అరబ్ ప్రపంచంలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అక్కడి పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుస్తున్నాయనడంలో సందేహం లేదు. నిన్న ఈజిప్టులో ముబారక్ తొలగింపు, నేడు లిబియాలో గడాఫి తొలగింపు కొరకు విస్త్రత స్దాయిలో సాగుతున్న ప్రజాందోళనలు, రేపు మిగతా ఏ అరబ్ దేశములో మొదలవుతుందోన్న అందోళనలో అరబ్ దేశాధినేతలు బెంగపడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే, నేటి అధునిక కాలములో ప్రజల ద్వారా ఎన్నుకొనబడి ప్రజాసామ్యదేశంగా ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. నేటి ప్రజలలో వచ్చిన మార్పు మరియు జాతుల మధ్య తగ్గిన అసమానతలు అన్ని రకాల ప్రజలకు సమాన న్యాయమును పాటిస్తున్నాయి. ఈ మార్పు రెండవ ప్రపంచ యుద్దం తర్వాత బాగా వృద్ది చెందింది. కాని విచిత్రంగా మధ్యప్రాచ్యంలో ఉన్న అరబ్ దేశాలన్నింటిలోను మరియు కొన్ని యితర దేశాలలో ఇంకా రాజులు లేక నియంతల పాలనలోనే ఏలుబడి సాగుతుండడం నిజంగా ఆశ్చర్యకరమే. ప్రజాస్వామ్యం దిశగా అమెరికా, ఇండియా, జపాన్, బ్రిటన్ మె.గు దేశాలు ఏనాడో అధికారమును ప్రజలకు అప్పగించాయి. ఐక్యరాజ్యసమితి ఏర్పాటయిన తర్వాత సభ్యత్వం ఉన్న దేశాలన్నింటా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. నేటి ప్రపంచం అధునిక పోకడలతో ముందుకు పోతుందని, మనము సాధించిన విజయములు ద్వారా అసంఖ్యాకులు నమ్ముతున్నారు. కాని ఇది నాణేనికి ఒక వైపు మాత్రమేనని మిగతా కొన్ని దేశాలను గమనిస్తే తెలుస్తుంది. ఆయా దేశములలో నేటికి కూడా ప్రజలకు ప్రాధమిక హక్కులు లేకపోవడం చాలా దుర్లభం. మారుతున్న ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతిక మరియు శక్తివంతమైన మీడియా ద్వారా ప్రపంచ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొనుటకు వీలుపడడంతో ఆయా దేశాలలో ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల మక్కువ ఏర్పరచుకొని నియంతల పాలనకు చరమగీతం పాడడానికి కదం తొక్కుతున్నారు. ఇప్పటి వరకు ఏకచత్రాదిపత్యముగా పాలించిన నియంత రాజులకు ఈ చర్యలు సహజంగానే మింగుడుపడనివి. కాని నేటు అధునిక కాలములో ప్రజలలో వస్తున్న మార్పులు గౌరవించి, ఆయా దేశాలు ప్రజాస్వామ్యం దిశగా చర్యలు తీసుకుంటే మంచిది. ఇప్పటికే ఈ విషయములో ప్రజల నుండి ఇంకా ఆలోచన రాకముందే భూటాన్ రాజు అక్కడి తన రాజ్యపాలనను రద్దుచేసి ప్రజాస్వామ్యమును ఏర్పాటు చేసి, ప్రజల మనసులో చిరస్దాయిని సంపాదించుకొన్నాడు. కాబట్టి నేటికైనా అరబ్బు పాలకులు భ్రమలు వీడి, ప్రజాపాలనకు తగు చర్యలు తీసుకొవలసిన సమయం ఆసన్నమయింది. కాని పక్షంలో ముబారక్ కి పట్టిన గతే వీరికి పట్టవచ్చు.
No comments:
Post a Comment