Tuesday, 25 February 2014

ఒకే ఒక్కడు..


కల్వకుంట్ల చంద్రశేఖరరావు..

పరిచయం అక్కర్లేని రాజకీయ నేత...

నేటి తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధనలో క్రెడిట్ ని చాలా మంది కోరుకోవచ్చును గానీ వాస్తవానికి తెలంగాణాని ఇంత వరకు తీసుకురావడంలో కేసిఆర్ పాత్ర లేకుండా చెప్పుకోవడానికి అస్కారం లేదు.

ఎన్టీఆర్ హయాంలో శాసనసభ్యుడిగా రాజకీయ ప్రస్దానం మొదలెట్టి, నేడు తెలంగాణా రాష్ట్ర పితామహుడుగా అవతరించడం వరకు గల కేసిఆర్ ప్రస్దానంను చూస్తే అతని రాజకీయ చతురతని మెచ్చుకోకుండా ఉండలేమనిపిస్తుంది..

ఒక నియెజకవర్గానికి మాత్రమే పరిమితమైన శాసనసభ్యుడిగా ఉన్న కేసిఆర్ తదనంతరం కాలంలో చంద్రబాబు మంత్రివర్గంలో స్దానం దక్కలేదన్న కారణంతో వేరుకుంపటి పెట్టి ఆ కుంపటి ద్వారానే తెలంగాణా పది జిల్లాల్లో తిరుగులేదనిపించుకోవడమే కాక ఢిల్లీ స్దాయిలో లాబీయింగ్ చేయించి తన అభిష్టానుసారం తెలంగాణాని సాధించుకురాగలిగిన ఒకే ఒక్కడు కేసిఆర్....

ప్రపంచంలో చాలా మంది నాయకులు తమ మనసులో గూడుకట్టుకున్న అసంతృప్తి జ్వాలల కారణంతోనే పైకి వచ్చారు. కేసిఆర్ కూడా అంతే... తెలుగుదేశంలో పార్టిలో ఉన్న కేసిఆర్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినేట్ లో కేసిఆర్ కు చోటు కల్పించకపోవడంతో అసంతృప్తితో బయటకు రావడంతోనే కేసిఆర్ యొక్క రాజకీయ పెరుగుదల ప్రారంభమయిందని చెప్పొచ్చు.

పాకిస్తాన్ ఏర్పాడడానికి కారణమయిన మహమ్మద్ ఆలీ జిన్నా వెళ్ళిన బాటలోనే కేసిఆర్ కూడా వెళ్ళాడని చెప్పుకోవచ్చు.

స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో భారతదేశంలో గల పలు పేరేన్నిక గల నాయకుల ముందు తాను ప్రత్యేకమయిన నాయకుడుగా ఎదగలన్న ఆశతోనే ముస్లింలో తన ప్రాబల్యం పెంచుకొనే దిశగా అడుగులేసి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న నివాదంతో జాతిలో చీలిక తేవడం ద్వారా పాకిస్తాన్ ఏర్పరచడం, దాని ద్వారా పాకిస్తాన్ జాతిపితగా చరిత్రలో నిలిచిపోవడం జరిగింది.

అలాగే కేసిఆర్ కూడా చంద్రబాబు నాయుడు కేబినేట్ లో స్దానం దక్కకపోవడంతో బయటకు వచ్చిన కేసిఆర్ తెలంగాణా రాష్ట్ర సమితి పార్టిని స్దాపించారు. ఆ పార్టి స్దాపించిన  పన్నెండు సం.రాల తర్వాత చరిత్ర సృష్టించగలదని సాక్షాత్తు కేసిఆరే ఆ సమయంలో ఊహించియుండకపోవచ్చును.

టి.అర్.ఎస్ (తెలంగాణా రాష్ట్ర సమితి)ని స్దాపించేనాటికి తెలంగాణావాదమనేది అస్సలు ఎక్కడ లేనేలేదు. అంతకు ముందు పలు పర్యాయములు ప్రత్యేక తెలంగాణావాదము వినిపించినప్పటికీ మారిన పరిస్దితుల దృష్ట్యా అది మరుగున పడిపోయింది.

టి.ఆర్.ఎస్. ఏర్పడేనాటికి/దాని తర్వాత చాలా కాలం వరకు కూడా దాని ఉనికిని ఆ ప్రాంత నాయకులే పట్టించుకోలేదు. ఆయినప్పటికీ అత్మస్దెర్యం కోల్పోకుండా పార్టీని ముందుకు నడపడానికి సిద్దపడ్డారు..
 
ఆయితే తర్వాత కాలములో రాష్ట్రంలో మారిన సమీకరణాల దృష్ట్యా టి.ఆర్.ఎస్. కార్యాకలపాలు కూడా ఊపందుకున్నాయి. దానికి అప్పటి ముఖ్యమంత్రి నుండి సహయసహకారాలు అందియుండోచ్చు.  ఆయితే ప్రత్యేక తెలంగాణా వాదమును జనాల్లోకి తీసుకువెళ్ళాలంటే ఇదొక్కటే సరిపోదని భావించారు. మహమ్మద్ అలీ జిన్నా తరహా ఆలోచనను అచరణలో పెట్టడానికి సిద్దపడ్డారు.  దానితో తన మాటల్లో, చేతల్లో దూకుడుని పెంచారు. ప్రజల మధ్య చీలిక తేవడం మరియు ప్రాంతాల మధ్య సారూప్యాలను ఎత్తి చూపడం ద్వారా దుందుడుకు ధోరణిని అవలంభిచడం మొదలెట్టారు. ఆయన దుందుడుకు స్వభావం పై తెలంగాణా ప్రాంతపు నాయకులే విరుచుకుపడేవారు. ఆయితే రాన్రాను అక్కడి ప్రజల్లో కూడా నెమ్మదిగా విడిపోవాలనే విషపు బీజాలు మొగ్గ తొడగడంలో కొంత వరకు సఫలీకృతుడయ్యారు.  తన మాటల్లో కాఠినత్యని పరుష పదజాలంను చొప్పించడం ద్వారా బలమైన నాయకుడిగా ఎదగడానికి మార్గం సుగమం చేసుకున్నారు. అంతే కాకుండా పార్టి బలాన్ని కూడా నెమ్మదిగా పెంచుకుంటూ ఒక స్దాయికి తీసుకురాగలిగారు. ఆయితే ఆయన పరుష పదజాలన్ని అన్ని ప్రాంతాల నాయకులు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

తన రాజకీయ గురువు ఎన్టీఆర్ కి తన జీవిత చరమాంకంలో జరిగిన రాజకీయ పరాభవంను దృష్టిలో పెట్టుకొని పార్టిలో  తనకు సమాంతరంగా వేరేవరు ఎదగకుండా జాగత్తపడిన ముందుచూపు కల్గిన నాయకుడు కేసిఆర్... తన పార్టి ప్రతిష్టను పెంచుకోవడంలో భాగంగా ఎంతో దోహదపడిన అలె నరేంద్రని పార్టి నుండి సాగనంపడం కూడా అందులో భాగమే... అలె నరేంద్ర తర్వాత పార్టిలో ఒక ఒన్ మేన్ ఆర్మీగా తన స్దానంను స్దిరపర్చుకున్నారు. అదే విధంగా టి.ఆర్.ఎస్. పార్టిలో రాకెట్ వేగంతో దూసుకువస్తున్న మేనల్లుడు హరీశ్ రావుని కట్టడి చేయడానికి కొడుకుని కూతురిని రంగంలోకి ముందుగానే దింపిన మేధావి. తద్వారా పార్టి తనను కాదని ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోకుండా కాపాడుకున్నాడు.

తెలంగాణాలో టి.ఆర్.ఎస్.కి పెరుగుతున్న ప్రాబల్యంను గుర్తించో లేక రాజకీయ అవసరాల దృష్ట్యానో మిగతా పార్టీలు కొన్ని సందర్బాల్లో టి.ఆర్.ఎస్.తో పొత్తునకు సుముఖత చూపాయి. తొలుత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఆయితే తెలుగుదేశం అప్పటి ఎన్నికల్లో ఘోరపరాభవం చెందడంతో దానికి దూరంగా జరిగి అధికార పార్టి కాంగ్రెసుకు దగ్గరవడం ప్రారంభించారు. అప్పటి కాంగ్రెసు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా తన రాజకీయ అవసరాల దృష్ట్యా కేసిఆర్ తో చెలిమి చేసారు. ఆ విధంగా కాంగ్రెసుకి దగ్గర కాగలిగిన కేసిఆర్ అనంతర కాలంలో కేంద్రమంత్రిగా కూడా కొంత కాలం పనిచేయగలిగారు. అంతే కాకుండా కాంగ్రెసు ఎన్నికల మేనిపోస్టోలో తెలంగాణా అంశాన్ని చేర్చగలిగారు.

ఆయితే కాంగ్రెసు మేనిపోస్టోలో  తెలంగాణా అంశాన్ని కేవలం రాజకీయ జిమ్మిక్కు గానే భావించారు కానీ, తదుపరి కాలంలో అది తెలంగాణా విభజనకి దారి తీయగలదని ఆంధ్రప్రదేశ్ లోని ఏ రాజకీయ నాయకుడు కూడా ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణా కాంగ్రెసు నాయకులే ఊహించియుండరు.  అందుకనే ఆ సమయంలో తెలంగాణా అంశంపై ఏ పక్షం వారు  కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అది అచరణ సాధ్యంకానీ హమీ గా భావించడం వలనే...


కానీ దానిని నిజం చేసి చూపించిన ఘనత మొత్తం కేసిఆర్ కే దక్కుతుంది...

కాంగ్రెసులో అప్పటి వరకు బలమైన నాయకుడుగా ఉన్న వైఎస్ ఆర్ దుర్మరణం పాలవడంతో తెలంగాణాలో కేసిఆర్ ని నిరోధించగల నాయకుడంటూ ఎవరూ లేకుండా పోయారు. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణా కోసం దీక్షకు పూనుకోవడంతో తెలంగాణా ఉద్యమంను తారాస్దాయికి తీసుకురాగలిగారు. అప్పటికి కూడా తెలంగాణా కాంగ్రెసు నాయకులకు నమ్మకం కలగలేదు భవిష్యత్తులో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకలదని.

ఆయితే సీమాంధ్రుల మీద తన దూకుడు స్వభావం కొనసాగించడంతో పాటుగా దోపిడివాదమును కూడా పైకి తీసుకువచ్చారు. తెలంగాణా వెనుకబాటుతనానికి సీమాంధ్రులే కారణమని,  నిరుద్యోగాలకు, వెనుకబాటుతనానికి ఇలా పలురకముల రుగ్మతలకు కారణం సీమాంధ్రులే కారణమని చెప్పడం ద్వారా ప్రజల్లో విద్వేషన భావలను తారాస్దాయికి తీసుకురాగలిగారు. అందులో ఎక్కువ అసత్యాలే కావడం దురదృష్టకరం. రాజధాని హైదరబాద్ నకు పొట్టకూటి/చదువు కోసం తెలంగాణా మిగతా ఎనిమిది జిల్లాల నుండి ప్రజలు ఎలా తరలివచ్చారో, సీమాంధ్ర పదమూడు జిల్లాల నుండి ఆ విధంగానే తరలివచ్చారు అనే విషయమును మర్చిపోయి సీమాంధ్రులను ద్వేషించడం మొదలెట్టారు.

ఈ విధంగా తన రాజకీయస్వలాభం కోసం తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టిన వాడుగా కేసిఆర్  అపఖ్యాతి మూటకట్టుకున్నారు. 
                                                                                                              ఇంకావుంది....

1 comment:

  1. అదేంటో యెప్పుడు కాంగ్రెసు(అధినేత్రి)ని కలిసినా పార్టీ నుంచి మరో పురుగుని కూడా రానివ్వకుండా ఒఖ్ఖడే(!?) వెళ్తాదు. అక్కడ పొర్లు దండాలే పెడుతాడో గుక్క పట్టి యేడుస్తాడో పీక కోసుకుంటానని బెదిరిస్తాడో యెవరికీ తెలీదు.బయట కొచ్చి ద్డవిలాగులు మాత్రం దంచేస్తాడు.ఒక్క నెల రోజులే ఇంకొక్క నెల రోజులే అంటూ డేకించుకొచ్చి ఆఖరికి ఖాజీ సాయెబు గారు తురకల్లో కలిసి పోయాడన్నట్టు కాంగ్రెసులో కలిసి పోతున్నాడు.పాపం!

    ReplyDelete