Wednesday, 11 May 2011

వేసవి కాలము- తీపి గుర్తులు

వేసవి కాలము వచ్చిందంటే ఇప్పడు చాలా చిరాకు పడుతున్నాము కాని, ఒకప్పుడు ఇదే వేసవి కోసము సంవత్సరమంతా ఎదురుచూసేవాళ్ళం. చదువుకొనే రోజుల్లో వేసవి కాలానికి ఉన్న క్రేజ్ అంతయింత కాదు. ఎప్పుడు క్లాస్ లు ఆవుతాయా... ఎప్పుడు పరీక్షలు ఆవుతాయా.... ఎప్పుడు సొంత ఇళ్ళకు వెళ్ళిపోతామా......... అని ఎదురుచూపులు చూస్తుండేవాళ్ళం. ఇక వేసవి కాలము రాగానే మా ఇంటికి వెళ్ళగానే, అప్పటికి సుమారు ఇంకో పది మంది వరకు ఉండేవాళ్ళం. అందరం కలసి ఒక పంక్తిలోనే భోజనాలు, మధ్యాహ్నం చలువ పందిరి క్రింద మడత మంచాల మీద పడుకొని కబుర్లు, సాయంత్రం చేలోకి వెళ్ళడం, ముంజుకాయలు(తాటికాయలు) కొట్టించుకొని తినడం, పై ఈతకు వెళ్ళడం, తిరిగి రాత్రికి వెన్నెల్లో ఆరుబయట కూర్చుని అర్దరాత్రి వరకు కబుర్లు చెప్పుకోవడం. వేసవంతా విధముగానే గడిచిపోయేది. అసలు ఎండల దెబ్బ తెలిసేదే కాదు.
కాని ఇప్పుడు, పొద్దున్నే ఆఫీసుకి పోవడం, ఆఫీసులో ఎండ వేడికి ఉక్కపోత రేంజ్ లో ఉండడం, మధ్యాహ్నం మనమొక్కరమే ఏదో భోజనం తిన్నమనిపించడం, ఆఫీసు ఆవగానే ఇంటికి వెళ్ళడం, అప్పటికి ఎండ దెబ్బకి ఇల్లు అగ్నికుంపటి లా భగభగ మనడం.  ఇక ఇంటిలో మనమొక్కరిమే టి.వి.లో ఏదో ఒక చానల్ చూస్తూ పడుకోవడం. పడుకోవడము కూడా యాంత్రిక నిద్ర కావడం. స్వచ్చమైన ప్రకృతి గాలికి బదులు యాంత్రిక ఎయిర్ కండిషనర్ గాలులలో పడుకోవడం గమనిస్తే వేసవి రోజులకు, వేసవి రోజులకి ఎంత తేడా ఉందో తెలుస్తుంది. అందుకే నాకు దేవుడు కనిపించి వరమడిగితే ఎండలు తగ్గించమని అడగను కాని నాకు మరల పాత రోజులను ప్రసాదించవలసినదిగా కోరతాను. మొన్న ఆదివారం మా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తము నా ఐదుగురు మరదళ్ళు, అన్నయ్య, చెల్లి, బావ, ఇద్దరు అత్తయ్యలు, ఇద్దరు మావయ్యలతో ఇళ్ళు కలకలలాడుతు ఉంటే నాకు తిరిగి రావలనిపించలేదు. నిజముగా నాకు రావలనిపించలేదు. కాని తప్పదు కదా....... అందుకే ఆయిష్టంగానే బయలుదేరాను.....

1 comment: