Thursday, 3 November 2011

అసాంజే కోసం గోతి దగ్గర నక్క లాగా ఎదురుచూస్తున్న అమెరికా.....

వికిలీక్స్ వెబ్ సైట్ ద్వారా అనేక దేశాలకు చెందిన రహస్య పత్రాలను ప్రపంచానికి లీక్ చేసిన జూలియస్ అసాంజే ను చేజిక్కుంచుకోవడానికి అమెరికా గోతి దగ్గర నక్కలాగా ఇప్పుడు ఎదురుచూస్తుంది. అమెరికా మరియు యితర దేశాల మధ్య రహస్యంగా ఉండవలసిన అనేక ముఖ్యమైన దస్త్రాలను సంపాదించి దానిని బయట ప్రపంచానికి తెలియజేయడం ద్వారా ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకి గురిచేసి ఒక్కసారిగా వార్తలోకి ఎక్కాడు జూలియస్ అసాంజే. అతను విడుదల చేసిన పత్రాలతో ఎక్కువగా అమెరికాకే నష్టం కలిగించింది. పైగా యితర దేశాల అంతర్గత వ్యవహారాలలో అమెరికా ఎంతగా జోక్యం చేసుకుంటుందో వికిలీక్స్ విడుదల చేసిన పత్రాల ద్వారా వెలుగుచూసింది. ముఖ్యంగా ఆయా దేశాలలో రాయబార కార్యాలయల్లో పనిచేసే సిబ్బంది గూడచార్యానికి పాల్పడుతున్నట్టుగా ఆయా పత్రాలను బట్టి తెలిసింది. దానితో ఆయా దేశాలు అమెరికాను అనుమానపు చూపుల్తో చూడడం అమెరికాకు త్రీవ ఇబ్బందిని కలిగించింది.. అప్పటి నుండి అసాంజే పై కన్నేసిన అమెరికా, వికిలీక్స్ కు అవసరమైన అన్ని రకాల అయివు పట్టులను మూసివేయడం ద్వారా దానికి ప్రాణవాయువు అందకుండా చూసింది. పైగా అసాంజేను చెరపట్టేందుకు పధక రచన చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న అసాంజేను తమ దేశానికి తీసుకురావడానికి వీలుగా అతనిపై లైంగిక నేరారోపణ చేసి స్వీడన్ కు అప్పగించే విధముగా పాపులు కదిపింది. దరిమిలా బ్రిటన్ కోర్టు ఒకటి అసాంజే ను స్వీడన్ కు అప్పగించవలసినదిగా తీర్పు యిచ్చింది. ప్రస్తుతం బ్రిటన్ లో అత్యంత కఠిన నిబంధనల మధ్య గడుపుతున్న అసాంజే తనను స్వీడన్ కి అప్పగిస్తే, అమెరికాకు అప్పగించినట్టే అని మెరపెట్టుకున్నప్పటికి బ్రిటన్ కోర్టు వినిపించుకోలేదు. ఆయినా బ్రిటన్ కూడా అమెరికాకు తొత్తే అన్న విషయము గమనార్హం. ఇక అసాంజే ను స్వీడన్ కు అప్పగించిన తర్వాత అమెరికాకు తరలించడం లాంచనమే.. తర్వాత అసాంజేకు అక్కడి కోర్టులు మరణ శిక్ష విధించవచ్చును. లేదంటే గ్వాంటానేబే జైలుకు తరలించవచ్చును. ఏది ఏమైనా అమెరికా ఉన్మాదానికి ఇంకొక వ్యక్తి బలి కాబోయే రోజు తొందరలోనే ఉందనిపిస్తుంది.... అలా కాకపోతే దేవునికి వేలాదివేల ధన్యావాదములు తెలియజేసుకుంటాను....

Wednesday, 2 November 2011

భోదిధర్మ గురించి తెలియజెప్పిన చిత్రం "సెవెన్త్ సెన్స్"

సెవెన్త్ సెన్స్... సూర్య, మురుగదాస్ కలయికలో ఈ మధ్య వచ్చిన చిత్రం... ఈ చిత్రంపై అందరిలాగే ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది.. పైగా సూర్య తన నటనతో ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలడని ఈ సినిమా ద్వారా మరోసారి తెలియజేసాడు. ఇకపోతే సినిమా కధ గురించి మాట్లాడితే.. ఇందులో నాకు బాగా నచ్చిన అంశమేమిటంటే, ప్రస్తుతం చైనా లో యుద్దకళగా భావించే కుంగ్ ఫూ, షావోలిన్ విద్యలకు మూలము మన భారతీయతే అనే విషయము. భారతదేశానికి చెందిన భోదిధర్మ అనే వ్యక్తి తన ప్రపంచ యాత్రలో భాగంగా చైనాలోని ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ సమయములో మనకి తప్ప మరెవరికి ఎరుక లేని ఆమూల్యమైన వైద్య, యుద్ద కళలు అక్కడి వార్కి తెలియజెప్పడమనేది చాలా గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే నేను భారతీయున్ని కాబట్టి.. ఒక భారతీయుడు ద్వారా వారు అత్యున్నత స్దాయికి చేరుకోగలిగారు కాబట్టి. 
 ఒక భారతీయుడైన భోదిధర్మ చైనా మరియు జపాన్ తదితర ప్రాంతాలలో తనకు తెలిసిన విద్యలను అక్కడివారికి తెలియజేప్పడం ద్వారా అక్కడి ప్రజలకు దేవుడయ్యాడు. ఆ రోజు భోదిధర్మ భోదనలతో ప్రభావితమైన ఆయా దేశ ప్రజలు ఇప్పటికి ఆయనను గుర్తుపెట్టుకొని ఆరాధించడం చాలా గొప్ప విషయము.. అదే విధముగా మన దేశములో అదే భోదిధర్మ ఎవరో, ఈ సినిమా చూసినంత వరకు మనకు తెలియకపోవడం.. మనము మన సంస్కృతి మీద చూపిస్తున్న నిర్లక్యం.. నిజానికి మన దేశ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది.. ఆనాటి నుండి, ఈ నాటి వరకు భారతీయుల భాగస్వామ్యం ప్రపంచమంతటా ఉంది. ఇప్పుడు చైనాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన మార్షల్ అర్ట్స్, షావోలిన్ విద్యలు మూలము మన భారతీయ యుద్దకళలే.. మరియు ఇప్పుడు ప్రపంచం మంతటా జపిస్తున్న పవర్ యోగ పుట్టుక భారతదేశంలోనే... కాని మనమందరము మన దేశ అద్బుత చరిత్ర మరిచి పాశ్చాత్య దేశాల ధోరణికి ఎంగిలి పడుతున్నాము. నేడు మనము ఎవరి ఎంగిలికి ఆశ పడుతున్నామో, ఆ పాశ్చాతులే నేడు భారతీయత సంప్రదాయానికి దాసోహమయి మన దేశాన్ని ఆరాధిస్తున్నారు..... ఈ విషయమై మంచి విషయాన్ని తెలియజేప్పేలా తీసిన చిత్ర దర్శకునికి నా జోహార్లు. ఈ విధముగా నేటి దర్శకులు మన భారతీయుల అద్బుత చరిత్ర కొద్దిగానైన సినిమాల ద్వారా తెలియజెప్పితే, నేటి మనలాంటివారికి ఎంతో కొంత తెలుస్తుంది.. చైనా, జపాన్ లో భోదిధర్మ కళలకు నేటికి కూడా ఆదరణ దక్కుతుందటంటే దానికి కారణం, అక్కడ దాన్ని ఒక ఆచారముగా భావించి క్రమము తప్పకుండా తమ తర్వాత తరాల వార్కి అందజేయడమే. దురదృష్టవత్తు మన పూర్వికుల్లో అది లోపించింది... సదరు దేశ సంపద్రాయలను పెద్దలు, తమ తర్వాత తరానికి ఖచ్చితముగా బదలాయించేలా చూడాలి. అప్పుడే మన సంప్రదాయాలు ఒక తరం నుండి మరోక తరానికి ప్రయాణిస్తాయి... ఈ విషయంలో మన పెద్దలు చొరవ తీసుకోవలసిన అవసరము ఉంది.....

Friday, 21 October 2011

ముగిసిన మరో నియంత శకం... గడాఫీ..

లిబియాను నాల్గు దశాబ్దలుగా ఏకచత్రాధిపత్యంగా ఏలిన మూమర్ గడాఫీ నిన్న నాటో దళాలు, తిరుగుబాటుదారుల చేతిలో హతమయ్యాడు...

ప్రపంచ అగ్రరాజ్యాలు తమ స్వలాభము కోసం ఆడుతున్న క్రీడలో మరణించిన నాయకులలో గడాఫీ ఒకడు....
లిబియాలో ఉన్న అపార చమురు నిల్వలు, అగ్రరాజ్యాలు తమ జూద క్రీడకి తెరదీయడానికి అవకాశము కల్పించినట్టు అయింది.. చమురు నిల్వలు ఉన్న దేశాలలో తమ చమురు వ్యాపార కార్యాకలపాలు సజావుగా సాగాలంటే, ఆయా దేశాలలో నియంత లు ఉండడమే మేలనుకొన్నప్పుడు వారికి వంత పాడింది.... నేడు అదే నియంతలు మేకై గుచ్చుకొంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట తిరుగుబాటులు లేవదీసి మట్టుపెట్టడం మామూలే... అఫఘనిస్తాన్, ఇరాక్ లో జరిగిందేమిటో మనందరికి ఎరుకే.... గడాఫీ ఉన్నంతవరకు ఆగ్రరాజ్యాల పట్ల కఠినంగా వ్యవహరించినందున, అతన్ని మట్టుబట్టి, ఇప్పుడు లిబియాలో దోపిడి చేయడానికి రెడిగా కాచుకున్నాయి ఆగ్రరాజ్యాల గద్దలు..... ఇరాక్ లో డమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అక్కడ చమురు వెలికితీత కంపెనిలన్నింటిని తమ దేశియుల చేతిలోనే పెట్టిన ఆమెరికా... ఇప్పుడు లిబియాలో కూడా అదే చేయనుంది.. అప్పటి వరకు లిబియాలో కూడా డమ్మి ప్రభుత్వమును పెట్టి, తను చెప్పినట్టు ఆడించుకుంటుంది.......
నాకు తెలిసి అమెరికాకు ఇంకా ఇప్పటికీ వ్యతిరేకముగా ఉన్న దేశాలలో క్యూబా ఒక్కటి... విఖ్యాత పోరాట యెధుడు చే గువేరా తిరుగుబాటు ద్వారా క్యూబాలో అమెరికా అనుకూల ప్రభుత్వమును పడగొట్టి తమ మిత్రుడైన ఫిడెల్ క్యాస్ట్రోను అధ్యక్షుడుని చేసిన దగ్గర నుండి ఫిడెల్ క్యాస్ట్రోను అంతమెందించడానికి ఎన్ని కుట్రలు పన్నిందో లెక్కలేదు..... కాని వాటన్నింటిని క్యాస్ట్రో సమర్దముగా ఎదుర్కొనడంతో అమెరికా ఆటలు సాగలేదు.... కాని ఏదో రోజు క్యూబా పరిస్దితి కూడా ఇరాక్, లిబియా వలే కావచ్చు..... ఇక మిగిలినవి ఆరబ్ దేశాలు..... లిబియా, ఇరాక్ లలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరు చెప్పి ఆయా దేశాధినేతలకు మరణశిక్ష లిఖించిన ఆమెరికాకు ప్రజాస్వామ్య సూచనలు మచ్చుకైనా కనిపించని ఆరబ్ దేశాలు గుర్తుకు రావెందుకో.... ఎందుకంటే ఆరబ్ దేశాధినేతలు అమెరికా మాట వినడం వలన.......

Wednesday, 19 October 2011

సామాన్య ప్రజల ఆక్రోశం "వాల్ స్ట్రీట్ ముట్టడి" ...

అర్దిక మాంద్యం నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపణలు దేశ జనాభాలో ఉన్న ఒక్క శాతము ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని, మరియు అదే సమయములో మిగతా తొంబై తొమ్మిది శాతం ఉన్న సాధారణ ప్రజానీకానికి సబ్బిడిలో కోత విధించడం పై ఆ దేశ పౌరులు, వాల్ స్ట్రీట్ ముట్టడి పేరుతో స్టాక్ ఎక్సేంజ్ ని ముట్టడించి, అందలి కార్యకలాపాలకు అటంకం కల్గించారు. ఇందులో చెప్పుకోవలసిదేమిటంటే, ప్రభుత్వాలకు ప్రజలపై ఉన్న ఈ రకమైన వివక్ష ప్రపంచమంతా ఉన్నదే.... ముఖ్యంగా చెప్పాలంటే మన దేశములో ఎప్పటి నుండో ఈ రకమైన దోపిడి జరుగుతుంది... కాని మనవాళ్ళు ఏమి చేయలేక ఊరకుండిపోయారు. అమెరికాలో మాత్రం సదరు ధనిక, పేద తారతమ్యం పై తమ గళం విప్పారు. అర్దిక మాంద్యం అనేది ప్రభావం చూపినప్పుడు అది అందరి మీద ప్రభావం చూపుతుంది. అటువంటి సమయములో ప్రజలకు అర్దిక అసరాగా నిలబడవలసిన ప్రభుత్వాలు, విపణిలో తారాస్దాయిలో ఉన్న ధరలను అదుపు చేయడం మరియు జనాభాలో అధిక శాతమున్న సామాన్య ప్రజానీకానికి అర్దిక ఇబ్బందులు లేకుండా చూడడంలో సరయిన శ్రద్ద చూపడం లేదనేది సత్యం. కాని అతి తక్కువుగా ఉన్న ధనికుల ప్రయోజనాలను కాపాడడానికి మాత్రము ఎనలేని అత్రుత చూపుతున్నాయి. ఈ రకమైన వివక్షని సహించలేకనే అమెరికాలో వాల్ స్ట్రీట్ ముట్టడి జరిగింది. నేడు అది ప్రపంచ దేశాలన్నింటికి పాకి, నిరసనోద్యమాలు ఎక్కువవడానికి అవకాశము కల్పించింది. ఇకపోతే మన దేశములోని ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. ఒక అర్దికవేత్త ప్రధాన మంత్రి అయితే, దేశ అర్దిక ప్రగతి అభివృద్ధి పధంలో దూసుకువెళ్ళుతుందనుకొని, తద్వారా ప్రజల తలసరి ఆదాయము పెరుగుతుందని అనుకొని, కాంగ్రెస్ పార్టికి పట్టం కట్టి నందుకు, దానికి ఆ పార్టి చేసిన చర్యలు దేశములో ఉన్న ప్రతి సామాన్యుడి గుండే మండకమానదు. 
 మన్మోహన్ సింగ్ ప్రధాని ఆయిన తర్వాత భారత వృద్ది రేటు పెరిగిందని, గొప్పులు చెప్పుకుంటున్న ప్రణాళిక సంఘం, అది ఎవరి బ్రతుకులు దుర్బరం చేసి వృద్ది రేటు పెంచగలిగారో మాత్రం తెలపలేదు.
దేశజనాభాలో అతి తక్కువగా గల కార్పోరేట్ల అదాయాలను గణనీయముగా పెంచడం ద్వారా, దేశ అర్దిక వృద్ధి రేటు బాగుందని చెపుతున్న వారు, మిగిలిన అత్యధిక శాతానికి చెందిన సామాన్య జనాల పరిస్దితిని మాత్రము గాలికొదిలేసారు. నాయకుల నయవంచితతనానికి ఏనాడో అలవాటు పడి పోయిన భారతీయులు, దీని పై పల్లెత్తు మాట అనకుండా, తమ పని తాము చేసుకుపోతున్నారు. మన ప్రభుత్వ విధానాల కారణాముగానే దేశములో ఉన్న ధనవంతులు, అత్యధిక ధనవంతులు కాగలిగారు. పేదవాడు, కటిక పేదవాడుగా మారిపోయాడు. పైగా పేదరికంతో ప్రభుత్వాలు ఆటలు కూడా చాలా నీచాతినీచముగా ఉన్నాయి. దానికి ఉదహరణగా మొన్న ప్రణాళిక సంఘం వారు మినియం అదాయము లెక్కలు ముప్పయి రెండు రూపాయలు (ఒకరోజుకి)గా లెక్కకట్టినప్పుడే తెలిసింది మన వాళ్ళ గొప్పతనమేంటొ. కాని మిగతా దేశాలలో మాత్రం, మనలా ఊరుకోకుండా, ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. సామాన్య జనాలు మార్పు కోరుకుంటే ఏమవుతుందో ట్యూనీషీయా, ఈజిప్టు, లిబియాలో జరిగిన పరిణామాల ద్వారా నిరూపించబడింది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న వాల్ స్ట్రీట్ ముట్టడి, రేపు ఏ రకమైన పరిస్దితులకు దారితీస్తుందోనని ఒబామా అందోళన చెందుతున్నారు. అది ప్రస్తుతం మిగతా అభివృద్ది చెందిన దేశాలకు పాకింది. చూద్దాం ఇది ప్రపంచంలో ఏ మార్పులకు సంకేతమో........