Thursday, 29 May 2014

విద్యార్హతలు


హెచ్.బి.వో. చానల్లో వస్తున్న అదేదో ఇంగ్లీషు సినిమాని చూస్తున్నా. ఇంతలో నా మెబైల్ ఫోన్ రింగు ఆవుతుంటే ఎవరా అని అనుకుంటూ ఫోన్ అందుకున్నాను. ఫోన్ డిస్ ప్లే మీద నవ్వుతూ ఉన్న నాయుడు పోటో కనిపించింది. తన ఫోన్ కాల్ ను చూడగానే నా పెదవుల మీద చిన్నగా ఆనందంతో కూడిన చిరునవ్వు మెదిలింది...

చాలా కాలం తర్వాత తన నుండి నాకు ఫోన్ రావడం..  తాను, నేను కల్సి రెండేళ్ళు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఎన్నో విషయాలు తన నుండి నేర్చుకున్నాను. పలు విషయాల గురించి ఇద్దరము కల్సి చర్చించుకొనేవాళ్ళం. నాకు సంబందించిన అన్ని విషయాలను తనతో చర్చిస్తాను.  నాకు మనసుకి బాగా దగ్గరయిన స్నేహితుడు కావడం కూడా నా అనందానికి ఒక కారణం.

వరుసబెట్టి ఎన్నికలు రావడంతో గత మూడు నెలల నుండి సావకాశమనెదే లేకుండా పోయింది. నాయుడు కూడా ప్రస్తుతం ఎటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ లేకపోవడంతో స్వగ్రామంలోని ఇంటికి వెళ్ళిపోయాడు.... ఇదిగో మరల మూడు నెలల తర్వాత ఖాళీ సమయంలో నాయుడు ఫోన్ చేయడం ఇదే..

ఫోన్ లిప్ట్ చేసి, ఎక్కడ బాబూ... ఇన్నాళ్ళకు ఖాళీ దొరికిందా నాయనా నీకు అని నిష్టూరమడాను..
నిన్నే వచ్చాను కాకినాడ... నీవు ఎక్కడ అని అడిగాడు అవతల్నించి...
ఇంట్లో ఉన్నాను. మరేమి మాట్లాడకుండా తిన్నగా ఇంటికి వచ్చేయి అర్డరేసాను..
అలాగే!! అని చెప్పి ఫోన్ కట్ చేసాడు...

చెప్పినట్టుగానే పావు గంటలో ఇంటికి వచ్చి కూర్చున్నాడు../  యెగక్షేమాలు అవి మాట్లాడుకున్న తర్వాత సాయం సమయం కావడంతో అలా బయటకు నడుచుకుంటూ వెళ్ళి కుళాయి చెర్వు వద్ద గల వివేకానంద పార్కుకి వెళ్ళి లోపల కూర్చున్నాము.

ఏంటీ.. చదువులు ఎలా సాగుతున్నాయి? అడిగాన్నేను....
ప్రస్తుతానికి ఏమి చదవట్లేదు... కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ జారీ చేయాలి. అప్పుడే మొదలెట్టాలి చదువులు మరల... అప్పటి వరకు ఖాళీనే అన్నాడు....

ఆవునూ.. చదువంటే గుర్తుకొచ్చింది, మానవ వనరులు శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు గురించి కాంగ్రెసు ఏంటి అలా రాద్దాంతం చేస్తుంది? ఆయినా ఎంతో విశిష్టత కల్గిన ఆ శాఖను స్మృతి ఇరానీకి ఎలా కేటాయించగలిగారు. తాను ఆ శాఖ ద్వారా ఏమైనా ఇంప్రూవ్ మెంట్ తేగల సమర్దత ఉంది అంటవా? అని అడిగాను...

ఆ కాంగ్రెసు నాయకుల బుర్ర ఆ స్దాయి వరకే పనిచేస్తుంది. వారు ఇలాంటి చిల్లర విషయాలు వరకే అలోచిస్తారు. ముందు వాళ్ళ నాయకి సోనియా, రాహుల్ విద్యార్హతలు గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నాడు .... ఒకవేళ మర్చిపోయింటే సుబ్రమణ్యస్వామిని అడిగితే బాగా క్లారిటి వస్తుంది వారికి!! అన్నాడు నాయుడు.

అదేంటి!! అలా ఎందుకనుకోవాలి! వారు ఒక వ్యక్తి సమర్దత గురించి మాట్లాడినపుడు, సదరు వ్యక్తికి సమర్దత ఉందో, లేదో తెలియజెప్పాలి కానీ, ఇలా తిరిగి ఎదురు ప్రశ్నిస్తే ఎలా? అన్నాన్నేను..

అసలు ఇలాంటి చెత్త సంప్రదాయం తెచ్చిందే కాంగ్రెసు వారు. ఇప్పటి వరకు వారి హయంలో జరిగిన తప్పులను ప్రతిపక్షాలు ఎత్తి చూపితే, సంబంధం లేని చెత్త విషయాలను తెరపైకి తెచ్చి ఎదురు దాడికి దిగడం వారికే చేతనయింది! అన్నాడు...

సరేలే.. వారి విషయం వదిలేద్దాం... మన విషయానికి వద్దాం... ఇంతకి స్మృతి ఇరానీ సరయిన ఛాయిస్సేనా,  కాదా చెప్పు! అన్నా...

ఎందుకు చేయలేదు. నిక్షేపంగా చేయగలదు. ఆ నమ్మకం ఉంది కాబట్టే నరేంద్ర మోడీ ఆ శాఖను కట్టబెట్టాడు! అన్నాడు నాయుడు...

అదెలా, అవిడ గతములో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకొనే స్దాయి నుండి మెడల్ గా, తర్వాత టి.వి. నటిగా కొనసాగి రాజకీయాల్లోకి వచ్చింది. అంతే తప్ప అవిడకి ఎటువంటి రాజకీయానుభవం కానీ, యితర అనుభవం కానీ లేవు కదా అన్నాను. అసలు ఆ శాఖకు సంబందించి కనీస అవగాహన ఆయినా ఉండాలి కదా... పెద్ద పెద్ద చదువులు చదివి మేధావులనిపించుకున్నవారు కూడా ఆ శాఖ ద్వారా దేశ విద్యావ్యవస్దలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయారు కదా! అన్నానేను...

చూసావుగా పెద్ద పెద్ద చదువులు వెలగబెట్టి మేధావులనిపించుకొన్న వారు కూడా ఏమి చేయలేకపోయారని నువ్వే ఒప్పుకున్నావు కదా... ఇక అలాంటప్పుడు ఆ శాఖ ఎవరికి ఇస్తే ఏంటబ్బాయి. గమ్మున పడుకొనుందాము మనం.

నిజమే.. ఇప్పటి వరకు ఎంతో మంది మేధావులు మానవ వనరుల శాఖని చేపట్టారు. వ్యవస్దలో ఎటువంటి ప్రమాణాలు మెరుగుపర్చడం కాదు కదా ఇంకా దిగజార్చడం మాత్రం జరిగింది.. ఈ నాడు దేశంలో పలు సాంకేతిక విద్యాలయాల నుండి వస్తున్న విద్యార్దుల్లో కనీసం పది శాతం మాత్రమే తమ కంపెనీ అవసరములకు తగ్గ సాంకేతిక సామర్ద్యం కల్గి ఉంటున్నారనీ, మిగతా వారందరికీ మరల ప్రత్యేక శిక్షణ యివ్వడం ద్వారా తయారుచేసుకోవల్సి వస్తుందని పలు సందర్బాల్లో పేర్కోనడం జరిగింది.  మారుతున్న ప్రపంచీకరణకి అనుగుణంగా నేటి విద్యావ్వవస్దని అందలి పాఠ్యాంశాలను పూర్తిగా మార్చవలసిన అవసరమున్నప్పట్టికి, అందులో ఎటువంటి పురోగతిని సాధించకపోవడం ద్వారా యువతని ఎందుకూ పనికి రాని అసమర్దులుగా తయారుచేస్తుంది.  
అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న ఐ.ఐ.టి, ఖరగ్ పూర్ లాంటి విద్యాలయాలను దేశమంతతా విస్తరించజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నట్టుగా కనిపించడం లేదు. భారతీయ విద్యార్దులు చాలా తెలివైనవారు. కానీ వారిని మెరికల్లా తయారుచేయగల సంస్దలు చాలా తక్కువుగా ఉండడమే ప్రధాన సమస్య అని చాలా మంది నమ్ముతున్నారు.

చివరగా నాయుడు ఒక మాట చెప్పాడు.. మన దేశంలో ఎదుగుదల అనేది ఒక చదువు ద్వారా మాత్రమే రాదు. రెండు పి.జి.లు చేసిన మన కన్నా, మన ఊర్లో టెన్త్ ఫెయిల్ ఆయిన సుబ్బుగాడు మంచి పోజిషన్ లో ఉన్నాడు. ఎందుకంటే వాడు చదువుకోకపోయినా బ్రతకడానికి కావలసిన కిటుకలు తెల్సుకొన్నాడు. కానీ మనలా చదువుకున్నవారికి బ్రతకడానికి కావలసిన కిటుకలు ఏ పాఠాలు చెప్పవు.. అంతెందుకు మన చదువుల ద్వారా మనం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే సంపాదించుకోగలము తప్ప... ఇంకేమి చేయలేము.. అన్నాడు...

ఆలోచించాను.. నేను చదువుకున్న పాఠాలు నుండి కానీ, సంపాదించిన సర్టిఫికెట్టుల నుండి కానీ నిజ జీవితంలో బ్రతకడానికి కావల్సిన కిటుకలు నేర్పించయా అని!! ఎంత ఆలోచించిన మచ్చుకు ఒక్కటి కూడా కనబడలేదు నాకు... ఒక్క కూడికలు, తీసివేతలు లాంటి రెండో తరగతిలో నేర్చుకున్నవి తప్ప....

నేను చదివిన చదువంతా కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయెగపడ్డాయి.. సర్టిఫికెట్టులు ఉద్యోగంలో జాయినయినప్పుడు గేటుపాసులాగా ఉపయెగపడింది తప్పితే మరల ఇప్పటివరకు పనికి రానేలేదు......

మరి అలాంటప్పుడు స్మృతి ఇరానీ మంత్రి అవడంలో తప్పు ఏమి కనిపించడం లేదు. అంటే నా ఉద్దేశం ఆవిడ గత నేపధ్యంను పరిగణనలోకి తీసుకొని ఆవిడ సమర్దతని అంచనా వేయడం తప్పు. సమర్దతకి కొలమానం విద్యార్హత ఎంత మాత్రం కాదని చెప్పగలను.... స్మృతి ఇరానీ కూడా ఆ శాఖ నిర్వహణలో తన పనితీరుని చూడమని, తన విద్యార్హతలు కాదని చెప్పడం ద్వారా కాంగ్రెసుకు సరయిన సమాధానం ఇచ్చింది....

వేచిచూడాలి.. ఎలాఉంటుందో....



2 comments:

  1. అనాలసిస్ చాలా బాగుంది రాఘవ్ గారు!

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ,
      నిజం చెప్పండి.. ఎందుకంటే నా అనాలసిస్ నాకే సరిగా నచ్చలేదండీ.... బ్లాగింగ్ చేసి చాలా రోజులయింది కదండీ.. అందుకని నామమాత్రంగా కూడా రాయలేకపోయాను.. నేనూ మీ కాకినాడ వాసినన్న అభిమానంతో బాగుంది అని మనస్పూర్గ్తిగా మెచ్చుకున్నారు... నేను మీ ప్రతి పోస్ట్ చదువుతాను... కాకినాడ విశేషాలన్ని మీరే రాసేస్తున్నారు.. నాకు ఆ అవకాశం ఇవ్వకుండా!!!!
      ఆయినా మీరు వ్రాస్తేనే చాలా బాగుంటుదండీ....ఎందుకంటే మీ విశ్లేషణ మాస్టారు పాఠం చెబుతున్నట్టుగా అందంగా ఉంటుంది...
      స్పందనకు ధన్యవాదములతో..

      Delete