Monday, 9 December 2013

అవినీతి అధర్మమేమి కాదు.....1



నిన్న ఆదివారం సాయంత్రం వాతావరణం చాలా కూల్ గా ఉంది. తుఫాన్ ప్రభావమో లేక చలికాలం ప్రభావమో తెలియదు కానీ, పగలు కూడా చల్లని గాలులతో వాతావరణం చాలా కూల్ గా ఉంది. B.Tech మెకానికల్ పూర్తి చేసిన ఆశోక్ చాలా రోజుల తర్వాత కాకినాడ రావడంతో నన్ను కలిశాడు.

ఇంట్లో ఉండడం బోర్ అనిపించి ఇద్దరము కలసి అలా బయటకు బయలుదేరాము. వాతావరణం చల్లగా ఉంది కదాని వేడి వేడిగా చాయ్ తాగాలనిపించి భానుగుడి జంక్షన్ వద్ద గల వినాయక కేఫ్ కి వెళ్ళాము. అప్పటికే అక్కడేదో జాతర జరుగుతున్నట్టుగా జనాలతో కప్పబడిపోయి ఉంది వినాయక కేఫ్ వద్ద ఉన్న టీ కౌంటర్ దగ్గర....
ఏంటన్నా ఇక్కడేమన్నా ఉచితముగా టీ సరఫరా చేస్తున్నారా! అని ఆశోక్ జోకేశాడు చీమలదండుల ఉన్న అక్కడ జనాలను చూసి....

ఈ లోపునే నాయుడుకి కూడా ఫోన్ చేసాను వినాయక్ కేఫ్ కి వచ్చేయమని చెప్పి. మేము వెళ్ళేసరికే నాయుడు ఎదురుచూస్తూ ఉన్నాడు మాకోసం... నాయుడుకి టీ అంటే చాలా ఇష్టం... వినాయక కేఫ్ టీ అంటే ఇంకా ఇష్టం... అందుకే ఎన్ని పనులున్నా వినాయక కేఫ్ అంటే వెంటనే వచ్చేస్తాడు.....

మూడు కప్పుల  టీ తీసుకొని కేంటిన్ లోపల ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర ముగ్గురం సెటిల్ ఆయ్యాము. ఆశోక్ తో నాయుడుకు కొద్దిగా పరిచయం ఉంది. దాంతో యెగక్షేమాలు మాట్లాడుకున్నారు.

ఆ మాటా, ఈ మాటా మాట్లాడుకుంటూ ఉండగా కేంటిన్ లో గోడకి అంటించి ఉన్న వినాయక స్వచ్చంద సేవ సంస్ద పోస్టర్ కనబడింది. దానిని ఆ క్యాంటిన్ వాళ్ళే నడుపుతున్నారు.  ఈ క్యాంటిన్ వాళ్ళు స్వచ్చంద సంస్ద కూడా నడుపుతున్నారా? అని అడిగాడు ఆశోక్...

ఆవును కదా, చెప్పడం మరిచాను.. ఆశోక్  కొద్దిగా సున్నితస్వభావి.. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తాడు. ముఖ్యంగా సామాజిక సేవ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. అధర్మం అన్నా, అవినీతి అన్నా సహించలేడు... అందుకే స్వచ్చంద సంస్ద పోస్టర్ కనబడగానే అత్రుతగా అడిగాడు......

అవునన్నట్టుగా ఇద్దరము తలాడించాము....

ఆశోక్ మాట్లాడుతూ ఇది చాలా మంచి విషయమని, ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సామాజిక సేవ కోసం పాటుపడాలని, అవినీతికి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని ఇలా తన అదర్శాలు చెప్పుకుంటూ పోతున్నాడు...... కుర్రాడు కదా, ఆ మాత్రమ్ ఊపు ఉంటుందిలే అని మిగతా మేమిద్దరం ఆశోక్ చెబుతున్నదీ వింటూ కూర్చున్నాము.

తర్వాత దేశములో అవినీతి గురించి అందుకొని, అటూ తిరిగి..ఇటు తిరిగి చివరకి వైజాగ్ లో తనుంటున్న రూమ్ ఓనర్ దగ్గరకి వచ్చి ఆగాడు. ఆ ఇంటి ఓనర్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులో అధికారి స్దాయిలో పనిచేస్తున్నాడనీ, అతను మేసే లంచాలకి అంతు లేదని ఇలాంటి వారి వలన దేశములో పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుందని వాపోయాడు. అంతే కాక ఆ ఓనర్ పెద్ద దైవ భక్తుడని, అన్నన్ని వెధవ పనులు చేసి కూడా దేవుడి దగ్గరకి సిగ్గులేకుండా ఎలా వెళ్తారని ప్రశ్నించాడు!. పైగా అదేదో తన తాతల అస్తి అన్నట్టు అక్రమ సొమ్ముతో అన్నదానాలు నిర్వహిస్తాడనీ... చెప్పుకుంటూ పోతున్నాడు ఆశోక్....

ఈ లోగా నాయుడు టీ తాగడం పూర్తయింది....

అసలు ధర్మమంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి బ్రదర్ అనడిగాడు ఆశోక్ వాగ్దాటికి అడ్డుపడుతూ.....
తప్పులు చేయకుండా ఒప్పుగా ఉండడం, చట్టాన్ని అతిక్రమించకుండా చట్టానికి లోబడి ఉండడం, లంచాలు తినకపోవడం, రాజకీయనాయకులు ప్రజలను మెసం చేయకపోవడం.. ఇవన్నీ ధర్మం... అలా చేయకపోవడం అధర్మం అన్నాడు ఆశోక్...... తప్పులు చేసిన వాడి పాపములన్నీ ఆ దేవుడు లెక్కపెడుతునే ఉంటాడు. పాపాలు చేసి గుడికి వెళ్ళి దణ్ణాలు పెట్టుకున్నంత మాత్రానా పాపాలు పోయినట్టు కాదు అన్నాడు....

ఆయితే నువు చెప్పినట్టు తప్పులు చేయకపోవడం, చట్టానికి లోబడి ఉండడం చేస్తే పుణ్యం చేసినట్లేనా? వారందరూ తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అన్న మాట అన్నాడు నాయుడు.... కొద్దిగా తటాపయిస్తూనే ఆవునని సమాధానమిచ్చాడు ఆశోక్.....

చూడబ్బాయ్ ఆశోక్.. నువ్వు కుర్రాడివి.. ఆ మాత్రం దూకుడు ఉండడం కామన్ అనుకో.. కానీ వాస్తవాలు అంటే నిజాలు కూడా తెలుసుకోవల్సియుంది అబ్బాయ్ నువ్వు అని మొదలెట్టాడు కృష్ణుడు అర్దునుడికి గీతాపదేశం చేసినట్టుగా......

ధర్మం వేరు... తప్పులు వేరు...
పాప, పుణ్యముల లెక్క భగవధ్గీత, బైబిల్, ఖురాన్ మరియు యితర మత గ్రంధాల్లో చెప్పారు. దాని ప్రకారం పాప పుణ్యములు మూట కట్టుకొని పోయేటప్పుడు వాటిని అనుభవిస్తాము.  అంతే కాని మనం మన అవసరాల కోసం ఏర్పరచుకొన్న రాజ్యాంగాలు,  చట్టాలు పాటించామా లేదా అన్న దాన్ని బట్టి పాప పుణ్యములు లెక్కకట్టరు..... చట్టాలు, రాజ్యాంగాలనేవి మనకు మనం విధించుకున్న ఒక క్రమశిక్షణ లాంటిది... ఒక క్రమశిక్షణ అనేది లేకపోతే ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనేది ఉండదు. అందుకని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రజలందరికీ ఒక టైమ్ టేబుల్ లాంటిది లేక క్రమశిక్షణ లాంటిది ఏర్పరచి అందుకు అనుగుణంగా ప్రజలను పాలించడం కోసం పెట్టుకున్నదిదీ... అన్ని దేశాల్లో చట్టాలు ఒకేలా ఉండవు.. ఒక దేశంలో ఉన్న చట్టం, ఇంకొక దేశములో ఉన్న వారికి కొత్తగా లేక అసంబద్దంగా అనిపిస్తాయి. అన్ని దేశాల సంస్కృతులు ఒకేలా ఉండవు కాబట్టి.. ఆయా సంస్కృతులకు అనుగుణంగా చట్టాలు రూపొందించబడతాయి....

ఉదహరణకి పశ్చిమ దేశాల్లో అమ్మాయిల, అబ్బాయిలు డేటింగ్ అన్నది చాలా కామన్ వ్యవహరం... పిల్లలకు పది సం.రాల వయసు నుండే కొన్ని విషయాల్లో స్వేచ్చ ఉంటుంది అక్కడ. కొంత మంది తమ బాయ్ ప్రెండ్ లేదా గర్ల్ ప్రెండ్ తో కలిసి స్వంత ఇంట్లోనే తల్లిదండ్రులతో కలసి ఉంటారు. దానిని ఎవరూ తప్పపట్టరు.. ఎందుకంటే అది వారి సంస్కృతి.  అదే మన దేశానికి వచ్చే సరికి పెళ్ళి కాకుండా డేటింగ్ చేయడాన్ని చాలా ఘోరమైన తప్పుగా భావిస్తారు. ఎందుకంటే సంస్కృతుల మధ్య ఉన్న భేదం కారణంగా. అంతే కాని మనకు సభ్యత కాని దానిని పశ్చిమ దేశాల్లో యువత చేస్తున్నారని వారందరూ పాపములు చేస్తున్నట్టు కాదు. ఆ విధముగా చట్టాలు, రాజ్యాంగాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న సంస్కృతులు, జీవన విధానము ఆధారంగా ఏర్పాటు చేసినవే కానీ పాప, పుణ్యముల ఆధారంగా తయారు చేసినవి కాదు....

అంటే చట్టాలను అతిక్రమించి తప్పుడు పనులు చేయడం, లంచాలు తినడం, తప్పుడు పనులు చేయడం వలన పాపములు అంటుకోవా! అని కొద్దిగా రోషంగా అడిగాడు ఆశోక్.....

నాయుడు కొద్దిగా నవ్వి, పాపపు పనులు చేయడం, తప్పుడు పనులు చేయడానికి చాలా తేడా ఉంది....

నువ్ చెప్పినట్టు మీ ఇంటి ఓనర్ నే తీసుకుందాం... అతను ఆఫీసులో లంచాలు తింటాడు. అది తప్పని నేను అంటాను. నువ్వేమో అది పాపం అంటావు... అది పాపం అని ఏ దేవుడు ఎక్కడా చెప్పలేదే!!

అవతలి వాడు ఇవ్వబట్టే కదా, ఇవతలి వాడు పుచ్చుకుంటాడు... అంటే దీనిని ఇచ్చిపుచ్చుకొనే పద్దతి అనవచ్చు... ఒక్కప్పుడు దేశంలో వస్తువలన్నింటినీ ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలోనే ఉండేవి. మన దగ్గర ఉన్న వస్తువులు లేదా సామాగ్రిని వేరేకరికి యిచ్చి బదులుగా వారి వద్ద నుండి మనకి కావల్సినది తీసుకోనేవారు. దానినే వస్తు మార్పిడి పద్దతి అనేవారు. ఆ తర్వాతర్వాత ద్రవ్యం చెలామణిలోకి రావడంతో ఇచ్చిపుచ్చుకోవడమంతా డబ్బు రూపంలోనే సాగుతుంది. అదే మీ ఓనర్ చేస్తున్నాడు.....

ఇకపోతే అవతలి పార్టివాడు లంచం ఇవ్వడం వల్లనే తన పూర్తి ఆవుతుందని లేదా లాభం కలుగుతుందని భావిస్తేనే లంచం ఇవ్వడానికి సిద్దపడతాడు. కాబట్టి ఇక్కడ ఎవరూ ఎవరిని మోసం చేయడం లేదు.......


అదెలా కుదురుతుంది? ప్రభుత్వం అతనిని నియమించింది లంచాలు తినమని కాదు కదా! నిబంధనలు సక్రమంగా అమలు చేయమనే కదా జీతం ఇస్తుంది! అలాంటప్పుడు దానికి విరుద్దంగా వ్యవహరించడం తప్పే కదా అన్నాడు ఆశోక్....
                                                                                                                                  తరువాయి భాగానికి ప్రక్కన క్లిక్ చేయండి.. ఇంకావుంది...

Tuesday, 26 November 2013

జవాబు చెప్పగలరా!!



ఒక ట్రాఫిక్ పోలిసు చూస్తూ ఉండగానే ఒక టాక్సీ డ్రైవర్ రెడ్ లైట్ ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న ట్రాపిక్ పోలిసు అతనిని ఆపలేదు. ఎందుకో చెప్పగలరా!!

మృత్యువు – భయం



మృత్యువు అంటే ప్రతి ఒక్కడూ భయపడతారు.. కొంత మందైతే రాబోయే మృత్యువు కోసం ఇప్పటి నుండే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు....
మృత్యువు గురించి భయపడకూడదు. మృత్యువే మనల్ని చూసి భయపడే విధంగా మనం అన్నింటికి సిద్దమై ఉండగలగాలి. ఎవరు ఎంత భయపడినా లేక గింజుకున్నా రావాలనుకొన్న సమయంలో మృత్యువు మనల్ని వెతుక్కొంటూ వస్తుంది. దీన్ని ఎవరూ మార్చలేరు.... ఆపలేరు....

చదువుకొనే రోజుల్లో మృత్యువు గురించి నా పిలాసఫి ఇదీ.

మృత్యువంటే నేను ఏనాడూ భయపడేవాడిని కాదు. విపరీతమైన రద్దీగా ఉన్న రోడ్లపై బైక్ మీద వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు భయపడలేదు. కాకినాడ బీచ్ రోడ్డులో ఎన్నో సార్లు ప్రెండ్స్ తో బైక్ పోటిలు పెట్టుకొన్నప్పుడూ భయపడలేదు. ఎక్కడైనా భీభత్సమైన ప్రమాదం జరిగినపుడు అక్కడ ఉన్న రక్తసిక్తమయిన ప్రదేశమును చూసినప్పుడు గాని, రక్తమోడుతున్న క్రతగ్రాతులను చూసినపుడూ కూడా మృత్యువు గురించి ఆలోచించి భయపడలేదు.

మనమెందుకు భయపడాలి? భయపడితే మృత్యువు మన దగ్గరకి రావడం మానేస్తుందా? మా కొలీగ్ మురళి గారితో చాలా సార్లు ఈ విషయమై వాదించేవాడిని.  నా మాటలు విని ఆయన నవ్వి ఊరుకొనేవారు. ఒకసారి మా అన్నయ్యని బైక్ వెనకాలు కూర్చుబెట్టుకొని భీభత్సంగా డైవింగ్ చేయడం మొదలెట్టాను. నా డైవింగ్ కి తానేమీ భయపడలేదు కానీ, రేయ్ పెళ్ళాం, పిల్లలు ఉన్నోడిని కొద్దిగా జాగత్రగా చూసుకొని పోనియ్ రా అన్నాడు సౌమ్యంగానే...

అప్పుడు అన్నయ్య అలా అంటే నేను ఏమనుకొన్నాను? అన్నయ్యకి మృత్యువంటే ఎంత భయం! మనకు భూమ్మీద నూకలు చెల్లిపోయియుంటే మృత్యువుని ఎవరైనా తప్పించుకోగలరా! మృత్యువు రాసిపెట్టిఉంటే బైక్ మీద నెమ్మదిగా వెళ్ళినా, వేగంగా వెళ్ళినా పైకి పోవలసినదే కదా అనుకొన్నాను..

కొన్ని సార్లు బైక్ మీద నుండి పడి దెబ్బలు తగిలించుకొని పది రోజుల పాటు మంచం మీదే ఉన్నపుడు కూడా ఏమనిపించలేదే నాకు...

మరీ ఈ రోజు నా జీవితంలో తొలిసారి మృత్యువు గురించి భయపడ్డానేంటి? మృత్యువు గురించి ఒక రకమైన వైర్యాగం లాంటి ఫీలింగ్ వచ్చిందేమిటి?

రోజూలానే ఈ రోజు కూడా ఉదయమే లేచి వివేకానంద పార్క్ కి జాగింగ్ మరియు రన్నింగ్ కోసం బయలుదేరి వెళ్ళాను.  రెండు రౌండ్లు పూర్తి చేసి, మూడో రౌండ్ చేస్తున్నవాడిలా ట్రాక్ దగ్గర అల్లంత దూరంలో కొంత మంది మిగతా వాకర్స్ గుంపుగా ఉన్నారు. అందులో మురళి గారు కూడా ఉన్నారు. ఏంటబ్బా అంతమంది అక్కడ ఉన్నారు. ఏదో జరిగి ఉంటుంది అనుకొని గబాగబా చేరుకున్నాను అక్కడికి.  అక్కడకి ప్రక్కన ఉన్న టేబుల్ మీద ఒకాయన పడిపోయి ఉంటే మిగతా వాకర్స్ లో డాక్టరయిన ఒకాయిన ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు.

 మురళి గారిని అడిగాను ఏమయింది అన్నయ్య అని!

ఎవరో ఒక వాకర్ నడుస్తూ ఉన్నట్టుండి ముందుకు పడిపోయారు. తల నేలకు కొట్టుకోవడంతో చిన్న దెబ్బ తగిలింది అని చెప్పారు. ఒహ్.. అంతే కదా అనుకున్నాను... కానీ ఆయన అపస్మారకస్దితిలోకి వెళ్ళిపోవడంతో పార్క్ ఎదురుగా ఉన్న హస్పటల్ కి వెంటనే తీసుకెళ్ళి జాయిన్ చేసారు మిగతా వాకర్స్...
సరే అంతా బాగానే ఉంది కదా అనుకొని, నేను తిరిగి వాకింగ్ మొదలెట్టాను. ఇంకో రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అక్కడకి వచ్చేసరికి ఇందాకటి పడిపోయిన వాకర్ చనిపోయారని తెలిసింది.  ఆయన వయస్సు కూడా సుమారు 45 నుండి 50 లోపే ఉంటుంది. కారణం ఆయనకు ఆ సమయంలో హర్ట్ స్ట్రోక్ రావడం వల్లనని చూచాయగా తెలిసింది.

ఆ విషయం తెలిసి, ఎందుకో మనసులో చిన్న ఫీలింగ్ మొదలయింది. అప్పుడు మురళి గారు కూడా నాతోనే ఉన్నారు. ఉదయం నాలానే వాకింగ్ అని పార్క్ కి వచ్చిన ఆ వ్యక్తి, అంతలోనే ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా భాద కల్గించింది. నా ఆలోచన అతని యొక్క ఇంటి మీదకి వెళ్ళింది. బహుశా అతని కుటుంబ సభ్యులు వాకింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇలా విగతజీవిగా మారి వస్తాడని కలలో కూడా అనుకొని ఉండరు కదా అనిపించింది... వెంటనే నాలో మృత్యు భయం కల్గింది. నాకు కూడా ఏదో రోజు ఇలా జరగొచ్చుమో అన్న ఆలోచన నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేలా చేసింది....

ఎందుకంటే నాకు పెళ్ళయింది కాబట్టి... నన్ను నమ్ముకొని నా అర్దాంగి ఉంది కాబట్టి.......

ఒక్కప్పుడు నా స్వార్దం మాత్రమే చూసుకొనేవాడిని. నాకేమయినా అయితే ఏంటి? లేకపోతే ఏంటీ అనే తెగింపు ఉండేది. అందుకే ఏనాడూ మృత్యువు గురించి భయపడలేదు. కానీ ఈ రోజూ నేను నా కోసం కాకుండా నా అర్దాంగి కోణంలో ఆలోచించి మృత్యువుకి భయపడవలసివచ్చింది...

నిజమే.. చాలా మందిలానే నేను కూడా మృత్యువుకి ఇప్పుడు భయపడుతున్నాను ..... నేను ఏమయిపోతానన్న భయం మాత్రం కాదు.....



Saturday, 23 November 2013

మైసూర్ బజ్జీలను నిషేదించాలి...... అంతే...



పై పోటో చూస్తుంటే మీకేమనిపిస్తుందండీ... నోరు ఊరుతుందా.. మహా అయితే కుదిరినప్పుడు ఒకసారి తినాలనుకుంటారు అంతే కదా..... అదే నాకయితే ఏమనిపిస్తుందే తెలుసా... యమ అర్జంటుగా మైసూర్ బజ్జీలను నిషేధించేయాలి అనిపిస్తుంది....

అవునండీ మైసూర్ బజ్జీలను అన్ని హోటల్స్ లోని నిషేదించాలి. కుదరకపోతే మైసూర్ బజ్జీలు బాగా వేసే హోటల్స్ లో నైనా అర్జంటుగా నిషేదించేయాలండీ....

కొంత మంది అల్కహల్ కి బానిస ఆవుతారు, సిగరెట్టు తాగడానికి బానిస ఆవుతారు, డ్రగ్స్ కి బానిస ఆవుతారు, అమ్మాయిలకు బానిస ఆవుతారు, పేకాటకి బానిస ఆవుతారు... కానీ నేనేమిటండీ బాబూ... మైసూర్ బజ్జీలకు బానిసను ఆయిపోయాను.

ఎంతంత పని చేస్తుందండీ అది...  అరోగ్యానికి మంచిది కాదు, అవి తింటే త్వరగా జీర్ణం కాదు తద్వారా అకలి పుట్టదు, పైగా నూనెలో వేసి కాగుతారు కాబట్టి ఆయిల్ వుడ్ తినకూడదు అన్ని డాక్టర్లు ఆయినవారు మరియు డాక్టర్లు కానివారందరూ కూడా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతుంటే ఎన్ని సార్లు  కమిట్ అయ్యాను! ఇక చచ్చినా మైసూర్ బజ్జీలు తినకూడదు అని....

కానీ ఏమయింది??...
నేను చావలేదు కానీ, మైసూర్ బజ్జీలు తినడం మాత్రం అపలేదు....

చిన్నప్పుడు ఎంత బాగుండేదండీ.... శుభ్రంగా చద్దన్నం తిని అందులో నంజుకోవడానికి ఒక చిన్న బెల్లం ముక్కో లేక అవకాయ ముక్కో పడేస్తే ఎంత ఆనందంగా తినేవాళ్ళం.... ఆ చద్దన్నం చల్లదనం పాఠశాల మధ్యాహ్నం బెల్ కొట్టేవరకు ఉండేది..... పదవ తరగతి వరకు అదే ఆనందం... అప్పుడపుడు శుభ్రంగా రోట్లో రుబ్బిన పప్పుతో వేసిన మినప అట్లు, ఇడ్లీలు, పెసరట్టులు ఎంత రుచికరంగా ఉండేవి.... రోజూ చద్దన్నం తినేవాళ్ళమేమో కానీ, అప్పుడప్పుడు చేసే ఇలాంటి టిఫిన్స్ తింటే ఆ ఆనందానికి ఏ స్వర్గం సరిపోతుందండీ! ఇప్పుడంత టేస్ట్ ఎక్కడ ఏడ్చింది రోజూ మేసే టిఫిన్స్ లో.. అంతా గ్లెండర్ లోనో లేక మిక్సిలోనే ఆడించేయడమే......

నా పదవ తరగతి ఆయిపోయేంత వరకూ మైసూర్ బజ్జీ అనే ఒక టిఫిన్ ఉందనీ కూడా నాకు తెలియదు. మా ఊరిలో ఉన్న చిన్న హోటల్లో అలాంటి గడ్డిని ఎప్పుడూ పెట్టలేదులెండి... అందుకని మాకు తెలియలేదు... ఇక ఇంటర్ చదువు కోసం కాకినాడకి వచ్చి పడ్డాను చూసారా! అప్పుడు పరిచయం ఆయింది మైసూర్ బజ్జీ... మిగతా టిఫిన్స్ తో పోల్చుకుంటే గొప్పగా లేకపోయినా ఎందుకో అదంటే పిచ్చి.. నాకే కాదు నా జట్టుగాళ్ళకు అందరికి కూడాను.

కాకినాడలోని ఇంద్రపాలెం వద్ద నున్న ఐడియల్ కాలేజిలో జాయిన్ అయ్యాను ఇంటర్ కోసం. మా ఇల్లేమో గాంధీనగర్ లోని ఒంటి మామిడి సెంటర్ దాటిన తర్వాత ఉన్న తిరుమలరావు వారి వీధిలో ఉండేది.  ఉదయం ఆరు గంటలకే ఫిజిక్స్ ప్రెవేటు చెప్పించుకోవడానికి అచ్యుతపురం గేటు అవతలి వైపుకు వెళ్ళేవాళ్ళం. ఒక గంట క్లాస్ ఆయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పెరుగన్నమో లేక టిఫిన్ చేసేసి తిరిగి ఎనిమిది గంటల కల్లా కాలేజికి వెళ్ళిపోయేవాళ్ళం...

ఒంటి మామిడి జంక్షన్ నుండి గాంధీనగర్ పార్క్ మీదుగా రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో గాంధీనగర్ మార్కెట్టు దగ్గర సౌజన్య రెస్టారెంట్ అనే హోటల్ ఒకటి ఉండేది.. మా జట్టుగాళ్ళ అందరికీ అది అప్పుడు మంచి ఫేమస్ హోటల్... అక్కడ మైసూర్ బజ్జీ, అరటికాయ బజ్జీ, సేమియా టిఫిన్ ఇలాంటివి ఉండేవి..   అప్పటి వరకు పల్లెటూరిలో పెరిగిన నాకు ఇడ్లీ, పెసరట్టు, మినపట్టు, ఉప్మా ఇలాంటి సంప్రదాయక టిఫిన్స్ తప్ప మిగతావి తెలియవు.

అప్పుడు మా దగ్గర డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవి కాదు. అందుకని మా దగ్గర డబ్బులున్నప్పుడే ఎక్కువ టోకెన్స్ తీసుకొనేసేవాళ్ళం. అప్పుడు కౌంటర్ దగ్గర ఒకతను కూర్చుని టిఫిన్ టోకెన్స్ అమ్మేవాడు. ఆ టోకెన్ తీసుకొని లోపలకెళ్ళి టిఫిన్ తీసుకోవాలన్న మాట.  అప్పుడు మైసూరు బజ్జీ ప్లేట్ ధర ఐదు రూపాయలు.  వాటిని రోడ్డు మీద 60 కి.మీ.ల వేగంతో బైక్ మీద రయ్యిన దూసుకుపోయేవాడికి కూడా క్షణకాలంలోనైనా చూపుని ఒక్కసారి వాటి వైపు తిప్పుకోనేలా చేసే విధంగా బయటికి కనిపించేలా పెట్టేవారు. ఇక సైకిల్ మీద వెళ్ళే నాలాంటి వాడి గురించి చెప్పక్కలేదు కదా... 
ఉదయం ట్యూషన్ అవగానే తిన్నగా సౌజన్య రెస్టారెంట్ కి వెళ్ళడం, ముందుగా మైసూర్ బజ్జీల స్టాల్ చూడడం, అందులో ఎర్రని కార్క్ బాల్స్ తలదన్నే విధంగా బజ్జీలను చూసి  తృప్తిగా తలాడించి టోకెన్ తీసుకొని కడుపారా తినేయడం, తిరిగి ఇంటికి ఏమి ఎరగనట్టు వెళ్ళి అక్కడ పెట్టిన టిఫిన్ కూడా తినేయడం ఇలా ఉండేది నా టిఫిన్ దినచర్య... బయట తిన్నామని తెలిస్తే అమ్మ తోలు తీస్తుందని భయపడి ఇంట్లో చెప్పేవాడిని కాదు. ఒక్కోసారి రెండు సార్లు (సౌజన్యలోను, ఇంటిదగ్గరనూ) టిఫిన్ చేయడం కొన్ని సార్లు భారంగా అనిపించేది.

మా దగ్గర ఎప్పుడయినా డబ్బులున్నప్పుడు ఖర్చు ఆయిపోతాయని చెప్పి నాలుగు ఐదు టోకెన్స్  ఒకసారే కొనేసుకునేవాళ్ళం (హూ.. తెలివితేటలు)....  ఆ విధంగా డబ్బులు లేని రోజుల్లో తినాలనిపించినపుడు ముందుగా కొనుక్కొని దాచుకొన్న టోకెన్స్ పట్టుకెళ్ళ్లి తినేవాళ్ళం....
మేము ఒకేసారి ఐదారు టోకెన్స్ కొని పట్టుకుపోవడం వలన ఆ హోటల్ మేనేజర్ దగ్గర రోజూవారీ లెక్క చూసుకుంటే టోకెన్స్ తక్కువగా ఉండేవి. దాంతో టొకెన్స్ రద్దు చేసేసి, టిఫిన్ తిన్న తర్వాత బిల్లు పేమేంట్ చేసే సిస్టం ఏర్పాటు చేసాడు. దానితో మా టోకెన్స్ ప్లాన్ బెడిసికొట్టింది. అప్పటికి నా దగ్గర ఎనిమిది టోకెన్స్ ఉన్నాయి మరి!!! ఇదంతా మైసూర్ బజ్జీల మీద ఉన్న పిచ్చే...

ఇక డిగ్రిలోకి వచ్చిన తర్వాత జేబులో డబ్బులకి ఇబ్బంది లేకపోయేసరికి ట్వంటీ-ట్వంటీల్లో సిక్సర్ లకు కొదవలేనట్లు మా మైసూర్ బజ్జీ తిండికి కొరత లేకుండా పోయింది. అప్పటికే తినకండిరా మొర్రో అని ఎంత మంది చెప్పినా మనకి వినిపించలేదు.  ఇంట్లో అమ్మ కూడా నా చేత మైసూర్ బజ్జీలు తినిపించడం మానిపించాలని కంకణం కట్టుకొని ఇంట్లోనే చేయడం మొదలెట్టారు. ఇంతకీ నేను మైసూర్ బజ్జీలు తింటున్నాని అమ్మకి ఎలా తెలిసిపోయిందే నాకు తెలియదు.  కానీ అవి ఎర్రని కార్క్ బాల్స్ వలె కాకుండా నిమ్మకాయ డిప్పల్లా ఉండి హోటల్ చేసే విధంగా టేస్ట్ వచ్చేవి కావు. ఇక మన వల్ల కాదని చూసి చూసి మా అమ్మ పట్టించుకోవడం మానేసింది.

అప్పటికే నా ముఖం నిండా మన సర్కారీ రోడ్ల వలే అడుగు అడుగ్కి గుంతలు(మొటిమలు) పడిపోయాయి. మొటిమలు తగ్గేవరకు వాటి జోలికి వెళ్ళడం మానేసి శుభ్రంగా ఇంట్లో చేసిన టిఫిన్స్ చేసేవాడిని. మొటిమలు పోగానే మరల మామూలే...   తినగా తినగా పంచదార కూడా చేదేక్కినట్టు నాకు కూడా మైసూరు బజ్జీలను త్యజించలన్న కోరిక కల్గింది. వెంటనే దానిని అమలులో పెట్టడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఎంత ఇదిగా మనసు లాగినప్పటికి నిగ్రహం చేసుకొని హోటల్స్ వైపు వెళ్ళడం మానివేసాను. రోజూ ఇంట్లో టిఫిన్స్ మాత్రమే తింటుండంతో మా అమ్మ కూడా చాలా సంతోషించింది. మైసూర్ బజ్జీలు మానేయడం వల్ల నా ముఖం కూడా వాజ్ పేయి గారి స్వర్ణ చతుర్బజి రహదారుల వలె గుంతలు పోయి నున్నగా తయారయ్యాయి...

కానీ హోటల్స్ వారు ద్రోహులు.. వాటిని బయటకు కనిపించేలా అద్దాల షోకేస్లో పెట్టి రోడ్డు మీద అటుగా పోతున్న నన్ను రా.. రమ్మని అంటూ ఊరించడం.. ఎంత అర్జెంటు పని ఉన్నప్పటికీ, ఆ పనులన్నింటికి విరామం ప్రకటించి తోక ఊపుకుంటూ పోయి పుల్లుగా మొక్కటం ఎన్ని సార్లు జరిగిందో లెక్క కట్టాలంటే జగన్ ఆక్రమాస్దులను లెక్కకట్టడమంతా కష్టం....  కొన్ని సార్లు ఇంట్లో ఎవరూ లేక తప్పని సరయి టిఫిన్ కి బయటకు వెళ్ళవలసివచ్చేది. అప్పుడు ముందుగానే తినకూడదని కమిట్ ఆయి వెళ్ళేవాడిని. ఫలనా టిఫినే తినాలని నిశ్చయించుకొని హోటల్లో ఒక టేబుల్ ముందు కూర్చుని వెయిటర్ కోసం వెయిట్ చేస్తుంటే,  దురదృష్ట దేవత నాప్రక్కనే కూర్చునట్టు నా ప్రక్కన్ కూర్చున్నోడు మైసురు బజ్జీలు తింటూ కనబడడం, ఈ లోగా వచ్చిన వెయిటర్ కి ఇడ్లి అర్డర్ అనబోయి, నాకు తెలియకుండానే ఇ..... డీ..డీ.. మైసూరు బజ్జీ ఒక ప్లేట్ అనేవాడిని.... అలా ఉండేది నా కమిట్ మెంటు......

తర్వాత అమ్మ మా సొంత ఊరికి వెళ్ళిపోవడం, నేను జాబ్ రీత్యా కాకినాడలోనే ఉండవలసిరావడంతో ఎమ్.సి.ఎ. చదువుతున్న మా ఊరి కుర్రాళ్ళు కొంత మంది అదిత్య కాలేజి దగ్గర రూమ్ తీసుకొనే ఉండేవారు. నేను వారితో జాయిన్ ఆయిపోయాను. ఆ రూమ్ దగ్గరల్లోనే ఒక ముసలాతను, ముసలమ్మ కలిసి చిన్న హోటల్ నిర్వహించేవారు. అందులో టిఫినులు అన్నీ చాలా బాగుండేవి. ముఖ్యంగా ఊతప్పం ఉండేదండీ అక్కడ.. చూడగానే నోటిలో నీరు ఊరేది.... ఆ టేస్ట్ నేను చెప్పితే తెలెసేది కాదుగానీ మీకు.. వదిలేయండి... అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ ముసలాళ్ళు మైసూర్ బజ్జీలు కూడా వేసేవారు. లంచ్ & డిన్నర్ లోకి రోజూ వరి అన్నం ఎంత కామనో, ఉదయం టిఫిన్ కి మైసూర్ బజ్జీ అంత కామన్ ఆయిపోయింది....
ఇక ఇలాయితే లాభం లేదని చెప్పి రూమ్ లోనే ఉండిపోయి టిఫిన్ తెప్పించుకొనేవాడిని. ఆ విధంగా మైసూర్ బజ్జీలు జోలికి వెళ్ళకుండా ఉన్నాను. ఒక రోజు, రెండు రోజులు కాదు... ఏకంగా రెండు సంవత్సరాలు తినకుండా ఉన్నాను.

కాకినాడ మెయిన్ రోడ్డులో మసీదు సెంటరు దాటిన వెంటనే కుడివైపున భీమాస్ రెస్టారెంట్ అని ఒక హోటల్ ఉంటుంది.. అందులో సాంబారు చాలా అద్బుతంగా చేస్తారు.. కాకినాడ మొత్తమ్మీద కేవలం సాంబారు కోసమే ఆ హోటల్ వరకు వచ్చేవారు చాలా మంది ఉంటారు. అందులో నేను కూడా ఒకడినే... పొద్దున్నే ఏడింటికల్లా వాకింగ్ పూర్తి చేసుకొని వెళ్ళి సాంబారు ఇడ్లీ ఆర్డర్ వేసుకొని తింటే ఉంటుందండీ....అదిరిపోతుంది....  ఇక్కడే కాకుండా భానుగుడి సెంటర్ వద్దనున్ను వినాయక రెస్టారెంట్ లో కూడా సాంబారు బాగుంటుంది. కానీ భీమాస్ లోనే కొద్దిగా రుచి ఎక్కువగా ఉంటుంది.... ఇక్కడ సాంబారే కాదు.. చెట్నీ కూడా అదిరిపోతుంది. రెండు రకాల చెట్నీలు ప్రతి టేబులు మీద పెట్టబడి ఉంటాయి. మనం టిఫిన్ తినేటప్పుడు చెట్నీ కోసం పదేపదే సర్వర్ ని పిలవలసిన అవసరం లేదు. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కానీ బిల్లు కొద్దిగా ఎక్కువగా పడుతుంది... రేట్లు లెక్కలోకి తీసుకోకపోతే ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది.... సాంబారు ఇడ్లీ కోసం నాయుడుతో కలసి ప్రత్యేకంగా ఎన్ని సార్లు వెళ్ళిఉంటానో లెక్కేలేదు....

అప్పటికి భీమాస్ కి వెళ్ళి  చాలా రోజులు కావడం, వాతావరణం కూల్ గా ఉండడం మరియు ఇంట్లో వారు ఊరు వెళ్ళడంతో సాంబారు ఇడ్లీ కోసం భీమాస్ కి వెళ్ళాలని రెండు రోజులు ముందుగానే అనుకున్నాను. ఆ తర్వాతి రెండు రోజులూ ఎందుకనో అటు వెళ్ళడానికి కుదరలేదు. అనుకోకుండా ఒక రోజు వీలు చిక్కడంతో భీమాస్ కి వెళ్ళాను...  సాంబారు ఇడ్లీని అస్వాదించాలి, అస్వాదించాలి అనుకుంటూ కూర్చుని సర్వర్ కోసం ఎదురు చూస్తూ యధాలాపంగా ప్రక్కకు తిరిగి చూసాను. అక్కడ ఒక వెధవన్నర వెధవ కూర్చుని ఎర్రని కార్క్ బాల్ లా నిగనిగలాడిపోతున్న మైసూర్ బజ్జీ తింటున్నాడు.

సర్వర్ రావడం.. రెండు వెధవన్నర వెధవనయిన నేను మైసూర్ బజ్జీ అర్డర్ వేయడం ఆయిపోయింది..... సాంబారు ఇడ్లీ తినడానికి వచ్చిన నేను రెండేళ్ళ తర్వాత మళ్ళీ బుక్ ఆయిపోయాను....

అందుకే ఏదో చేయాలనుకోవడం.. చివరకి మైసూర్ బజ్జీకి బలయిపోవడం... అందుకే అర్జంటుగా నిషేదించేయాలి..