Thursday 15 November 2012

సాయపడే మనసులింకాయున్నాయి......


మొన్న ఆ మధ్య రౌతులపూడిలోని మా పొలంలో చేస్తున్న పనులను చూడడానికి రమ్మని మా బావ ఫోన్ చేస్తే, సరే ఒకసారి చూసి వద్దామని బయలుదేరాను.. బడలిక దృష్ట్యా బైక్ మీద వెళ్ళేకంటే బస్సు మీద వెళ్ళడం బెటరనిపించి రౌతులపూడి మీదుగా వెళ్ళే కోటనందూరు బస్సులో బయలుదేరాను.

అప్పటికి సాయంత్రం మీదన పనులు పూర్తయిన వాళ్ళందరితో బస్సు కిక్కిరిసి పోయింది.. నాకు మాత్రము బస్సులో కండక్టరు వెనక రెండు లైన్ల వెనక కిటికి ప్రక్కన సీటు దొరికింది....

హమ్మయ్య అనుకొని దొరికిన సీటులో కూర్చుని, బస్సు ముందుకు వెళుతుంటే రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లు వెనక్కు పరిగెడుతున్న దృశ్యం చూసి చాలా ఆనందం వేసింది...

అప్పటికి బస్సులో సరదాగా ప్రయాణించి చాలా రోజులయ్యింది... కొంతసేపటికి బస్సు కత్తిపూడి చేరుకుంది. అప్పటికి బస్సులో జనం తగ్గలేదు సరికదా ఇంకొంత మంది జనం తోడయ్యారు...

బస్సు బయలుదేరిన తర్వాత యదాలాపంగా జనంలోకి చూసిన నాకు అక్కడ రోజుల వయసున్న బిడ్డతో ఒకామె మరియు ఆవిడ తల్లి గారు అనుకుంటాను, ఇద్దరు కలసి ఆ బస్సులో ఆ జనాల తోపులాటలో నిలబడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు... వెంటనే లేచి ఆ బిడ్డ తల్లికి సీటు ఇస్తే బాగుంటుందనిపించింది.

కాని తను నాకు చాలా దూరంలో యుంది. మరియు ఆ గందరగోళ పరిస్దితులో నా పిలుపు వారికి అందలేదు.... ఇక లాభం లేదని పైకి లేచి నిలబడదామనుకొనేసరికి కండక్టర్ వెనక సీటులో ఉన్న యువకుల్లో ఒకతను లేచి ఆ బిడ్దల తల్లికి స్దానం ఇచ్చాడు... కొద్ది సెకనుల్లోనే ప్రక్కనే ఉన్న ఇంకో యువకుడు కూడా లేచి ఆమె తల్లికి సీటు ఇచ్చాడు.... ఆ దృశ్యం చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది...

ఎందుకంటే అంతకు ముందు స్టేజిలోనే సీటు గురించి ఒక పెద్ద మనిషితో గొడవపడి మరి ఆ సీటులో కూర్చున్నాడు. అప్పుడు అనుకొన్నా... ఏంటి మనవాళ్ళు మరి ఇంతగా స్వార్దపరులవుతున్నారని..... కాని అదే యువకుడు ఇప్పుడు ఒక బిడ్ద తల్లికి సీటు ఇచ్చి మనలోని విలువలు ఇంకా బ్రతికేయున్నాయని తెలియపరిచాడు... అంటే మనలో చాలా మందికి స్వార్దమున్నప్పటికి, అవసరమైనప్పుడు సహయము చేయడానికి కూడా మన తెలుగు వారు ఎంత ముందు ఉంటారో తెలిసింది....

అందుకనే ఇప్పుడు అంటున్నా సాయపడే మనసులింకాయున్నాయి అని......

 

సమాధానం దొరకని ప్రశ్న....


వారాంతపు శెలవులకు అడపాదడపా ఇంటికి వెళ్ళడం నాకు అలవాటు..

ఇది వరకూ సాయంత్రం ఆఫీసు కాగానే బైక్ మీద వెళ్ళిపోయేవాడిని. గత సంవత్సర కాలము నుండి బైక్ మీద మానివేసి, ఆర్టీసి బస్సులో వెళుతున్నాను. ముడి చమురు వినియోగము తగ్గించుకొని, సాధ్యమైనంత వరకు ప్రజా రవణా వ్యవస్దను ఉపయోగించుకొనమని ప్రభుత్వం వారు బ్రతిమాలుతున్నారని నేను ఆ పని చేయట్లేదు.. ఇది వరకులా బైక్ రైడింగ్ ని ఎంజాయ్ చేయలేకపోవడం మరియు ఇతరత్ర కారణాలతో బస్సు ప్రయాణానికి అలవాటు పడ్డా...

మా ఊరు వెళ్ళాలంటే ముందుగా తుని వెళ్ళి, అక్కడ నుండి పదహారు కిలోమిటర్లు లోపలికి వెళ్ళాలి. బస్సు సౌకర్యం లేదు. ఇప్పటికీ చాలా పల్లెలకు బస్సు సౌకర్యం లేదు కదా, చాలా దౌర్బగ్యం అని ఫీలవ్వకండి. ఎందుకంటే మా ఊరికి నేను పుట్టక ముందు నుండే బస్సులు తిరిగేవి. ప్రపంచికరణ జరిగి ఈ హైటైక్ యుగంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తుంటే, సరైన గిరాకీ రావట్లేదని ఆరు సం.ల నుండి ఆర్టీసి బస్సులు మా ఊరికి ముఖం చాటేసాయి. దానితో ఆటోలదే రాజ్యం... ఇష్టమున్నోడు ఆటోలో సర్కస్ ఫీట్స్ చేస్తూ, వేలబడుతూ, ఊగుతూ, బుర్ర ఆటో పై రాడ్ కి కొట్టించుకుంటూ వెళ్తాడు. ఇష్టం లేని నాలాంటోడు ఊరి నుండి ఎవరినన్నా బైక్ మీద రమ్మని చెప్పి వాడితో కూడా వెళ్తాడు. నాకు ఆ సమస్య లేదు లెండి. ఎందుకంటే నాకు తునిలో ఒక బైక్ ఉంది.  దాని మీద వెళ్తుంటాను. (ఆ ముక్క కూడా బస్సు ఉంటే, ఎంచక్కా బస్సే ఎక్కిసేవాడిని).

కాకినాడ బస్సు కాంప్లెక్స్ కి వెళితే అక్కడ విశాఖపట్నం వైపు వెళ్ళే సర్వీసు బస్సులు ఉంటాయి. అంతే కాకూండా డొక్కు బస్సులు, సూపర్ డొక్కు బస్సులు ఉంటాయి తుని వెళ్ళడానికి. (నేనోదో వెటకారానికి అనలేదు, నిజంగానే అవి డొక్కు బస్సులు). డొక్కు బస్సులు చేయేత్తిన ప్రతి చోట ఆపుతాడు. సూపర్ డొక్కు బస్సులు డ్రైవర్ కి మూడ్ వచ్చిన చోటల్లా ఆపుతాడు. సాధ్యమైనంతవరకు ఇవి ఎక్కను ఎందుకంటే, ఇవన్నీ పిఠాపురం ఊర్లో నుండి వెళతాయి. ఆయితే ఏంటంట అనుకుంటున్నారా?

ఇప్పుడు మీరు హైదరబాద్ నుండి ముంబాయి వెళ్ళాలనుకొండి? ఎలా వెళ్తారు. డైరెక్టుగా ముంబయి ఫ్లయిట్ ఎక్కుతారా లేక న్యూడిల్లి వెళ్ళి అక్కడ నుండి ముంబయి వెళ్తారా? తిక్క ప్రశ్న అని అనుకోకండి...

న్యూడిల్లీలో పని ఉన్నవాడు మాత్రమే అలా వెళ్తాడు. మిగతా వారు తిన్నగా పోతారు కదా అంటారు...

ఇది కూడా అలాగే. పిఠాపురంతో పని ఉన్నోడు మాత్రమే పిఠాపురం టౌన్ లోకి వెళ్ళడానికి సాహసిస్తాడు. పని లేనోడు డొక్కు బస్సు ఎక్కి వెళ్ళాడనుకొండి.. వాడికి ఒక గంట హాంఫటే....

అందుకని సాధ్యమైనంత వరకు పిఠాపురం ఊళ్ళోకి వెళ్ళని ఎక్సెప్రెస్ బస్సులే ఎక్కుతాను. దాని వలన ఒక గంట టైమ్ మిగులుతుంది.

ఇకపోతే ఇక అసలు విషయానికి వస్తాను....

ఎక్సెప్రెస్ సర్వీసు బస్సులన్నీ హైవే మీద ఉన్న బస్సు కాంప్లెక్స్ మీదుగా వెళ్ళిపోతాయి. తుని టౌన్ లోకి వెళ్ళవు. మా చెల్లాయి తునిలోనే ఉంటుంది. తనని చూడడానికి అప్పుడప్పుడు వెళ్తుంటాను. దాని కోసం అన్నవరంలో దిగిపోయి అక్కడ నుండి డొక్కు బస్సు ఎక్కి తుని టౌన్ లో ఉన్న మా చెల్లాయి ఇంటికి వెళ్తుంటాను. డొక్కు బస్సులు బస్సు కాంప్లెక్స్ కి వెళ్ళవు. టౌన్ లోకే వెళ్తాయి.

అలా ఒకసారి తుని టౌన్ లోకి వెళ్ళడానికి డొక్కు బస్సు  కోసం అన్నవరం బస్ కాంప్లెక్స్ లో ఎదురుచూస్తుండగా, యధాలాపంగా నా దృష్టి ఫ్లాట్ ఫారం చివర నుండి లోపలికి వస్తున్న ఒక వ్యక్తి మీద ఫోకస్ ఆయింది. అతనికి పోలియో అనుకుంటా.. కాళ్ళు రెండు చచ్చుపడిపోయిఉన్నాయి. ఒంటి మీద బట్టలు కూడా బాగోలేదు. స్నానం చేసి చాలా రోజులయినట్టుంది. దేక్కుంటూ వాటర్ ట్యాంక్ వద్దకి వచ్చి చేతులు కడుక్కొని, నా ఎదురుగా ఉన్న ఒక కొట్టు ప్రక్కకి వచ్చి వున్నాడు. నేను అతడినే దొంగ చాటుగా గమనిస్తున్నాను. అతనికి బహుశా సుమారు ఇరవై ఏళ్ళు ఉండోచ్చు అనుకుంటాను. నాకు చాలా భాద అనిపించింది. ఇంతలో ఎవరో ఒకతను వచ్చి టిఫిన్ అందించి వెళ్ళిపోయాడు. దానిని శుభ్రంగా తిని, చేతులు కడుక్కొని తిరిగి ప్లాట్ ఫారం చివరకు వెళ్ళిపోయాడు. మానసిక స్దితి చాలా చక్కగా ఉంది.

మనకు అన్ని అవయువాలు బాగా ఉండి, కష్టపడుతూ డబ్బు సంపాదించుకుంటూ, బ్రతుకుతూ ఉన్నప్పట్టికి, మనలో ఏదో అసంతృప్తి రాజ్యమేలుతుంటుంది. ఎవరి గురించో ఎందుకులెండీ... నా గురించి చెప్పుతున్నా....

నిజానికి నేను ఇప్పటికీ హ్యాపిగా ఉన్నానని చెప్పలేను. దానికి కారణం ఏమిటన్నదీ కూడా మనకి తెలియదు. జస్ట్ అంతే.... ఏదో తెలియని అసంతృప్తి... జీవితాన్ని ఆనందంగా అనుభవించలేని మానసిక రోగులం.....

అలా అతనిని దొంగ చాటుగా చూస్తున్నా... తన స్దితికి అతను ఏమైనా ఫీల్ అవుతున్నాడా అని చూసా... కాని అతని కళ్ళలో అలాంటిది ఏమి కనబడలేదు. పైగా నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించాయి. చటుక్కున ముఖం త్రిప్పివేసేసుకున్నాను. మరల చూసా అతని ముఖంలోకి తరచి తరచి... ఏ కోశానా కూడా తన స్దితి గురించి భాదపడుతున్నట్టుగా లేవు.. ఆ కళ్ళలో జీవం తొలకలడుతుంది. అతని చిరునవ్వులో ఎన్నో విషయాలు దాగున్నాయి అనిపించింది... మరి నేనేందుకు అతనిలా అనందంగా ఉండలేకపోతున్నాను?? సమాధానం దొరకడం లేదు. ఇంతలో డొక్కు బస్సు రావడంతో వెళ్ళిపోయాను.

మరల ఇంకొకసారి వచ్చినప్పుడు, మరల వచ్చినపుడు, ఇంటికి వెళ్ళిన ప్రతీసారీ అన్నవరం బస్ కాంప్లెక్స్ కి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతాయి. అతను కనిపించిన తర్వాత ముందుగా అతని కళ్ళలోకి చూస్తా...  ఎప్పుడూ చూసిన అదే పవర్... అదేంటో నాకు అర్ద్రం కావడం  లేదు. ఒకసారి నేను చూసినపుడే, అతను కూడా నావైపు చూసాడు. అతని ప్రశాంత మనసు అతని కళ్ళలో ప్రతిబింభిస్తుంది... చిన్నగా నవ్వాడు...

ఆ నవ్వు నాలో బోలెడన్నీ ప్రశ్నలు మిగిల్చింది..... ఒరే ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.. దేవుడిచ్చిన జీవితంను అస్వాదించండి. అంతే కాని లేనిపోని ఆలోచనలతో మనసుని పాడుచేసుకోకండీ..... ప్రతిక్షణం ఆనందంగా ఉండండి అని చెబుతున్నాడా? ఏమో నాకైతే తెలియదు. ఎందుకు అతను అంత నిశ్చలంగా ఉండగలుగుతున్నాడో.....

దేవుడు అందరికీ అన్నీ సమానంగా ఇవ్వలేదు... అందరికీ ఎంతో కొంత పెడతాడు. ఎంతో కొంత పెట్టడు.... కాని మనసుని జయించగలిగిన విద్య ఎవరికి ఇస్తాడో, వారే జీవితాన్ని జయిస్తారు.

నాకు నా స్దితి గురించి పూర్తిగా తెలియకుండానే, ఇంకొకడి మీద జాలి చూపించాను. నేను ఎవరి మీదయితే జాలిపడ్డానో, అతను దానిని ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే నన్ను అలోచింపదేసింది. మన జాలి మీద అధారపడేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.  పైగా అతనే నా పరిస్దితి చూసి జాలిపడ్డాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి మీద జాలి పడాలో...... సమాధానం దొరకని ప్రశ్న ఇది...

అతను నన్ను బాగా ప్రభావితం చేసాడని మాత్రం చెప్పగలను....

Saturday 3 November 2012

రాంబాబూ.... ఇలా ఆయిపోయావేంటి?


నా ఇంటర్ మీడియట్ చదివే రోజులు.... అప్పటి వరకు కార్పోరేటు కాన్వెంటులో చదివి, మన ప్రమేయం లేకుండానే జీవితమంతా ఒక అర్డర్ ప్రకారం జరిగిపోయేది...

ఇంటర్ కి వచ్చాకా, స్వేచ్చా ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తున్న రోజులవి. అందులో ఇప్పుడు మాట్లాడబోయేది సినిమా లోకం గురించి...

అప్పటి వరకు నాన్న గారు దయతలచి సినిమాకు తీసుకువెళ్తే్ అదే పండుగ. మరలా ఎప్పుడు తీసుకువెళ్తారో మనకు తెలియదు. ఆయన ఏ సినిమాకు తీసుకువెళ్తే, ఆ సినిమానే నోర్మూసుకొని చూడాలి. నా సినిమా నాలెడ్జ్ ఎలా ఉండేదంటే, టి.వి.లో వచ్చే పాటలను చూసి ఆ సినిమా రిలీజ్ ఆయిందో, లేదో కూడా తెలేసేది కాదు. 

అలాంటి సమయంలో నేను ఇంటర్ లోకి వచ్చాను. నాకు టెన్త్ లో మంచి మార్కులు రావడంతో మంచి గవర్నమెంటు కాలేజిలో సీటు వచ్చింది. దానితో మా నాన్నగారు ఏమీ ఆలోచించకుండా జాయిన్ చేసేశారు. అంతే కాదు క్రమశిక్షణలో కూడా కొద్దిగా సడలింపు యిచ్చారు. కాని నేను ఏనాడు దానిని దుర్వినియెగం చేయలేదు. 

మేము ఇంటర్ గవర్నమెంటు కాలేజిలో చేరడంతో, నోట్సు కోసం బయట వేరేగా సబ్బెక్సు కోసం ట్యూషన్ లకి వెళ్ళేవాళ్ళము. కాలేజి ఒక పూటే ఉండేది.  సాయంకాలం సమయములో ట్యూషన్స్ కి వెళ్ళేవాళ్ళము. ట్యూషన్స్ ఆయిపోయిన తర్వాత సైకిలు మీద వెళ్తూ సినిమా వాల్ పోస్టర్స్ ని గమనిస్తూ వెళ్ళేవాళ్ళము. అలా నాకు సినిమాలంటే లైక్ ఏర్పడింది. సినిమాను సినిమాగా కాకుండా అందులో ఉన్న సాంకేతిక అంశాల మీద కూడా లైక్ ఏర్పడింది. దానితో ప్రతి సినిమా వాల్ పోస్టర్ ని గమనించి, ఆ సినిమా బాగుంటుందో , లేదో అని గెస్ చేసేవాడిని.

అలా ఉండగా, ఒక రోజు ట్యూషన్స్ ఆయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే, ఒక పోస్టర్ ని చూడమని నా స్నేహితుడు చెబితే, చూసా... చూడగానే ఆ పోస్టర్ మీద మంచి అభిప్రాయం కలగలేదు. అది “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”.  హిరో ఎవరో తెలియదు. అచ్చోచ్చిన వెధవలు అందరూ సినిమాల్లో నటిస్తే ఇలాగే ఉంటుంది అని అనుకొన్నాను.

ఏం పేరా అని చూస్తే కళ్యాణ్ బాబట....

ఇంకొక ఆరు నెలలు గడిచిన తర్వాత, అదే హిరోతో “గోకులంలో సీత” అనే సినిమా వచ్చింది. నా స్నేహితుడు ఆ పోస్టర్ చూపించి, అందులో హిరో చిరంజీవి తమ్ముడంట. సినిమా బాగానే ఉందట అని చెవిలో ఊదాడు. దానితో ఒక రోజు ఖాళీ చేసుకొని, ఇంటిలో చెప్పి ఆ సినిమాకు వెళ్ళా... ఏంటో సినిమా అంతా అదోలా అనిపించింది. బాగుందని కాదు.. బాగోలేదని కాదు... చిరంజీవి తమ్ముడు కాబట్టి పర్లేదులే అని అనిపించింది.

అలా ఇంకోక ఆరు నెలలు గడిచింది, ఈ సారి సుస్వాగతం సినిమా రిలీజ్... చాలా రోజుల వరకు ఆ సినిమా గురించి పట్టించుకోలేదు. కాని కాలేజిలో మాత్రం ఆ సినిమా గురించి గోల గోల ఆయిపోయింది. ఇంటిలో చెప్పి సినిమాకు వెళ్ళా... బయటికొచ్చిన తర్వాత అనుకున్నా... సెంటిమెంటు సీన్స్ అదరగొట్టేసాడు. ప్రకాశ్ రాజ్ ఇరగదీసేశాడు అనుకున్నాను. బానే ఉందిలే అనుకున్నాను.

మరల సంవత్సరం గడిచింది... ఈ సారి “తొలిప్రేమ” రిలీజ్... రిలీజ్ నుండి యూత్ మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకోవడం. అప్పటికే కళ్యాణ్ బాబు మీద ఒక బెస్ట్ ఇంప్రెస్ ఏర్పాడంతో, సినిమా చూసా. బయటికి వచ్చాక మైండ్ బ్లోయింగ్...

ఎందుకంటే ఈ సారి సినిమాలో నటించింది కళ్యాణ్ బాబు కాదు... పవన్ కళ్యాణ్....

వావ్.. ఏం తీసాడు. చాలా సీన్లు నన్ను చూసి కాపీ కొట్టినట్టుగా కూడా అనిపించింది.... కాదు కాదు... నేనే ఆ సినిమాను కాపీ కొట్టానేమో అనిపించింది. చాలా సీన్లు నిజజీవితంలో జరిగినట్టుగా ఎంత నేచురల్ గా యాక్ట్ చేసాడు. ముఖ్యంగా పాటలు... అబ్బో... ఎక్కడ చూసిన అవే.... అప్పటి మా నాలెడ్జ్ కి అదే సూపర్ క్లాసికల్ సినిమాగా కనబడింది. మరల మరల చూడాలనిపించేది. చెల్లిగా నటించిన దేవకి, ప్రియురాలుగా నటించిన కీర్తిరెడ్డి సూపర్ గా యాక్ట్ చేసారు. రెండో సారి చూడాలనిపించి మరల వెళ్ళా, అమ్మకి చూపించాలని మరల వెళ్ళా, చెల్లికి చూపించాలని మళ్ళి వెళ్ళా... అలా పద్దెనిమిది సార్లు చూసా ఆ సినిమాను(ఇంట్లో తెలియదులెండి)...

అప్పటికి పవన్ కళ్యాణ్ స్టైల్ కి పూర్తిగా ఫిదా ఆయిపోయా.....

ఆ స్టైల్, కళ్ళలో ఆ పవర్, బాడీ లాంగ్వేజీ ఇలా అన్ని కూడా తనను మిగతా హిరోల నుండి వేరు చేసేవి.

ఆ తర్వాత ఇంకొక సంవత్సరం పోతే కాని రాలేదు “తమ్ముడు” సినిమా... అది కూడా సూపర్ హిట్టే.. ముఖ్యంగా కాలేజికి బంక్ కొట్టి చదువులో వెనుకబడిన వారిని బాగా సంతృప్తి పరిచింది.( నేను అప్పుడు కూడా ’ఎ’ క్లాస్ విద్యార్దినే). ముఖ్యంగా పాటలు... అందులోను రమణ గోగుల అందించిన “వయ్యారిభామ నీ హంస నడక....” మాట సూపర్ హిట్... అది కూడా సూపర్ హిట్ మూవీ ఆయి కూర్చుంది.. మా కాలేజి మొత్తం పవన్ కి ఫిదా ఆయిపోయారు.

మరల ఇంకో సంవత్సరం గ్యాప్...

ఆయినా సినిమా రాదే... వాడికి ఇంత బద్దకమేంటిరా బాబూ అనుకొనేవాళ్ళం.

ఎటువంటి హడావుడి లేకుండా “బద్రి” సినిమా రిలీజ్.... తొలిరోజే సినిమాకి వెళ్ళిపోయా.... ఆయిపోయిన తర్వాత అనిపించింది. సినిమా కిరాక్ ఎక్కించాడనిపించింది. అంతే కాదు పాటలు, స్టెప్స్, మేనరిజమ్స్ అన్ని పవన్ కి కొత్త స్టైల్ ని సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ “ఐయామ్ ఇండియన్...” మాకు బాగా కనెక్ట్ అయింది. నాకు తెలిసి అప్పటి నుండి తన ప్రతి సినిమాలో దేశభక్తి పాటను పెట్టుకునే హిరో ఒక పవన్ మాత్రమే...

“నువ్వు నంద ఆయితే, నేను బద్రి.. బద్రినాధ్.. ఆయితే ఏంటి”” డైలాగ్ టచ్ ఆయింది బాగా మాకు...
 

ఇక “ఏ చికితా..” సాంగ్ లో వేసిన కౌబాయ్ గెటప్, ఆ పాటలో స్టిల్స్, మేనరిజమ్స్ అంతా కొత్తకొత్తగా సాగిపోతుంది.... ధండర్ బర్డ్ బైక్ పై పాటలు ఇలాంటివన్నీ పవన్ కే సాధ్యమయ్యాయి.

మరల సంవత్సరం గ్యాప్ తర్వాత వచ్చింది

“ఖుషి” సినిమా..... పవన్ ని ఆగ్రస్దానానికి తీసుకువెళ్ళిన సినిమా ఇది. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్... దేశభక్తి సాంగ్.... తర్వాత “ఆడువారి మాటలకు అర్దాలు వేరులే...” పాట రీమిక్స్.... భూమిక అందాలు వెరసి సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాయి.

అక్కడితో పవన్ మేనియా నెమ్మదించింది... కాని పాపులారిటీ మాత్రం తగ్గలేదు...

ఆ స్టైల్ ని జనాలు మర్చిపోలేదు... తర్వాత ఎన్ని ప్లాప్స్ ఇచ్చిన జనాలకు అతనంటే క్రేజ్ తగ్గలేదు.

అలా ఒక సంవత్సరం కాదు... పది సంవత్సరాలుగా ప్లాప్స్ ఇస్తునే ఉన్నాడు.... ఆయినప్పటికి పీల్డ్ లో ఇప్పటికీ కౌబాయే.... ఎందుకంటే చాలా మంది పవన్ సినిమాల కంటే, అతని మేనరిజమ్స్ ని ఇష్టపడేవారు.

చివరికి పది సం.రాల తర్వాత గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టాడు...

కాని అది రొటీన్ సినిమాగానే అనిపించింది నాకు.... అందులో గత పవన్ కళ్యాణ్ కనబడలేదు. పైగా ముఖంలో డల్ నెస్... మెడ క్రింద మడతలు, ముందుకు తన్నుకువచ్చిన పొట్ట మొత్తానికి ఇది వరకు పవన్ లో ఉన్న ఫైర్ లేదు అనిపించింది...

తర్వాత ఆరు నెలలు తిరక్కుండానే “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా రిలీజ్ అయింది...
 

సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొంది. వారం రోజుల తర్వాత గానీ చూడడానికి కాని కుదరలేదు నాకు... సినిమా చూసిన తర్వాత నాకు ఏమనపించలేదు....

ఏంటీ.. అతను పవన్ కళ్యాణేనా? అని డౌటయితే మాత్రం వచ్చింది....

ఒకప్పుడు ఎలా ఉండే వాడు పవన్ కళ్యాణ్... చూరకత్తుల లాంటి చూపులు, పర్ ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్, ఢిపరెంట్ వాకింగ్ స్టైల్ అని వెరశి యంగ్రియంగ్ మ్యాన్ లా ఉండేవాడు...

మరి ఇప్పుడు? చూడలేకపోతున్నాను... ఆనాటి పవన్ ని నేడు ఈ విధంగా చూడలేకపూతున్నా.,...

వయసు ప్రభావం సహజమే అనుకోండి? కాని నాకే ఒప్పుకోబుద్ది కావడం లేదు.. ఏం నాగార్జున లేడా, సల్మాన్ ఖాన్ లేడా, సైఫ్ అలీ ఖాన్ లేడా యంగ్ గా?

అందుకే ఇక్కడి నుండి పవన్ సినిమాలకి సెలవు ఇద్దామనుకుంటున్నా.....

అందుకే అడుగుతున్నా నా అభిమాన నటుడుని...

ఏంటి రాంబాబూ... అలా ఆయిపోయావు? అని