Tuesday, 26 November 2013

మృత్యువు – భయం



మృత్యువు అంటే ప్రతి ఒక్కడూ భయపడతారు.. కొంత మందైతే రాబోయే మృత్యువు కోసం ఇప్పటి నుండే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు....
మృత్యువు గురించి భయపడకూడదు. మృత్యువే మనల్ని చూసి భయపడే విధంగా మనం అన్నింటికి సిద్దమై ఉండగలగాలి. ఎవరు ఎంత భయపడినా లేక గింజుకున్నా రావాలనుకొన్న సమయంలో మృత్యువు మనల్ని వెతుక్కొంటూ వస్తుంది. దీన్ని ఎవరూ మార్చలేరు.... ఆపలేరు....

చదువుకొనే రోజుల్లో మృత్యువు గురించి నా పిలాసఫి ఇదీ.

మృత్యువంటే నేను ఏనాడూ భయపడేవాడిని కాదు. విపరీతమైన రద్దీగా ఉన్న రోడ్లపై బైక్ మీద వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు భయపడలేదు. కాకినాడ బీచ్ రోడ్డులో ఎన్నో సార్లు ప్రెండ్స్ తో బైక్ పోటిలు పెట్టుకొన్నప్పుడూ భయపడలేదు. ఎక్కడైనా భీభత్సమైన ప్రమాదం జరిగినపుడు అక్కడ ఉన్న రక్తసిక్తమయిన ప్రదేశమును చూసినప్పుడు గాని, రక్తమోడుతున్న క్రతగ్రాతులను చూసినపుడూ కూడా మృత్యువు గురించి ఆలోచించి భయపడలేదు.

మనమెందుకు భయపడాలి? భయపడితే మృత్యువు మన దగ్గరకి రావడం మానేస్తుందా? మా కొలీగ్ మురళి గారితో చాలా సార్లు ఈ విషయమై వాదించేవాడిని.  నా మాటలు విని ఆయన నవ్వి ఊరుకొనేవారు. ఒకసారి మా అన్నయ్యని బైక్ వెనకాలు కూర్చుబెట్టుకొని భీభత్సంగా డైవింగ్ చేయడం మొదలెట్టాను. నా డైవింగ్ కి తానేమీ భయపడలేదు కానీ, రేయ్ పెళ్ళాం, పిల్లలు ఉన్నోడిని కొద్దిగా జాగత్రగా చూసుకొని పోనియ్ రా అన్నాడు సౌమ్యంగానే...

అప్పుడు అన్నయ్య అలా అంటే నేను ఏమనుకొన్నాను? అన్నయ్యకి మృత్యువంటే ఎంత భయం! మనకు భూమ్మీద నూకలు చెల్లిపోయియుంటే మృత్యువుని ఎవరైనా తప్పించుకోగలరా! మృత్యువు రాసిపెట్టిఉంటే బైక్ మీద నెమ్మదిగా వెళ్ళినా, వేగంగా వెళ్ళినా పైకి పోవలసినదే కదా అనుకొన్నాను..

కొన్ని సార్లు బైక్ మీద నుండి పడి దెబ్బలు తగిలించుకొని పది రోజుల పాటు మంచం మీదే ఉన్నపుడు కూడా ఏమనిపించలేదే నాకు...

మరీ ఈ రోజు నా జీవితంలో తొలిసారి మృత్యువు గురించి భయపడ్డానేంటి? మృత్యువు గురించి ఒక రకమైన వైర్యాగం లాంటి ఫీలింగ్ వచ్చిందేమిటి?

రోజూలానే ఈ రోజు కూడా ఉదయమే లేచి వివేకానంద పార్క్ కి జాగింగ్ మరియు రన్నింగ్ కోసం బయలుదేరి వెళ్ళాను.  రెండు రౌండ్లు పూర్తి చేసి, మూడో రౌండ్ చేస్తున్నవాడిలా ట్రాక్ దగ్గర అల్లంత దూరంలో కొంత మంది మిగతా వాకర్స్ గుంపుగా ఉన్నారు. అందులో మురళి గారు కూడా ఉన్నారు. ఏంటబ్బా అంతమంది అక్కడ ఉన్నారు. ఏదో జరిగి ఉంటుంది అనుకొని గబాగబా చేరుకున్నాను అక్కడికి.  అక్కడకి ప్రక్కన ఉన్న టేబుల్ మీద ఒకాయన పడిపోయి ఉంటే మిగతా వాకర్స్ లో డాక్టరయిన ఒకాయిన ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు.

 మురళి గారిని అడిగాను ఏమయింది అన్నయ్య అని!

ఎవరో ఒక వాకర్ నడుస్తూ ఉన్నట్టుండి ముందుకు పడిపోయారు. తల నేలకు కొట్టుకోవడంతో చిన్న దెబ్బ తగిలింది అని చెప్పారు. ఒహ్.. అంతే కదా అనుకున్నాను... కానీ ఆయన అపస్మారకస్దితిలోకి వెళ్ళిపోవడంతో పార్క్ ఎదురుగా ఉన్న హస్పటల్ కి వెంటనే తీసుకెళ్ళి జాయిన్ చేసారు మిగతా వాకర్స్...
సరే అంతా బాగానే ఉంది కదా అనుకొని, నేను తిరిగి వాకింగ్ మొదలెట్టాను. ఇంకో రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అక్కడకి వచ్చేసరికి ఇందాకటి పడిపోయిన వాకర్ చనిపోయారని తెలిసింది.  ఆయన వయస్సు కూడా సుమారు 45 నుండి 50 లోపే ఉంటుంది. కారణం ఆయనకు ఆ సమయంలో హర్ట్ స్ట్రోక్ రావడం వల్లనని చూచాయగా తెలిసింది.

ఆ విషయం తెలిసి, ఎందుకో మనసులో చిన్న ఫీలింగ్ మొదలయింది. అప్పుడు మురళి గారు కూడా నాతోనే ఉన్నారు. ఉదయం నాలానే వాకింగ్ అని పార్క్ కి వచ్చిన ఆ వ్యక్తి, అంతలోనే ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా భాద కల్గించింది. నా ఆలోచన అతని యొక్క ఇంటి మీదకి వెళ్ళింది. బహుశా అతని కుటుంబ సభ్యులు వాకింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇలా విగతజీవిగా మారి వస్తాడని కలలో కూడా అనుకొని ఉండరు కదా అనిపించింది... వెంటనే నాలో మృత్యు భయం కల్గింది. నాకు కూడా ఏదో రోజు ఇలా జరగొచ్చుమో అన్న ఆలోచన నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేలా చేసింది....

ఎందుకంటే నాకు పెళ్ళయింది కాబట్టి... నన్ను నమ్ముకొని నా అర్దాంగి ఉంది కాబట్టి.......

ఒక్కప్పుడు నా స్వార్దం మాత్రమే చూసుకొనేవాడిని. నాకేమయినా అయితే ఏంటి? లేకపోతే ఏంటీ అనే తెగింపు ఉండేది. అందుకే ఏనాడూ మృత్యువు గురించి భయపడలేదు. కానీ ఈ రోజూ నేను నా కోసం కాకుండా నా అర్దాంగి కోణంలో ఆలోచించి మృత్యువుకి భయపడవలసివచ్చింది...

నిజమే.. చాలా మందిలానే నేను కూడా మృత్యువుకి ఇప్పుడు భయపడుతున్నాను ..... నేను ఏమయిపోతానన్న భయం మాత్రం కాదు.....



Saturday, 23 November 2013

మైసూర్ బజ్జీలను నిషేదించాలి...... అంతే...



పై పోటో చూస్తుంటే మీకేమనిపిస్తుందండీ... నోరు ఊరుతుందా.. మహా అయితే కుదిరినప్పుడు ఒకసారి తినాలనుకుంటారు అంతే కదా..... అదే నాకయితే ఏమనిపిస్తుందే తెలుసా... యమ అర్జంటుగా మైసూర్ బజ్జీలను నిషేధించేయాలి అనిపిస్తుంది....

అవునండీ మైసూర్ బజ్జీలను అన్ని హోటల్స్ లోని నిషేదించాలి. కుదరకపోతే మైసూర్ బజ్జీలు బాగా వేసే హోటల్స్ లో నైనా అర్జంటుగా నిషేదించేయాలండీ....

కొంత మంది అల్కహల్ కి బానిస ఆవుతారు, సిగరెట్టు తాగడానికి బానిస ఆవుతారు, డ్రగ్స్ కి బానిస ఆవుతారు, అమ్మాయిలకు బానిస ఆవుతారు, పేకాటకి బానిస ఆవుతారు... కానీ నేనేమిటండీ బాబూ... మైసూర్ బజ్జీలకు బానిసను ఆయిపోయాను.

ఎంతంత పని చేస్తుందండీ అది...  అరోగ్యానికి మంచిది కాదు, అవి తింటే త్వరగా జీర్ణం కాదు తద్వారా అకలి పుట్టదు, పైగా నూనెలో వేసి కాగుతారు కాబట్టి ఆయిల్ వుడ్ తినకూడదు అన్ని డాక్టర్లు ఆయినవారు మరియు డాక్టర్లు కానివారందరూ కూడా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతుంటే ఎన్ని సార్లు  కమిట్ అయ్యాను! ఇక చచ్చినా మైసూర్ బజ్జీలు తినకూడదు అని....

కానీ ఏమయింది??...
నేను చావలేదు కానీ, మైసూర్ బజ్జీలు తినడం మాత్రం అపలేదు....

చిన్నప్పుడు ఎంత బాగుండేదండీ.... శుభ్రంగా చద్దన్నం తిని అందులో నంజుకోవడానికి ఒక చిన్న బెల్లం ముక్కో లేక అవకాయ ముక్కో పడేస్తే ఎంత ఆనందంగా తినేవాళ్ళం.... ఆ చద్దన్నం చల్లదనం పాఠశాల మధ్యాహ్నం బెల్ కొట్టేవరకు ఉండేది..... పదవ తరగతి వరకు అదే ఆనందం... అప్పుడపుడు శుభ్రంగా రోట్లో రుబ్బిన పప్పుతో వేసిన మినప అట్లు, ఇడ్లీలు, పెసరట్టులు ఎంత రుచికరంగా ఉండేవి.... రోజూ చద్దన్నం తినేవాళ్ళమేమో కానీ, అప్పుడప్పుడు చేసే ఇలాంటి టిఫిన్స్ తింటే ఆ ఆనందానికి ఏ స్వర్గం సరిపోతుందండీ! ఇప్పుడంత టేస్ట్ ఎక్కడ ఏడ్చింది రోజూ మేసే టిఫిన్స్ లో.. అంతా గ్లెండర్ లోనో లేక మిక్సిలోనే ఆడించేయడమే......

నా పదవ తరగతి ఆయిపోయేంత వరకూ మైసూర్ బజ్జీ అనే ఒక టిఫిన్ ఉందనీ కూడా నాకు తెలియదు. మా ఊరిలో ఉన్న చిన్న హోటల్లో అలాంటి గడ్డిని ఎప్పుడూ పెట్టలేదులెండి... అందుకని మాకు తెలియలేదు... ఇక ఇంటర్ చదువు కోసం కాకినాడకి వచ్చి పడ్డాను చూసారా! అప్పుడు పరిచయం ఆయింది మైసూర్ బజ్జీ... మిగతా టిఫిన్స్ తో పోల్చుకుంటే గొప్పగా లేకపోయినా ఎందుకో అదంటే పిచ్చి.. నాకే కాదు నా జట్టుగాళ్ళకు అందరికి కూడాను.

కాకినాడలోని ఇంద్రపాలెం వద్ద నున్న ఐడియల్ కాలేజిలో జాయిన్ అయ్యాను ఇంటర్ కోసం. మా ఇల్లేమో గాంధీనగర్ లోని ఒంటి మామిడి సెంటర్ దాటిన తర్వాత ఉన్న తిరుమలరావు వారి వీధిలో ఉండేది.  ఉదయం ఆరు గంటలకే ఫిజిక్స్ ప్రెవేటు చెప్పించుకోవడానికి అచ్యుతపురం గేటు అవతలి వైపుకు వెళ్ళేవాళ్ళం. ఒక గంట క్లాస్ ఆయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పెరుగన్నమో లేక టిఫిన్ చేసేసి తిరిగి ఎనిమిది గంటల కల్లా కాలేజికి వెళ్ళిపోయేవాళ్ళం...

ఒంటి మామిడి జంక్షన్ నుండి గాంధీనగర్ పార్క్ మీదుగా రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో గాంధీనగర్ మార్కెట్టు దగ్గర సౌజన్య రెస్టారెంట్ అనే హోటల్ ఒకటి ఉండేది.. మా జట్టుగాళ్ళ అందరికీ అది అప్పుడు మంచి ఫేమస్ హోటల్... అక్కడ మైసూర్ బజ్జీ, అరటికాయ బజ్జీ, సేమియా టిఫిన్ ఇలాంటివి ఉండేవి..   అప్పటి వరకు పల్లెటూరిలో పెరిగిన నాకు ఇడ్లీ, పెసరట్టు, మినపట్టు, ఉప్మా ఇలాంటి సంప్రదాయక టిఫిన్స్ తప్ప మిగతావి తెలియవు.

అప్పుడు మా దగ్గర డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవి కాదు. అందుకని మా దగ్గర డబ్బులున్నప్పుడే ఎక్కువ టోకెన్స్ తీసుకొనేసేవాళ్ళం. అప్పుడు కౌంటర్ దగ్గర ఒకతను కూర్చుని టిఫిన్ టోకెన్స్ అమ్మేవాడు. ఆ టోకెన్ తీసుకొని లోపలకెళ్ళి టిఫిన్ తీసుకోవాలన్న మాట.  అప్పుడు మైసూరు బజ్జీ ప్లేట్ ధర ఐదు రూపాయలు.  వాటిని రోడ్డు మీద 60 కి.మీ.ల వేగంతో బైక్ మీద రయ్యిన దూసుకుపోయేవాడికి కూడా క్షణకాలంలోనైనా చూపుని ఒక్కసారి వాటి వైపు తిప్పుకోనేలా చేసే విధంగా బయటికి కనిపించేలా పెట్టేవారు. ఇక సైకిల్ మీద వెళ్ళే నాలాంటి వాడి గురించి చెప్పక్కలేదు కదా... 
ఉదయం ట్యూషన్ అవగానే తిన్నగా సౌజన్య రెస్టారెంట్ కి వెళ్ళడం, ముందుగా మైసూర్ బజ్జీల స్టాల్ చూడడం, అందులో ఎర్రని కార్క్ బాల్స్ తలదన్నే విధంగా బజ్జీలను చూసి  తృప్తిగా తలాడించి టోకెన్ తీసుకొని కడుపారా తినేయడం, తిరిగి ఇంటికి ఏమి ఎరగనట్టు వెళ్ళి అక్కడ పెట్టిన టిఫిన్ కూడా తినేయడం ఇలా ఉండేది నా టిఫిన్ దినచర్య... బయట తిన్నామని తెలిస్తే అమ్మ తోలు తీస్తుందని భయపడి ఇంట్లో చెప్పేవాడిని కాదు. ఒక్కోసారి రెండు సార్లు (సౌజన్యలోను, ఇంటిదగ్గరనూ) టిఫిన్ చేయడం కొన్ని సార్లు భారంగా అనిపించేది.

మా దగ్గర ఎప్పుడయినా డబ్బులున్నప్పుడు ఖర్చు ఆయిపోతాయని చెప్పి నాలుగు ఐదు టోకెన్స్  ఒకసారే కొనేసుకునేవాళ్ళం (హూ.. తెలివితేటలు)....  ఆ విధంగా డబ్బులు లేని రోజుల్లో తినాలనిపించినపుడు ముందుగా కొనుక్కొని దాచుకొన్న టోకెన్స్ పట్టుకెళ్ళ్లి తినేవాళ్ళం....
మేము ఒకేసారి ఐదారు టోకెన్స్ కొని పట్టుకుపోవడం వలన ఆ హోటల్ మేనేజర్ దగ్గర రోజూవారీ లెక్క చూసుకుంటే టోకెన్స్ తక్కువగా ఉండేవి. దాంతో టొకెన్స్ రద్దు చేసేసి, టిఫిన్ తిన్న తర్వాత బిల్లు పేమేంట్ చేసే సిస్టం ఏర్పాటు చేసాడు. దానితో మా టోకెన్స్ ప్లాన్ బెడిసికొట్టింది. అప్పటికి నా దగ్గర ఎనిమిది టోకెన్స్ ఉన్నాయి మరి!!! ఇదంతా మైసూర్ బజ్జీల మీద ఉన్న పిచ్చే...

ఇక డిగ్రిలోకి వచ్చిన తర్వాత జేబులో డబ్బులకి ఇబ్బంది లేకపోయేసరికి ట్వంటీ-ట్వంటీల్లో సిక్సర్ లకు కొదవలేనట్లు మా మైసూర్ బజ్జీ తిండికి కొరత లేకుండా పోయింది. అప్పటికే తినకండిరా మొర్రో అని ఎంత మంది చెప్పినా మనకి వినిపించలేదు.  ఇంట్లో అమ్మ కూడా నా చేత మైసూర్ బజ్జీలు తినిపించడం మానిపించాలని కంకణం కట్టుకొని ఇంట్లోనే చేయడం మొదలెట్టారు. ఇంతకీ నేను మైసూర్ బజ్జీలు తింటున్నాని అమ్మకి ఎలా తెలిసిపోయిందే నాకు తెలియదు.  కానీ అవి ఎర్రని కార్క్ బాల్స్ వలె కాకుండా నిమ్మకాయ డిప్పల్లా ఉండి హోటల్ చేసే విధంగా టేస్ట్ వచ్చేవి కావు. ఇక మన వల్ల కాదని చూసి చూసి మా అమ్మ పట్టించుకోవడం మానేసింది.

అప్పటికే నా ముఖం నిండా మన సర్కారీ రోడ్ల వలే అడుగు అడుగ్కి గుంతలు(మొటిమలు) పడిపోయాయి. మొటిమలు తగ్గేవరకు వాటి జోలికి వెళ్ళడం మానేసి శుభ్రంగా ఇంట్లో చేసిన టిఫిన్స్ చేసేవాడిని. మొటిమలు పోగానే మరల మామూలే...   తినగా తినగా పంచదార కూడా చేదేక్కినట్టు నాకు కూడా మైసూరు బజ్జీలను త్యజించలన్న కోరిక కల్గింది. వెంటనే దానిని అమలులో పెట్టడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఎంత ఇదిగా మనసు లాగినప్పటికి నిగ్రహం చేసుకొని హోటల్స్ వైపు వెళ్ళడం మానివేసాను. రోజూ ఇంట్లో టిఫిన్స్ మాత్రమే తింటుండంతో మా అమ్మ కూడా చాలా సంతోషించింది. మైసూర్ బజ్జీలు మానేయడం వల్ల నా ముఖం కూడా వాజ్ పేయి గారి స్వర్ణ చతుర్బజి రహదారుల వలె గుంతలు పోయి నున్నగా తయారయ్యాయి...

కానీ హోటల్స్ వారు ద్రోహులు.. వాటిని బయటకు కనిపించేలా అద్దాల షోకేస్లో పెట్టి రోడ్డు మీద అటుగా పోతున్న నన్ను రా.. రమ్మని అంటూ ఊరించడం.. ఎంత అర్జెంటు పని ఉన్నప్పటికీ, ఆ పనులన్నింటికి విరామం ప్రకటించి తోక ఊపుకుంటూ పోయి పుల్లుగా మొక్కటం ఎన్ని సార్లు జరిగిందో లెక్క కట్టాలంటే జగన్ ఆక్రమాస్దులను లెక్కకట్టడమంతా కష్టం....  కొన్ని సార్లు ఇంట్లో ఎవరూ లేక తప్పని సరయి టిఫిన్ కి బయటకు వెళ్ళవలసివచ్చేది. అప్పుడు ముందుగానే తినకూడదని కమిట్ ఆయి వెళ్ళేవాడిని. ఫలనా టిఫినే తినాలని నిశ్చయించుకొని హోటల్లో ఒక టేబుల్ ముందు కూర్చుని వెయిటర్ కోసం వెయిట్ చేస్తుంటే,  దురదృష్ట దేవత నాప్రక్కనే కూర్చునట్టు నా ప్రక్కన్ కూర్చున్నోడు మైసురు బజ్జీలు తింటూ కనబడడం, ఈ లోగా వచ్చిన వెయిటర్ కి ఇడ్లి అర్డర్ అనబోయి, నాకు తెలియకుండానే ఇ..... డీ..డీ.. మైసూరు బజ్జీ ఒక ప్లేట్ అనేవాడిని.... అలా ఉండేది నా కమిట్ మెంటు......

తర్వాత అమ్మ మా సొంత ఊరికి వెళ్ళిపోవడం, నేను జాబ్ రీత్యా కాకినాడలోనే ఉండవలసిరావడంతో ఎమ్.సి.ఎ. చదువుతున్న మా ఊరి కుర్రాళ్ళు కొంత మంది అదిత్య కాలేజి దగ్గర రూమ్ తీసుకొనే ఉండేవారు. నేను వారితో జాయిన్ ఆయిపోయాను. ఆ రూమ్ దగ్గరల్లోనే ఒక ముసలాతను, ముసలమ్మ కలిసి చిన్న హోటల్ నిర్వహించేవారు. అందులో టిఫినులు అన్నీ చాలా బాగుండేవి. ముఖ్యంగా ఊతప్పం ఉండేదండీ అక్కడ.. చూడగానే నోటిలో నీరు ఊరేది.... ఆ టేస్ట్ నేను చెప్పితే తెలెసేది కాదుగానీ మీకు.. వదిలేయండి... అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ ముసలాళ్ళు మైసూర్ బజ్జీలు కూడా వేసేవారు. లంచ్ & డిన్నర్ లోకి రోజూ వరి అన్నం ఎంత కామనో, ఉదయం టిఫిన్ కి మైసూర్ బజ్జీ అంత కామన్ ఆయిపోయింది....
ఇక ఇలాయితే లాభం లేదని చెప్పి రూమ్ లోనే ఉండిపోయి టిఫిన్ తెప్పించుకొనేవాడిని. ఆ విధంగా మైసూర్ బజ్జీలు జోలికి వెళ్ళకుండా ఉన్నాను. ఒక రోజు, రెండు రోజులు కాదు... ఏకంగా రెండు సంవత్సరాలు తినకుండా ఉన్నాను.

కాకినాడ మెయిన్ రోడ్డులో మసీదు సెంటరు దాటిన వెంటనే కుడివైపున భీమాస్ రెస్టారెంట్ అని ఒక హోటల్ ఉంటుంది.. అందులో సాంబారు చాలా అద్బుతంగా చేస్తారు.. కాకినాడ మొత్తమ్మీద కేవలం సాంబారు కోసమే ఆ హోటల్ వరకు వచ్చేవారు చాలా మంది ఉంటారు. అందులో నేను కూడా ఒకడినే... పొద్దున్నే ఏడింటికల్లా వాకింగ్ పూర్తి చేసుకొని వెళ్ళి సాంబారు ఇడ్లీ ఆర్డర్ వేసుకొని తింటే ఉంటుందండీ....అదిరిపోతుంది....  ఇక్కడే కాకుండా భానుగుడి సెంటర్ వద్దనున్ను వినాయక రెస్టారెంట్ లో కూడా సాంబారు బాగుంటుంది. కానీ భీమాస్ లోనే కొద్దిగా రుచి ఎక్కువగా ఉంటుంది.... ఇక్కడ సాంబారే కాదు.. చెట్నీ కూడా అదిరిపోతుంది. రెండు రకాల చెట్నీలు ప్రతి టేబులు మీద పెట్టబడి ఉంటాయి. మనం టిఫిన్ తినేటప్పుడు చెట్నీ కోసం పదేపదే సర్వర్ ని పిలవలసిన అవసరం లేదు. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కానీ బిల్లు కొద్దిగా ఎక్కువగా పడుతుంది... రేట్లు లెక్కలోకి తీసుకోకపోతే ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది.... సాంబారు ఇడ్లీ కోసం నాయుడుతో కలసి ప్రత్యేకంగా ఎన్ని సార్లు వెళ్ళిఉంటానో లెక్కేలేదు....

అప్పటికి భీమాస్ కి వెళ్ళి  చాలా రోజులు కావడం, వాతావరణం కూల్ గా ఉండడం మరియు ఇంట్లో వారు ఊరు వెళ్ళడంతో సాంబారు ఇడ్లీ కోసం భీమాస్ కి వెళ్ళాలని రెండు రోజులు ముందుగానే అనుకున్నాను. ఆ తర్వాతి రెండు రోజులూ ఎందుకనో అటు వెళ్ళడానికి కుదరలేదు. అనుకోకుండా ఒక రోజు వీలు చిక్కడంతో భీమాస్ కి వెళ్ళాను...  సాంబారు ఇడ్లీని అస్వాదించాలి, అస్వాదించాలి అనుకుంటూ కూర్చుని సర్వర్ కోసం ఎదురు చూస్తూ యధాలాపంగా ప్రక్కకు తిరిగి చూసాను. అక్కడ ఒక వెధవన్నర వెధవ కూర్చుని ఎర్రని కార్క్ బాల్ లా నిగనిగలాడిపోతున్న మైసూర్ బజ్జీ తింటున్నాడు.

సర్వర్ రావడం.. రెండు వెధవన్నర వెధవనయిన నేను మైసూర్ బజ్జీ అర్డర్ వేయడం ఆయిపోయింది..... సాంబారు ఇడ్లీ తినడానికి వచ్చిన నేను రెండేళ్ళ తర్వాత మళ్ళీ బుక్ ఆయిపోయాను....

అందుకే ఏదో చేయాలనుకోవడం.. చివరకి మైసూర్ బజ్జీకి బలయిపోవడం... అందుకే అర్జంటుగా నిషేదించేయాలి.. 




Thursday, 14 November 2013

ఢిల్లీ దారెటు?

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న అంశం ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే...

దానికి కారణం క్రేజివాల్ స్దాపించిన ఆమ్ అద్మీ పార్టీ..

 ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేసేందుకు కాంగ్రెసు మరియు భారతీయ జనతా పార్టీలతో సమానంగా ముందుకు దూసుకువస్తున్న నూతన పార్టీ.... దేశంలో చాలా మంది యువత చూపు ప్రస్తుతం ఆమ్ అద్మీ సాధించబోయే స్కోరు మీదే ఉంది...

ఏ రాజకీయ పార్టీలో చూసినా అవినీతిపరులే, ఎక్కడ నీతి ఉంది? ఎక్కడ నిజాయితీ ఉంది? అన్ని ప్రశ్నించేవారు ఎక్కువగా ఉన్న నేటి సమాజంలో ఇదిగో మేమున్నామంటూ ముందుకు వచ్చింది ఆమ్ అద్మీ పార్టి!



మన ఓటు- నిజాయితీపరులకే@ అన్న అంశంపై నా స్నేహితులతో డిస్కస్ వచ్చిన చాలా సందర్బాల్లో చాలా మంది ఒక్కటే చెప్పేవారు! అదేమిటంటే, ఇప్పుడున్న వారిలో ఎవరు నిజాయితీపరులు? అందరూ డబ్బులు తినేవాళ్ళే కదా? అలాంటప్పుడు ఎవరో ఒకరికి ఓటు వేయాల్సిందే! ఉన్న వాళ్ళల్లో కొద్దిగా తక్కువ అవినీతి చేసిన వాడిని(ఇందులో ఇదొక నిజాయితి) ఎన్నుకోక తప్పడం లేదు అనే వారు....

2009 ఎలక్షన్ల సమయంలో రాజశేఖర రెడ్డి అంతటి అవినీతిపరుడు లేడు. అక్కడ కేంద్రంలో యూపిఏ ప్రభుత్వము పీకిందేమి లేదు, అన్నింటా అవినీతే... పైగా కుంభకోణాలు పెరిగిపోయాయి, ధరలు పెరిగిపోయాయి, అవి పెరిగిపోయాయి, ఇవి నాశనమయిపోయాయి, జనాలు గురించి ఆలోచించేవాడొక్కడూ లేడు అని వాపోయారు కొంతమంది....

ఇంకొంత మందెమో చంద్రబాబునాయుడంతా విశ్వాసఘతుకుడు ఇంకెక్కడ లేడు. వాడికి నిలువెల్లా విషమే... వాడి మామకే వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగులను పీకి తింటాడు. వాడికి ఓటు వేస్తే మనం కొంత విషం తిన్నట్లే అన్నారు.....

ఆ సమయంలో వారికి లోక్ సత్తా పార్టిని సూచించాను.. జయప్రకాశ్ నారాయణ్ తన ఐ.ఎ.ఎస్. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతికి వ్యతిరేకంగా లోక్ సత్తా సంస్దను స్దాపించారు. తదనంతరం అప్పట్లో మొదటిసారిగా లోక్ సత్తా పార్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పాలుపంచుకుంది. చాలా మంది నిజాయితీపరులైన యువకులను రంగంలో నిలబెట్టింది. ప్రచారంలో డబ్బులు, మందు, తాయిలాలు పంచిపెట్టకుండా ఎలక్షన్స్ బరిలోకి దిగింది. తమ పార్టికి వచ్చిన విరాళాలను బహిరంగంపరిచింది. అంతే కాకుండా తమ అభ్యర్దుల ఎలక్షన్ ప్రచార ఖర్చులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు.

నిజాయితీగా చేసిన సదరు చర్యలు ప్రజలకేమి కనిపించలేదు. పైగా లోక్ సత్తా పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉండదు కాబట్టి ఆ పార్టికి ఓటు వేసినా ప్రయెజనం లేదని చెప్పుకొచ్చారు... అంటే ఇక్కడ చాలా మంది కోరుకుంటున్నది నిజాయితీపరులైన రాజకీయ నేతలను కాదని చాలా సులువుగా అర్ద్రం ఆవుతుంది. ఓటు వేసే మనలోనే అవినీతినేతల పట్ల ఎంతో కొంత అభిమానం ఉండి ఓటు వేయడం వేసి గెలిపించడం వల్లే కదా, ప్రజల సొమ్ము ప్రక్క దారి పడుతుంది!
(ఇప్పుడు లోక్ సత్తా పార్టి మీద చాలా మంది యువత గుర్రుగా ఉన్నారులెండి. అది వేరే విషయం)



చివరికి ఏమయింది... బాబుని విమర్శించేవారు రెడ్డికి, రెడ్డిని విమర్శించేవారు బాబుకి ఓట్లు వేసి దులిపేసుకున్నారు. మధ్యలో పానకంలో పుడకలా చిరంజీవి 18 సీట్లు కొల్లగొట్టి, తదుపరి కాలములో కాంగ్రెసు పార్టికి గుంపగుత్తగా ఆమ్మేసుకున్నాడు....

ఇలా ప్రభుత్వాలు, అవినీతినేతలు ప్రజలు సొమ్మును దుర్వినియెగం చేయడం, ఆ విషయమై ప్రజలు నేతలను అసహ్యించుకోవడం ఐదేళ్ళ పదవి కాలంలోని మామూలు వ్యవహరమే... తిరిగి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మరల వారికే పట్టం కట్టడం రివాజుగా మారింది....

ఇలాంటి వాటిని చూసి ఎక్కడో మండిన క్రేజివాల్ అనబడే ఒక ఐ.ఆర్.ఎస్. ఆఫీసర్ తన సర్వీసుని వదులుకొని దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరారు.. కొంత కాలం అన్నాహజారే అనే పెద్దాయన్ని వెంటబట్టుకొని “అవినీతికి వ్యతిరేకంగా భారత్” అనే నివాదాన్ని ఎత్తుకొని హడావుడి చేసారు. దానికి భారత్ లో పలు వర్గాలు, ముఖ్యంగా యువత మద్దతు ప్రకటించారు. పేసుబుక్కుల్లోను, ట్విట్టర్ లోనూ, మిగతా సామాజిక నెట్టువర్కుల్లోను హోరెత్తించారు. (ఇలాంటివన్నీ వినడానికి, ప్రక్కొడికి చెప్పడానికి మాత్రమే బాగుంటాయి. మనం స్వయంగా ఆచరించడానికి కష్టంలెండి అనే బాపతెక్కువ ఇందులో).  అలా చాలా కాలం పెద్దాయనతో కలసి కాంగ్రెసు ప్రభుత్వం మనసు మార్చేద్దాం... దేశ భవితని మార్చేద్దాం అని ఆశపడ్డారు.. కానీ అతని ఆశ అత్యాశ అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు! దానితో ఈయనే ఒక పార్టిని ఏర్పాటు చేసి ఎలక్షన్స్ లో పోటి చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని దున్నేయాలని కంకణం కట్టుకొని, అందులో మొదటి విడతగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి దిగారు.. అక్కడ ఎంపిక చేసిన అభ్యర్దుల సరాసరి వయస్సు 40 మాత్రమే.. అంటే మొత్తం యువ అభ్యర్దులనే ఎంచుకొన్నారు. పైగా వివిధ రంగాల్లో పనిచేసుకుంటున్న, ఎటువంటి అవినీతి మచ్చలేని నిజాయితీపరులైన యువకులు వారందరూ! అంతే కాకుండా ఒక్కొక్కొ నియెజకవర్గానికి ఆ ప్రాంతానికి తగ్గట్టు మేనిపోస్టో తయారుచేసుకొన్నారు. (మిగతా పార్టిలకు దేశమంతా ఒక్కటే మానిపోస్టో.. ఎందుకంటే మేనిపోస్టో ఏదైనా చివరికి చేసేది ప్రజల సొమ్ము తినడమే కదా).
 
ఆ విధంగా ఇప్పుడున్న కాలంలో నిజాయితీపరులు ఎవరున్నారు అని అమాయకంగా ప్రశ్నించే వారి కోసం, ఇదిగో అంటూ అమ్ అద్మీ పార్టిని ముందుకు తెచ్చారు క్రేజీవాల్...



పైగా తమ పార్టి గుర్తు ఆయిన చీపురుని గెలిపిస్తే అవినీతిని చీపురుతో మొత్తం ఊడ్చేస్తానని వాగ్దానమిచ్చారు.....

ఇక మిగతా పార్టిలు కాంగ్రెసు, బిజెపి గురించి కొత్తగా చెప్పేదెముంది?

మరి ఢిల్లీ ప్రజలు ఎవరికి దారి ఇస్తారో చూడాలి......

లోక్ సత్తా అధినేత, అమ్ అద్మీ అధినేత ప్రభుత్వ సర్వీసులను వదులుకొని వచ్చిన వారే... ఇద్దరూ ప్రజలను జాగృతం చేయడానికి పార్టిలను స్దాపించి ప్రజల తీర్పు కోరిన వారే.. అందులో జయప్రకాశ్ నారాయణ్ ముందుకు వెళ్ళలేకపోయారు. మరి క్రేజివాల్ ముందుకు వెళతారో, లేక వెనుకడుగు వేస్తారో వేచిచూడాలి.

ఢిల్లీ యువత సామాజిక నెట్ వర్కుల్లోను, ఇంటర్నెట్ లోను, రోడ్ల మీద అవినీతిరహిత భారత్ గురించి హోరెత్తించడం కాదు.... అసలైన ఆయుధం ఇప్పుడు చేతికి చిక్కింది.... ఆ ఆయుధంతోనే మనల్లి ఎప్పటి నుండో పీడిస్తున్న అవినీతి భూతంని, దాని మీద స్వారీ చేస్తున్నా నేతలని ఒక్క వేటుతో పడగొట్టి చంపేయాలి!


Wednesday, 30 October 2013

చుక్కల్లో అమ్మాయిలు.... విలువల పతనంలో అబ్బాయిలు...

చాలా కాలం తర్వాత తీరిక దొరకడంతో మా ప్రెండ్ నాయుడు, నేను కలసి తీరిగ్గా టీ తాగుతూ కూర్చుని బాతాఖానీ మొదలుపెట్టాము...

రెండు నెలల క్రితమే మేముంటున్న రూమ్ ని ఇద్దరం ఖాళీ చేసేసి నేను కొత్తగా మొదలెట్టిన జీవితంలోకి, తనెమో ఊర్లోనే ఉన్న ఇంకొక ప్రెండ్ ఇంటికి మారిపోవడంతో మా మధ్య బాతాఖానీలకు సరైన సమయం కుదరలేదు....

ఇలా తన విషయాలు, నా విషయాలు చెప్పుకోవడం ఆయిన తర్వాత లోకాభిరామాయణం మొదలెట్టాము.. రాజకీయాల నుండి మొదలెట్టి అనేక అంశాలు మాట్లాడుకొన్నాము. అందులో తెలంగాణా, రాష్ట్ర విభజన గురించి చాలా వాదనలు జరిగాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో రాష్ట్ర విభజన గురించి, తెలంగాణా గురించి అసలు మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాను. ఇక మిగిలిన దాంట్లో ఈ మధ్యన హైదరబాద్ లో జరిగిన అభయ ఉదంతం గూర్చి చర్చ జరిగింది.... దీని పై ఈ పోస్టుని చాలా రోజుల క్రిందటే రాసాను. కానీ పోస్ట్ చేయలేదు. ఎందుకనో చేయాలనిపించలేదు.. ఈ రోజు దీన్ని చూసిన తర్వాత పోస్ట్ చేయాలనిపించి చేస్తున్నాను..

అభయ ఉదంతం గురించి బయటకు వచ్చిన తర్వాత రోజు మా ప్రెండ్స్ కొందరు, ఈ విషయమై మాట్లాడుతూ సదరు ఉదంతం విషయమై అమ్మాయిదే తప్పంతా అన్నట్టుగా మాట్లాడారు. స్టాప్ వేర్ ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళు ఆఫీసు ఆయిపోయిన తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళిపోవడం మానేసి, రాత్రి వరకు షికార్లు, షాపింగులు అంటూ ఎవడు తిరగమన్నాడు అన్నట్టుగా వాదించారు. మరియు నాల్గు రోజుల వరకు పోలిస్ కంప్లైట్ యే ఇవ్వలేదు అన్నారు. అదే విషయం నాయుడు దగ్గర ప్రస్తావించాను...

అంటే ఏమి జరిగినా అమ్మాయిదే తప్పవుతుంది తప్ప, వెధవ పని చేసిన అబ్బాయిలది తప్పని మనకి అనిపించండం లేదా అని?  అర్దరాత్రి తిరగడం అమ్మాయిది మాత్రమే తప్పవుతుందా? అంటే అర్దరాత్రి అబ్బాయిలు ఏ విధంగా చేసిన అది సమ్మతం క్రింద లెక్క వస్తుందా?

నాయుడు కొద్దిగా నవ్వి, ఇందులో అమ్మాయిది, అబ్బాయిలది ఇద్దరిది తప్పే, అలాగని ఇద్దరిది తప్పు లేదు అన్నాడు...

నాకొద్దిగా కనుప్యూజ్ గా మరియు చిరాగ్గా అనిపించి, ఏంటింది అటూ, ఇటూ కాకుండా మాట్లాడుతున్నావు? ఇక్కడ తప్పంతా అబ్బాయిలది అని సృష్టంగా కనబడుతుంటే నువు అలా చెప్పడమేమి బాలేదన్నా....

అది కాదు బ్రదర్... మనం కాసేపు సమాజంలో ఉన్న వాస్తవ పరిస్దితుల గురించి మాట్లాడుకుందాం.. ఆ తర్వాత నీ అభిప్రాయం చెప్పు అన్నాడు.... సరే చెప్పు! అన్నట్టుగా తలాండిచించాను...


అబ్బాయి యుక్త వయసు వచ్చిన తర్వాత సరైన జోడి కొరకు చూస్తాడు.. కాదు ప్రయత్నిస్తాడు.. అది ప్రకృతి ధర్మం.. దానిని తప్పు బట్టలేము... అందుకే పూర్వ కాలములో యుక్త వయసు రాగానే అటు అబ్బాయికి, అమ్మాయికి పెళ్ళిళ్ళు చేసేసేవారు. అందుకే మన తాతల కాలములో అందరికి పదిహేను, పదహారు సం.లు నిండకుండానే పెళ్ళిళ్ళు ఆయిపోయాయి. అంత చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు కావడం వల్ల వారికి ప్రక్క దారి పెట్టే అవకాశం ఉండేది కాదు.

అలాగే ఏదైనా సందర్బంలో అమ్మాయి చనిపోతే, అతి కొద్ది సమయంలోనే మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోనేవారు తప్ప ఒంటరిగా మిగిలిపోయేవారు కాదు. ఎక్కడో ఒకరిద్దరు తప్ప... దాని వలన చాలా మందికి అమ్మాయి సానిహిత్యం కోసం ఎక్కడో వెతుక్కోవలసిన అవసరం ఉండేది కాదు... ఒక వేళ అంతగా కావలసి వచ్చిన పక్షంలో బయటకు వెళ్తే బోలెడన్నీ అవకాశాలు ఉండేవి... అంటే వేశ్య వాటికలకు వెళ్ళడం వంటివి.. ఆ రోజుల్లో ప్రతి ఏరియాకి  ఒక వేశ్య వాటిక ఉండేది...

దాని వలన ఒక మగాడు తన వాంచలు తీర్చుకోవడానికి ఇంట్లో ఇల్లాలు ఆయిన ఉండేది, లేకపోతే బయట వేశ్యవాటికైనా ఉండేది... దాని వలన బలత్కరాలు ఉండేవి కావు... అమ్మాయిలు అప్పుడు ఎక్కువగా స్వతంత్రంగా ఉండక పోవడం కూడా కొంత కారణం కాకపోవచ్చు. ఒక వేళ ఎక్కడికైనా వెళ్ళవలసివచ్చినా, తన తరపు బంధువులు ఎవరైనా రక్షణ లేకుండా బయటకు వెళ్ళేవారు కాదు.

రాను రాను తర్వాత కాలములో చాలా మంది పై చదువులకు వెళ్ళడం, మరియు విద్యాధికత పెరగడంతో యుక్త వయసులో పెళ్ళిళ్ళు జరగడం ఆగిపోయాయి. అలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటంతో వేశ్యావృత్తిని చట్టవిరుద్దంగా ప్రకటించడంతో క్రమంగా వేశ్యా వాటికలు కనుమరుగు ఆయిపోయాయి. ముందుగా అబ్బాయిలకు మాత్రమే ఉన్నత విద్య చదివించడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోనేవారు. చదువయిపోయిన తర్వాత వారికి తగిన అమ్మాయిని చూసి సంబందాలు చేయడం చేసేవారు. చదువుకున్న వాళ్ళకే కాకుండా, చదువుకొననివారికి, వివిధ వృత్తుల్లో ఉన్న వారికి కూడా అమ్మాయిలు సమృద్దిగా దొరికేవారు. అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తి సరయిన రీతిలో ఉండడంతో ఎవరికీ పెళ్ళిళ్ళు కావడానికి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.

ఇక ఆ తర్వాత కాలములో అమ్మాయిలను కూడా ఉన్నత విద్య చదివించడానికి పెద్ద కుటుంబాలు ముందుకు వచ్చాయి. ఆ తర్వాతర్వాత మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలు కూడా తమ అమ్మాయిలకి ఉన్నత విద్యని అందుబాటులోకి తెచ్చారు.

గతములో వైద్య శాస్ర్తం అభివృద్ది అంతగా లేనందున, మరియు ప్యామిలీ ప్లానింగంటూ ఏమి లేకపోవడం వలన అబ్బాయి, అమ్మాయి అంటూ లింగ బేధం ఉండేది కాదు. ఎంత మందిని కనగలిగితే అంత మందిని కనేయడమే.....
తర్వాత కాలములో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందడం, ఫ్యామిలీ ప్లానింగులు రావడంతో అబ్బాయి, అమ్మాయి పట్టింపులు ఎక్కువయ్యాయి.  బిడ్డ పుట్టడానికి ముందే కడుపులో ఉన్న బిడ్డ లింగం తెలిసిపోతుండంతో అబార్షన్ లు ఎక్కువయ్యాయి... క్రమంగా అర్దిక భారం మరియు యితర కారణాల వల్ల అబ్బాయిలు మాత్రమే కావాలనుకొనే దంపతులు విపరీతంగా పెరిగిపోయారు. దాని ఫలితం అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం....

అమ్మాయిల సంఖ్య ఎప్పుడయితే గణనీయంగా తగ్గిపోయిందో, అప్పటి నుండి అబ్బాయిల పెళ్ళిళ్ళకి  వధువుల కొరత వచ్చింది. పైగా అమ్మాయిలను చాలా మంది తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించడంతో, అమ్మాయిలకు కూడా తమ భాగస్వామిగా నచ్చిన వ్యక్తిని ఎంచుకోనే స్వేచ్చ వచ్చింది. చదువుకున్న అమ్మాయిలు తమ భాగస్వామిగా తన కన్నా పై స్దాయిలో ఉన్న అబ్బాయిలనే కావాలని కోరుకుంటున్నారు...

దానితో మిగతా అబ్బాయిలు పెళ్ళిళ్ళ కోసం సాదాసీదా చదువులు ఉన్న పల్లెటురి అమ్మాయిల కోసం క్యూ కడుతున్నారు.. అమ్మాయిలకు కొరత రావడంతో పల్లెల్లో చదవకుండా ఉండిపోయిన అమ్మాయిలకు కూడా చదువుకున్న అబ్బాయిల నుండి గిరాకీ పెరిగింది. దానితో చదువుకోకుండా ఉండిపోయిన నిరుద్యోగులు, యితర వృత్తిల వారికి త్రీవమైన అమ్మాయిల కొరత వచ్చింది.... ఇక అమ్మాయిలు చుక్కల్లో చందమామే ఆయింది వీళ్ళకి.

వయసు ముదిరిపోతున్నా కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఈ నాటికి పల్లెల్లో కుప్పలు తెప్పలుగా కనబడుతున్నారు. పెళ్ళి కాకుండా సొంత ఊళ్ళలో ఉండలేక హైదరబాద్, ముంబయి, చైన్నై లాంటి మహ నగరాలకు వలస పోతున్నారు. తమకి పెళ్ళి కాకపోవడం , లేదా అమ్మాయిల దొరకపోవడం అన్న విషయం వారిని ఒక రకమైన త్రీవమైన డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది. పైగా పెళ్ళి కాకపోవడం అన్నదాన్ని సమాజంలో చిన్నచూపుగా చూస్తున్నారు.  దాని వలన వారు కనిపించే ప్రతి అమ్మాయి మీద ఒక రకమైన కక్ష లేదా దేహ్యభావం పెంచుకుంటున్నారు.  అందుకే చాలా చోట్ల అత్యాచార సమయంలో హింసాత్మకంగా ప్రవరిస్తున్నారు. ఆ విధంగా తమ దుస్దితిని, సమాజంపై ఉన్న దుగ్దను ఆ అమ్మాయిని హింసించడానికి ప్రేరేపిస్తుంది.

తర్వాత ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు సరాసరిగా ఉండేవారు. దానితో వారికి చిన్నప్పటి నుండి కుటుంబంలో ఉన్న అమ్మ, చెల్లి, అక్క, వదిన, మరదలు ఇలా అమ్మాయిలతో మానసిక అనుబంధం ఉండడంతో బయట ప్రపంచంలో అమ్మాయిల పట్ల చెడు అభిప్రాయాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇద్దరు లేదా ఒకరు మాత్రమే సంతానం ఉన్న కుటుంబాలు వచ్చాయి. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆయితే పర్వాలేదు.  అదే ఇద్దరు అబ్బాయిలో లేదా ఒక్క అబ్బాయే సంతానమయితే, వాడికి ఆడపిల్లలతో అనుబంధమనేది లేకపోవడం/తెలియకపోవడం వలన బయటి ప్రపంచంలోని అమ్మాయిల పట్ల చులకనభావం ఉంటుంది. చిన్నప్పటి నుండి కుటుంబంలో సోదరి  ప్రాతినిద్యం లేకపోవడం వల్ల  బయటి ప్రపంచంలో అమ్మాయిలతో సరయిన అనుబంధం ఉండడం అరుదు... గౌరవించడం రాదు... అమ్మాయిలను గౌరవించడం అనేది మన కుటుంబం నుండే ప్రారంభం కావాలి.. కానీ అలా జరుగతుందా?

నైతిక విలువలు పతనమవడం. ఈ రోజు చాలా కుటుంబాల్లోని పెద్దలు తమ పిల్లలు ఏమి చేస్తున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? నైతిక విలువలు అబ్బుతున్నాయా? అన్న విషయాలను ఏ కోశానా పట్టించుకోవడం లేదు. దానితో పిల్లలకు నైతిక విలువలు భోదించేవారు, భయం చెప్పేవారే కరువయ్యారు. పోనీ కళాశాలలో, పాఠశాలల్లో గురువులు నైతిక విలువలు భోదిస్తున్నారా? అంటే అదీ లేదు... వాళ్ళల్లోనే నైతిక విలువలు దిగజారిపోయాయి. ఇక పిల్లలకు ఏమి చెబుతారు వాళ్ళు?

ఇక సినిమాలు, అంతర్జాలం.. యువతని పెడదారి పెట్టించడానికి కూతవేటు దూరంలో అన్ని రకములు సదుపాయలున్నాయి ప్రస్తుత కాలంలో...

ఇక అమ్మాయిలు గురించి.. చదువులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐదంకెల జీతాల కొలువులు కెరియర్ ప్రారంభంలో సాధించడం... మెట్రో సిటిల్లో మెజారిటి భాగం  నైతిక ప్రమాణాలను గాలికొదిలేసి సహ జీవనం పేరు చెప్పి ఒకటి కన్నా ఎక్కువ మందితో కలిసి ఎఫైర్స్ నడపటం... పేజ్ 3 లైఫ్ స్టైల్ కి అలవాటు పడడం.... వంటివి కూడా కొంత వరకు ఇలాంటి దారుణాలు జరగడానికి దోహదం చేస్తున్నాయి. వీరిని చూసి మిగతా అమ్మాయిలు ఆకర్షితులవడం మొ.వి కూడా.... ఇలాంటి అమ్మాయిలను చూసి మొత్తం అమ్మాయిలందరూ అంతే అన్న భ్రమల్లో ఉన్నారు చాలా మంది అబ్బాయిలు. సిటిల్లో ఉన్నా అమ్మాయిలందరూ ఇలానే ఉంటారు అనుకునే వాళ్ళే ఎక్కువ.

ప్రస్తుత సమాజంలో ఉన్న అన్ని వ్యవస్దలు విఫలమవ్వడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఎవరిది తప్పు అని అడిగితే అటూ నైతిక విలువలు గాలికి వదిలేసిన అబ్బాయిలది తప్పు అని చెప్పోచు... లేకపోతే వారిని కని పెంచిన తల్లిదండ్రులుది తప్పు అని చెప్పోచ్చు... లేక వారిని ఆ విధంగా ప్రేరేపించిన మెట్రో సిటి లైప్ స్టైల్ అని చెప్పోచ్చు.... లేదా పెళ్ళికి లేదా అమ్మాయి సాన్నిహిత్యానికి నోచుకోని తమ దుర్బర పరిస్దితి కావోచ్చు.. ఇలా ఏదైనా కావచ్చు ఒక ఘోరం జరగడంలో ఉన్న పాత్ర గురించి....

కానీ చివరకు బలయ్యేది అభం, శుభం తెలియని ఆమాయక అమ్మాయిలు మాత్రమే....

ఇకపోతే అత్యాచార నిరోధాలకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ, దాని వల్ల జాగర్తపడతారు తప్పితే, వారిలో ఉన్న పశుప్రవృత్తి పోదు.

ఇప్పుడు చెప్పు ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అని అడిగాడు నవ్వుతూ నన్ను చూస్తూ.....

ఎంత పరిస్దితులు ప్రభావం ఆయితే మాత్రం నైతిక విలువలు పట్టించుకొనని అబ్బాయిలదే తప్పు” ఇందులో సందేహమే లేదు అంది నా అంతరాత్మ...... కానీ బయటకు ఏమన్లేదు....

మరి వీటికి విరుగుడు ఏమి లేదా? అని అడిగా....

ఉంది అన్నాడు!........ ఏమిటి అన్నట్టుగా నా పేసు కొశ్చన్ మార్కు?

వేశ్యావాటికలను ప్రభుత్వం చట్టబద్దం చేయాలి”” అప్పుడే కొంత వరకు ఫలితం ఉండొచ్చు అన్నాడు చిన్నగా కన్ను గీటుతూ.....

?????????????...........


MARD- MEN AGAINST RAPE DISCRIMINATION  వేదికపై ప్రఖ్యాత నటులు అత్యాచారాలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం నిజంగా అభినందనీయం...  ఇలాంటి చర్యలు మీడియా ద్వారా లేదా సోషన్ నెట్ వర్క్ సైటు ల ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ఎంతో కొంత మార్పును తీసుకురావచ్చని అనుకుంటున్నాను...