Thursday 21 February 2013

స్వర్గానికో ఉత్తరం....

ప్రియమైన మధుకి,
మీ అన్నయ్య రాజీవ్ వ్రాయునది. ఇక్కడంతా క్షేమమే. అక్కడ నువ్వు కూడా క్షేమం మరియు ప్రశాంతంగా ఉన్నావని నేను మరియు మన కుటుంబ సభ్యులందరూ భావిస్తున్నారు. ఏంటో రా.. నిన్ను చూసి మూడేళ్ళు గడిచిపోయినప్పటికీ, నిన్న, మొన్న మాట్లాడుకున్నట్టుగానే ఉందిరా నాకు.  ఎన్ని మాటలు చెప్పేవాడివి రా నువ్వు.. మాటలు చెప్పమంటే నీ తర్వాతే ఎవరైనా...  మన ఇంటిలో సబ్బుబిల్ల దగ్గర నుండి హైదరబాద్ లో నీ ఆఫీసు విషయాల వరకు అన్నీ చెబుతుంటే అసలు టైమే తెలిసేది కాదు కదరా...  ఆఫీసు అంటే గుర్తు వచ్చిందిరా.. మన కుటుంబంలో మన తరంలో చదువుకున్న వాళ్ళలో నేను, నువు, మధుమతి మాత్రమే ఉండేవాళ్ళం కదా.. అందుకని మన బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనలో మనమే మాట్లాడుకొనేవాళ్ళం కదా... గుర్తుతెచ్చుకుంటే చాలా హాయిగా ఉందిరా నాకు. ఇక హైదరబాద్ లో నువు కూడా ఉద్యోగం జాయినయిన తర్వాత ఆఫీసులో ఉండే సాధక బాధలు గురించి చాలా సార్లు చెప్పుకొన్నాం... అఫీసులో పరిస్దితుల మీద జోకులు వేసుకొని చాలా సార్లు నవ్వుకున్నాం కదరా...
నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా మార్పులే వచ్చాయి రా.... చదువుకునేటపుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వచ్చేసేవాడివి. దానితో ఎప్పటి విషయాలు అప్పుడే మాట్లాడేసుకొనేవాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు రాక చాలా రోజులు గడిచిపోయింది కదరా... ఈ లోపులో చాలా విశేషాలు జరిగాయి రా మన ఇంట్లో... వేణుకి పాప పుట్టింది రా... మధు పేరు కలసివచ్చేలా మధుర అని నీ పేరే పెట్టారురా ఆ పాపకి.. పేరు ఎవరు పెట్టారో తెలుసా... నువ్వంటే ఎంతో ఇష్టపడే మీ నాన్నేరా... ఆ తర్వాత నీకు మేనల్లుడు  పుట్టాడు రా... వాడికి మెహిత్ అని పేరు పెట్టారు... వాడు ఇపుడు ఎలా ఉన్నాడో తెలుసా.... నువ్వే బెటర్ అనిపించేలా అల్లరి చేస్తున్నాడు రా... ఇప్పటి వరకు నువ్వే పెద్ద అల్లరిగాడివనుకున్నాము. కానీ ఇప్పుడు వాడు నిన్ను మించిపోయాడు. ఆ తర్వాత ఆశోక్ గాడి పెళ్ళి సౌజన్యతో ఆయింది. ఆ పెళ్ళికి అందరూ వచ్చారు. నువ్వు మాత్రమే మిస్ అయ్యావు.  నువ్వు ఉంటే ఇంకా బాగుండేది రా ఆ పెళ్ళిలో... 
ఎవరికి వారికి పెళ్ళిళ్ళు ఆయిపోయిన తర్వాత యిదివరకులా ఎంజాయ్ చేయలేకపోతున్నాను రా నేను ఇక్కడ. అంటే ఎవరిని విమర్శిస్తున్నానని కాదు. పెళ్ళయ్యాక ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయనుకో.... కానీ ఏ మాటకామాటే... ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం రా మనం. నువ్వేమో ఇంజనీరింగు చదివే టైములో ప్రతి శనివారం కాకినాడ వచ్చేసేవాడివి కదా... ఇక ఆ రాత్రంతా కబుర్లే కబుర్లు చెప్పుకోనేవాళ్ళం కదారా.. పడుకొనేసరికి ఒంటి గంట కూడా అయిపోయేదనుకుంటా కదరా... పెద్దమ్మ పడుకోమ్మని తిడుతునే ఉండేది. కాని మనం పట్టించుకొనేవాళ్ళం కాదు కదా... ఆ మర్నాడు పది కొడితే కానీ లేచేవాళ్ళం కాదు. ఇక ఆ రోజంతా బద్దకంగా మంచం దిగకుండానే టి.వి. చూస్తునే గడిపేవేసేవాళ్ళం. నిజంగా తలచుకుంటే ఎంత బాగుండేవి రా ఆ రోజులు... ఎంత డబ్బు పెట్టి కొంటే అలాంటి రోజులొస్తాయి రా మరల.... 
ఇక మీ నాన్నతో ఎన్ని విషయాలు చెప్పేవాడివి రా... మా నాన్న చనిపోయిన తర్వాత అన్నీ మీ నాన్నే కదరా నాకు  కూడా. కాని ఆయనంటే భయం మూలంగా నేనైతే దూరంగా ఉండేవాడిని కానీ, నువ్వు ఎంత స్వేచ్చగా ఉండేవాడివి రా.... రోజూ గంటలు తరబడి ఫోన్ లో మాట్లాడుకొనేవాళ్ళు కదరా.... ఆయినా అన్నీ విషయాలు మీ నాన్న దగ్గర అంత ధైర్యంగా ఎలా చెప్పేసేవాడివిరా... అఖరికి అల్కహల్ పుచ్చుకొన్న విషయం కూడా మీ నాన్నకి ఎలా చెప్పేసేవాడివి రా....  నాకైతే ఇప్పటికీ చెప్పడానికి భయం రా.... మాకందరికి ఆయనొక పెద్దాయనలా కనిపిస్తే, నువ్వు మాత్రం ఆయనతో స్నేహమే చేసావు కదరా.... మీ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ఎక్కడ చూడలేదు అంటే నమ్మరా... కొత్త బంగారు లోకం సినిమా చూసి, ఆ సినిమా చూడండని చెప్పావట కదా.. నువు చెప్పావని ఆ సినిమాకి వెళ్ళారట ఆయన. అలాగే ఈ మధ్య వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసి మధుమతి దగ్గర ఏమన్నారట తెలుసా నీకు.... ఆ సినిమా చూస్తే ఆయనకు నువ్వు, నేనే గుర్తుకు వచ్చామట రా..... వెంకటేష్ క్యారెక్టర్  నాకులానే ఉందట.. అలాగే మహేష్ బాబు క్యారెక్టర్ నీకులానే ఉందని అన్నారట.. మధుమతి కూడా సినిమా చూసి నిజమే అన్నయ్యా అని నాకు ఫోన్ చేసిందిరా.... నువు కూడా చూడరా ఆ సినిమాను. నిజంగా మన స్టోరీల మల్లే తీసాడురా ఆ సినిమాను.
ఏంటో రా.. మాట్లాడుతుంటే ఎన్ని విషయలైనా చెప్పాలని ఉందిరా.... ఈ పేజిలు ఎక్కడ సరిపోతాయిరా మన కబుర్లు చెప్పుకోవడానికి..... సరేలే ఇక నీ సంగతులేమిటి రా.... చెప్పాపెట్టాకుండా నువు వెళ్ళిపోయి మూడేళ్ళు ఆయిపోయింది కదా... ఒక్కసారి కూడా రావాలనిపించలేదు రా నీకు ఈ మూడెళ్ళులో.... ఎంత మిస్సయ్యామో తెలుసా రా... నీకు... తెలియడం లేదురా నీకు.... మీ నాన్న ఆయితే ప్రతి రోజూ లెక్కపెడుతున్నాడు తెలుసా నువ్వు వెళ్ళిన దగ్గర నుండి.... ఆయినా నీ పంతం నీదే కదరా.... అన్నీ నీకు నచ్చినట్టుగానే చేసుకున్నావు... నీకు నచ్చినట్టుగానే బ్రతికావు.... నీకు నచ్చినట్టుగానే వెళ్ళిపోయావు కదరా....
సరేలే... ఏది ఏమైనా నువ్వు సంతోషంగా ఉంటే చాలు రా... ఇంకేమి మాకు అక్కర్లేదు.... నువ్వు కులసాగానే ఉన్నావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను రా... ఎందుకంటే నీలాంటి కలాష్మం లేని మనుషులు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారని నాకు తెలుసు కాబట్టి.......
ఇట్లు
మీ అన్నయ్య అనబడే స్నేహితుడు...
  (నా ప్రియతమ సోదరుడు, స్నేహితుడు మదన్ మెహన్ 3 సం. క్రితం ఇదే రోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. మమ్మల్లందరిని వదిలేసి శాశ్వతంగా)

3 comments:

  1. He is just not physically with us.. But he will be there in our hearts ever... Thanks for remembering me bava - Ganesh.

    ReplyDelete
  2. The photograph you have added was taken during my brother's marriage in Hyderabad. He was my room mate at that time. Nice Guy....

    ReplyDelete
    Replies
    1. ఆవున బావ... ఆ పోటో అప్పడు తీసుకున్నదే... మీ ఇద్దరు రూమ్మేట్స్ గా ఉన్నప్పుడు నేను కూడా వచ్చాను.. మర్చిపోలేను ఆ రోజులను....

      Delete