Thursday 21 February 2013

స్వర్గానికో ఉత్తరం....

ప్రియమైన మధుకి,
మీ అన్నయ్య రాజీవ్ వ్రాయునది. ఇక్కడంతా క్షేమమే. అక్కడ నువ్వు కూడా క్షేమం మరియు ప్రశాంతంగా ఉన్నావని నేను మరియు మన కుటుంబ సభ్యులందరూ భావిస్తున్నారు. ఏంటో రా.. నిన్ను చూసి మూడేళ్ళు గడిచిపోయినప్పటికీ, నిన్న, మొన్న మాట్లాడుకున్నట్టుగానే ఉందిరా నాకు.  ఎన్ని మాటలు చెప్పేవాడివి రా నువ్వు.. మాటలు చెప్పమంటే నీ తర్వాతే ఎవరైనా...  మన ఇంటిలో సబ్బుబిల్ల దగ్గర నుండి హైదరబాద్ లో నీ ఆఫీసు విషయాల వరకు అన్నీ చెబుతుంటే అసలు టైమే తెలిసేది కాదు కదరా...  ఆఫీసు అంటే గుర్తు వచ్చిందిరా.. మన కుటుంబంలో మన తరంలో చదువుకున్న వాళ్ళలో నేను, నువు, మధుమతి మాత్రమే ఉండేవాళ్ళం కదా.. అందుకని మన బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనలో మనమే మాట్లాడుకొనేవాళ్ళం కదా... గుర్తుతెచ్చుకుంటే చాలా హాయిగా ఉందిరా నాకు. ఇక హైదరబాద్ లో నువు కూడా ఉద్యోగం జాయినయిన తర్వాత ఆఫీసులో ఉండే సాధక బాధలు గురించి చాలా సార్లు చెప్పుకొన్నాం... అఫీసులో పరిస్దితుల మీద జోకులు వేసుకొని చాలా సార్లు నవ్వుకున్నాం కదరా...
నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా మార్పులే వచ్చాయి రా.... చదువుకునేటపుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వచ్చేసేవాడివి. దానితో ఎప్పటి విషయాలు అప్పుడే మాట్లాడేసుకొనేవాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు రాక చాలా రోజులు గడిచిపోయింది కదరా... ఈ లోపులో చాలా విశేషాలు జరిగాయి రా మన ఇంట్లో... వేణుకి పాప పుట్టింది రా... మధు పేరు కలసివచ్చేలా మధుర అని నీ పేరే పెట్టారురా ఆ పాపకి.. పేరు ఎవరు పెట్టారో తెలుసా... నువ్వంటే ఎంతో ఇష్టపడే మీ నాన్నేరా... ఆ తర్వాత నీకు మేనల్లుడు  పుట్టాడు రా... వాడికి మెహిత్ అని పేరు పెట్టారు... వాడు ఇపుడు ఎలా ఉన్నాడో తెలుసా.... నువ్వే బెటర్ అనిపించేలా అల్లరి చేస్తున్నాడు రా... ఇప్పటి వరకు నువ్వే పెద్ద అల్లరిగాడివనుకున్నాము. కానీ ఇప్పుడు వాడు నిన్ను మించిపోయాడు. ఆ తర్వాత ఆశోక్ గాడి పెళ్ళి సౌజన్యతో ఆయింది. ఆ పెళ్ళికి అందరూ వచ్చారు. నువ్వు మాత్రమే మిస్ అయ్యావు.  నువ్వు ఉంటే ఇంకా బాగుండేది రా ఆ పెళ్ళిలో... 
ఎవరికి వారికి పెళ్ళిళ్ళు ఆయిపోయిన తర్వాత యిదివరకులా ఎంజాయ్ చేయలేకపోతున్నాను రా నేను ఇక్కడ. అంటే ఎవరిని విమర్శిస్తున్నానని కాదు. పెళ్ళయ్యాక ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయనుకో.... కానీ ఏ మాటకామాటే... ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం రా మనం. నువ్వేమో ఇంజనీరింగు చదివే టైములో ప్రతి శనివారం కాకినాడ వచ్చేసేవాడివి కదా... ఇక ఆ రాత్రంతా కబుర్లే కబుర్లు చెప్పుకోనేవాళ్ళం కదారా.. పడుకొనేసరికి ఒంటి గంట కూడా అయిపోయేదనుకుంటా కదరా... పెద్దమ్మ పడుకోమ్మని తిడుతునే ఉండేది. కాని మనం పట్టించుకొనేవాళ్ళం కాదు కదా... ఆ మర్నాడు పది కొడితే కానీ లేచేవాళ్ళం కాదు. ఇక ఆ రోజంతా బద్దకంగా మంచం దిగకుండానే టి.వి. చూస్తునే గడిపేవేసేవాళ్ళం. నిజంగా తలచుకుంటే ఎంత బాగుండేవి రా ఆ రోజులు... ఎంత డబ్బు పెట్టి కొంటే అలాంటి రోజులొస్తాయి రా మరల.... 
ఇక మీ నాన్నతో ఎన్ని విషయాలు చెప్పేవాడివి రా... మా నాన్న చనిపోయిన తర్వాత అన్నీ మీ నాన్నే కదరా నాకు  కూడా. కాని ఆయనంటే భయం మూలంగా నేనైతే దూరంగా ఉండేవాడిని కానీ, నువ్వు ఎంత స్వేచ్చగా ఉండేవాడివి రా.... రోజూ గంటలు తరబడి ఫోన్ లో మాట్లాడుకొనేవాళ్ళు కదరా.... ఆయినా అన్నీ విషయాలు మీ నాన్న దగ్గర అంత ధైర్యంగా ఎలా చెప్పేసేవాడివిరా... అఖరికి అల్కహల్ పుచ్చుకొన్న విషయం కూడా మీ నాన్నకి ఎలా చెప్పేసేవాడివి రా....  నాకైతే ఇప్పటికీ చెప్పడానికి భయం రా.... మాకందరికి ఆయనొక పెద్దాయనలా కనిపిస్తే, నువ్వు మాత్రం ఆయనతో స్నేహమే చేసావు కదరా.... మీ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ఎక్కడ చూడలేదు అంటే నమ్మరా... కొత్త బంగారు లోకం సినిమా చూసి, ఆ సినిమా చూడండని చెప్పావట కదా.. నువు చెప్పావని ఆ సినిమాకి వెళ్ళారట ఆయన. అలాగే ఈ మధ్య వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసి మధుమతి దగ్గర ఏమన్నారట తెలుసా నీకు.... ఆ సినిమా చూస్తే ఆయనకు నువ్వు, నేనే గుర్తుకు వచ్చామట రా..... వెంకటేష్ క్యారెక్టర్  నాకులానే ఉందట.. అలాగే మహేష్ బాబు క్యారెక్టర్ నీకులానే ఉందని అన్నారట.. మధుమతి కూడా సినిమా చూసి నిజమే అన్నయ్యా అని నాకు ఫోన్ చేసిందిరా.... నువు కూడా చూడరా ఆ సినిమాను. నిజంగా మన స్టోరీల మల్లే తీసాడురా ఆ సినిమాను.
ఏంటో రా.. మాట్లాడుతుంటే ఎన్ని విషయలైనా చెప్పాలని ఉందిరా.... ఈ పేజిలు ఎక్కడ సరిపోతాయిరా మన కబుర్లు చెప్పుకోవడానికి..... సరేలే ఇక నీ సంగతులేమిటి రా.... చెప్పాపెట్టాకుండా నువు వెళ్ళిపోయి మూడేళ్ళు ఆయిపోయింది కదా... ఒక్కసారి కూడా రావాలనిపించలేదు రా నీకు ఈ మూడెళ్ళులో.... ఎంత మిస్సయ్యామో తెలుసా రా... నీకు... తెలియడం లేదురా నీకు.... మీ నాన్న ఆయితే ప్రతి రోజూ లెక్కపెడుతున్నాడు తెలుసా నువ్వు వెళ్ళిన దగ్గర నుండి.... ఆయినా నీ పంతం నీదే కదరా.... అన్నీ నీకు నచ్చినట్టుగానే చేసుకున్నావు... నీకు నచ్చినట్టుగానే బ్రతికావు.... నీకు నచ్చినట్టుగానే వెళ్ళిపోయావు కదరా....
సరేలే... ఏది ఏమైనా నువ్వు సంతోషంగా ఉంటే చాలు రా... ఇంకేమి మాకు అక్కర్లేదు.... నువ్వు కులసాగానే ఉన్నావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను రా... ఎందుకంటే నీలాంటి కలాష్మం లేని మనుషులు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారని నాకు తెలుసు కాబట్టి.......
ఇట్లు
మీ అన్నయ్య అనబడే స్నేహితుడు...
  (నా ప్రియతమ సోదరుడు, స్నేహితుడు మదన్ మెహన్ 3 సం. క్రితం ఇదే రోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. మమ్మల్లందరిని వదిలేసి శాశ్వతంగా)

Sunday 17 February 2013

రెండేళ్ళ నా బ్లాగోతం...


ఆవునండీ.. బ్లాగులో వాగడం మొదలెట్టి ఈ నెలతో రెండేళ్ళు పూర్తి ఆయింది. మొదటి సం.రం పూర్తి ఆయినపుడు ఒక రకమైన భావన, అదే రెండో ఏడాది పూర్తయినపుడు వేరే రకమైన భావన....

బ్లాగు ప్రారంభించిన మొదట్లో వీటి గురించి నాకు అసలు అవగాహనే లేదు. అవగాహన లేకపోవడం వలన అదేంటో తెలుసుకోవాలన్న కుతుహలంతోనే ఎక్కువగా ఏదొక సబ్జెక్టు మీద అర్టికల్స్ రాసి పోస్ట్ చేసేవాడిని....

ఒక సంవత్సరం పూర్తయేసరికి మిగిలిన బ్లాగులను బాగా పరిశీలించేవాడిని, ఎక్కువగా చదివేవాడిని. ఎవరు ఎలా రాస్తున్నారో గమనించేవాడిని. తద్వారా చాలా మంది ప్రభావం నామీద పడేది. ఎప్పుడయితే బ్లాగులు ఎక్కువగా చదవడం మొదలెట్టానో, అయా బ్లాగుల్లో ఉన్న వారి ప్రభావంతో రాయడానికి ఆలోచనలు చేసేవాడిని. దాని వల్ల నా అసలైన ఒరిజినాలిటీ మిస్ ఆయిందనుకుంటున్నాను......

మొదటి సంవత్సరం బ్లాగు గురించి కుతుహలంతో ఎక్కువగా చూసేవాడిని....

రెండవ సంవత్సరం యితర బ్లాగుల గురించి కుతుహలంతో ఎక్కువగా చూసేవాడిని.....

ప్రస్తుతానికి వచ్చేసరికి బ్లాగు మీద కొత్తదనం పోయి పాతదనం వచ్చేసరికి, అన్నీ విషయాలు మల్లే బ్లాగింగ్ మీద కూడా ఇంట్రెస్టు తగ్గినట్టుగా అనిపిస్తుంది..... రాన్రాను నేను వ్రాసే ఆర్టికల్స్ సంఖ్య తగ్గిపోతుంది. దానికి కారణం మరేమి కాదు. శ్రద్ద పెట్టలేకపోవడం. బ్లాగింగ్ ప్రారంభించిన మొదట్లో ఒక బ్లాగరు అన్నారు... బ్లాగ్ ని మొదలెట్టినప్పుడు ఉన్న ఇంట్రెస్టు రాన్రాను నీరుగారుపోతుంది అని.... ఆ కామెంటుని  నేను పెద్దగా పట్టించుకోలేదు కాని, అది నిజమేనేమో అనిపిస్తుంది......

బ్లాగింగ్ నిరంతరం కొనసాగించడమనేది ఒక కళ. అది కొంత మందికి మాత్రమే సాధ్యమయితుందనేది నా అభిప్రాయం. పాతకాలం బ్లాగర్లు నేటికి కూడా అదే ఒరవడితో రాయడం చూస్తుంటే నాకు చాలా అశ్చరమేస్తుంది. నిరంతరంగా రాయడం మీద పట్టు ఎలా నిలుపుకుంటున్నారా అని!!! చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే...

మాలాంటి వాళ్ళలో చాలా మందికి ఇదే బలహీనత అనుకుంటా! తెలియనది తెలుసుకోవాలన్న కుతుహలంతోనే ఏదైనా పని చేస్తున్నాము తప్ప, దాని మీద ఇష్టంతో కాదని అనిపిస్తుంది. సీనియర్ బ్లాగర్లు మాత్రం ఇష్టపడి చేయడం వలనే నిర్విరామంగా వారి యొక్క అమూల్యమైన అనుభవాలను, సంప్రదాయాలను, కధలను ఇలా ఒకటనేమిటి, అన్ని రకములు విషయాలను పంచిపెడుతున్నారు. అవన్నీ మాలాంటి వారికి నిజంగా చాలా ఉపయెగకరం.

బ్లాగింగ్ ద్వారా నేను పంచిపెట్టిన దాని కంటే, పొందినది చాలా ఎక్కువ... చాలా విషయాలను తెలుసుకోవడానికి కారణమయిన బ్లాగింగ్ మీద బ్లాగు వ్యాసకర్తల పైనా నాకు చాలా అభిమానం. ఈ రోజుల్లో పుస్తకాల ద్వారా పాతతరం భావాలు తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేటి తరంలో ఎవరికీ పుస్తకాలు చదవడం మీద ఇంట్రెస్టే లేదు కాబట్టి. ఎవరూ చూసిన కంప్యూటర్ల మీదే పని చేస్తున్నారు. పని ఆయినా కాలక్షేపమయినా కంప్యూటర్ మీదే. దాని వలన మా ముందు తరాలు వారు ఏమన్నారో, వారి అనుభవాలు, భావాలు ఏంటో తెలుసుకోనే అవకాశం ఈ తరానికి లేదు.  ఆ విధంగా ఉన్న ఈనాటి రోజుల్లో బ్లాగుల ద్వారా మా వెనుక తరంతో సంభాషించగలుగుతున్నాము. వారి యొక్క అనుభవాలు తెలుసుకోగలుగుతున్నాము. ఇది ఒక రకముగా వారికి, మాకు వారధిగా ఉపయెగపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం గా భావిస్తున్నాను......

Saturday 2 February 2013

పోరాడే వాళ్ళంతా ఉగ్రవాదులేనా?


విశ్వరూపం సినిమా వివాదస్పదం కావడానికి అసలు కారణమేంటి?

తన సినిమాను అఫ్ఘనిస్తాన్ మరియు కాబూల్ నేపధ్యంలో తీయడమే......

ఆ నేపధ్యంలో సినిమా తీసిన ప్రతి ఒక్కడూ, అక్కడ ప్రతి వాడు విలన్ అన్నట్టుగానే చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడి వారందరూ ఉగ్రవాదులే అన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు........ ఏం... ఆయుధాలు పట్టుకొని సంచరిస్తే ఉగ్రవాదులేనా? అలా అయితే మిగతా దేశాల సైనికుల వద్ద అయుధాలు ఉన్నందున వారిని కూడా ఉగ్రవాదులనవచ్చా?  ఎవరి రక్షణ కోసం వారు ఆయుధాలు ధరించడంలో తప్పేమి ఉంది?
అఫ్ఘనిస్తాన్ మరియు కాబూల్ తలంపుకి వచ్చినప్పుడల్లా మనకి గుర్తుకు వచ్చేది అక్కడ స్దానికులైన ముస్లిం వర్గానికి చెందినవారే... మిగతా దేశాల్లో ఉన్నట్టుగానే అక్కడ కూడా వారు సాధారణ వ్యక్తులే... మిగతా అన్ని దేశాలకు రక్షణ దళాలు ఎలా ఉంటాయో, వాళ్ళకు కూడా రక్షక దళాలుంటాయి. ఆయితే మిగతా దేశాల్లో వ్యవస్ద ఒక క్రమపద్దతిలో పటిష్టంగా ఉండడం వలన తప్పుగా కనబడవు. కాని అఫ్ఘనిస్గాన్ లో అలాకాదే. అక్కడ దేశం మొత్తానికి ఒక పటిష్టమైన సరయిన వ్యవస్ద లేదు. అందు వలన ఎక్కడి కక్కడే ఆయా ప్రాంత తెగలు రక్షక దళాలను ఏర్పాటు చేసుకుంటాయి. మిగతా దేశాలు తమ దేశ రక్షణ కోసము ఎలా రక్షక దళాలు ఏర్పాటు చేసుకుంటాయో, అదే విధంగా వారు కూడా ఏర్పాటు చేసుకుంటారు.  తమ దేశరక్షణ కోసం వారి దళాలు ఎలా పోరాడతాయో,  వారు కూడా వారి రక్షణ కోసం పోరాడతారు. ఇందులో తప్పేమి ఉంది....

కాకపోతే మిగతా చోట్ల పటిష్టమైన రాజ్యనిర్మాణం ఉంది, ఇక్కడ లేదు అంతే తేడా. మిగతా దేశాల మీదకు వేరొకరు వస్తే ఎలా తిరగబడతారో, వీరు కూడా అంతే......

పక్క ఇంటోడి పర్మిషన్ లేకుండా వాడింట్లోకి వెళితే, లాగి పెట్టి కొడతాడు. అలాగే అక్కడ వాళ్ళకు నచ్చకుండా ఎవడైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తే లాగి పెట్టి కొట్టడానికే ప్రయత్నిస్తాడు.

భారతదేశ సైనికులను, వారి వద్దనున్న ఆయుధాలను చూపించి, భారత దేశంలో ప్రజలందరూ ఇలానే ఉంటారని ఎలా భావించలేమో, ఆయుధాలు ధరించి తిరిగుతున్న అక్కడ స్దానికులను చూసి అక్కడ వారందరూ అలానే ఉంటారని భావించలేము...

సినిమా పేరు నాకు గుర్తు లేదు, ఒక హాలీవుడ్ సినిమాలో అఫ్ఘనిస్తాన్ లో ప్రజల కష్టాల గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ సినిమా చూస్తే ఎలాంటి వాడికైనా కన్నీళ్ళు రావడం ఖాయం. ఆ సినిమా చూసిన వారెవరూ వారిని విలన్స్ గా భావించరు. అసలు అఫ్ఘనిస్తాన్ రావణకాష్టంలా మారడానికి కారణం అమోరికా, రష్యాలే. ప్రచ్చన్న యుద్ద కాలములో రెండు దేశాలు అఫ్ఘనిస్తాన్ ని తమ స్వార్దం కోసం సర్వనాశనం చేసేశాయి. వారు చేసిన నష్టానికి ఇప్పటికి పటిష్ట రాజ్య నిర్మాణం చేసుకోలేని స్దాయికి దిగజారిపోయింది.

అఫ్ఘనిస్తాన్ అంటే అయుధాలు ధరించి తిరుగుతున్న వ్యక్తులే కాదు. అంతకు మించి అవతల చాలా ఉంది. దాని గురించి ఎవరూ సృశించరు.. ఎవడో ఒక తలతిక్కవెధవ తిన్నదరక్క ఉగ్రవాదం దారి పట్టాడు. వాడే బిన్ లాడెన్.. వీడు తన ఉగ్రవాదంలోకి ముస్లింలందరినీ కలిపేసాడు. అసలు వాడెంత? ముస్లిం వర్గం మొత్తానికి వాడేమైనా ప్రతినిధా?   ముస్లింలకు అల్లా తప్ప, వేరేవరు ప్రతినిధులు కారు. ఇలాంటి తలతిక్క వెధవలు అన్ని మతాల్లొను ఉన్నారు. మతం పేరు చెప్పి తమ ఉగ్రవాదం పిచ్చిని తలకెక్కించుకొన్న వెధవలు అన్ని మతాల్లోని ఉన్నారు. మరేం వారందరినీ ఒదిలేసి ముస్లింల మీద పడుతున్నారు అందరూ...... బిన్ లాడెన్ ఒక మూర్ఖుడు. వీడు తానున్న ప్రాంతంలో అధిపత్యం కోసం ప్రయత్నించేవాడు. అసలు వీడిని పెంచి పోషించిందే అమెరికా. అమెరికా తన అవసరాల కోసం తయారు చేసిన సంస్దే అల్ ఖైదా.. ప్రచ్చన్న యుద్దం ముగిసిన తర్వాత అమెరికాకు దానితో పనేమి లేక పట్టించుకోవడం మానేసింది. అప్పటి వరకు అమెరికా కోసం కార్యాక్రమాలు నడిపిన అల్ ఖైదా, తన ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు కొనసాగించింది. ఆయితే దానికి ఒక దిశ ఉండాలి కాబట్టి, పైగా దానికి జనామోదం ఉండాలి కాబట్టి, పవిత్ర జిహద్ అని పేరు పెట్టి ముస్లింలందరినీ అందులో భాగస్వామ్యం ఉన్నట్టుగా క్రియెట్ చేసింది. తాను చేసే పనికిమాలిన పనులకు ముస్లింలు అందరూ భాధ్యత వహించాలా? అతనుకతను తాను ముస్లింలందరి కోసం పోరాడుతున్నానని ప్రకటించుకుంటే సరిపోతుందా? వాడు ఉగ్రవాది కాబట్టి, మిగతా ముస్లింలందరూ అలానే  ఉంటారని భావించాలా? ఉదహారణకు మావోయిస్టులను తీసుకుందాం. వీరు ఇండియాలో ఉంటారు కాబట్టి,  మరియు ఇండియాలో మెజారిటీ భాగం హిందువులే కాబట్టి, వారు కూడా హిందువులే ఆయి ఉంటారు అనుకుంటే, హిందువులందరూ ఉగ్రవాదులే అంటే ఒప్పుకుంటామా? అలాగే మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో మాదకద్రవ్య ముఠాలు క్రిస్టియన్ వర్గానికి చెందిన వారిగా భావిస్తే, వారు చేసే సంఘ విద్రోహ కార్యక్రమాలకు క్రిస్టియన్స్ అందరూ భాధ్యత వహించాలంటే ఒప్పుకుంటామా?  ఇది కూడా అంతే...

బిన్ లాడెన్ లాగే, మూర్ఖత్వ భావాలున్న తాలిబాన్స్ చేతుల్లోకి అఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవడం, ఆ దేశం ఇంకా అనిశ్చితిలోకి కూరుకుపోవడానికి కారణమయింది. తాలిబాన్స్ చేసిన అకృత్యాలకు అనేక మంది ప్రాంతీయ ముస్లింలు పడరాని పాట్లు పడ్డారు. మంచి రోజులోస్తాయని ఎదురు చూసారు. బిన్ లాడెన్ చర్యల ద్వారా అమెరికా తాలిబాన్స్ పై దండయాత్ర చేసి తరిమికొట్టడంతో, తమ కష్టాలు తీరిపోయాయని ఎంతో సంతోసించారు. మనం ఎవరం పడని కష్టాలు అక్కడి ప్రజలు పడ్డారు. కానీ ప్రపంచం మాత్రం బిన్ లాడెన్ తో పాటుగా తమందరీని అనుమానంగా చూడడం వారికి ఇబ్బందిగా ఉంది. కొంత మంది చేసిన వెధవ పనులకు మొత్తం మతస్దులను ఎలా భాద్యుల్ని చేస్తారు.  అఫ్ఘనిస్తాన్ గురించి చెప్పినప్పుడు అక్కడంతా ఉగ్రవాదమే అని భావించడం తప్పు కాదా?

ఆ లెక్కన అన్ని మతాల్లోనూ ఇలాంటి వెధవలున్నారు. అంత మాత్రాన అయా మతస్దులందరూ వెధవలుగా భావించరాదు. అఫ్ఘనిస్తాన్ అంటే బిన్ లాడెన్ మాత్రమే కాదు. అలాగే తాలిబాన్స్ మాత్రమే కాదు. అలాగే మత మౌడ్యం తలకెక్కిన ముష్కరులు మాత్రమే కాదు. అంతకి మించి చాలానే ఉంది. దానిని చూడండి ముందు... ప్రతి దేశానికి మంచి, చెడు ఉంటుంది.  రెండు కోణాల్లోను చూస్తే ఎలాంటి సమస్యలు ఉండవు....

విశ్వరూపం సినిమాలో కమల్ హసన్ అఫ్ఘనిస్గానీయుల జీవితంలో ఉన్న రెండో పార్శంను కొద్దిగా సృశించాడు. కానీ మెజారిటి భాగం ఒక వైపే చూపించాడు. అది వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడంలో తప్పులేదు. అలాగే సినిమాలో చూపించిన ముస్లింలందరికీ ఉగ్రవాద సంబంద లింక్స్ ఉన్నట్టుగా చూపించాడు. ఉగ్రవాదులనేవారు అన్ని మతాల్లో ఉన్నట్టుగానే ముస్లిం మతంలో కూడా ఉంది. అలాగే ముస్లిమ్స్ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలి. దానికి మతంతో పని లేదు. ఉగ్రవాదం ఒక ముస్లిం చేసినా, హిందూ చేసిన, క్రిస్టియన్ చేసిన లేక వేరే ఎవరూ చేసిన దానిని ఖండించాలి.

విశ్వరూపం సినిమా అఫ్ఘనిస్తాన్ నేపధ్యంలో తీసారు, అక్కడ ఉండేది ముస్లిం వర్గాలే కాబట్టి వారినే చూపిస్తారు. అంతే కాని హిందువులో, క్రిస్టియన్స్ లేక వేరే మతం వారో అక్కడ ఉంటున్నట్టుగా చిత్రికరించలేరు కదా...  సినిమాలో ముస్లిం యువకుడుని ఉగ్రవాదిగా చూపించినంత మాత్రనా మొత్తం ముస్లిం వర్గాన్ని కించపరిచినట్టుగా ఎలా ఆవుతుంది? ఆ మాటకు వస్తే అదే సినిమాలో న్యూయర్క్ నేపధ్యంలో కొంత భాగం ఉంటుంది. అక్కడ రాహుల్ బోస్ బృందానికి చాలా మంది అమెరికా సంతతి వారు సాయం చేస్తారు. అంత మాత్రం చేత వారు తమను ఉగ్రవాదులుగా చూపించడం జరిగిందని రాద్దాంతం చేయలేదు కదా? అలాగే రిచర్డ్ హెడ్లీ జన్మత అమెరికన్. వాడు ముంబాయి బాంబు పేలుళ్ళ కేసులో నిందితుడు. మరి దానికి అమెరికా జాతి మొత్తం బాధ్యత వహిస్తుందా? వాడు తప్పు చేసాడు కాబట్టి జైలు శిక్ష పడింది. ఎవరైనా అంతే ఆ విషయంలో...

మతం వేరు, ఉగ్రవాదం వేరు.....

రెండింటీ పేరు చెప్పుకొని ప్రజల ఎమోషన్స్ తో అడుకోనే రాజకీయనాయకులుతోనే వస్తుంది చిక్కు అంతా....

ఆ మధ్య ఒక శాసనసభ్యుడు కసబ్ ముస్లిమ్ కాబట్టే ఉరితీసారని సెలవిచ్చారు. కానీ కసబ్ ని ఉరితీసింది ఎందుకో మనకందరికి తెలుసు.... మరి ఆయనకు తెలియదనుకోవాలా?

ఆ మధ్యనే ఇంకో పెద్దాయన దేశములో జరిగిన కొన్ని బాంబు దాడుల్లో హిందూ సంస్దల ప్రమేయముంది అని సెలవిచ్చారు. స్టేజీ మీద కూర్చుని స్టేటుమెంట్సు ఇవ్వడానికి కాదు కదా ఆయనకు పదవి నిచ్చింది. వెంటనే దానిని నివారించే చర్యలు చేపట్టవలసింది పోయీ, మత విషయమును ప్రస్తావనలోకి తెచ్చారు. దీనిని ఏమనాలి? ఓట్ల రాజకీయం అంటే బాగుంటుందా?

ముందుగా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే చూడాలి. అప్పుడే సమస్యలు ఉండవు.. ఎక్కడైనా ఆధారాలతో ఉగ్రవాదులు దొరికినపుడు వాడి మతం గురించి ఇటు హిందువులు, అటు ముస్లింలు గగ్గోలు పెట్టడం మాని ప్రభుత్వాలకు సహకరిస్తే బాగుంటుంది. అప్పుడే ఏ వర్గం మీద ప్రతికూల అభిప్రాయాలు కలగకుండా ఉంటాయి.