Thursday, 16 May 2013

పరిణయం


పరిణయం....
 
 
చిన్నప్పుడు...
 
చిన్నప్పుడు సెలవుల్లో కొబ్బరి ఆకులతో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు బొమ్మలను తయారుచేసి వాటికి చిన్న గుడ్డ పీలికలు బట్టలుగా చుట్టి పీటపై ఉంచి పిల్లలందరూ గుంపులుగా చుట్టుప్రక్కల ఇళ్ళకు ఊరేగింపుగా తీసుకెళ్ళి, వారు ఇచ్చే తినుబండారలను చివర్లో అందరం సమానంగా పంచుకోనేవాళ్ళం.....
 
కొద్దిగా పెద్దయినపుడు....
 
ఊర్లో ఎవరి ఇంట్లో ఆయిన పెళ్ళి ఉందంటే ఆ ఇంటి మీద మైకా (పాటల వినిపించే సాధనం) (మేము అలానే పిలిచేవాళ్ళం) (ఇప్పటికీ దానిని ఏమంటారో నాకు ఐడియాకి రావడం లేదు) నుండి పెద్ద సౌండ్ తో సినిమా పాటలు వినిపించేవి. ఆ పాటలు ఎక్కడి నుండో వస్తున్నాయో అన్నదాన్ని బట్టి పెళ్ళి సందడి ఎక్కడో అందరికీ తెలిసిపోయేది....
 
ఇంకొద్దిగా పెద్దయినపుడు....
 
ఊర్లో ఎవరిదయినా పెళ్ళంటే ఎంత సంతోషమో... ఎందుకంటే అప్పట్లో పెళ్ళిళ్లలకు ఆరుబయట తెర కట్టి సినిమాలు ప్రదర్శించేవారు. మాకు అప్పుడు అదే పెద్ద గొప్పగా ఉండేది.. ఆ రోజుల్లో మా ఊరిలో ఇంకా సినిమా ధియేటర్ లేదు. కాబట్టి ఎక్కడన్నా పెళ్ళి ఉందంటే ఆ రాత్రికి సినిమా ఉంటుందని ఫిక్స్ ఆయిపోయేవాళ్ళం. సినిమా ప్రారంభానికి గంట ముందే వెళ్ళిపోయి చాపలు, గోనేసంచిలు వేసుకొనేవాళ్ళం......
 
మనం కూడా పోటుగాళ్ళం రా అని అనుకున్నప్పుడు....
 
చుట్టాల్లో ఎవరిదయినా పెళ్ళంటే పండగే... ఎందుకంటే పెళ్ళి పేరు చెప్పి ప్రక్క ఊరు వెళ్ళొచ్చు. స్కూలుకు డుమ్మా కొట్టొచ్చు. పెళ్ళికి వెళ్ళివచ్చిన తర్వాత ఒక రెండు రోజుల పాటు మనం పెద్ద హిరో టైపు లెక్క.. ఎందుకంటే అక్కడ జరిగనవి, జరగనివి గొప్పగా చెప్పడమే మన పని.....
 
ఇంటర్ లో ఉన్నప్పుడు.....
 
ఎక్కడయినా పెళ్ళి అంటే అదో సరదా... ఎందుకంటే మంచి ఫిగర్లు కనబడతారు కదా.... మనదయినా పర్లేదు లేదా ప్రక్కింటోడిది ఆయిన పర్లేదు... అమ్మాయిల కోసమైన వెళ్ళాలి........
 
 
డిగ్రిలో ఉన్నప్పుడు....
 
అసలు  పెళ్ళెందుకు చేసుకుంటారు రా బాబు.... అమ్మాయిలను అర్ద్రం చేసుకోవడం చాలా కష్టం.... డబ్బు ఉంటే చాలురా బాబూ... ఏ అమ్మాయి ఆయిన మన వెంట వచ్చేస్తుంది....  ఆయిన పెళ్ళి చేసుకోవడం కంటే బ్రహ్మచారిగా ఉండిపోవడమంతా ఉత్తమం ఇంకోకటి లేదురా బాబు.......
 
జాబులో ఉన్నప్పుడు.....
 
మా అమ్మ ఏంటిరా బాబు... ఇలా చంపేస్తుంది.... ప్రతి వెధవ పెళ్ళికి అటెండ్ అవ్వమని పోరు పెడుతుంది.. అమ్మ గోల పడలేక ప్రతి పెళ్ళికి అటెండ్ కావలసివస్తుంది.... ఎందుకొచ్చిన తలనొప్పో తెలియదు... అక్కడ పది మంది పలకరిస్తారు... ఏమి మాట్లాడతాము వాళ్ళతో.... 
 
కొద్ది కాలం తర్వాత....
 
రేయ్ అప్పుడే పెళ్ళేంటి రా నీకు.... అప్పుడే లైఫ్ మీద బోర్ కొట్టేసిందా నీకు... వెధవ.. లైఫ్ ఎంజాయ్ చేయడం మానేసి పెళ్ళి అంటు నీ గొడవ ఏంటి రా...... పెళ్ళికి రెడి ఆయిన చిన్ననాటి స్నేహితుడిని..
 
కుటుంబానికి దూరంగా బయట రూమ్ లో ఉన్నప్పుడు....
 
ఎవరిదయినా పెళ్ళి ఉంటే చూడండరా.... రూమ్ లో భోజనం తిని తిని నాలుక చచ్చిపోయింది. కొద్దిగా పెళ్ళి భోజనం తింటే జిహ్ఘ కొద్దిగానయిన తీరుతుంది......పైగా ఇప్పటికే పెళ్ళి వయసు వచ్చేసింది... ఇంక పెళ్ళి చేసుకోపోతే ఎవడూ మనకి పిల్లను ఇవ్వడు..... అందుకే పనిలో పనిగా ఎవరయినా అమ్మాయి కనబడితే పెద్దలతో మాట్లాడించేద్దాము...
 
ఇప్పుడు.....
 
నా పెళ్ళి... మా చుట్టాలమ్మాయి ఉషశ్రీ తో ఈ నెల 26 తేదిన వివాహం జరుగుతుంది.... ఆ అమ్మాయి చాలా మంచిది. నేను చాలా అదృష్టవంతుడిని అలాంటి మంచి అమ్మాయి నాకు దొరకడం.... మొత్తానికి ఇన్నాళ్ళకు మనకి మంచి రోజులొచ్చాయి... ఇక్కడ నుండి బయట తిండి తినవలసిన భాద తప్పుతుంది....
 
రేపు....
???????
?????????????
 
 
 

Tuesday, 23 April 2013

భలే భారతీయుడు- ఒక చిన్న జోక్


 
(పేస్ బుక్ తిరగేస్తుంటే శ్రీ సూర్యప్రకాశ్ జోస్యుల అనే వ్యక్తి టైమ్ లైన్ లో ఈ జోక్ కనబడితే, నచ్చి ఈ క్రింది యిస్తున్నాను) 

ఒక భారతీయుడు, ఒక అమెరికన్, ఒక పాకిస్థానీయుడు సౌదీ అరేబియాకు చెందిన విమానంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు.

వారు చేసిన నేరానికి శిక్షగా ఒక్కొక్కరికీ 20 కొరడా దెబ్బలు శిక్ష విధించారు అధికారులు.

వారు ముగ్గురూ శిక్షకు సిద్ధపడుతుండగా శిక్షను అమలుపరిచే షేక్ వచ్చి ఇలా ప్రకటించాడు.


“ఇవాళ నా ప్రియమైన మొదటి భార్య పుట్టిన రోజు.
 

కాబట్టి మీకు శిక్ష విధింవబోయే ముందుగా మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంది” అన్నాడు

మొదటిగా అమెరికన్ వంతు వచ్చింది.

అతను కొద్దిసేపు ఆలోచించి తన వీపునకు ఒక దిండును కట్టమన్నాడు.

కానీ దురదృష్టశావత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది.

మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.

తరువాత పాకిస్తానీ వంతు వచ్చింది.

తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు.

అతని దురుదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది.

తరువాత భారతీయుడి వంతు వచ్చింది.

అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుండి వచ్చావు.

మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు.

“మీ అభిమానానికి కృతజ్ణుణ్ణి.

నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడాదెబ్బలు కావాలి”

“చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు’ సరే నీ రెండో కోరిక ఏమిటి?”

.

.

.

.

.

.

.

 

“ఆ పాకిస్తాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.....”

ha..ha..

Monday, 22 April 2013

కావల్సినదేమిటి? కఠిన చట్టాలా- నైతిక విలువలా?

ఈ మధ్య కాలంలో మన దేశంలో అందునా రాజధాని నగరంలో వరుస బెట్టి మహిళలపై జరుగుతున్న దురాగతాలు భారతదేశ పరువును ప్రపంచం ముందు నడిబజారులో తీసివేసినట్టయింది....
ఇప్పుడు ఆ దురాగతాలు మహిళలకే కాకుండా అభం శుభం ఎరుగని చిన్నారులపై కూడా జరుగుతుండడంతో భారతదేశం ఎక్కడికిపోతుందన్న భయం కలుగుతుంది.....
వీళ్ళు చేసిన పనికి ఎంత భయం కలుగుతుందంటే... మన ఇంట్లో చిన్నపిల్లలను గమనించే చూపుల్లో ఏ చూపులో ఎటువంటి కౌర్యం ఉందో తెలియనంతగా...
లేదా వాళ్ళు చేసిన పనికి, మనకి తెలిసిన చిన్నపిల్లలను అపాయ్యంగా దగ్గరకు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేతంగా..
దీనికి కారణం మేమిటి? అకృత్యాలకు కఠిన చట్టాలు లేకపోవడమా? లేక మనలో నైతిక విలువలు లోపించడమా?
ఏది ఏమైనప్పటికి ఇది చాలా నిస్సిగ్గుకరమైన చర్య... ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఎంతో ఘనమైన చరిత్ర మరియు విజ్షాన సంపద కల్గిన అతి పురాతన దేశంలో నేడు ఇలాంటి పరిస్దితి దాపురించడానికి చాలా కారణాలున్నాయని అనిపిస్తుంది.....
కఠిన చట్టాలు లేకపోవడం వలనే ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయనీ, ఒక సారి కఠిన చట్టాలు తయారుచేసి సమర్దంగా అమలుచేస్తే ఇంకొకరు అలా చేయడానికి భయపడతారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందరూ చట్టంనకు దొరుకుతారనీ భావించలేము... ముఖ్యంగా చట్టానికి భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు కానీ, అవకాశం వస్తే తమలో పశుప్రవృత్తిని చూపించడానికి వెనకాడరు. ఎందుకంటే అది తప్పు అని వారికి వారు భావించనంత కాలం ఇలానే ఉంటుంది....
దీనికి విరుగుడుగా యువతలో నైతిక విలువలు పెంపోదించవలసిన భాధ్యత తల్లిదండ్రులు మీదే ఉంది.నైతిక విలువలను వారి మనసుల్లో నూరిపోయడం ద్వారా పెరిగిన యువతలో ఏది తప్పొ, ఏది ఒప్పో తెలుసుకోగలిగితే ఇలాంటి ఆకృత్యాలను నిలువరించవచ్చు.
మనలో చాలా మంది మన దేశ సంస్కృత్తిని నిర్లక్శ్యం చేయడం వలనే నేటి యువతలో ఒక రకమైన విష సంస్కృత్తి పెరుగుతుందనడం కాదనలేని సత్యం.... ఒక మనిషి మంచిగా లేదా చెడుగా తయారయ్యాడు అంటే అతని చిన్నతనంలో పెరిగిన వాతావరణం, లేదా నేర్చుకొన్న నైతిక విలువలను బట్టి ఉంటుంది...
ఒకప్పుడు పెద్దలు తమ పెంపకంలో పిల్లలకు ఖచ్చితంగా నైతిక విలువలు అలవడేలా పెంచేవారు. కాని నేడు నైతిక విలువలు నూరిపోయకుండా వారు కోరినది తెచ్చి పెడుతున్నారు....
మన దేశ సంస్కృతి,సంప్రదాయాలు పిల్లలను ఎలా పెంచాలన్నదాని మీద బోలెడన్ని సూచనలు చేసాయి. కానీ నేటి పెద్దలు ఆ సూచనలను పెడచెవిన పెట్టి పాశ్చాత ధోరణికి అలవాటు పడిపోయి యువతలో విచ్చలవిడితనంను పెంచి పోషిస్తున్నారు.తద్వారా యువత ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనే పరిపక్వత స్వయముగా సాధించలేకపోతున్నారు. ఫలితంగానే ఇలాంటి దారుణాలు మన పరువును గంగలో కలిపేస్తున్నాయి.
చట్టం ద్వారా చేయలేని పనిని నైతిక విలువలు పెంపోందించడం ద్వారా మాత్రమే చేయగలము.....
పెద్దలు తమ పిల్లలను సంప్రదాయాలకు అనుగుణంగా భారత దేశ సంస్కృతి తెలియజేయుచూ పెంచాలి. పెద్దలు తమ పిల్లలకు తాము కల్పిస్తున్న సౌకర్యాలు కన్నా నైతిక విలువలు ఏ మేరకు ఇవ్వగలుగుతున్నామో కూడా అలోచించుకోవాలి....
ఏ ఒక్క వ్యక్తి కూడా తనంతతానుగా నైతిక విలువలు అలవర్చుకోలేడు. ఎక్కడో కొంత మంది తప్ప....
ఒక మనిషి పశువులా ప్రవర్తించాడంటే, ఆ ప్రవర్తనకి ముందుగా తల్లిదండ్రులే భాద్యత వహించాలి... పెళ్ళి చేసుకొని సంసారం చేసి పిల్లలను కనేస్తే సరిపోదు... వారిని ఉత్తమంగా తీర్చగలగాలి. అలాంటి వారే పిల్లలను కనాలి... అంత ఓపిక,తీరిక లేని వారు పిల్లలను కనడమే మానివేయాలి....
 
 

Thursday, 28 March 2013

గుజారిష్ – నవరసాల వేదిక...


సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ తారాగణంగా తెరకెక్కిన సినిమా గుజారిష చూసారా మీరు?


బహుశా మూడు, నాల్గు ఏళ్ళ క్రితం వచ్చుంటుందేమో ఈ సినిమా.. అప్పుడు ఈ బ్లాగులు, వాగుడుకాయలు లేవు కాబట్టి పంచుకోవడానికి కుదరలేదు. (అప్పటికి బ్లాగులున్నాయి కానీ మనకి అంత నాలెడ్జి లేదు అని అర్ద్రం చేసుకోగలరు)...

గుజారిష్—ఎన్ని సార్లు చూసిన నాకు మళ్ళీ మళ్ళీ  చూడాలనిపించే అద్బుత క్లాసికల్ మూవీ అది...
నేను అప్పుడు మా ఊరిలో ఉండేవాడిని. ఈ సినిమా రిలీజయిందని తెలిసి కాకినాడ వెళ్ళి మరీ చూసానీ సినిమాను..... భన్సాలీ సినిమాను తెరకెక్కించిన విధానం.. హృతిక్ పాత్రకు జీవం పోసిన పద్దతి మాటల్లో చెప్పలేము..... చూసి ఆనందించవల్సిందే.....

కమర్షియల్, సూపర్ హిరో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన నేటి తరం హిరోల్లో ఎవరూ చేయలేని సాహసం హృతిక్ చేసాడనే చెప్పాలి.... నటుడు అంటే అన్ని రకముల పాత్రలు చేయగలగాలి. అంతే కాని కేవలం యంగ్రీమాన్,లవర్ బాయ్ పాత్రలు మాత్రమే కాదు. స్వర్గీయ ఎన్.టి.ఆర్., కమల్ హసన్ లాంటి కొంత మంది మాత్రమే  నటులనుపించుకొన్నారు. మిగతా వారందరూ కేవలం హీరోలు మాత్రమే అనిపించుకొన్నారు..... హిరోలందరూ నటులు కాదన్న సంగతి మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను...

ప్యాషన్ పరంగా, టెక్నిక్ పరంగా, కధనం పరంగా సరికొత్త పధములో దూసుకుపోతున్న బాలీవుడ్ లో గుజారిష్ లాంటి మూవీని ఎంచుకొని హౄతిక్ ఎంతో సాహాసం చేసాడని అనుకుంటున్నాను. అందులో అతని నటన చూస్తే, అతను నటనకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో గమనించవచ్చు.

కమర్షియల్ సినిమాలు ప్రతి హిరోకి దొరుకుతాయి. కానీ ఇలాంటి సినిమాలు చాలా కొద్ది మందికి మాత్రమే వస్తాయి. మెడ క్రింద భాగం మొత్తం చచ్చుబడిపోయిన మెజీషియన్ పాత్రలో హృతిక్ రోషన్ జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అతని నటన చూసి అందులో లీనమవడం చూసి హ్యాట్సాప్స్  చెప్పకుండా ఉండలేము. మాటలు కాని, చేతలు కానీ లేకుండా కేవలం హవభావాల ద్వారానే అన్ని రసములు పలికించడం సామాన్యమైన విషయం కాదని సినిప్రియులకు తెలుసు.....

ముఖ్యంగా ఒక ఈగ తన ముక్కు మీద వాలినపుడు మరియు ఒక రాత్రి వర్షానికి పై భాగము నుండి ఒక్కొక్కొ నీటి బొట్టు కారుచూ కరెక్ట్ గా నుదుటి మీద పడుతున్నప్పుడు సహయానికి అక్కడ ఎవరూ లేక ఆతను పడ్డ ఇబ్బంది, దానిని తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం మె.గు సీన్లు అద్బుతంగా ఉంటాయి. ఈ విధంగా సినిమా అద్యంతం హృతిక్ తన నటనతోనే మైమరపించగలడు. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నప్పుడూ, గ్రౌండ్ లో కొంతమంది ఆటగాళ్ళు పుట్ బాల్ అడుతున్నప్పుడు వారిని తదేకంగా చూడడం.... అలా చూస్తూ, చూస్తూ పరిగెడుతున్న అటగాళ్ళ కాళ్ళని చూడడం... తద్వారా మొహంలో అనేక భావాలు పలికించడం నిజంగా వండర్ పుల్.... భన్సాలీ టేకింగ్ కూడా మాటల్లో చెప్పలేము...

వీలయితే మీరు కూడా ఇప్పుడే చూడండి... నేను చెప్పింది వందశాతం నిజమని మీరు ఒప్పుకుంటారు.....