Monday, 16 April 2012

పానీ పూరి - డాటరు గారు

ధమ్స్ అఫ్స్ - మహేష్ బాబు

సెవెన్ అప్ - అల్లు అర్జున్

కోక కోలా - షారుఖ్ ఖాన్

ఇలా ప్రతి ప్రముఖ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అయా ప్రముఖ్యులు ఉండి ప్రచారము నిర్వహిస్తుంటే, మరి పానీ పూరికి ఎవరు చేస్తారో ప్రచారము అనుకున్నట్టున్నారు మా డాక్టరు గారు..

అసలు పానీ పూరి పరిచయమే చాలా విచిత్రముగా జరిగింది. నేను చదువుకోవడానికి కాకినాడకి వచ్చిన కొత్తలో అసలు పానీ పూరి అనే ఐటమే ఎక్కడా వినపడేది కాదు. నా చిన్నప్పుడంటా సమెసలు, మిరపకాయ బజ్జీలదే రాజ్యమంతా...

చాలా కాలము తర్వాత మా చెల్లి ఇంజనీరింగు చదివే రోజుల్లో ఒక రోజు సడెన్ గా అడిగింది. అన్నయ్యా నువ్వు పానీ పూరి తిన్నావా అని?

ఇదేంటి ఇప్పటి వరకు పూరీ, మసాలా పూరీ మొదలగు టిఫిన్స్ గురించే విన్నాను. ఇది ఎక్కడ విన్నట్టుగా లేదే అనుకున్నాను..

ఆయినా నాకు తెలీదు అని చెప్తే, తన దగ్గర నేను నామోషి ఆవుతానేమో అని చెప్పి, ఓ... చాలా సార్లు తిన్నాను అని ఫోజు కొట్టా....


చాలా బాగుంటుంది కదూ... నాకు చాలా ఇష్టం అంది.... అవునవును అని తలాండించాను.. కాని వెంటనే దాని గురించి తెలుసుకోవలన్న అసక్తి పెరిగిపోయింది. కాని ఆ పేరు ఎక్కడ వినకపోవడం వలన ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. కనబడిన ప్రతి హోటల్ కి వెళ్ళి పానీ పూరి ఉందా అని అడిగేవాడిని. వాళ్ళు నన్ను వింత జంతువును చూసినట్టుగా చూసేవారు. అయ్యబాబోయ్ ఇలాంటి చూపులు మనము తట్టుకోలేము అని అనుకొని ఇక అక్కడ నుండి హోటల్స్ లో అడగడం మానేసాను.

ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కొంత మందిని అడిగాను. వారు కూడా నాకు లాగే సేమ్ డిటో. ఒకడు మాత్రం చెప్పాడు అసలు నిజం. పానీ పూరి అనేది మెయిన్ రోడ్డులో మార్వాడి ఏరియాలో ఉంటాయి అని.

అప్పట్లో పానీ పూరి బండ్లు తక్కువుగా ఉండేవి. అందువల్ల అవి పెద్దగా ప్రాచుర్యంలో లేవు. మరి మా చెల్లాయికి ఎలా తెలుసా అని డౌట్ వచ్చింది. తర్వాత తెలిసింది.. తనకు ఇంజీనీరింగ్ కాలేజిలో మార్వాడి అమ్మాయి ప్రెండ్ అని, పానీ పూరి ని తాను పరిచయం చేసిందని తెలిసింది.

ఇలా ఉండగా, ఒక సారి అన్నయ్యా పానీ పూరి తినాలని ఉంది తీసుకెళ్ళవా అని అడిగింది... ఇప్పుడు వద్దులే తర్వాత వెళదాంలే అని తప్పుంచుకుందామనుకొన్నా. నీకు కూడా ఇష్టమే కదా తీసుకువెళ్ళరాదూ అని అడిగేసరికి సరే అని బయలుదేరా.

పానీ పూరి సెంటర్ కి మా చెల్లే దారి చూపించింది. వెళ్ళిన తర్వాత బండిలోకి చూద్దును.... అన్ని పచారీ కొట్టు సామానులు వలే కారంపూస, చిన్న సైజు పూరిలు వగైరాలతో నిండిపోయియుంది. పైగా ఆ ప్రక్కన పెద్ద గిన్నె అందులో ఏదో చింతపండు రసంతో చేసినట్టు ఏదో పాయసం ఉంది. ఇదేదో వైరేటిగా ఉందే అనుకున్నాను.

రెండు ప్లేట్లు పానీ పూరీ అర్డర్ వేసింది మా చెల్లాయి. వాడు మా వైపు అదో టైపు ఎగాదిగా చూసి రెండు ప్లేట్లు మా చేత్లో పెట్టాడు.

ఇదేంటి పానీ పూరి పెడతాను అని చెప్పి ఖాళీ ప్లేట్లు పెట్టడేంటా చేతిలో? అని నాలో క్వొశ్చన్ మార్కు... ఎగాదిగా మా చెల్లి వైపు చూసా....

తాను మాత్రము ప్రశాంత చిత్తముతో ఆ బండి లోకి చూస్తూ ఉంది.... ఏంటిది అని నోటి చివరి దాకా వచ్చి నా నోట్లో ఆగిపోయింది మాట.

పరువు... పరువు.... పరువు పోకూడదు వీళ్ళ దగ్గర అన్నట్టు గుంభనంగా ఉన్నా...

ఆ తర్వాత వాడు చిన్న సైజులో ఉన్న పూరిలకు బొక్క పెట్టి మా ప్లేట్లో పెట్టాడు. ఆ తర్వాత కొన్ని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసాడు.

వాడు ఏమి చేస్తున్నాడో, నేను ఏమి చేయాలో తెలియడం లేదు. నేను మాత్రం మా చెల్లాయినే చూస్తున్నాను. ఎందుకంటే దానిని బట్టి నేను ఫాలో ఆయిపోదామని నా ఆలోచన...

ఆ తర్వాత అక్కడ ఉన్న పెద్ద గిన్నెలో నుండి చింతకాయ పులుసులా ఉన్న రసం తీసి మా ప్లేట్లో ఉన్న పూరిల్లోకి పోసాడు. అంతే అప్పటి వరకు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న మా చెల్లాయి వెంటనే యుద్దరంగంలోకి దిగిన సైనికురాలుగా అలెర్ట్ ఆయిపోయి, వాడు ఆ చింతకాయ పులుసు పోయడం పాపం, అర సెకను వంతులో అందులో కొత్తిమీర, ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని గుబుక్కున నోటులో వేసేసుకుంది.

నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను.... మా చెల్లాయి నా వైపు చూసి ఏంటి అన్నట్టుగా చూసింది. ఏమి లేదన్నట్టుగా తల పకించాను. అలా గుడ్లు మిటకరించి చూస్తున్నవేటి.. తొందరగా తిను.... పోతాయి అని చెప్పింది... కాదు అరిచింది...

వెంటనే నేను యాక్షన్ లోకి దిగి మా చెల్లాయి చేసినట్టే చేసి నోటిలో పెట్టుకున్నాను. కాని నోటిలోకి వెళ్ళదే... ఎందుకంటే నేను అలవాటుగా నోరు సగమే తెరిచాను మరి... మొత్తమంతా ఒక్కసారే నోటిలో పెట్టుకోవాలి అని అరిచింది మా చెల్లాయి...

ఒ.కె... ఒకె... అంటు నోరు మొత్తం తెరిచి నోట్లో పెట్టుకున్నా.... టేస్ట్ చేయడానికి ఏమి లేదు అందులో... నోటిలో పెట్టుకోవడం... మింగడం... అంతే...

అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అనుకుంటా బట్టలు మీద పడకుండా తినలేకపోయెవాడిని. ఇదుగో మరల ఇన్నాళ్ళకు దున్నపోతులా ఎదిగిన తర్వాత బట్టలు మీద కొంత పోసేసుకొని తిన్నాను పానీ పూరి.... ఆ తర్వాత బట్టలు మీద పడకుండా ఎలా తినాలో బాగా ప్రాక్టిసు చేసి అందులో ప్రావీణ్యత సంపాదించుకొన్నాను.

ఆ తర్వాత పానీ పూరి మా ప్రెండ్స్ కి పరిచయం చేసాను. ఇక అక్కడ నుండి అదో పెద్ద క్రేజీ ఐటమ్ ఆయిపోయింది మా అందరికీ..

కొన్ని రోజులకి, మా ప్రెండ్ ఒకడు మాటల సందర్బంలో పానీ పూరిలో వేసే రసము ఎలా తయారుచేస్తారో తెలుసా అంటూ, దాని తయారి చాలా చంఢాలంగా ఉంటుందని భయపెట్టేయడంతో మళ్ళా దాని జోలికి వెళ్ళడం మానివేసాము.

తినడం మానివేసిన నాల్గు సంవత్సరాలకు, ఒక రోజు మా అన్నయ్య వచ్చాడు ఊరి నుండి.. సాయంకాలం మనోడి పనులన్ని అయిపోయాక తమ్ముడు పానీ పూరి తిందామా అని అడిగాడు.

ఏంటి బ్రదర్ పల్లెటూరిలో ఉండేవాడివి నీకు పానీ పూరి మీదకు మనసు ఎలా మళ్ళింది? అని అడిగాను.

అప్పుడు చెప్పాడు మన వాడు పానీ పూరీ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని..... ఆయనే మా ఊరి డాక్టరు గారు...

మా డాటరు (వాడుక బాష) గారికి పానీ పూరి అంటే చాలా ఇష్టం.... ఆయనతో పాటుగా మా అన్నయ్య కాకినాడకి వచ్చినప్పుడు పానీ పూరి అలవాటు చేసినట్టున్నారు డాటరు గారు... ఒకసారి అలవాటు పడడంతో, ఇక అప్పటి నుండి మా వాడు కాకినాడ వచ్చినప్పడల్లా పానీ పూరి బండి దగ్గరకు పోతేకాని ఊరికి వెళ్ళేవాడు కాదు.

డాటరు గారి అడ్వర్ మెంట్ మా వాడితోనే అగలేదు... అది మా తమ్ముడుకి అలవాటు ఆయిపోయింది. పానీ పూరి యొక్క విశిష్టతను పట్టణంలో ఉన్న నాకు మా చెల్లాయి తెలిపితే, ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉన్న మా అన్నయ్యలకు మా డాటరు గారు పరిచయం చేసారు....

అప్పటి నుండి మా ఊరు నుండి అన్నయ్య గాని, డాటరు గాని ఎపుడూ వచ్చిన సరే... పానీ పూరి తినకుండా ఉండడం లేదు.

అందుకే పానీ పూరికి ప్రస్తుతానికి మా డాటరు గారి బ్రాండ్ అంబాసిండర్.... ఈ విషయములో పానీ పూరి వాలాల వద్ద రూపాయి తీసుకోకుండా, నయా ప్రతిఫలం పొందకుండా మా డాటరు గారు ప్రచారము నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరూ మా డాటరు గార్కి రుణపడియుండవలసినదే..

మా డాటరు గారి పుణ్యమాని మరల ఇన్నాళ్ళకి పానీ పూరి పేరు చెప్పి నా గతం రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. ఎంతయినా అవన్నీ మధురమైన రోజులు.... ముఖ్యంగా ఆ రోజుల్లో నా కుటుంబంతో, ముఖ్యముగా నా చెల్లాయితో గడిపిన రోజులు ఎప్పటికి మర్చిపోలేను.

పి.ఎస్: ఈ పోస్ట్ రాయడానికి కారణమయిన మా డాటరు గార్కే ఈ అర్టికల్ అంకితం.


3 comments:

  1. నేనీ పోస్ట్ ఇప్పుడే చూశాను.
    బయట బళ్ళ మీద అమ్మే పానీపూరీ అంత పరమ /అన్ హైజీనిక్/ అపరిశుభ్ర టిఫిన్ మరొకటి ఉండదేమో. అవి అమ్మేవాడు వాడి వేలితో (ఒక్కోచోట ఎడమచేతి వేలితో) పానీపూరికి చిల్లు పెట్టడం గమనించే ఉంటారు కదా (కనీసం ఓ పుల్లో చెంచాకాడో అయినా వాడడు చిల్లు పెట్టడానికి). ఇది చాలక ఆ పూరీని ఆ చింతపండు నీళ్ళల్లో ఎడమచేత్తో ముంచి తీస్తారు కొంతమంది వ్యాపారులు. పక్కన నిలబడి అదంతా చూస్తూ కూడా ఆ పానీపూరీ ఎలా తింటారో? ఎవరి టేస్ట్ వారిది అని వాదించేవాళ్ళు ఉంటారు, అయితే మాత్రం బయట పానీపూరీ తినేవాళ్ళకు తమ ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచన ఉండాలి గదా.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమేలెండి.... పరిశుభ్రత లేదని చెప్పే నేను కూడా తినడం మానేసాను సార్... కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన విపరీతంగా ఎగబడుతున్నారు యువత... కొత్తగా పెట్టిన కొన్ని ఫాస్ట్ పుడ్ సెంటర్ ల్లొ మాత్రం శుభ్రత బాగానే మెయిన్ టెయిన్ చేస్తున్నారండీ... అక్కడ ఆయితే కొద్దిగా బెటర్ అండీ..
      స్పందనకు ధన్యవాదములు...

      Delete