రచనలకు వలే బిగుతుని కల్గి ఉంటాయి.
 మరి ఎందుకు చేతన్ భగత్ లా పేరు తెచ్చుకోలేకపోయారు అంటే??? చేతన్ భగత్ ఉత్తరాదికి చెందిన అహ్మదబాద్ అనే నగరానికి చెందిన వ్యక్తి కావడం ఒక కారణం కావచ్చు.. ఆయితే ఏంటంట అని మీరు అనుకోవచ్చు.. ఉత్తరాదిలో నాకు తెలిసినంత వరకు ప్రజలు తమ రోజు మొత్తములో ఉద్యోగసమయులో కష్టపడడం పోను మిగిలిన సమయములో కొంత సమయమును పుస్తక పఠనం లేక యితర వ్యాపకాల మీద దృష్టి పెడతారు. ఇంచు మించుగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పుస్తకపఠన అలవాటు ఉంటుంది. దాని వలన వారు అన్ని రకములు పుస్తకములను చదువుతారు. కాని మనకి అలాంటి పరిస్దితి లేదు. నాకు తెలిసి యువతలో సుమారు తొంభయై ఐదు శాతానికి పైగా యువతకు పుస్తకపఠన అలవాటు లేదని ఖరాఖండిగా చెప్పగలను. అటువంటప్పుడు మన రచయితలు పైకి ఎలా రాగలుగుతారు. నిజానికి చేతన్ భగత్ అంటే మన వాళ్ళకి అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమా వచ్చేంత వరకు తెలియదు. అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ ఘనవిజయము తర్వాత, పలు సందర్బాలలో అమీర్ ఖాన్ స్వయముగా చేతన్ భగత్ నవలను, మరియు అతని గురించి చెప్పినందున, అక్కడి నుండి చేతన్ భగత్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
చేతన్ భగత్ వ్రాసిన నవల అధారముగా త్రీ ఇడియట్స్ సినిమాను ఉన్నదున్నట్టు తీయడం మూలముగా ఆ సినిమా చాలా గొప్పగా వచ్చిందని చాలా మంది అభిప్రాయము. మన రచయితల్లో యండమూరి వీరేంద్రనాధ్, యుద్దనపూడి సులోచనరాణి వారి నవల్లో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. అప్పట్లో దాసరి నారాయణరావు మరియు చిరంజీవి ఎన్నో హిట్ సినిమాలు అందించింది మన రచయితల వ్రాసిన నవలల ద్వారానే.. అప్పట్లో ఆ నవలలకు ఉన్న క్రేజ్ అధారముగా అయా సినిమాలకు ముందే పాపులారిటి వచ్చిన సందర్బాలున్నాయి.
 కాని వారు నవల్లో వ్రాసిన విధముగా సినిమాల్లో చూపించలేదు. అయా సినిమాల్లో నటించే స్టార్ హిరోల ఇమేజికి అనుగుణంగా అందులో అనేక మార్పులు చేసేవారు. అందువలన వాస్తవానికి సదరు రచయిత చెప్పిన అసలైన ఫీల్ సినిమాలోకి వచ్చేసరికి ఎక్కడ కనబడదు. ఇది మన తెలుగు సినిమా దౌర్బగ్యం. అందుకనే మన రచయితలకు పెద్దగా పేరు రాలేదు. ఇంకా ఖచ్చితముగా చెప్పాలంటే మన రచయితలు పాపులర్ ల్లోకి రాకపోవడానికి కారణం మన సినిమానే. అదే విధముగా చేతన్ భగత్ ప్రాచ్యురంలోకి రావడానికి త్రీ ఇడియట్స్ సినిమానే కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక పేరు ప్రఖ్యాతులు గురించి ప్రక్కన పెడితే చేతన భగత్ వ్రాసిన నవలలు అంత గొప్పవిగా నాకనిపించలేదు. ఎందుకని మీరు అడగవచ్చు. ఆపాటి నవలలను మన మధుబాబు గారు ఎన్నో రాసారు. చేతన భగత్ ఎక్కువగా తన నవలకు మూల కధ ని ఏదైనా కొంతమంది యువకులు మధ్యన మరియు వారి సంఘర్షణల చుట్టు నడుపుతారు. మరియు అతను రాసిన విధానము, మన జీవితములో కూడా అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నమా అన్నట్టుగా ఉంటాయి. సాధారనముగా మన నిజజీవితములో సామాన్యముగా మన చుట్టు జరిగే అంశాలతోనే కధనం వ్రాస్తారు. దాని వలన అతని రచనల్లో బిగుతు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని అంతకన్నా బిగుతు మధుబాబు రచనల్లో కనబడుతుంది. కాని మధుబాబు గారి రచనలు ఒక సూపర్ కధని పోలినట్టుయుంటాయి. అంటే ఆయన వ్రాసే రచనల్లోని షాడొ, గంగరాం, వీరభద్రారెడ్డి వంటి క్యారెక్టర్లు మన నిజజీవితములో చూడలేము. అందుకే ఆయన కధలు ఒక ప్రత్యేక పంధాలో కొనసాగుతాయి. అలాగే మన యితర రచయితల రచనలలో కూడా కొద్దిగా నాటకీయత ఉంటుంది. అందువలన వారి రచనలు చదవడానికి బాగుంటాయి కాని అందులో మనము ఊహించుకోలేము. కాని చేతన్ భగత్ వ్రాసే ప్రతి నవలలోను ప్రతి కార్యెక్టర్ మనకి తెలుసున్నదే అనిపిస్తుంది. ఎక్కడో ఒకచోట అరే నాకు కూడా యిలా జరిగిందే అన్నట్టుగా ఉంటుంది. అంటే మనల్ని అందులో ఫీలయ్యేలా చేయగలుగుతున్నారు చేతన్ భగత్. అందుకనే ఆయన రచనలు బాగున్నట్టుగా అనిపిస్తాయి. కాని ఈ రోజు ఆయనకు పట్టాభిషేకం చేస్తున్న తెలుగు యువత.. ఒకసారి మన రచయితల రచనలను చదవగల్గితే అంద్ర రుచులేంటొ తెలుస్తాయి మన యువతకు. మరియు మనలో చాలా మందికి మంచి పుస్తకాలేంటో తెలియవు. దాని వలన ఏ పుస్తకము చదవాలో తెలియక తికమకపడతారు. అలాగే నేను కూడా మొదట్లో తికమక పడేవాడిని. అలాగని ఇప్పటికి కూడా నాకు సరిగా తెలియదు మంచి పుస్తకమేదో, చెడ్డదేదో.. నాకు బాగుందనిపించిన పుస్తకాలన్నింటిని చదివాను. అందులో నాకు నచ్చిన పుస్తకాలు మచ్చుకు మీ ముందు పెడుతున్నాను. మృత్యువు తర్వాత జీవితము, చే గువేరా జీవిత చరిత్ర, పడిలేచే కడలి తరంగం... ఈ మూడు నాకు చాలా బాగా నచ్చాయి......
పి.ఎస్... నేను సాహితిప్రపంచం అనే సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టును. దాని పరిధిలో ఒక బచ్చాగాడిని. ఏదో నాకు తెల్సినంతవరకు బాగుందని రాసాను. ఇందులో ఎవరికైనా నా తెలివితక్కువతన రాతలు ఉంటే మన్నించగలరని కోరుకుంటు
.......

Thursday 3 November 2011

అసాంజే కోసం గోతి దగ్గర నక్క లాగా ఎదురుచూస్తున్న అమెరికా.....

వికిలీక్స్ వెబ్ సైట్ ద్వారా అనేక దేశాలకు చెందిన రహస్య పత్రాలను ప్రపంచానికి లీక్ చేసిన జూలియస్ అసాంజే ను చేజిక్కుంచుకోవడానికి అమెరికా గోతి దగ్గర నక్కలాగా ఇప్పుడు ఎదురుచూస్తుంది. అమెరికా మరియు యితర దేశాల మధ్య రహస్యంగా ఉండవలసిన అనేక ముఖ్యమైన దస్త్రాలను సంపాదించి దానిని బయట ప్రపంచానికి తెలియజేయడం ద్వారా ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకి గురిచేసి ఒక్కసారిగా వార్తలోకి ఎక్కాడు జూలియస్ అసాంజే. అతను విడుదల చేసిన పత్రాలతో ఎక్కువగా అమెరికాకే నష్టం కలిగించింది. పైగా యితర దేశాల అంతర్గత వ్యవహారాలలో అమెరికా ఎంతగా జోక్యం చేసుకుంటుందో వికిలీక్స్ విడుదల చేసిన పత్రాల ద్వారా వెలుగుచూసింది. ముఖ్యంగా ఆయా దేశాలలో రాయబార కార్యాలయల్లో పనిచేసే సిబ్బంది గూడచార్యానికి పాల్పడుతున్నట్టుగా ఆయా పత్రాలను బట్టి తెలిసింది. దానితో ఆయా దేశాలు అమెరికాను అనుమానపు చూపుల్తో చూడడం అమెరికాకు త్రీవ ఇబ్బందిని కలిగించింది.. అప్పటి నుండి అసాంజే పై కన్నేసిన అమెరికా, వికిలీక్స్ కు అవసరమైన అన్ని రకాల అయివు పట్టులను మూసివేయడం ద్వారా దానికి ప్రాణవాయువు అందకుండా చూసింది. పైగా అసాంజేను చెరపట్టేందుకు పధక రచన చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న అసాంజేను తమ దేశానికి తీసుకురావడానికి వీలుగా అతనిపై లైంగిక నేరారోపణ చేసి స్వీడన్ కు అప్పగించే విధముగా పాపులు కదిపింది. దరిమిలా బ్రిటన్ కోర్టు ఒకటి అసాంజే ను స్వీడన్ కు అప్పగించవలసినదిగా తీర్పు యిచ్చింది. ప్రస్తుతం బ్రిటన్ లో అత్యంత కఠిన నిబంధనల మధ్య గడుపుతున్న అసాంజే తనను స్వీడన్ కి అప్పగిస్తే, అమెరికాకు అప్పగించినట్టే అని మెరపెట్టుకున్నప్పటికి బ్రిటన్ కోర్టు వినిపించుకోలేదు. ఆయినా బ్రిటన్ కూడా అమెరికాకు తొత్తే అన్న విషయము గమనార్హం. ఇక అసాంజే ను స్వీడన్ కు అప్పగించిన తర్వాత అమెరికాకు తరలించడం లాంచనమే.. తర్వాత అసాంజేకు అక్కడి కోర్టులు మరణ శిక్ష విధించవచ్చును. లేదంటే గ్వాంటానేబే జైలుకు తరలించవచ్చును. ఏది ఏమైనా అమెరికా ఉన్మాదానికి ఇంకొక వ్యక్తి బలి కాబోయే రోజు తొందరలోనే ఉందనిపిస్తుంది.... అలా కాకపోతే దేవునికి వేలాదివేల ధన్యావాదములు తెలియజేసుకుంటాను....

Wednesday 2 November 2011

భోదిధర్మ గురించి తెలియజెప్పిన చిత్రం "సెవెన్త్ సెన్స్"

సెవెన్త్ సెన్స్... సూర్య, మురుగదాస్ కలయికలో ఈ మధ్య వచ్చిన చిత్రం... ఈ చిత్రంపై అందరిలాగే ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది.. పైగా సూర్య తన నటనతో ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలడని ఈ సినిమా ద్వారా మరోసారి తెలియజేసాడు. ఇకపోతే సినిమా కధ గురించి మాట్లాడితే.. ఇందులో నాకు బాగా నచ్చిన అంశమేమిటంటే, ప్రస్తుతం చైనా లో యుద్దకళగా భావించే కుంగ్ ఫూ, షావోలిన్ విద్యలకు మూలము మన భారతీయతే అనే విషయము. భారతదేశానికి చెందిన భోదిధర్మ అనే వ్యక్తి తన ప్రపంచ యాత్రలో భాగంగా చైనాలోని ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ సమయములో మనకి తప్ప మరెవరికి ఎరుక లేని ఆమూల్యమైన వైద్య, యుద్ద కళలు అక్కడి వార్కి తెలియజెప్పడమనేది చాలా గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే నేను భారతీయున్ని కాబట్టి.. ఒక భారతీయుడు ద్వారా వారు అత్యున్నత స్దాయికి చేరుకోగలిగారు కాబట్టి. 
 ఒక భారతీయుడైన భోదిధర్మ చైనా మరియు జపాన్ తదితర ప్రాంతాలలో తనకు తెలిసిన విద్యలను అక్కడివారికి తెలియజేప్పడం ద్వారా అక్కడి ప్రజలకు దేవుడయ్యాడు. ఆ రోజు భోదిధర్మ భోదనలతో ప్రభావితమైన ఆయా దేశ ప్రజలు ఇప్పటికి ఆయనను గుర్తుపెట్టుకొని ఆరాధించడం చాలా గొప్ప విషయము.. అదే విధముగా మన దేశములో అదే భోదిధర్మ ఎవరో, ఈ సినిమా చూసినంత వరకు మనకు తెలియకపోవడం.. మనము మన సంస్కృతి మీద చూపిస్తున్న నిర్లక్యం.. నిజానికి మన దేశ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది.. ఆనాటి నుండి, ఈ నాటి వరకు భారతీయుల భాగస్వామ్యం ప్రపంచమంతటా ఉంది. ఇప్పుడు చైనాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన మార్షల్ అర్ట్స్, షావోలిన్ విద్యలు మూలము మన భారతీయ యుద్దకళలే.. మరియు ఇప్పుడు ప్రపంచం మంతటా జపిస్తున్న పవర్ యోగ పుట్టుక భారతదేశంలోనే... కాని మనమందరము మన దేశ అద్బుత చరిత్ర మరిచి పాశ్చాత్య దేశాల ధోరణికి ఎంగిలి పడుతున్నాము. నేడు మనము ఎవరి ఎంగిలికి ఆశ పడుతున్నామో, ఆ పాశ్చాతులే నేడు భారతీయత సంప్రదాయానికి దాసోహమయి మన దేశాన్ని ఆరాధిస్తున్నారు..... ఈ విషయమై మంచి విషయాన్ని తెలియజేప్పేలా తీసిన చిత్ర దర్శకునికి నా జోహార్లు. ఈ విధముగా నేటి దర్శకులు మన భారతీయుల అద్బుత చరిత్ర కొద్దిగానైన సినిమాల ద్వారా తెలియజెప్పితే, నేటి మనలాంటివారికి ఎంతో కొంత తెలుస్తుంది.. చైనా, జపాన్ లో భోదిధర్మ కళలకు నేటికి కూడా ఆదరణ దక్కుతుందటంటే దానికి కారణం, అక్కడ దాన్ని ఒక ఆచారముగా భావించి క్రమము తప్పకుండా తమ తర్వాత తరాల వార్కి అందజేయడమే. దురదృష్టవత్తు మన పూర్వికుల్లో అది లోపించింది... సదరు దేశ సంపద్రాయలను పెద్దలు, తమ తర్వాత తరానికి ఖచ్చితముగా బదలాయించేలా చూడాలి. అప్పుడే మన సంప్రదాయాలు ఒక తరం నుండి మరోక తరానికి ప్రయాణిస్తాయి... ఈ విషయంలో మన పెద్దలు చొరవ తీసుకోవలసిన అవసరము ఉంది.....