Thursday 28 March 2013

గుజారిష్ – నవరసాల వేదిక...


సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ తారాగణంగా తెరకెక్కిన సినిమా గుజారిష చూసారా మీరు?


బహుశా మూడు, నాల్గు ఏళ్ళ క్రితం వచ్చుంటుందేమో ఈ సినిమా.. అప్పుడు ఈ బ్లాగులు, వాగుడుకాయలు లేవు కాబట్టి పంచుకోవడానికి కుదరలేదు. (అప్పటికి బ్లాగులున్నాయి కానీ మనకి అంత నాలెడ్జి లేదు అని అర్ద్రం చేసుకోగలరు)...

గుజారిష్ఎన్ని సార్లు చూసిన నాకు మళ్ళీ మళ్ళీ  చూడాలనిపించే అద్బుత క్లాసికల్ మూవీ అది...
నేను అప్పుడు మా ఊరిలో ఉండేవాడిని. ఈ సినిమా రిలీజయిందని తెలిసి కాకినాడ వెళ్ళి మరీ చూసానీ సినిమాను..... భన్సాలీ సినిమాను తెరకెక్కించిన విధానం.. హృతిక్ పాత్రకు జీవం పోసిన పద్దతి మాటల్లో చెప్పలేము..... చూసి ఆనందించవల్సిందే.....

కమర్షియల్, సూపర్ హిరో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన నేటి తరం హిరోల్లో ఎవరూ చేయలేని సాహసం హృతిక్ చేసాడనే చెప్పాలి.... నటుడు అంటే అన్ని రకముల పాత్రలు చేయగలగాలి. అంతే కాని కేవలం యంగ్రీమాన్,లవర్ బాయ్ పాత్రలు మాత్రమే కాదు. స్వర్గీయ ఎన్.టి.ఆర్., కమల్ హసన్ లాంటి కొంత మంది మాత్రమే  నటులనుపించుకొన్నారు. మిగతా వారందరూ కేవలం హీరోలు మాత్రమే అనిపించుకొన్నారు..... హిరోలందరూ నటులు కాదన్న సంగతి మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను...

ప్యాషన్ పరంగా, టెక్నిక్ పరంగా, కధనం పరంగా సరికొత్త పధములో దూసుకుపోతున్న బాలీవుడ్ లో గుజారిష్ లాంటి మూవీని ఎంచుకొని హౄతిక్ ఎంతో సాహాసం చేసాడని అనుకుంటున్నాను. అందులో అతని నటన చూస్తే, అతను నటనకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో గమనించవచ్చు.

కమర్షియల్ సినిమాలు ప్రతి హిరోకి దొరుకుతాయి. కానీ ఇలాంటి సినిమాలు చాలా కొద్ది మందికి మాత్రమే వస్తాయి. మెడ క్రింద భాగం మొత్తం చచ్చుబడిపోయిన మెజీషియన్ పాత్రలో హృతిక్ రోషన్ జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అతని నటన చూసి అందులో లీనమవడం చూసి హ్యాట్సాప్స్  చెప్పకుండా ఉండలేము. మాటలు కాని, చేతలు కానీ లేకుండా కేవలం హవభావాల ద్వారానే అన్ని రసములు పలికించడం సామాన్యమైన విషయం కాదని సినిప్రియులకు తెలుసు.....

ముఖ్యంగా ఒక ఈగ తన ముక్కు మీద వాలినపుడు మరియు ఒక రాత్రి వర్షానికి పై భాగము నుండి ఒక్కొక్కొ నీటి బొట్టు కారుచూ కరెక్ట్ గా నుదుటి మీద పడుతున్నప్పుడు సహయానికి అక్కడ ఎవరూ లేక ఆతను పడ్డ ఇబ్బంది, దానిని తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం మె.గు సీన్లు అద్బుతంగా ఉంటాయి. ఈ విధంగా సినిమా అద్యంతం హృతిక్ తన నటనతోనే మైమరపించగలడు. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నప్పుడూ, గ్రౌండ్ లో కొంతమంది ఆటగాళ్ళు పుట్ బాల్ అడుతున్నప్పుడు వారిని తదేకంగా చూడడం.... అలా చూస్తూ, చూస్తూ పరిగెడుతున్న అటగాళ్ళ కాళ్ళని చూడడం... తద్వారా మొహంలో అనేక భావాలు పలికించడం నిజంగా వండర్ పుల్.... భన్సాలీ టేకింగ్ కూడా మాటల్లో చెప్పలేము...

వీలయితే మీరు కూడా ఇప్పుడే చూడండి... నేను చెప్పింది వందశాతం నిజమని మీరు ఒప్పుకుంటారు.....

సంజయ్ దత్ క్షమబిక్ష డిమాండ్ సరైనదైనా?


1993 బొంబాయి బాంబు పేలుళ్ళు ఘటనకి సంబందించి ఉగ్రవాదుల నుండి అక్రమంగా అందుకున్న అయుధాలును తన యింట దాచియుంచిన కేసులో జైలు శిక్ష పడిన సంజయ్ దత్ కి ఇప్పుడు పలువురు ప్రముఖ్యులు నుండి సానుభూతి వ్యక్తమవడం మరియు దత్ కి క్షమబిక్ష కోసం డిమాండ్ చేయడం సరైనదైనా?

చట్టం అందరికీ సమానమేనా.. లేక కొద్దిగా ఎక్కువ తక్కువ సమానమా?

నేను సంజయ్ దత్ అభిమానిని. అతనికి శిక్ష విధించడం ఎందుకో గాని నాకు వ్యక్తిగతంగా మనస్కరించలేదు. ఎందుకంటే చేసిన తప్పుకి ఇప్పటికే కావల్సినంత మానసిక క్షోభ అనుభవించియుంటాడని నా అభిప్రాయం. పైగా అతను తాను చేసిన తప్పుకి పశ్చాతాపపడి దైనందిన జీవితంలో సినిమాలు తీసుకుంటూ కొనసాగుతున్నాడు. పైగా తర్వాత కాలంలో అతని మారిన ప్రవర్తన విమర్శించే విధంగా లేదు. కాబట్టి అతనికి శిక్ష విధించడం కొద్దిగా బాధ కలిగించింది.. ఇది ఒక వైపు...

ఇదే విషయం మా రూమ్మేట్ దగ్గర అన్నాను.... అప్పుడు మావాడు ఈ క్రింది విధంగా అడిగాడు.

కానీ రెండో వైపు.... ఇలాంటి న్యాయం ఒక్క సంజయ్ దత్ కి మాత్రమేనా? మరి మిగతా వారి మాటేమిటి? తప్పు చేసిన మిగతా వారి విషయములో కూడా సానుభూతి పేరు లేక ఇంకేదో కారణం చూపి క్షమబిక్షకి డిమాండ్ చేస్తారా? మరి వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు. సంజయ్ దత్ సినిమా స్టార్ అనేనా? చట్టం ఒక్కొక్కొరికి ఒక్కొక్కొ విధంగా ఎలా పనిచేస్తుంది? ఈ రోజు సంజయ్ దత్ కి క్షమబిక్ష ఇవ్వదలిస్తే, రేపు ఈ కేసును ఉదహరణగా చూపి మిగతావారు అదే విధంగా కోర్టులకు ఆప్పీల్ చేసుకుంటే ఏమవుతుంది? ఈ రోజు దత్ కి క్షమబిక్ష కోసం డిమాండ్ చేస్తున్న ప్రముఖ్యులందరూ దత్ కి సపోర్ట్ చేస్తున్నట్టే మిగతా సామాన్య జనాల విషయంలో కూడా సపోర్ట్ చేస్తారా? అని అడిగాడు.

మావాడు అన్నదాంట్లో వంద శాతం నిజముంది. ఇంక మనమేమంటాం....

మరి మీరేమంటారు???


హంగ్ తప్పదేమో…


చూస్తుంటే రాబోయే ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా హంగ్ వచ్చే పరిస్దితులు కనిపిస్తున్నాయనిపిస్తుంది.....

మొన్న నా అప్త మిత్రుడి కూతురి మొదటి పుట్టినరోజు వేడుకలకు రమ్మంటే తప్పనిసరై వెళ్ళాను. అక్కడ ఏమి తోచక సదరు అప్తమిత్రుడి నాన్నగారితో పిచ్చాపాటి మాట్లాడడం మొదలుపెట్టాను. ఆయన మా ఊరి దగ్గర ఉన్న ప్రక్క ఊరికి గ్రామ స్దాయి నాయకుడు.

ఏంటి మామ... వచ్చే ఎలక్షన్స్ లో ఎవరూ వస్తారంటావ్ నేను అడిగాను....

వై.ఎస్.ఆర్.కాంగ్రెసు రావాలమ్మ అన్నాడు మామ...

బోలెడు ఆశ్చర్యపోయా... టి.వి.ల్లోను, పేపర్లలోను, సి.బి.ఐ. ఎంక్వైరీల్లోను బోలెడంతా అవినీతి చేసినాడని చెప్పి జైల్లో పెట్టిన మన ఓదార్పు నాయకుడు పార్టి గురించి చెపుతుంటే..... 
అదేంటి మామ అట్టాంటవ్.. ఇప్పటికే బోలోడెంత ప్రజాధనం మొక్కి జైలుకూడు తింటున్నాడు కదా... ఇక మనకేమి చేస్తాడు అని అడిగా....

ఆ.. బోడి ఎవడూ తినలేదు నాయనా ఈ రోజుల్లో.... అది కామన్ ఆయిపోయింది కదా... ఎవడు పట్టించుకుంటున్నాడు ఇప్పుడు అన్నాడు మామ....

అదేంటి మామ.. అధికారంలో లేకుండానే అంతోటి అవినీతి చేసి డబ్బు కూడబెట్టిండు.. ఇక అధికారమిస్తే ఇంకెత చేస్తాడు? మనకేమి చేస్తాడు అని చిన్నపిల్లాడిలా అడిగా...

మామ చిదిల్వాసంగా నవ్వి.. నాయనా.. ఇక తినడానికి ఏమి లేదు.. వాడికి కావలసినంత ఇప్పటికే సంపాదించుకున్నాడు... అందుకని వాడికి ఇప్పుడు డబ్బులు పని లేదు.... ఇప్పుడు వాళ్ళకు పేరు కావాలి... అందుకే ప్రజలకు ఎంతో కొంత చేయడానికి అవకాశం ఉంటుంది అని గీత సారాంశం విడమర్చి చెప్పాడు ఆయన....
అహా... ఏమి దహర్ద హృదయం మన తెలుగు వాళ్ళది అనిపించక తప్పలేదు నా అంతరాత్మకి.....

జై జగన్...జై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్.... జై అవినీతి..... జై అవినీతి తర్వాత అభివృద్ధి అని గొంతెత్తి అరవలనిపించింది.....

మరి అలుపెరగని బాటసారిలా గత ఆరు నెలల నుండి పాదయాత్ర ఆంటూ రోడ్డెక్కిన చంద్రబాబు పరిస్దితేంటి మామా అని అడిగా...

ఆ కష్టానికి సెక్ండ్ ప్లేస్ వస్తుందిలే, కాంగ్రెసుకి మూడో స్దానమెస్తుంది అని అన్నాడయన... చాలా సింపుల్ గా....
హతవిధీ అనుకున్నా..... గ్రామ స్దాయి నాయకుల్లో జగన్ మేనియా ఎంతుందో ఆ విధంగా ఎరుకయింది నాకు...
మర్నాడు టి.డి.పి. వీరాభియైన నా రూమ్మేట్ నాయుడు దగ్గర చెప్పాను జరిగిందంతా....

ఏంటి బాబూ పరిస్దితి అన్నాన్నేను... మరి బాబు గారు పాదయాత్ర మంచి రేంజ్ లో జరుగుతుందాయే.... ఆ పాదయాత్ర రాబోయో అధికారానికి బాట అని అందరూ భావిస్తున్నాము కదా......

నాయుడు అంతకన్నా చిదిలాస్వంగా నవ్వి ఇలా సెలవిచ్చాడు....
బ్రదర్... రాబోయో ఎలక్షన్స్ కి ఏ పార్టికి మెజారిటి రాదు. తెలంగాణాలో టి.డి.పి., వై.ఎస్.ఆర్.సి.పి.కి డిపాజిట్లు కూడా రాకపోవచ్చు. అలాగే మిగిలిన సీమాంధ్ర స్దానాలను మూడు పార్టిలు పంచుకుంటాయి. ఫలితంగా ఏ పార్టికి మెజారిటి రాకపోవచ్చు......

అప్పుడు పైనల్ గా కాంగ్రెసు మరియు వై.ఎస్.అర్.సి.పి.కలిపి ప్రభుత్వంను ఏర్పాటు చేయోచ్చు... ఇందులో ఆశ్చర్యపోవలసిన విషయమేమి లేదు...... అని సెలవిచ్చాడు.....
అంటే రాబోయో రోజుల్లో అభివృద్ధి కాంగ్రెసు మరియు వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుల ఇళ్ళలో జరుగుతుందన్న మాట... బాగుంది....

మరి మన ఇళ్ళల్లో అభివృద్ధి ఎప్పుడూ జరుగుతుందబ్బా......
కల కనాలి ఈ రోజు రాత్రికి......

Wednesday 13 March 2013

దక్షిణ భారతం: వివక్షయేల…. విస్మరించడమేల.....


చాలా వ్యవహరాల్లో కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే దాని పరిపాలన  కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉన్నట్టుగా ఉంది. దక్షిణ భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న మాట కేవలం చెప్పుకోడానికే తప్ప ఆచరణలో చాలా తక్కువగా ఉన్నట్టుగా తోస్తుంది

త్రీవమైన విద్యుత్ కొరతతో రాష్ట్రం అల్లాడుతుంటే, దీనికి సంబందించి రాష్ట్ర వర్గాలు సాయం కోరితే అది అసలు తమ పరిధిలో అంశమే కానట్టుగా వ్యవహరించడం చాలా విచారకరం.... వివిధ ప్రాజెక్టుల్లో తనకు రావల్సిన కేంద్ర వాటా మరియు పన్నుల్లో భాగం తీసుకోవడానికి సిద్దమే కాని, సాయం లేదా భాధ్యతల విషయానికి వచ్చేసరికి మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. రాబోవు రోజుల్లో దేశం ఎదుర్కోనబోతున్న విద్యుత్ సంక్షోభంను నివారించడానికి రాష్ట్రాలతో కలసి ఏమి చేపట్టబోతుందో కూడా అలోచించలేకపోతుంది.....


ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరతతో పారిశ్రామిక రంగం చాలా నష్టపోయి ఉంది. భవిష్యత్తులోనైనా యివ్వకపోతే మూసివేయవలసిన పరిస్దితుల్లో కేంద్రాన్ని సాయం కోరితే, సచిన్ పైలట్ ఏమన్నారు!!

ఈ విషయములో మేము చేయగలిగింది ఏమి లేదు అని!!!

ఏమి చేయలేని దానికి ఇక ఆ పదవిలో ఉండడమెందుకు??

రాష్ట్రంలో విద్యత్ సంక్షోభంను ఈ స్దితికి తీసుకువచ్చిన నాయకులను ఇప్పుడు తూలనాడి ఉపయెగం లేదు. అదే పని కేంద్ర నాయకులు కూడా చేస్తే ఇక అక్కడ ప్రభుత్వాలతో దక్షిణ భారతానికి పని ఏముంది....

కరెంటుని కొనడానికి ప్రక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కొరత ఉంది. పోని ఉత్తరాదిని నుండి కొనాలంటే ఆ సౌకర్యం లేదు. ఇప్పటికైనా ఉత్తరాదికి, దక్షిణాదికి విద్యుత్ ని సరాఫరా అయ్యేలా యంత్రాంగంను రూపొందించారా అంటే సమాధానం ఉండదు. అదే పరిస్దితి ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చి, దక్షిణాది నుండి కరెంటు తీసుకోవలసిన పరిస్దితి వస్తే ఇంత ఉదాసీనంగా ఉంటారని మనం భావించగలమా??

విద్యుత్ ఒక్క విషయమనే కాదు... రైల్వే ప్రాజెక్టులు కానివ్వండీ, మిగతా ఏ ప్రాజెక్టులు కానివ్వండీ... అన్నింటిలోను వివక్ష చూపిస్తునే ఉంది...

వీళ్లకు తొడు ఆయా మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్న మంత్రులు తమ స్వంత ప్రాంతాలకు మాత్రమే ప్రాతినిద్యం వహిస్తున్నాము అన్న ధొరణిలో పలు ప్రాజెక్టులకు తమ ప్రాంతాలకు కేటాయించుకుంటున్నారు తప్ప  దేశహితమును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం లేదు. ఇప్పటి వరకు రైల్వే శాఖని నిర్వహించిన వారందరూ ఉత్తరాది వారే కావడం మరియు పలుప్రాజెక్టులు వాళ్ళకుమాత్రమే కేటాయించుకోవడం ఇప్పటి వరకు చూస్తునే ఉన్నాము.

అలానే వ్యవసాయశాఖ మంత్రిగా పవర్ ఏనాడయిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేసిన దాఖలలు ఉన్నాయా? తనకొచ్చిన మంత్రిత్వశాఖను తన పార్టి బలోపతంనకు మరియు తన వ్యక్తిగత చరిష్మాను పెంచుకోవడానికి మాత్రమే ఉపయెగించుకొన్నారు. ఇది ఎంత వరకు సమర్దనీయం? ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఇక్కడ రైతులు అత్మహత్యలు చేసుకొన్నారు... ఎవరైనా పట్టించుకున్నారా?? అదే విధర్భలో జరిగితే, దానికి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించింది.


ఇలా అన్నింటిలోను వివక్ష చూపుతున్నప్పుడు మనం పన్నుల్లో వాటా ఎందుకివ్వాలి?
లేకపోతే ప్రతి మంత్రిత్వ శాఖనకు దక్షిణాది మరియు ఉత్తరాది శాఖలను ఏర్పాటు చేసి ఇద్దరేసి మంత్రులను నియమించాలి. ఆఫ్ఫుడయినా సమన్యాయం వస్తుందని భావించవచ్చు.

లేదంటే రాజధానిని దక్షిణ భారతంలోని బెంగుళురు, కొచ్చిన్, చైన్నై లలో ఏదొక దానికి మార్చాలి. లేదంటే ప్రత్యేక దక్షిణ భారతదేశం కావాలన్న డిమాండ్ లు రావచ్చును. అదే భావన ఇక్కడి ప్రజల్లో కలిగితే దేశ ఐక్యత బద్దలవడం ఖాయం....


ప్రమాణం చేసినపుడు భారతదేశ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పినప్పుడు అఖండ భారతవని మొత్తము మదిలోకి రావాలి. దేశము మొత్తం నాదే అన్న భావన కలగాలి. 

Tuesday 12 March 2013

గోదారి కతల రుచే వేరు....


వంశీ వ్రాసిన మా పసలపూడి కధలు చదివినోడికి ఉభయ గోదావరి జిల్లాలలో గోదారితో పరిచయమున్నోళ్ళికి గోదారోళ్ళ కతలు ఎన్ని సార్లయినా వినబుద్దేస్తుంది....

ఎందుకంటే ఆయా కతల్లో అన్ని పాత్రలు మన కళ్ళ ముందే తిరిగినవి, చూసినవై ఉండడం వల్ల కాబోసు.. పైగా గోదారోళ్ళు మంచి హస్యప్రియులు... మాట్టాడే ప్రతి మాటకు వెటకారంను పప్పన్నంలో  అవకాయ నంజుకున్నంత ఈజీగా జోడించేస్తారు.

ఇయన్నీ ఎందుకు కానీ, వంశీ రాసిన పసలపూడి కతలు చదివినప్పుడల్లా, నేను ఎందుకు కొద్దిగా లేటుగా పుట్టానా అనిపించని రోజు లేదు. ఎందుకంటే డైబ్బయి, ఎనభై దశకాల్లో అంటే మా నాన్న గారి  హయాంలో నాలాంటోళ్ళు మంచి ఎంజాయి చేసియుంటారు. అసలు జీవితంలో టెన్షన్ అనే పదం విని ఉండరనుకుంటా... మరి ఈ రోజు? పొద్దున్న లేచిన మొదలు రాత్రి ఆయేవరకు టెన్షన్ తో గడపడానికే రోజు మొత్తం సరిపోతుంది.

ఆ రోజుల్లో ఓ పనా?? పాడా?? శుభ్రంగా ఉన్న ఊళ్ళోనే ఉండి, రాయల్ ఎన్ ఫిల్డ్ బుల్లెట్ ఒకటి యేసుకొని, మెడలో పులిగోరుతో చేసిన మందపాటి గొలుసు చొక్కా బొత్తాలను దాటుకొని బయటకు కనబడుతూ ఉంటూ, రోడ్డు మీద వెళ్తుంటే ఆ దర్జా ఇప్పుడు ఎక్కడ వస్తుందండీ.... ఇయన్నీ మా బాబు, ఆళ్ళ తమ్ముడు గార్లు చేసారండీ. అస్సం వంశీ కతల్లో మల్లేనే.... పోనీ అలా రోడ్డు మీద తిరిగి వచ్చేసేవారా అంటే అదీ కాదు... వీళ్ళకు బయట బోలేడు వ్యవహరాలు.....అయన్నీ ఆ రోజుల్లో దొరబాబులకు మామూలే అనుకొండి... వంశీ కూడా అదే చెబుతారండీ... అయన్నీ ఇంట్లో పెద్దొళ్ళుకి తెలిసినా కూడా పల్లెత్తు మాటంటే ఒట్టు. ఎందుకంటే వాళ్ళు మగమహరాజులు... ఏదన్నా చేత్తారు అనేవారు.

మరి ఈ రోజు.. ఇట్టాంటివి ఏవైనా చేసినట్టు గానీ, చేస్తున్నట్టు గానీ చిన్న ఉప్పు అందడం పాపం... యమధర్మరాజు వారు కూడా జడుసుకొనేలా మనకి ఇక్కడ అభిషేకం చేస్తుంటిరి.. ఏం.. మనం మగమహరాజులం కాదా? అనిపించడంలో తప్పు లేదనుకుంటా....

అందుకేనేమో, వంశీ కతలు చదువుతూ ఆ కతల్లో మనకి కూడా ఒక క్యారెక్టర్ సెట్ చేసేసుకొని అనందించడం మినహా అంతకన్నా ఏమి చేయలేకపోతున్నాము. ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నామంటే, చెప్పలేం... కొన్నింటికి సమాధానాలు ఉండవు....

పెసరట్టు ఉప్పా తినాలంటే ఫలానా సెంటర్ లో సుబ్బయ్యమ్మ దగ్గరకి వెళ్ళిపోవాలంటాడు ఆయన... వెంటనే మన దృష్టి ఎరుకలో ఉన్న అలాంటి సెంటర్ దగ్గరకు పోతుంది... అలానే అంతర్వేది తీర్దంలో ఒక రోజు అనుకోకుండా రాజోలు అవతలు ఉన్న గోదారిలంకలోని ఒక ఊరు నుండి ఒక నెరజాణ వచ్చిందంటాడు... అంతే మనం కూడా మా బుచ్చింపేట తీర్దంలోకి వెళ్ళిపోయి అక్కడ మూడు రోజుల పాటు కునుకు లేకుండా చేసిన వేములపూడి నెరజాణ బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది. అలాగే ఇంగ్లీషు సినిమా కోసమని కాకినాడ సత్యగౌరి సినిమాహలుకి వెళ్ళడమనగానే.... మనం సత్యగౌరి సినిమాహాలులో చిరంజీవి గారి “మాస్టార్” సినిమాకి పోయిన రోజులు కళ్ళ ముందు రీళ్ళలాగా గిర్రున తిరుగుతుంటయి ఎటువంటి మిషన్ లేకుండానే.....

గోదారి కతలు అంతే అనుకుంటా... అవి ఎక్కడో ఆకాశంలో నుండి ఊడిపడవు... మన దగ్గరే మొదలయి మన చుట్టు తిరిగుతున్నట్టుగా ఉంటాయి. అందుకే గోదారి కతలుకు తిరుగుండదు...

వీడేంటి.. ఉన్నట్టుండి గోదారి కతలు మీద పడ్డాడు అన్న అనుమానం వచ్చిందా మీకు??
హి..హి... దానికో కారణముంది లెండి... ఎందుకంటే నిన్ననే ’గుండెల్లో గోదారి’ సినిమా చూసా..

ముందు రోజు సెలవు కావడం, మరియు ఈసారికి యింటికి వెళ్ళబుద్దేయక ఇక్కడే ఉండిపోయా... కానీ ఇక్కడ ఏమి తోయలేదు. దానితో సినిమాకు వెళ్దామనుకొని, ఏ సినిమాకి వెళదామా అని ఆలోచించా...
గుండెల్లో గోదారి తప్ప చూడవలసిన సినిమాలేవి లేవు... దానికి వెళ్ళడానికి నాకున్న ధైర్యం చాలలేదు...
ఎందుకంటే అందులో ఉన్నది విశ్వవిఖ్యాత నటి ఆయిన మంచు లక్ష్మి మరీ.......

మొత్తానికి నా భయమే పై చేయి సాధించి, ఆ రోజుకి వెళ్ళడం మానేసా....  ఆ రాత్రి నాకు తెలిసిన స్నేహితులకు ఫోన్ చేసి సినిమా ఎలాఉందో వాకబు చేసాను. ఎవరికి దగ్గర బ్యూరో రిపోర్ట్ లేదు...

మర్నాడు ఏదయితే అదే అయిందేలెమ్మని మార్నింగ్ షో కి చెక్కేసా... భయం భయంగానే....

సినిమా మొదలయిన తర్వాత ఆ భయం నెమ్మదిగా పోయి ఆ స్దానంలోకి గోదారోడి కతలు గుర్తుకు వచ్చాయి. నిజ్జంగానేనండీ...  సినిమా ఒక మెస్తరు బాగానే ఉంది. ఎందుకంటే గోదారి నేపధ్యం గల సినిమా అని కాదు. సినిమాను వాస్తవికంగా అయా పరిస్దితుల ఆధారంగా తీయడమే నాకు నచ్చడానికి కారణం..... సినిమా ఎనభై దశకానికి చెందినది..... వాస్తవానికి ఆనాటి పరిస్దితులు ఏ విధంగా  ఉండేవో, అలానే వివిధ హోదాల మనుషుల మధ్య మాటలు ఎలా ఉండేవొ, అచ్చు గుద్దినట్టుగా చూపించారు. ఆ ఒరిజినాలిటియే నాకు నచ్చింది.... ఎక్కడా సినిమా నాటకీయత జొప్పించలేదు. ముఖ్యంగా గోదావరి వరదల దృశ్యాలు బాగానే వచ్చాయి. పైగా గోదారి ప్రాంత పల్లెల ముఖచిత్రంను చాలా దగ్గరగా తీసుకున్నాడు. పాత్రధారుల నివాసాలు కూడా వాస్తవికతకు దగ్గరగా ఉండే విధంగా శ్రద్ద తీసుకున్నారు.

ఇలాంటి కధలతో ఇప్పటి వరకు సినిమాలు రాలేదని అనను. కానీ అ వచ్చిన సినిమాలన్నీ వాస్తవికతకు దూరంగా తీసినవే అని నా ఉద్దేశం... ఉదహరణకి చిరంజీవి సినిమాలు చూడండి. చాలా సినిమాల్లో కార్మికుడిగానే లేక పనోడుగానో నటించాడు. సినిమాలో యజమాన్యంను లేదా ఊరిపెద్దని ఎదిరించడం దగ్గరి నుండి, తన బాస్ కూతురుని పెళ్ళి చేసుకోవడం వరకు చాలా జిమ్మిక్కులు చూపిస్తారు. నిజజీవితంలో అసలు అలా జరుగుతాయని ఊహించుకోడానికి కూడా చాన్సే లేదు. ఇప్పటి వరకు ఆ విధంగానే మన తెలుగు సినిమాలు ఆఘోరించాయి. అఘోరిస్తున్నాయి... జనాలు అలాంటి వాటిని ఆదరించారు కాబట్టే వారు ఇమేజి సంపాదించుకున్నారు... దీనికి కారణం చాలా మంది జనాలు తాను నిజజీవితంలో చేయడానికి కూడా ఉహించసాధ్యంకాని పనులను సినిమాలో చూడడం ద్వారా సంతృప్తి చెందుతాడని ప్రముఖ్య బ్లాగరు మరియు మానసిక వైద్యులు శ్రీ యా.రమణ గారు గతములో  చెప్పినట్టు గుర్తు......

ఇందులో అలాంటి జిమ్మిక్కులు లేకుండా వాస్తవికత ప్రతిబించేలా చూపించాడు. డైరెక్టరు కుమార్ నాగేంద్ర కొత్తవాడైనా సినిమా రూపకల్పనలో తగు శ్రద్ద తీసుకొన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో ప్రధాన కధానాయకుడు ఆయిన ఆది పినిశెట్టి పల్లెటూరి చేపలు పట్టేవాడిగా అద్బుతంగా నటించాడు. ముఖ్యంగా అహర్యంలో గాని నడవడికలో గాని, మాటల్లోగాని నాటకీయత కనబడకుండా జాగత్తపడ్డారు. ఆనాటి కాలంలో భూస్వామ్య వ్యవస్ద ఎలా ఉండోదో, పనివాళ్ళతో ఏ విధంగా ఉండేవారో, పనివాళ్ళు తిరునాళ్ళకు వెళ్ళి ఏమిచేసేవారో, వారి పట్ల భూస్వామ్య కుటుంబాల్లోని యువకులు ఎలా ప్రవర్తించేవారో ఉన్నదున్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. దానికి తగ్గట్టే తెర వెనుక ఉండే చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోలేదు. ఇకపోతే తాప్సి పాత్రధారిని చూస్తే వంశీ కధల్లో పెద్దింటోళ్ళ అమ్మాయే గుర్తుకువచ్చింది.  అలాంటి సందర్బాలు నిజంగానే జరిగేవి అట ఆనాటి కాలంలో... కొంత మంది పెద్దింటి అమ్మాయిలు బరితెగించి తమ పనివాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. ఆ పని వాళ్ళు అటువంటి సందర్బంని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమయిపోయేవారు. ఆనాడు భూస్వామ్య వ్యవస్దలో ఇలాంటివి జరిగినట్టు తెలిస్తే పరిణామాలు చాలా త్రీవంగా ఉండేవి. వాటినే కధలో చక్కగా చూపించాడు.  పెద్దింటి అమ్మాయి పాత్రలో తాప్సి బాగానే చేసింది. పక్కా కమర్షియల్ ఆయిపోయిన నేటి సినిమాకాలంలో  గోదారి నేపధ్య కధని ఎంచుకోవడం సాహసంగానే భావించాలి. ముఖ్యంగా రూపకల్పనలో వంశీ కధల మార్కుని చెడగొట్టకుండా తీయడం కూడా బాగుంది. గోదారి కతలు అంతే మరి.....

ఇక రెండో భాగములో సందీప్ కిషన్, లక్ష్మిల పాత్రలు కూడా బాగా ప్రెజెంట్ చేసారు. (లక్ష్మి పాత్ర వేరేకరు చేస్తే ఇంకా బాగుండేదేమో). ఆయినా కోడి పందాలు సీన్లు చిత్రికరణకు సెన్సార్ వాళ్ళు పరిష్మన్ అంత ఈజీగా ఎలా ఇచ్చారో ఆశ్చర్యం వేసింది. నిబంధనలు భరించలేక ఈ మధ్యన చాలా సినిమాల్లో జంతువులు లేక పక్షులను గ్రాఫిక్స్ లో చూపించేస్తున్నారు. అలాంటిది సినిమా ద్వితియార్దమంతా కోడిపందాలు నేపధ్యంలో తీయడం గొప్పే అనిపించింది.

అంతేందుకు.. మొన్నటికి మొన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. నేపధ్యం గోదారి ప్రాంతమే...  వంశీ కధ కాకపోయినా, గోదారి ప్రాంత ఆచార వ్యవహరములను కొంచెం దగ్గరగా చూపించారు. ఎంత ఆహద్లకరముగా ఉంటుంది ఆ సినిమాలో వాతావరణం. అభిమానం, అప్యాయతలు చూపించడంలో మా ప్రాంత వాసుల తర్వాతే ఎవరైనా... అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న బేధాబిప్రాయములు ఉన్నా సర్దుకుపోయే తత్వంతో చివరి వరకు ఎలా కలసి ఉండాలో, మరియు సంతృప్తికరమైన జీవితం అంటే ఎలా గడపాలో ఈ సినిమాలో చూపించారు.

హిందిలో కుటుంబ కధా చిత్రాలంటే రాజశ్రీ ప్రోడక్షన్స్ వైపు ఎలా చూస్తారో..... ఇక్కడ కుటుంబ కధా చిత్రాలు కావాలంటే గోదారి ప్రాంతానికి వచ్చేయవలసిందే...  

పి.ఎస్: కాకి పిల్ల కాకికి ముద్దు... అలానే గోదారి కతలంటే మాకు ముద్దు....

Saturday 9 March 2013

రికార్డు ఆయిందా? లేదా?- ఫోటో కామెంట్

రాష్ట్రంలో నేటి విధ్యుత్ సంక్షోభంను రెండేళ్ళ క్రితమే అసెంబ్లీలో చెప్పిన జె.పి. గారి మాట రికార్డు ఆయిందంటారా?
రికార్డు ఆయినప్పట్టికి మన పెద్దల బుర్రలో రికార్డు కాలేదంటారా?
విజన్ అంటే ఇంకో ఇరవై సం.ల తర్వాత ఏమి చేసేయాలో కల కనడం కాదు.
రాబోవు సమస్యలు ఊహించి నేడే దానికి తగ్గ చర్యలు తీసుకోవడం......
ఆలోచించండి..... విజన్ అంటే ప్రజలకు ఉపయెగపడేలా ఉండాలి.. అంతే కాని నేతలకు ఉపయెగపడేలా కాదు.....




















(పై చిత్రం పేస్ బుక్ నుండి తీసుకోవడమైనది)