Saturday 5 September 2015

రాము మాస్టారు



నిన్న సాయంత్రం “రాము మాస్టారు”కి ఫోన్ చేసా.  ఆయనకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు చెబుదామని కారణంతో. ఈ విషయం మొన్నటికి మొన్న మా ఊరి నుండి టీచరు ఉద్యోగం చేస్తున్న చిన్ననాటి జోస్త్ కన్నబాబు ఫోన్ లో చెప్పడంతో తెలిసింది. అంతే కాదు ఈ అదివారం పూర్వ విద్యార్దులతో కల్సి ఆయనకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి తప్పక రావల్సినదే అని మరి మరీ చెప్పాడు.

ఉపాధ్యాయుల దినోత్సహం నాడు కాకినాడ అంబేద్కర్ భవన్ నందు ఆయనకు అవార్డ్ ప్రధానోత్సహం జరిగిందట. ఈ విషయం ఆయన చెపితేనే తెల్సింది. నేను ఆ సమయానికి కాకినాడలో ఉన్నప్పట్టికి సమాచారం లేని కారణంగా వెళ్ళడానికి వీలుపడలేదు. ఈ విషయమై నొచ్చుకొన్నాను కూడా.

ఆయితే ప్రభుత్వం వారు ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఎంపికలో రాజకీయ పైరవీలు, ఇతర పైరవీలు ఉంటాయనే విషయంలో అనేక అపోహలు అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. కానీ ఈ సందర్బంలో “రాము మాస్టారు”కి అవార్డు వచ్చిన విషయంలో నాకు ఎటువంటి అపోహ లేదు. ఆయనకు  ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవడానికి అర్హత ఎందుకు ఉందో ఆయన దగ్గర శిష్యరికం చేసి వివిధ ఉద్యోగాల్లో సెటిల్ ఆయిన అనేక మంది విద్యార్దులే ఇందుకు సాక్ష్యం. అందులో నేను ఒకడిని కావడం కొద్దిగా గర్వంగా ఫీలవుతున్నాను.

వాస్తవంగా చెప్పాలంటే, ఒక మాస్టారు ఉత్తమమైన బోధన చేస్తున్నారనే  అసలైన సర్టిఫికెట్ ఇచ్చేది విద్యార్దులు, తల్లిదండ్రులు, గ్రామస్దులే... ఆ విషయంలో మా “రాము మాస్టారు” ఎప్పుడో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్దు పొందినట్టే..  మా “రాము మాస్టారు” కి ప్రభుత్వం ప్రకటించిన ఆవార్డు జస్ట్ ఒక అభరణం మాత్రమే అని నా ఫీలింగు. ఆ స్టేజి ఆయన ఏనాడో దాటేసారు.

ఎలిమెంటరీ నుండి పి.జి వరకు నేను చేసిన చదువు ప్రయాణంలో అత్యధిక ప్రాముఖ్యత కల్గిన ఉపాధ్యాయుల్లో “రాము మాస్టారు”దే ప్రధమ స్దానం. ఆయనంతగా ప్రభావితం చేసిన వారు ఒక్కరూ లేరు. నాకు లెక్కలు సబ్బెక్టు అంటే ఉన్న మమకారం కారణంగా ఇంటర్ లో ప్రెవెటు మాస్టారు ఆయిన గిరిశం గారు కూడా నా మీద అభిమానం చూపించేవారు. ఆయితే తర్వాత కాలంలో ఆయనతో నా ప్రయాణం ఆగిపోయింది.

ఆయన ఈ స్టేజికి రావడానికి పట్టిన సమయం తక్కువేమి కాదు. అలాగే ఆయన నడిచొచ్చిన దారి పూలదారి కాదు కదా కనీసం మట్టి దారి కూడా కాదు. అలాంటి ప్రతికూలతలు అన్నింటిని తట్టుకొని “శాంతినికేతన్” ని నిర్మించి నాలాంటి వారికి అక్షరాలు దిద్దించి పదాలు నేర్పించి మాట్లాడడం నేర్పించి, రాయడం నేర్పించి విజేతలుగా తీర్చిదిద్దడం అనేది మామూలు విషయం కాదు.

“శాంతినికేతన్” రాము మాస్టారుకి తొలి మజిలీ ఆయితే నా విద్యాబ్యాసంనకు తొలి మజిలీ “రాము మాస్టారు”. “ఇనుమును బాగా కాల్చినపుడే మనకి కావల్సిన విధంగా మార్పు చేసుకోగలము” అన్నట్టుగా ప్రాధమిక విద్యాభ్యాసంలో గురువులు విద్యార్దులును మలిచే తీరు ఆధారంగానే అయా విద్యార్దుల భవిష్యత్తు ఉంటుంది.  అందుకనే చాలా మంది చెబుతుంటారు, ప్రాధమిక విద్యలో సరయిన గురువును పొందగలిగితే సరయిన విద్యాబుద్దులు అందితే ఆ తర్వాత తిరుగుండదు అని.  ఆ అదృష్టం చాలా మంది విద్యార్దులకు దొరకదు. కానీ మా ఊరిలో మా బ్యాచ్ మరియు ఆ తర్వాత చదివిన వారందరికీ “రాము మాస్టారు” ప్రాధమిక గురువు కావడం వలన  అందరూ సరయిన దారిలో ప్రయాణించగలిగారు. ఈ విషయం నేను కాదు, ఆయన దగ్గర చదువుకున్న ఏ విద్యార్ది ఆయినా అదే మాట చెబుతాడు..

“రాము మాస్టారు”కి ఫోన్ చేసినపుడు అదే మాట చెప్పాను ఆయనతో.. సార్, మీకు ఉత్తమ ఉపాద్యాయుడు ఆవార్డు రావడం అనేది ఒక అభరణం మాత్రమేనండీ... మాకు మీరు గతములోను, ఇప్పుడు, రేపు కూడా మాకు ఉత్తమ ఉపాధ్యాయుడే. ఆ విషయం మీ విద్యార్దులు సాధించిన విజయాలే చెబుతున్నాయి అన్నా..... నేను అన్న మాటలకు “రాము మాస్టారు” నవ్వేసారు. ఆ నవ్వు నాకు చాలా ఆనందంగా అనిపించింది.

ముందుగా ప్లాన్ చేసుకున్న అఫీసు ప్రొగ్రాం కారణంగా ఈ రోజు మా ఊరిలో “రాము మాస్టారు”కు జరుగుతున్న సన్మాన కార్యక్రమంనకు హాజరు కాలేకపోవడం వలన గిల్టీగా ఉంది. ఆయితే వీలు చేసుకొని మా ఊరు వెళ్ళినప్పుడు ఆయనని కలవకుండా మాత్రం తిరిగి రాను అని మాత్రం గ్యారంటీగా చెప్పగలను.


“రాము మాస్టారు”కి అభినందనలతో.....