Sunday, 5 February 2012

నా బ్లాగు పుట్టినరోజు....(ఇది చదివిన వారికి పొట్ట చెక్కలవ్వడం ఖాయం)

నా బ్లాగులో వాగుడు మొదలెట్టి సంవత్సరం ఆయింది. తెలుగు బ్లాగర్లందరికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరమంతా నా పిచ్చి పిచ్చి వాగుడు రాతలతో మీరు బాగానే వేగగలిగినందుకు... ఆయిన జీవితమన్నక కొంత కంప్రమైజింగ్ ఉండాలండి.... అన్ని మీకు నచ్చినట్టుగానే ఉండాలంటే కుదరదుగా.... అందుకే నాలాంటి వాడిని భరించవలసివచ్చింది మీ అందరికి....

ఈ పోస్టు మీరందరు చదివేస్తారని రాయడం లేదులెండి. ఏదో ఈ బ్లాగు మొదలెట్టి సంవత్సరమయిన సందర్బంగా, అసలు నేను బ్లాగు మొదలెట్టే సమయానికి నాకున్న బ్లాగు పరిజ్ణానం గురించి నెమరువేసుకుందామని రాస్తున్నాను అంతే.

నిజ్జంగా నిజమండీ, బ్లాగు మొదలెట్టే సమయానికి అసలు బ్లాగర్లు అనే వాళ్ళు అప్పటికే కుప్పులు తెప్పలుగా ఉన్నారని, వాటన్నింటికి కేంద్రబిందువుగా అగ్రిగ్రేటర్స్ అనేవి ఉంటాయని నాకు అస్సలు తెలియదు. (నా మీద ఒట్టు). మనం చదివిన చదువులు అలాంటివిలెండి.

ఏదో ఖాళీగా ఉన్నాం కదాని కంప్యూటర్ లోకి దూరి అడ్డమైన చెత్త అంతా చూస్తు ఉంటే, గూగుల్ లో కొత్తగా బ్లాగ్ అనే పదం కనబడితే, ఏంటబ్బా అని లోనికి వెళ్ళి చూస్తే, అప్పుడు తెలిసింది బ్లాగ్ గురించి. వెంటనే దాన్లోకి వెళ్ళి గెలికి, గెలికి చివరికి బ్లాగు యొక్క ప్రాధమిక అంశాలు కనుగొని  బ్లాగుని క్రియెట్ చేసి ఏదో కనిపెట్టేసాన్న అనందం కల్గింది.

అప్పటి వరకు నాకు వాటి గురించి చూడకపోవడం (లేక) వినకపోవడం (లేక) తెలియక పోవడం వలన తెలుగులో తొలి బ్లాగుని నేనే క్రియేట్ చేసానేమో అని ధ్రిల్ ఫీలయిపోయాను. ఇంకా నయం భూమాక్షర్షణ సిద్దాంతం గురించి, న్యూట్రన్ గురించి  చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మా ఇంటిలో ఉన్న కొబ్బరిచెట్టు క్రింద కూర్చుని , కొబ్బరి కాయ క్రిందకి పడగానే యురేకా అని అరిచి కొత్తగా భూమాక్షర్షక సిద్దాంతం కనిపెట్టేవాడినేమో.

ఇకపోతే బ్లాగు క్రియేట్ చేసిన తర్వాత దానిని ఏమి చేయాలో తెలియలేదు... బ్లాగు మెయిన్ పేజిలో టాప్ లో నెక్ట్స్ బ్లాగ్ అని ఉంటే దాని మీద క్లిక్ చేస్తే ఏవో ఇంగ్లీషు బ్లాగులు వచ్చేవి. వాటిని చూసి పోస్ట్ లు వ్రాయాలని తెలిసుకొన్నా. వెంటనే ఒక పోస్ట్ వ్రాసేసి పడిసేసా. కాని ఎవడు చదువుతాడో తెలియదు. అలానే రోజులు గడిచిపోతున్నాయి. (జల్లెడ, కూడలి, మాలిక లాంటి అగ్రిగ్రేటర్స్ ఉంటాయని, అందులో మన బ్లాగ్ ని లిస్ట్ చేస్తే, మన పోస్ట్ లు అందులో యాడ్ ఆవుతాయని నాకు అస్సలు తెలియదు).

మూడ్ ఉన్నప్పుడు బ్లాగులో పోస్ట్ లు వ్రాసి పడేయడడం, లేకపోతే బ్లాగులో నెక్ట్స్ బ్లాగు అన్నదానిమీద క్లిక్ చేయడం, వాటిని పరిశీలించడం చేస్తుండేవాడిని. అలా చూస్తు ఉండగా సత్యవతి గారి మా గోదావరి బ్లాగు, వనజవనమాలి వారి బ్లాగు తగిలాయి. వార్ని! తెలుగులో కూడా బ్లాగులు ఉన్నయా అని బోలెడు ఆశ్చరపోయి, వాటిని పరిశీలించాను( నా అజ్ణానానికి నవ్వుకోకండి ప్లీజ్). అలా మా గోదావరి, వనజావనమాలి వారి బ్లాగులకి ఫ్యాన్ ఆయిపోయాను. ఇకపోతే వారి పోస్ట్ లకు కామెంట్లు ఎవరు పెడతారో అర్ద్రమయ్యేది కాదు(దయచేసి నవ్వకండి, అప్పటికి నా నాలెజ్ద్ అంతే మరి).

అలా ఉండగా ఒకసారి శరత్ గారి బ్లాగు "శరత్ కాలమ్"కి వెళ్ళినప్పుడు, ఆయన పోస్ట్ ఒక దానికి కామెంట్ ఇచ్చి, నా బ్లాగ్ చూడవలసినదిగా రిక్వెస్ట్ పెట్టా. వెంటనే నా బ్లాగ్ చూసి, నా బ్లాగ్ తెలుగు బ్లాగ్ అగ్రిగ్రేటర్స్ లో లిస్ట్ చేయమని సూచించారు. ఈ తెలుగు బ్లాగు అగ్రిగ్రేటర్స్ అంటే ఏమిటి రా బాబు అనుకొని కొన్ని రోజులు బుర్ర పీక్కున్నా..

సరేలే అని గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి అగ్రిగ్రేటర్స్ అని క్లిక్ చేస్తే నా తలకాయంత మేటర్ వచ్చింది. మొత్తానికి కొన్ని రోజులు బుర్ర పీక్కున తర్వాత నా బ్లాగుని జల్లెడ, కూడలి, మాలిక లోకి లిస్ట్ చేయగలియాను. అప్పటికే అందులో తెలుగు బ్లాగర్ల లిస్టు చూసి, తొలి రోజుల్లో బ్లాగు నేనే కనిపెట్టనని ఫీల్ ఆయిన సందర్బం గుర్తుకువచ్చి నా మెకాలిలో ఉన్న బల్బు టక్ మని ఆరిపోయింది..

అలా మొత్తానికి నా బ్లాగు పట్టాల మీదికి వచ్చి మీ ముందుకు వచ్చింది. ఎందరో మహనుభావులు, ఎందరో రచయితలు, అన్ని రంగాల వారు వ్రాస్తున్న బ్లాగ్ లు చదువుతుంటే, వారి యొక్క రచన సామర్ద్యానికి ముగ్దుడునయ్యాను. ఒక్కొక్కొరిది ఒక్కొక్క శైలి. అందరూ మేధావులే... వార్కి "కలం" నైపుణ్యాన్ని ఇచ్చిన అ దేవుడుకు మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

Friday, 3 February 2012

నేను- నా రూమ్మేట్లు - చదువు

ఏదో ఉన్నంతలో పర్లేదు అన్నట్టుగా సోలో జీవితము సాగించేస్తున్న నా జీవితంలోకి (రూమ్)లోకి కొత్తగా ఇద్దరు వ్యక్తులు జాయిన్ కావడంతో నా సోలో జీవితానికి కొద్దిగా ఉప్పు కలిపినట్టుగా ఉంది. అంటే ఉప్పగా అయిపోయిందని ఊహించికోవద్దు. రుచి సరయిన మోతాదుకి వచ్చిందనుకోవచ్చు. వాళ్ళు అంత సడెన్ గా రావడానికి కారణం గ్రూప్ సర్వీసులకు ప్రీపేర్ కావడానికి. ఇద్దరూ ఉద్దండులే. వచ్చిన వాళ్ళు వచ్చి బుద్దిగా చదువుకొని ప్రిపేర్ కావచ్చు కదా.... నాలో ఉన్న పోటుగాణ్ణి కూడా లేపి రెచ్చగొట్టారు. నేను కూడా గ్రూప్ సర్వీసులకు ప్రిపేర్ కావచ్చు కదాని.... నాలో పోటుగాడికి పూర్తిగా తెలియక పోయినా, నాకు మాత్రం తెలుసు కదా మన సామర్ద్యం ఎంతో.. దానితో అటువంటివి మనకు వర్కవుట్ కావని చెప్పా.... ఆయిన వాళ్ళు వినకుండా నాలో పోటుగాణ్ణి పైకి ఎక్కించేసారు. సర్లే వాళ్ళు అంతలా మునగ చెట్టు ఎక్కించాక కాదనడం ఎందుకులే అనుకొని ఓకె చెప్పా.. నేను ఇచ్చిన చనువుతో, ఇక నాలో ఉన్న పోటుగాడు రెచ్చిపోయాడు. (ఇక్కడ నుండి వాళ్ళతో కలసి విరగబడి చదివేస్తున్నాడురా బాబు అని అనుకోకండెయె. అలానుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే). నాలో ఉన్న పోటుగాడు, ఆఫీసులో నా ప్రక్కన సిన్సియర్ గా పనిచేసుకొనే మూర్తిగారిని రెచ్చగొట్టేసాడు. ఆయన మాత్రము అన్ని బేరిజు వేసుకొని చదవగలనని డిసైడయి మాతో పాటుగా జాయినయ్యారు(చదవడానికి). వెంటనే నేను ఎలా చదవాలో స్కెచ్ గీచేసాను. ఆ స్కెచ్ అక్కడ వరకే ఆగిపోయింది. ఎందుకంటే ఆ స్కెచ్ ని ఇప్పటి వరకు అమలులో పెట్టడానికి కుదరలేదు. నా రూమ్మేట్లు మాత్రము బుద్దిగా కోచింగ్ సెంటర్ లకి వెళ్ళి వచ్చి చదువుకుంటున్నారు. నాలో పోటుగాడు రెండు రోజులయ్యక పడుకున్నాడు. వాడి ఆయిపు లేదు. అడ్రసు లేదు. కాని మూర్తిగారు మాత్రము పట్టువదలని విక్రమార్కుడులా గ్రూప్ సర్వీసులకు ఎట్లయిన ప్రిపేర్ కావల్చినదే అని పట్టు కూర్చున్నారు. ఈసారి అంత ఉత్సాహముగా లేవలేదు నాలో పోటుగాడు. ఆయినప్పట్టికి ఏదొలా రోజులు కానిచ్చేన్నాను.
ఇక బద్దకము పుట్టిన వెంటనే నేనే పుట్టానని నా నమ్మకము. అందుకే వాడు నేను ఎపుడూ అన్నదమ్ములా కలసిమెలసి ఉంటాము. వారము తిరిగే సరికల్లా వాడేసిన నా బట్టలు వాష్ చేసి పెట్టడానికి కాకినాడ మహనగరంలో చాకలి అనే మహత్తరమైన వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతున్నారు. అందుకని వారాంతములో నేను వాడేసిన బట్టలని పట్టుకొని మా ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు. అక్కడ ఆ బట్టలు పడేసి, మళ్ళా వారానికి సరిపడే బట్టలు తెచ్చుకొవడం అలవాటు. ఆ విధంగా ఇప్పటి వరకు చేస్తుండె వాడిని. (మనది చిన్నప్పటి నుండి మహరాజ లైఫ్. ఏ పని చేయవలసిన అవసరము ఉండేది కాదు). కాని ప్రతి వారము ఇంటికి వెళ్ళిరావడమంటే, ప్రయాణానికి మహ ఇబ్బందిగా ఉండేది. కాని వేరే ప్రత్యాయమ్నం లేక అలాగే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇకపోతే నా రూమ్మేట్లు మాత్రము వాళ్ళ బట్టలు వాళ్ళె ఉతుకేసికుంటున్నారు. ఇదేదో బాగుంది కదా.. మనము కూడా ట్రై చేద్దామని డిసైడయి ఈ వారము బట్టలు నేనే ఉతుకేసికున్నా.... నా టొటల్ లైఫ్ జీవితంలో ఎపుడూ బట్టలు ఉతికిన పాపానికి పోలేదు. కాని ఈ రోజు ఉతికిన తర్వాత తెలిసింది. ఉతకడం ఒక ఆర్ట్ అని. వాటిని ఉతకలంటే నైపుణ్యం కావలని. నా బట్టలు నేనే ఉతుక్కోవడం గ్రూప్ సర్వీసులు కొట్టడం కన్నా గొప్పదిగా కనిపించి నాలో పోటుగాడు సంతృప్తి పడిపోయాడు. మొత్తానికి నా చేత గ్రూప్ సర్వీసులు రాయిస్తానన్న నా రూమ్మేట్లు, నా చేత బట్టలు ఉతికించారు.