Monday 14 May 2012

దువ్విన తలనే దువ్వగా...

దువ్విన తలనే దువ్వగా....దువ్వగా.. ఏమవుతుంది??

నెత్తి మీద క్రాప్ చాలా అందంగా కనబడుతుంది అంటారా మీరు??

నేను అయితే ఏమి అనను కాని.. మా చెల్లాయి అయితే మాత్రం అద్దమునకు కన్నాలు పడిపోతాయి అని ఆట పట్టిస్తుంది...

కన్నాలు పడితే ఏమిటి లేకపోతే ఏమిటి అని అనుకొని ఉంటే నాకే ఏ సమస్యలు లేకపోదును... కాని నిలువెత్తు అద్దంతో నాకు చాలా సమస్యలు వస్తున్నాయండీ బాబూ..... మీకు నవ్వులాటగా ఉన్నా, నాకు మాత్రం నిలువెత్తు అద్దం బోలెడన్నీ సమస్యలు తెచ్చిపెడుతుందండీ... నన్ను నన్నుగా స్దిమితంగా ఉండనీయడం లేదు.

ఇదేంటి.. నిలువెత్తు అద్దం తో మనోడికి సమస్యలు ఏమిటి అనుకుంటే, వివరముగా చెపుతాను మీకు.. వినండి....

అద్దం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ఉన్నది కాదని రామాయణం తెలిసిన వారందరికి తెలుసు.. ఆ రోజుల్లో సాక్షాత్తు శ్రీ రామ చంద్రుల వారే తన చిన్నతనంలో ఎక్కడో అందనంత ఎత్తులో ఉన్న చందమామ కావాలని మారాం చేస్తే, ఏమి చేయాలో తోచని దశరధుడిని కాపాడింది ఎవరు?? అద్దమే కదా.... నిలువెత్తు అద్దంలో చందమామను చూపించి శ్రీ రాముని కోరిక తీర్చాడు.. ఆ అద్దంలో ఉన్న చందమామను చూసి నిజమైన చందమామ అని భ్రమపడి ఆ శ్రీ రామచంద్రుడంతటి వాడే ఎంత సంబరపడిపోయాడో అంటే మనమెంత చెప్పండి!!

అదే విధంగా ఆడాళ్ళకు అద్దంతో ఉన్న అవినాభవ సంబంధం గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఇంట్లో ఏమి లేకపోయినా పర్లేదు కాని, అద్దం మాత్రం లేకపోతే అడవాళ్ళు గుమ్మం దాటి బయటకు రాలేరని మా కన్నగాడు ఏనాడో చెప్పేశాడు.

ఇకపోతే వావానాలకు, బైక్ లకు ఉండే అద్దాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పక్కల్లేదనుకుంటా.... వెనక ఎవరూ వస్తున్నారో దాని ద్వారా తెలుసుకొని తద్వారా డ్రైవింగ్ ఫర్ పెక్ట్ గా చేయడానికి ఎంతగానో ఉపకరిస్తాయి కూడాను అవి.

అద్దంతో ఇన్ని ఉపయెగాలుండగా నాకు మాత్రం అద్దంతో చాలా ఇబ్బందులే కల్గుతున్నాయి..

నా చిన్నప్పుడు మా ఇంట్లో నిలువెత్తు అద్దం ఉండేది. దానిలో నేను ప్రతిరోజూ చూసుకొని నా ప్రతిబింబంను పై నుండి క్రింద దాకా చూసుకోవడం నాకు అలవాటు. (బట్టలు వేసుకొనే లెండి). అ అలవాటు అద్దంలో పావు వంతు ఉన్న నా ప్రతిబింబం, అద్దం చివరకి వచ్చేంత వరకు సాగుతునే ఉంది.

నిలువెత్తు అద్దం ముందు మన ప్రతిబింబం చూసుకోవడం కామనే అనుకొండి.. కాని అది శృతి మించితేనే అనర్దాలు..

అమితాబ్ బచ్చన్ మొదటిసారి సినిమా అవకాశాల కోసము ప్రయత్నించినపుడు, ముందు అద్దంలో చూసుకో నీ ముఖంను అని వెటకరించడట ఒకడు.. రోషమొచ్చిన అమితాబ్ అద్దం ముందు గంటల తరబడి నిలబడి ప్రాక్టిస్ చేయడం ద్వారా తదనంతర కాలములో గొప్ప యాక్టర్ అయ్యాడు... అమితాబ్ విషయములో శృతి మించడం అనేది అతనికి ప్లస్ ఆయింది. కాని అది అందరికి ప్లస్ అవ్వాలని రూలేమి లేదు కదా.

అలాగని నన్ను ఎవడూ అద్దంలో నీ ముఖం చూసుకోమని ఎగతాళి చేయలేదులెండి. అలాంటి అవకాశం ఎవడూ ఇవ్వకుండానే నేనే నిలువెత్తు అద్దం కనబడగానే వెంటనే దాని ముందు ప్రత్యక్షమయిపోతాను...

టీనేజికి వచ్చినంతవరకు పెద్దగా ముదరలేదు కాని జబ్బు, ఆ తర్వాతే బాగా ముదురుపోయింది. ప్రతిరోజు నిలువెత్తు అద్దము ముందు నిలబడి నిన్నటికి, ఇవాళ్టికి తేడా ఏముందా చూసుకోవడం నా పాలిట దరిద్రం ఆయింది. మనిషి అన్నాక బాడీలో బోలెడన్నీ మార్పులు వస్తుంటాయి కదండీ. అవన్నీ సహజం కూడానూ.. కాని అద్దం ముందు ఉన్నప్పుడు నాకు అవేవి గుర్తుకు వచ్చిచావడం లేదు. సరి కదా నిన్నటి మీద ఈ రోజు లావు ఆయిపోయానేమో అన్న అనుమానం చంపుకుతినేస్తుంది. దానితో లావు తగ్గడానికి అని, చర్మం తెల్లబడడానికి అని ఇలా రోజూ ఏదో ఒక ఫీటింగ్ చేస్తుఉండేవాడిని.

అద్దంలో నా ఏకపాత్రాభినయంను చూస్తుండే మా చెల్లాయి.. అన్నయ్, అలా ఎక్కువ సేపు అద్దం ముందు ఉండి చూసుకుంటూ ఉంటే అద్దానికి కన్నాలు పడిపోవు అని నిష్టురాలు అడేది. మా చెల్లాయి సరదాకే అన్నప్పటికి, మర్నాటి నుండి చూస్తే నిజంగానే అద్దానికి చిన్న చిన్న కన్నాలు పడినట్టుగా అనిపించేది. అయ్యాబాబోయ్ ఇలా అయితే లాభంలేదు... అద్దం మీద పడ్డ కన్నాలు చూసి, మా చెల్లాయి ఎగతాళి చేస్తుందోమోనని అక్కడ నుండి తగ్గించుకోవడం మొదలెట్టాను. కాని నిన్నటికి, నేటికి మార్పు అనే జబ్బు మాత్రం వదల్లేదు...

వాస్తవానికి చెప్పాలంటే నేను నాజుగ్గానే ఉంటాను. కాని అద్దంలో చూసుకొన్నప్పుడు మాత్రం నిన్నటి మీద లావు ఆయిపోయానేమో అని భావన వెంటాడేది. దానితో ప్రతిరోజూ ఉదయము రన్నింగ్ వెళ్ళేవాడిని. అది నాకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయెగపడిందనుకొండి.

తర్వాత కొంత కాలానికి ఉద్యోగరీత్యా కాకినాడలో ఒక్కడినే ఉండవలసి వచ్చింది. ఆ మాత్రం మన ఒక్కడికే అన్ని ఫర్నిచర్స్ అక్కర్లేదు కదా...

అందుకని నేను ఉంటున్న రూమ్ లో ముఖం మాత్రమే కనిపించే ఒక చిన్న అద్దం ఉండేది. దానితో నా సమస్యలు చాలా వరకు తీరిపోయాయి. ఆ చిన్ని అద్దంలో నా ముఖం ఒక్కటే కనబడడంతో, ఇక మిగిలిన యాంగిల్స్ మార్పులు గురించి తెలుసుకొనే అవకాశం కోల్పోయాను. దానితో జీవితం ఎటువంటి బాదరబందీ లేకుండా హాయిగా గడిపేయడం జరిగింది. అప్పుడప్పుడు బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ముందున్న అద్దంలో చూసుకొన్నప్పటికీ, వాటిల్లో అంత క్లారిటీ లేకపోవడం నాకు ప్లస్ ఆయిందిలెండి. ఆయిన అంత పబ్లిక్ గా అన్ని నిమిషాలు షాపింగ్ మాల్ గ్లాసెస్ ముందు నిలబడి చూస్తే మన కామన్ సెన్స్ ఊరుకోదు కదా... అందుకని ఒకవేళ అలాంటి అద్దాలు కనబడిన ఇబ్బంది పడలేదు.

ఇక మనకి ఎటువంటి బాదరబందీ లేదు కాబట్టి, నచ్చినప్పుడు రన్నింగ్ కి వెళ్ళడం, లేకపోతే మానివేయడం... ఇలా మనకి ఏది తోస్తే అది చేసేవాడిని.

ఇలా హ్యాపిగా జరిగిపోతున్న నా జీవితంలోకి మరో మలుపు క్రిందటి నెలలో జరిగింది..

నేను అప్పటి వరకు ఉన్న రూమ్ లోకి వాటర్ సరిగా రాకపోవడం వలన, దాని గురించి ఓనర్ గారికి కంప్లైట్ చేయడంతో, ఓనర్ కి చిర్రెత్తి రూమ్ ఖాళి చేసేమని అర్డర్ వేసాడు. మనమేమన్నా తక్కువ తిన్నామా?? తప్పు వాడి దగ్గర పెట్టుకొని, నన్ను అంటాడా అని నేను కూడా ఫైర్ ఆయిపోయి రూమ్ ఖాళి చేసేయడానికి సిద్దపడిపోయా....

ఆవేశానికి పోయి రూమ్ ఖాళి చేస్తానన్న గాని, చేస్తానన్న రోజుకి నెల రోజుల వరకు ఎక్కడ రూమ్ దొరకనే లేదు. బైక్ టైర్లు అరిగేలా ఊరంతా తిరిగి గాలించినా నో రూమ్స్.

ఒక వేళ ఎక్కడైనా టు-లెట్ కనబడితే, అబగా దగ్గరకు వెళితే, క్రింది చీమంతా అక్షరాలతో ఓన్లీ ఫర్ ఫ్యామిల్స్ అనో, లేక ఓన్లీ ఫర్ బ్రాహ్మిణ్స్ అనో ఉండేది. ఇక చివరకి విసుగెత్తి పోయిన సమయంలో నా స్నేహితుడు వాళ్ళ కాలనీలో ఉండే ఒక పోర్షన్ ని రిఫర్ చేసాడు. మూడు రోజుల నుండి మంచినీళ్ళు దొరకని వాడికి, మామూలు మంచి నీళ్ళు దొరికితే ఎలాగుంటందో నాకు కూడా అలానే అనిపించింది. ఇతర వివరములు ఏమి అడక్కుండనే ఓనర్ చెప్పినన్నిట్టికి "ఊ" కట్టేసి అందులో జాయినయిపోయాను..

అందులో జాయినయిన తర్వాత చూద్దును... ఆ పోర్షన్ లో ఉన్న రెండు గదుల్లో గోడకు అందంగా ఏర్పాటు చేసిన రెండు నిలువెత్తు ఆద్దాలు....

ఇక ఇప్పుడు చూడండీ.. నా పాట్లు.. మళ్ళీ మొదలయ్యాయి.... అర్జంటుగా జిమ్ జాయినవ్వాలని నా అంతరాత్మ ఇప్పటికే తెగ సతాయిస్తుంది...

ఈ రోజు పొద్దున చూద్దునూ... అద్దానికి చిన్న చిన్న కన్నాలు పడినట్టున్నాయి అనిపించింది..


No comments:

Post a Comment