Thursday 15 November 2012

సమాధానం దొరకని ప్రశ్న....


వారాంతపు శెలవులకు అడపాదడపా ఇంటికి వెళ్ళడం నాకు అలవాటు..

ఇది వరకూ సాయంత్రం ఆఫీసు కాగానే బైక్ మీద వెళ్ళిపోయేవాడిని. గత సంవత్సర కాలము నుండి బైక్ మీద మానివేసి, ఆర్టీసి బస్సులో వెళుతున్నాను. ముడి చమురు వినియోగము తగ్గించుకొని, సాధ్యమైనంత వరకు ప్రజా రవణా వ్యవస్దను ఉపయోగించుకొనమని ప్రభుత్వం వారు బ్రతిమాలుతున్నారని నేను ఆ పని చేయట్లేదు.. ఇది వరకులా బైక్ రైడింగ్ ని ఎంజాయ్ చేయలేకపోవడం మరియు ఇతరత్ర కారణాలతో బస్సు ప్రయాణానికి అలవాటు పడ్డా...

మా ఊరు వెళ్ళాలంటే ముందుగా తుని వెళ్ళి, అక్కడ నుండి పదహారు కిలోమిటర్లు లోపలికి వెళ్ళాలి. బస్సు సౌకర్యం లేదు. ఇప్పటికీ చాలా పల్లెలకు బస్సు సౌకర్యం లేదు కదా, చాలా దౌర్బగ్యం అని ఫీలవ్వకండి. ఎందుకంటే మా ఊరికి నేను పుట్టక ముందు నుండే బస్సులు తిరిగేవి. ప్రపంచికరణ జరిగి ఈ హైటైక్ యుగంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తుంటే, సరైన గిరాకీ రావట్లేదని ఆరు సం.ల నుండి ఆర్టీసి బస్సులు మా ఊరికి ముఖం చాటేసాయి. దానితో ఆటోలదే రాజ్యం... ఇష్టమున్నోడు ఆటోలో సర్కస్ ఫీట్స్ చేస్తూ, వేలబడుతూ, ఊగుతూ, బుర్ర ఆటో పై రాడ్ కి కొట్టించుకుంటూ వెళ్తాడు. ఇష్టం లేని నాలాంటోడు ఊరి నుండి ఎవరినన్నా బైక్ మీద రమ్మని చెప్పి వాడితో కూడా వెళ్తాడు. నాకు ఆ సమస్య లేదు లెండి. ఎందుకంటే నాకు తునిలో ఒక బైక్ ఉంది.  దాని మీద వెళ్తుంటాను. (ఆ ముక్క కూడా బస్సు ఉంటే, ఎంచక్కా బస్సే ఎక్కిసేవాడిని).

కాకినాడ బస్సు కాంప్లెక్స్ కి వెళితే అక్కడ విశాఖపట్నం వైపు వెళ్ళే సర్వీసు బస్సులు ఉంటాయి. అంతే కాకూండా డొక్కు బస్సులు, సూపర్ డొక్కు బస్సులు ఉంటాయి తుని వెళ్ళడానికి. (నేనోదో వెటకారానికి అనలేదు, నిజంగానే అవి డొక్కు బస్సులు). డొక్కు బస్సులు చేయేత్తిన ప్రతి చోట ఆపుతాడు. సూపర్ డొక్కు బస్సులు డ్రైవర్ కి మూడ్ వచ్చిన చోటల్లా ఆపుతాడు. సాధ్యమైనంతవరకు ఇవి ఎక్కను ఎందుకంటే, ఇవన్నీ పిఠాపురం ఊర్లో నుండి వెళతాయి. ఆయితే ఏంటంట అనుకుంటున్నారా?

ఇప్పుడు మీరు హైదరబాద్ నుండి ముంబాయి వెళ్ళాలనుకొండి? ఎలా వెళ్తారు. డైరెక్టుగా ముంబయి ఫ్లయిట్ ఎక్కుతారా లేక న్యూడిల్లి వెళ్ళి అక్కడ నుండి ముంబయి వెళ్తారా? తిక్క ప్రశ్న అని అనుకోకండి...

న్యూడిల్లీలో పని ఉన్నవాడు మాత్రమే అలా వెళ్తాడు. మిగతా వారు తిన్నగా పోతారు కదా అంటారు...

ఇది కూడా అలాగే. పిఠాపురంతో పని ఉన్నోడు మాత్రమే పిఠాపురం టౌన్ లోకి వెళ్ళడానికి సాహసిస్తాడు. పని లేనోడు డొక్కు బస్సు ఎక్కి వెళ్ళాడనుకొండి.. వాడికి ఒక గంట హాంఫటే....

అందుకని సాధ్యమైనంత వరకు పిఠాపురం ఊళ్ళోకి వెళ్ళని ఎక్సెప్రెస్ బస్సులే ఎక్కుతాను. దాని వలన ఒక గంట టైమ్ మిగులుతుంది.

ఇకపోతే ఇక అసలు విషయానికి వస్తాను....

ఎక్సెప్రెస్ సర్వీసు బస్సులన్నీ హైవే మీద ఉన్న బస్సు కాంప్లెక్స్ మీదుగా వెళ్ళిపోతాయి. తుని టౌన్ లోకి వెళ్ళవు. మా చెల్లాయి తునిలోనే ఉంటుంది. తనని చూడడానికి అప్పుడప్పుడు వెళ్తుంటాను. దాని కోసం అన్నవరంలో దిగిపోయి అక్కడ నుండి డొక్కు బస్సు ఎక్కి తుని టౌన్ లో ఉన్న మా చెల్లాయి ఇంటికి వెళ్తుంటాను. డొక్కు బస్సులు బస్సు కాంప్లెక్స్ కి వెళ్ళవు. టౌన్ లోకే వెళ్తాయి.

అలా ఒకసారి తుని టౌన్ లోకి వెళ్ళడానికి డొక్కు బస్సు  కోసం అన్నవరం బస్ కాంప్లెక్స్ లో ఎదురుచూస్తుండగా, యధాలాపంగా నా దృష్టి ఫ్లాట్ ఫారం చివర నుండి లోపలికి వస్తున్న ఒక వ్యక్తి మీద ఫోకస్ ఆయింది. అతనికి పోలియో అనుకుంటా.. కాళ్ళు రెండు చచ్చుపడిపోయిఉన్నాయి. ఒంటి మీద బట్టలు కూడా బాగోలేదు. స్నానం చేసి చాలా రోజులయినట్టుంది. దేక్కుంటూ వాటర్ ట్యాంక్ వద్దకి వచ్చి చేతులు కడుక్కొని, నా ఎదురుగా ఉన్న ఒక కొట్టు ప్రక్కకి వచ్చి వున్నాడు. నేను అతడినే దొంగ చాటుగా గమనిస్తున్నాను. అతనికి బహుశా సుమారు ఇరవై ఏళ్ళు ఉండోచ్చు అనుకుంటాను. నాకు చాలా భాద అనిపించింది. ఇంతలో ఎవరో ఒకతను వచ్చి టిఫిన్ అందించి వెళ్ళిపోయాడు. దానిని శుభ్రంగా తిని, చేతులు కడుక్కొని తిరిగి ప్లాట్ ఫారం చివరకు వెళ్ళిపోయాడు. మానసిక స్దితి చాలా చక్కగా ఉంది.

మనకు అన్ని అవయువాలు బాగా ఉండి, కష్టపడుతూ డబ్బు సంపాదించుకుంటూ, బ్రతుకుతూ ఉన్నప్పట్టికి, మనలో ఏదో అసంతృప్తి రాజ్యమేలుతుంటుంది. ఎవరి గురించో ఎందుకులెండీ... నా గురించి చెప్పుతున్నా....

నిజానికి నేను ఇప్పటికీ హ్యాపిగా ఉన్నానని చెప్పలేను. దానికి కారణం ఏమిటన్నదీ కూడా మనకి తెలియదు. జస్ట్ అంతే.... ఏదో తెలియని అసంతృప్తి... జీవితాన్ని ఆనందంగా అనుభవించలేని మానసిక రోగులం.....

అలా అతనిని దొంగ చాటుగా చూస్తున్నా... తన స్దితికి అతను ఏమైనా ఫీల్ అవుతున్నాడా అని చూసా... కాని అతని కళ్ళలో అలాంటిది ఏమి కనబడలేదు. పైగా నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించాయి. చటుక్కున ముఖం త్రిప్పివేసేసుకున్నాను. మరల చూసా అతని ముఖంలోకి తరచి తరచి... ఏ కోశానా కూడా తన స్దితి గురించి భాదపడుతున్నట్టుగా లేవు.. ఆ కళ్ళలో జీవం తొలకలడుతుంది. అతని చిరునవ్వులో ఎన్నో విషయాలు దాగున్నాయి అనిపించింది... మరి నేనేందుకు అతనిలా అనందంగా ఉండలేకపోతున్నాను?? సమాధానం దొరకడం లేదు. ఇంతలో డొక్కు బస్సు రావడంతో వెళ్ళిపోయాను.

మరల ఇంకొకసారి వచ్చినప్పుడు, మరల వచ్చినపుడు, ఇంటికి వెళ్ళిన ప్రతీసారీ అన్నవరం బస్ కాంప్లెక్స్ కి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతాయి. అతను కనిపించిన తర్వాత ముందుగా అతని కళ్ళలోకి చూస్తా...  ఎప్పుడూ చూసిన అదే పవర్... అదేంటో నాకు అర్ద్రం కావడం  లేదు. ఒకసారి నేను చూసినపుడే, అతను కూడా నావైపు చూసాడు. అతని ప్రశాంత మనసు అతని కళ్ళలో ప్రతిబింభిస్తుంది... చిన్నగా నవ్వాడు...

ఆ నవ్వు నాలో బోలెడన్నీ ప్రశ్నలు మిగిల్చింది..... ఒరే ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.. దేవుడిచ్చిన జీవితంను అస్వాదించండి. అంతే కాని లేనిపోని ఆలోచనలతో మనసుని పాడుచేసుకోకండీ..... ప్రతిక్షణం ఆనందంగా ఉండండి అని చెబుతున్నాడా? ఏమో నాకైతే తెలియదు. ఎందుకు అతను అంత నిశ్చలంగా ఉండగలుగుతున్నాడో.....

దేవుడు అందరికీ అన్నీ సమానంగా ఇవ్వలేదు... అందరికీ ఎంతో కొంత పెడతాడు. ఎంతో కొంత పెట్టడు.... కాని మనసుని జయించగలిగిన విద్య ఎవరికి ఇస్తాడో, వారే జీవితాన్ని జయిస్తారు.

నాకు నా స్దితి గురించి పూర్తిగా తెలియకుండానే, ఇంకొకడి మీద జాలి చూపించాను. నేను ఎవరి మీదయితే జాలిపడ్డానో, అతను దానిని ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే నన్ను అలోచింపదేసింది. మన జాలి మీద అధారపడేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.  పైగా అతనే నా పరిస్దితి చూసి జాలిపడ్డాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి మీద జాలి పడాలో...... సమాధానం దొరకని ప్రశ్న ఇది...

అతను నన్ను బాగా ప్రభావితం చేసాడని మాత్రం చెప్పగలను....

11 comments:

  1. ఎంత బాగా రాశారండి.
    నిజమే, జాలి చూపటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఎంతో కొంత మనకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేస్తూ అనవసరపు అలోచనలు, కోరికలు లాంటివి పెట్టుకోకుండా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. కానీ మనకు వచ్చే అలోచనలు, కోరికల్లో ఏది అవసరమో, ఏది అనవసరమో తేల్చుకోలేకపోతున్నామండీ.. అదే అన్ని అనర్దాలకు మాలం... మీరు చెప్పినట్లు మనసును అదుపులో ఉంచుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుందండీ... ధన్యవాదములతో

      Delete
  2. ఆలోచింపజేసారు, నిజంగా దేనితో సంతృప్తి చెందని మనమే మానసిక రోగులం.

    ReplyDelete
    Replies
    1. అమ్మయ్య, అందరూ అర్ద్రం చేసుకున్నారు నన్ను.. పై పోస్ట్ చూసి నన్ను పిచ్చోడి లెక్క కడతారేమో అని భయపడ్డానండీ... నాకు ఒక్కడికే ఈ సమస్య ఉందేమో అనుకున్నా...
      ధన్యవాదములతో

      Delete
  3. manushulu andari alochana vidhaanam oke rakam ga undadhu.konthamandi ki jaali chupiste anandapadataru.kontamandiki avi ishtam undavu.naku telisina oka athanu physically handicapped. Oka kaalu kurachaga untundi.kaani athanu college lo groups petti rowdyism chesevadu.

    ReplyDelete
    Replies
    1. చాలా ఇంట్రస్టింగ్ గా ఉందండీ.. మీరు చెప్పింది..
      మా చిన్నప్పటి బ్యాచ్ లో కూడా ఒకతను ఉండేవాడండీ... అతను కూడా మిగతా వాళ్ళ మీద పెత్తనం చెలాయించేవాడు. దీన్ని బట్టి మనసుకి వైకల్యం ఉండకూడదని తెలుస్తుంది.
      ధన్యవాదములతో....

      Delete

  4. మీ ఫొటో బెంగుళూరు గరుడా మాల్ లో నాలుగో ఫ్లోరులోంది కదా?

    ReplyDelete
    Replies
    1. చాలా కరెక్టుగా చెప్పారు... ప్రస్తుతం మీరు కూడా అక్కడే ఉండి పోటో తీసుకున్నారా ఏంటి?

      Delete
  5. బాగుంది మీ ప్రశ్న & జవాబు.
    కాని మీరు పీఠావురం వెళ్ల్ళారు ఈసారి.

    ~Anil Kumar Puranam.
    http://srihanumanvishayasarvasvam.blogspot.in/



    ReplyDelete
  6. బాగుంది మీ ప్రశ్న & జవాబు.
    కాని మీరు పీఠావురం వెళ్ల్ళారు ఈసారి.

    ~Anil Kumar Puranam.
    http://srihanumanvishayasarvasvam.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. పిఠాపురం ఎందుకండీ వెళ్ళడం ఈ సారి?

      Delete