Tuesday, 31 December 2013

ఈ సారికి వాగ్దానాల్లేవ్...


              
అవున్నిజమే... కొత్త సంవత్సరం సందర్బంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఈ సారి ఎటువంటి వాగ్దానాలు చేయబూనడం లేదు.  ప్రతి సంవత్సరం మొదటి రోజున పలు రకాల మేనిపోస్టొలతో సంవత్సరం పొడవునా చేయవలసిన పనులు గురించి వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మర్చిపోవడం పరిపాటి ఆయిపోతుంది...

అందుకనే ఈ సారి నేను ఆమ్ అద్మీ పార్టీ సంప్రదాయాన్ని అనుసరించి ఎటువంటి వాగ్దానాలు ఇవ్వడం లేదు. గుజరాత్ సి.ఎం. లా సంవత్సరం ఎండింగ్ లో ప్రగతి నివేదిక రిలీజ్ చేయడం బెటర్ గా భావించి మీ అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొంటున్నాను.. 


Saturday, 28 December 2013

సలీం.. నీకు సలాం..



సలీం.. సుమారుగా అరవై సం.లు పైబడి ఉంటుంది వయసు.. చేసేది అగర్ బత్తిలు వ్యాపారం..

మీసం లేకుండా గడ్డం మాత్రమే పెంచుకొన్న ముఖం, నెత్తి మీద టోపి అతను ముస్లిం అని చెప్పకనే చెబుతుంటాయి.

ప్రతి రోజూ వివిధ కంపెనీల అగర్ బత్తి ప్యాకెట్లను ఒక పెద్ద బ్యాగులో పెట్టుకొని తన మోపెడ్ పై తిరుగుతూ ప్రభుత్వ కార్యాలయల్లో పని చేసే సిబ్బందికి అమ్ముతూ ఉంటాడనుకుంటాను..

ఎందుకంటే అతనిని నేను చాలా సార్లు మా ఆఫీసులో చూసాను. వారానికో, రెండు వారాలకు ఒకసారో మా అఫీసుకు అగర్ బత్తిలు అమ్మడానికి వస్తుంటాడు. మా ఆఫీసునకు అనుకొని ఇంజనీరింగు విభాగము, క్వాలిటి కంట్రోల్ విభాగము కూడా ఉండడంతో తరచుగా అతను ఇక్కడికి వస్తుంటాడు.  అతని రాక కంటే ముందే అతని బ్యాగు నుండి విడుదలయ్యే అగర్ బత్తిల సుగంధ పరిమళం మన ముక్కుపుటలకు చేరడం ద్వారా తెలిసిపోతుంది. 

మనిషి చూడగానే మృదుస్వభావి అని మనకి అర్ద్రమవుతుంది. చాలా వినయంగా కార్యాలయంలో అందరి వద్దకు వెళ్ళి మీకైమనా అగర్ బత్తీలు కావాలా అని మర్యాదగా అడగడం అతని యొక్క వ్యాపార అణుకువను తెలియపర్చుతుంది. అతని వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తంలోనే అగర్ బత్తిలు కొనుగొలు చేస్తుంటారు. నేను ఆ మధ్య వరకు బ్యాచిలర్ గానే ఉండడంతో నాకెప్పుడూ వాటిని కొనవలసిన అవసరం రాలేదు. దానితో ఎపుడూ అతని దగ్గర ఏమి కొనలేదు.

మా అన్నయ్య స్వంత ఊరి రాజకీయాల్లో చాలా బిజీ మనిషి.  అప్పుడప్పుడు కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తుంటాడు. ఒక సారి మంజూరు ఆయిన ఒక పనికి సంబందించి అగ్రిమెంటు రాయించుకోవడానికి మా ఆఫీసునకు అనుకొని ఉన్న ఇంజనీరింగు విభాగమునకు వచ్చాడు. తాను ఫోన్ చేస్తే కనిపించడానికి అని చెప్పి నేను కూడా అక్కడకి వెళ్ళాను. అక్కడ మా అన్నయ్య ఇవ్వవలసిన ఫార్మాలిటిస్ అన్ని నా కళ్ళ ముందే అక్కడ ఉన్న అధికారులకు ఇవ్వడం, వారు అగ్రిమెంటు కాఫీ తయారుచేయడంలో మునిగిపోవడంతో నేను, మా అన్నయ్య మాట్లాడుకుంటూ అక్కడ కూర్చున్నాము.

అదిగో, అప్పుడే సలీం తన అగర్ బత్తీల బ్యాగ్ పట్టుకొని ఆ విభాగములోకి అడుగుపెట్టాడు.  నేను తరచుగా చూసే మనిషే కాబట్టి అతని రాక పెద్ద విశేషంగా అనిపించలేదు.  అక్కడ ఉన్న అధికారులు సలీం దగ్గర ఉన్న అగర్ బత్తీలు ప్యాకెట్లలను పరిశీలించి  మూడు ప్యాకెట్టులు తీసుకొన్నారు. సలీం వారు తీసుకొన్న ప్యాకెట్టుకలు లెక్కగట్టి 198 రూపాయలుగా లెక్కకట్టాడు. వెంటనే ఆ అధికారి తన జేబులో నుండి మా అన్నయ్య నుండి అంతకు ముందే తీసుకొన్న డబ్బుల నుండే 200 రూపాయలు తీసుకొని ఇచ్చాడు.

ఏమనుకున్నాడో.. ఏమో.. సలీం మరల చేతిలో ఉన్న కాగితం మీద తన పెన్నుతో ఏవో లెక్కలు, కూడికలు చేసుకొని, ఆ అధికారితో అతి వినయంగా అయ్యా, మన్నించండి, ఇందకా నేను లెక్క తప్పుగా కూడాను. వాస్తవానికి బిల్లు 193 రూపాయలు మాత్రమే ఆయిందని చెప్పి ఆయన యిచ్చిన రెండు వందలు తీసుకొని మిగతా ఏడు రూపాయలు చిల్లర తీసుకొని తిరిగి యివ్వబోయాడు. ఆ అధికారి చిల్లరను ఉంచుకోవలసినదిగా ఆదేశిస్తునట్టుగా సలీం తో చెప్పాడు.

కానీ సలీం మాత్రం నవ్వుతూ మీ డబ్బులు నాకు ఎందుకయ్యా, నా సరుకు కొన్నందుకు యిచ్చిన ప్రతిఫలం నాకు చాలు, నాది కాని ఒక అర్దరూపాయి ఆయినా సరే నాకు, నా కుటుంబానికి చేటు చేయదా అయ్యా! అని చెప్పి చిల్లరను ఆ అధికారికి ఇచ్చేసాడు. ఈ సంఘటనతో ఆ అధికారి ముఖంలో రంగులు మారిన వైనం నా దృష్టికి రాకుండా పోలేదు. మా అన్నయ్య కూడా ఆ సంఘటనతో నా వైపు చూసి చిన్నగా నవ్వాడు..

మాతో పాటుగా ఈ సంఘటనను అక్కడే ఉన్న ఒక బడా కాంట్రాక్టర్ కూడా చూస్తూ ఉన్నాడనుకుంటాను. ఆ విభాగము నుండి వెళ్ళిపోతున్న సలీంను పిలిచి ఒక అగర్ బత్తి ప్యాకెట్టు తీసుకొని 500 రూపాయల నోటు ఇచ్చాడు. అంతే కాకుండా మిగిలిన మొత్తం ఉంచుకోమని ఆఫర్ చేసాడు. ఆ బడా కాంట్రాక్టర్ తీసుకొన్న అగర్ బత్తి ప్యాకెట్టు విలువు 40 రూపాయలు. బడా కాంట్రాక్టర్ మాటలకు సలీం ఒక చిన్న వినయపూర్వకమైన చిరునవ్వు నవ్వి, అయ్యా మీరు చాలా గొప్పొళ్ళులా ఉన్నారు. మంచి మనసు కూడా కల్గి ఉన్నవారిలా ఉన్నారు. భగవంతుడు మీకు ఇలాంటి మంచి మనసు ఇచ్చినందుకు మీ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులై ఉంటారు.  మీకు, మీ మంచితనానికి సలాం సాబ్ అని చెప్పి మిగిలిన 440 రూపాయలు ఆ బడా కాంట్రక్టర్ చేతిలో ఉంచాడు. ఉంచుకోమని బడాకాంట్రాక్టర్ బలవంతం చేసినప్పటికీ మరొక సారి సలాం చేసి నిదానంగా అక్కడి నుండి నిష్కమించబోయాడు. అప్పుడు ఆ కాంట్రాక్టర్ అతనిని ఆపి నువు ఇందాక అక్కడున్న అధికారికి చిల్లర తిరిగి ఇచ్చినపుడే అనుకున్నాను నీ గొప్పతనం గురించి. అందుకే నా డబ్బులు నువు ఉంచుకోకుండా తిరిగి వెనక్కి ఇచ్చేస్తావని నాకు తెలుసు. అందుకే మిగిలిన చిల్లర నిన్ను ఉంచుకోమని చెప్పాను. నువు వాటిని తిరిగి ఇచ్చేస్తావని ముందే అనుకున్నాను అని అన్నాడు.

ఆ బడా కాంట్రాక్టర్ ఆ చర్యను ఎలా రిసీవ్ చేసుకున్నాడో నాకు తెలీదు, అలాగే ఆ అధికారి ఎలా రిసీవ్ తీసుకున్నాడో తెలియదు కానీ నా కళ్ళలో ఒక రకమైన విజయగర్వం కల్గింది. అది మా అన్నయ్యకి కనిపించింది. ఈ రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా తమ్ముడు అని నా కళ్ళలో చూస్తూ అన్నాడు. మరల నా వైపు తిరిగి నీలాంటోళ్ళు ఇంకా ఉన్నరన్న మాట అన్నాడు.....

మనసులోనే సలీంకి ధన్యవాదములు తెల్పాను... ఇప్పుడు మనకి కావల్సినది నీలాంటి వాళ్ళే సలీం భాయ్... మనదైన కోసం ఆరాటపడాలి తప్పితే, మనది కాని అర్దరూపాయి మీద కూడా మనం ఆశ పెట్టుకోకూడదు అని ఎంత చక్కగా అర్ద్రమయ్యేలా చేసావు..

అందుకే సలీం భాయ్... నీకు సలాం....


Friday, 27 December 2013

స్వామీ, నిను కనులరా వీక్షించి!!




ఏడు కొండల వాడా!! వెంకట రమణా... గోవిందా..గోగోగోవిందాదా........
ఏడు కొండల వాడా!! వెంకట రమణా... గోవిందా..గోగోగోవిందాదా........
ఏడు కొండల వాడా!! వెంకట రమణా... గోవిందా..గోగోగోవిందాదా........

ఏంటి స్వామీ, అన్ని సార్లు పిలుస్తున్నా పలకవేంటి?

“భక్తులను పలకరించడంలో మునిగిపోయి పలకలేదు నాయనా! చెప్పు నాయనా ఎందుకు పిలిచావు”?

“నేను నిన్ను చూడడానికి కుటుంబంతో కల్సి తిరుపతి వచ్చాను స్వామి!”

“ఆవును నాయనా నేను గమనించాను.. పైగా కాలినడకన కూడా వచ్చావు కదా”

“ఆవును  స్వామి.. శ్రీ వారి మెట్టు దగ్గర నుండి కాలినడకన మీ దర్శన భాగ్యం కోసం వచ్చాను”

"!!!!!!"

“కష్టంగా అనిపించినా మీ దర్శనం ఆవుతుందన్న ఆనందంలో కష్టం తెలీలేదు స్వామి”

"!!!!!!"

“కొండ మీదకి రాగానే తిరుమలను చూడగానే అక్కడ నగర సుందరీకరణ చూడగానే అద్బుతమనిపించింది స్వామి”

"!!!!!!"

“కానీ నీ కొండ మీద తన డబ్బులతో అతిధి గృహం కట్టించిన ఒక పెద్దాయన యిచ్చిన రికమెండెషన్ లేఖతో రూమ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు అష్టకష్టాలు పడ్డాను స్వామీ”

"!!!!!!"

“స్వామీ.. వింటున్నావా నేను చెబుతున్నవి?”

“ఆ..ఆ.. వింటున్న నాయనా... నువ్వు చెప్పు””

మరి ఊ కొడుతూ ఉండు స్వామీ.. నువు వింటున్నావన్న నమ్మకం కోసం”

సరే.. చెప్పు.. ఊ కొడుతు ఉంటాను నాయనా”

“కాలినడకన పైకి చేరుకున్న తర్వాత C.R.O.ఆఫీసులో డోనర్ యిచ్చిన లేఖ యిచ్చి రూమ్ తీసుకోవలని బయలుదేరితే ఎక్కడా అటోలు కానీ, జీపులు కానీ లేవు స్వామీ..ఎంత దూరమైన నడిచి వెళ్ళవలచి వచ్చింది.. కాలినడకన వచ్చిన మాకు తిరిగి రూమ్ కోసం ఆఫీసులు తిరగలేక ఇబ్బంది పడిపోయాను స్వామి”

అదేంటి నాయనా.. అక్కడ మీలాంటి యాత్రికులు కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడింది కదా”

“మీరన్నట్టు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నప్పట్టికి, అనంతమైన మీ భక్తుల అవసరాలు తీర్చలేకపోతున్నాయి స్వామీ... బస్సు నిండా జనమే.. నిలబడడానికి కూడా జాగా లేదు స్వామీ... ఆడవాళ్ళతో ఎక్కితే ఇబ్బందని ఎక్కలేదు స్వామి”

“ఊ..”

మొత్తానికి ఎలాగో తంటాలు పడి రూమ్ తీసుకుని, ఉదయమే మీ దర్శనానికి వద్దామని అనుకొన్నాను స్వామి”

“ఊ..”

తెల్లారి ఉదయమే నాల్గు గంటలకు రెడీ ఆయి బయటకు వచ్చి చూద్దునూ... రూ.300/- దివ్య దర్శనం లైను రోడ్డు మీద నాల్గు కిలోమిటర్లు మేర జనాలు లైనులో ఉన్నారు స్వామీ”

“ఊ..”

ఇలాగైతే మీ దర్శనం లేటు అవుతుందని అనుకొని, నిన్న కాలినడకన వచ్చినపుడు యిచ్చిన దివ్యదర్శన ద్వారం ద్వారా వెళ్ళడం మంచిదనిపించి ఆ విధంగా బయలుదేరాను స్వామి”

“ఊ..”

ఎంతో ఇష్టపడి, కష్టపడి నిను త్వరగా చూడాలని ఊబలాటపడుతూ నీ దర్శనం కోసం బయలుదేరితే నీవు ఏమి చేసావు స్వామీ””

“నేను ఏమి చేసాను నాయనా”

“అన్ని తెలిసి, ఏమి తెలియనట్టు అలా ఎలా మాట్లాడుతున్నావు స్వామీ”

“నీ నోటితో చెప్పు నాయనా, నా చెవులతో వింటా”

పొద్దుట అనగా నీ దర్శనం కోసం వస్తే కంపార్టుమెంటులో గంటల గంటల పాటు కూర్చోబెట్టేసావు కదా స్వామీ”

!!!!!!

నీ దర్శనం చేసుకోవడానికి వచ్చే అనంత కోటిభక్తులకు రద్దీ పేరు చెప్పుకొని ఇబ్బంది పెట్టడం భావ్యమా స్వామీ”

“ఊ...”

“ఎన్నో రోజుల నుండి నిన్ను దర్శించుకోవడానికి ముందస్తుగా ప్లాన్ చేసుకొని నీ దర్శన భాగ్యం కోసం వచ్చే సామాన్య జనాలను గంటల తరబడి లైనులో వేచియుంచేలా చేయడం ఎందుకు స్వామీ?”

“ భక్తా... అనంతంగా వచ్చే నా భక్తులకు దర్శనమివ్వడానికి ఆ మాత్రం ఇబ్బందులు తప్పవు నాయనా”

“మీరు అన్నదాన్ని నేను తప్పు బట్టడం లేదు స్వామీ... మీరు కూడా మాలాంటి వారి కోసం విశ్రాంతి అనేదే లేకుండా మాకు దర్శనం ఇస్తున్నారు.. కాదనను! కానీ భక్తులలోనే ధనికులు, సామాన్యులు, పేదలు అన్న బేధం చూపుతున్నావు స్వామీ నీవు! అది ఏ రకంగా భావ్యం స్వామీ?”

“అలాంటిది ఏమి లేదు నాయనా... నాకు భక్తులందరూ సమానమే”

“అలా అయితే నీ దర్శన భాగ్యానికి ఆయ్యే సమయం అందరికి ఒకేలా ఎందుకు ఉండడం లేదు స్వామీ?  నీ దర్శన భాగ్యానికి నాకయిన సమయంతో పోలిస్తే వి.ఐ.పి.దర్శనంకి వచ్చిన భక్తులకు కనీసం పావువంతు సమయం కూడా పట్టలేదు స్వామీ”

“ఊ...”

చిరంజీవి అనో, మెహన్ బాబు అనో, ఇంకో పని లేని వెధవ అనో, వాడనీ, వీడనీ ఎవడి దగ్గర డబ్బు ఉంటే వాడిని సకల లాంచనాలతో నీ దర్శన భాగ్యం నిమిషాల్లో కల్పించడానికి కుదురుతుంది కానీ మాలాంటి సామాన్య భక్తులకు వెంటనే దర్శనం ఇవ్వడానికి మీకు కుదరడం లేదా స్వామీ మీకు”

“!!!!!!”

నీకు భక్తులందరూ సమానమైనప్పుడు ఇన్నోటీ మార్గాలు ఎందుకు స్వామీ. వచ్చే భక్తులందరికి ఒకే మార్గం పెడితే రోజు మెత్తం మీద ఎంత మందికి దర్శనం ఇవ్వగలవో అలోచించావా స్వామీ???

“!!!!””

“పోనీ.. ఇంత సేపు వేచియుండడం వలన నీ దర్శన భాగ్యం సెకనుకి మించి ఇస్తున్నావా? ఎంత సమయం లైనులో వేచియున్నప్పట్టికీ నువు మాకు ఇచ్చే దర్శన సమయం క్షణాల్లోనే ఉంటుంది స్వామీ”

’!!!!”

శబరిమల అయ్యప్ప స్వామి తన భక్తులందరికి ఒకే రకమైన దర్శనం యిచ్చినప్పుడు నీవు ఎందుకు అలా ఇవ్వలేవు స్వామీ””

“ నాయనా.. నువు నా దర్శనానికి వచ్చిన సందర్బంలో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసాను కదా... ఇకపోతే దర్శనానికి గంటల సమయం తీసుకొన్నప్పట్టికీ, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపర్టుమెంటులో కూర్చుండబెట్టి ఫలహారాలు కూడా అందించాను కదా! అటువంటప్పుడు ఇబ్బంది ఎందుకు నాయనా నీకు”

స్వామీ నేను వచ్చింది మీ దర్శన భాగ్యం కోసం తప్ప, వారు పెట్టే ఫలహారాలు తినడానికి కాదు స్వామీ.. పొద్దుటే తలరా స్నానం చేసి పరకడుపుతో మీ దర్శనం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటాం స్వామీ మేము. అలాంటి వారికి ఫలహారాలు యితర సౌకర్యాల అవసరమేంటి స్వామీ”

“ఊ...”

ఎన్నన్ని ఉన్నప్పట్టికీ, గంటలకు పైగా సమయం వేచియుండవలసినప్పటికీ, మాకన్నా ముందుగా వి.ఐ.పి. మరియు ధనిక భక్తులకు నీ దర్శనం కల్పించినప్పటికీ, నీ దరికి రాగానే అవన్నీ మర్చిపోయాను స్వామీ””

“!!!!!”

“ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఆ ఆపూర్వ క్షణాలు దగ్గరవగానే నా మది నుండే నువ్వే స్వామీ.. నిండైనా నీ విగ్రహరూపంను నా కనులారా వీక్షించగానే.. నా మనసులో నీ దివ్యమైన రూపం ముద్రవేసుకుంటుండగానే ఎవరో రెక్కపట్టుకొని ఒక్కసారే ప్రక్కకు లాగేసారు స్వామీ నన్ను”

“!!!!!!”

అంత సమయం పాటు మమ్మల్ని వేచియుంచేలా చేసి కనీస సమయం కూడా నీ దర్శన భాగ్యం కల్పించలేకపోయవా స్వామీ”

“!!!!!”

కానీ స్వామీ క్షణకాలం పాటైనా నిను కనులారా వీక్షించునందుకు ధన్యుడయ్యాను స్వామీ నేను””

“తధాస్తు నాయనా”

“ధన్యవాదములు స్వామీ”

“మరీ మరల ఎప్పుడు వస్తున్నావు నా దర్శనానికి”

“మరల ఇప్పుడిప్పుడే రాను స్వామీ.. ఒక వేళ వస్తే వి.ఐ.పి. దర్శనానికి నా స్వంత వెహికల్ లోనే వస్తాను స్వామీ! ఒక సామాన్య భక్తుడుగా మాత్రం రాను స్వామి!”




Monday, 9 December 2013

అవినీతి అధర్మమేమి కాదు.....2


అవినీతి అధర్మమేమి కాదు.....1  తర్వాతి భాగం క్రిందన....

“సరే బ్రదర్.. నువ్వు చెబుతున్నది కరెక్ట్ అనుకుందాం.... నువ్వు ఆ మధ్య బైక్ కొన్నావ్ కదా ఎలా ఉంది?” అడిగాడు నాయుడు......

“చాలా బాగుందన్నయ్యా... నాకు నచ్చిన బైక్ కొనుకొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అన్నాడు ఆశోక్....

“మరి దానికి చట్టపరంగా ఉన్న రికార్డులన్నీ ఉన్నాయా?” అడిగాడు నాయుడు......

“ఇన్సూరెన్స్ తప్ప అన్ని ఉన్నాయి ఆన్నయ్యా.. ఇన్సూరెన్స్ కి కూడా అప్లయ్ చేసాను. అది ఇంకా రావాలి” అన్నాడు ఆశోక్.

“మరి చట్టపరంగా రికార్దులన్ని లేకుండానే బైక్ మీద ఎలా తిరుగుతున్నావ్ ఆశోక్ నువ్వు” తూటాల వచ్చింది నాయుడు నోట్లోంచి.....

“దాని వలన ఎవరికి నష్టం లేదు. ఒక వేళ ఎక్కడైనా చెకింగ్ లో పట్టుబడితే ఫైన్ కడతాను. దాని వలన నేనే నష్టపోతాను తప్ప వేరేకరు కాదు కదా” అన్నాడు ఆశోక్....

“సో.. నీ ఉద్దేశం ప్రకారం మనకి మనం నష్టపోయినా తప్పు లేదు కదా” అన్నాడు నాయుడు. ఏమి మాట్లాడలేదు ఆశోక్... 

చట్టాన్ని అతిక్రమించినోళ్ళు అందరూ పాపాత్ములు కాలేరు. అలాగే చట్టాన్ని ఖచ్చితంగా పాటించేవారందరూ పుణ్యాత్ములు కాలేరు...  అవతలి వాడికి మంచి జరుగుతుందని భావిస్తే చట్టాన్ని అతిక్రమించిన పర్వాలేదు బ్రదర్ అది తప్పు కావచ్చు కాని, అధర్మం మాత్రం కాబోదు....  అంతే కాని అవతలి వాడు ఏమైపోయినా పర్లేదు చట్టాన్ని మాత్రం అతిక్రమించకూడదు అనుకుంటే అది అధర్మం క్రిందకి వస్తుంది నాయనా...

అంతెందుకు, కురుక్షేత్ర యుద్దం జరుగుతున్న సమయంలో కురుపాండవుల గురువైన ద్రోణాచార్యుడిని నిలువరించడం కోసం ధర్మవంతుడైన ఏనాడు అబద్దం పలుకని పాండవ అగ్రజుడు ధర్మరాజే అబద్దం కాని నిజంని చెప్పలేదు!! ద్రోణాచార్యుడుని నిలువరించడానికి “ఆశ్వద్ధామ చనిపోయాడు” అని ధర్మరాజు ద్రోణుడుకి వినబడేలా అనలేదా? అది విన్న ద్రోణుడు స్దాణువై అస్త్రసన్యాసం చేయలేదా? నిజానికి అక్కడ చనిపోయినది ఆశ్వద్దామ అనే పేరు గల ఏనుగు!  కానీ ధర్మ విలువర్దం జరుగుతున్న యుద్దంలో అపాటి చిన్న అబద్దమాడి తప్పు చేయడం సమంజసమే కదా! పైగా శ్రీకృష్ణ పరమాత్ముడే ముందుండి నడిపించాడీ ఈ తతంగం మొత్తాన్ని....
అలాగే శ్రీ రాముడు వాలీ, సుగ్రీవలు యుద్దంలో తలపడుతున్నపుడు చాటుగా బాణం వేసి వాలిని నేలకూల్చలేదా? అది ధర్మమవుతుందా? కాదు కదా! కానీ శ్రీరాముడు ఎందుకు అలా చేసాడు.... అక్కడ వాలి తన తమ్ముడి విషయంలో  చేసినది తప్పు కాబట్టి అలా చేయడంలో అధర్మం కాదు కదాని భావించడం వలనేగా!!!

ఆ విధంగా ప్రజలకు మేలు కల్గుతుందని భావించినపుడు అధికారులు, రాజకీయనేతలు రాజ్యాంగం లేక చట్టానికి అతీతంగా చేసినా అది అధర్మం కాజాలదు....

ఒక అధికారి లంచం తీసుకొని నిబంధనలకు విరుద్దంగా ఏదైనా పని చేసినప్పుడు, దాని వలన ఎవరికి నష్టం కలగనప్పుడు అది పాపం లెక్కలోకి రాదు. దాన్ని కేవలం చట్ట ప్రకారం తప్పు చేసినట్టిగానే భావించాలి.. ఒక వేళ  ఆ అధికారి లంచం తినడానికి వ్యతిరేకి ఆయినా సరే ఎవరికి నష్టం లేదని భావించినపుడు నిబంధనలు ఉల్లంఘించిన పర్లేదు....

ఉదహారణకి మన రాఘవ్ గురించే మాట్లాడుకుందాము...

ఏదో ఆలోచనలో ఉన్న నేను సడెన్ గా వారి సంభాషణలో నా పేరు వినబడే సరికి ఈ లోకంలోకి వచ్చాను... ఏంటి అన్నట్టుగా ప్రశ్నార్దకంగా చూసాను నాయుడు వైపు...

నాయుడు తిరిగి చెప్పడం  మొదలెట్టాడు...
రాఘవ్ నిజాయితీగా పనిచేస్తాడు. లంచాలు తీసుకోడు. ఆ సంగతిని ఒప్పుకుంటాన్నేను... కానీ దాని వలన ఎవరికి ఉపయెగం!! నిబంధనలను బట్టి కాకుండా మానవతకోణంలో ఆలోచించగలిగిన వాడే గొప్పవాడు అవుతాడు.
 రాఘవ్ ప్రావిడెంట్ ఫండ్ విభాగములో పనిచేసేటప్పుడు, మా ఊరి మాస్టారు ఒకాయనకి వాళ్ళ అమ్మాయి పెళ్ళి నిమిత్తం డబ్బులు కావల్సి వచ్చింది. దానితో తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుండి లోను తీసుకుందామని భావించి రాఘవ్ కి నాతో చెప్పించాడు. నేను ఫోన్ చేసి మనోడే కొద్దిగా ఎక్కువ మొత్తం వచ్చేటట్టుగా చూడమని రిఫర్ చేసాను. కాని రాఘవ్ ఏమి చేసాడు!! రూల్స్, రెగ్యులేషన్స్ తొక్క తోలు అని చెప్పి మాస్టారు అడిగిన మొత్తంలో సగం మొత్తం మాత్రమే మంజూరు చేసాడు...  ఇక్కడ రాఘవ్ తాను రూల్స్ ని ఫాలో అయ్యాను అనో లేక సిన్సియారిటి అనో ఏదో వంక చెబుతాడు... కానీ అక్కడ మాస్టారి అమ్మాయి పెళ్ళికి సరిపడ డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు... పోనీ ఆ డబ్బులు ఏమైనా ప్రభుత్వానివా! తన జీతం నుండి నెలా, నెలా చెల్లించేదే కదా! తన స్వంత డబ్బులే కదా! ఆ డబ్బులు కూడా ఇవ్వడానికి కూడా రూల్స్ రెగ్యూలేషన్స్ అని పట్టించుకోవడం అవసరమా? దాని వలన మనోడికి ఏమైనా పుణ్యం పెరిగిపోతుందా? ఎదుటి వాడికి సాయపడలేని సిన్సియారిటి ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒకటే.....

నాయుడు చెప్పింది విని ఆలోచించాను నేను... నిజమే! ఆ మాస్టారి కూతురి పెళ్ళికి ఎలిజిబులిటి ఎమౌంట్ ని మాత్రమే మంజూరు చేసాన్నేను... ఆ సంగతి నాక్కుడా గుర్తుంది.. కానీ ఆ సమయంలో నేను నా బాధ్యత గురించి మాత్రమే ఆలోచించాను కానీ, అవతలి వ్యక్తి అవసరం గురించి ఆలోచించలేదు.. నాయుడు చెప్పినట్లు నా వైపు నుండి చేసినదీ నాకు కరెక్టే గానే అనిపించినా ఎందుకనో అవతలి కోణంలో నుండి ఆలోచించినపుడు తప్పు చేసానన్న ఫీలింగ్ కల్గింది... వాస్తవానికి నిబంధనలకు విరుద్దంగా మాస్టారు అడిగిన మొత్తమును మంజూరు చేయవచ్చు.. అది పెద్ద సమస్య కూడా కాబోదు...

తిరిగి నాయుడు చెప్పడం కొనసాగించాడు.
ఎదుట వాడికి మనం సాయం చేయగలిగి చేయలేకపోవడం ఆధర్మం క్రిందకి వస్తుంది.. మీ ఓనర్ లంచాలు మేసినంత మాత్రం పాపాత్ముడు కాడు.. పైగా అతను అన్నదానాలు చేస్తుంటాండని అంటున్నావు కాబట్టి అది పుణ్యఫలం క్రిందే వస్తుంది.....

“అంటే ఆక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇలా దానధర్మాలు చేసుకుంటూ పోతే పుణ్యం సంపాదించుకోవచ్చంటావ్, అంతేగా” అనడిగాడు ఆశోక్....

“ఆ దానధర్మాలు ఎదుటివాడికి ఉపకారం కల్గేలా ఉండాలి. అంతే కాని ఆడంబరం కోసమో, లేక పేరు కోసమో చేస్తే ప్రతిఫలం మాత్రము దక్కదు” అన్నాడు నాయుడు......

“ చివరగా నేను చెప్పేదేమిటంటే ఎదుటివాడికి ఉపకారం కల్గుతుంది అంటే చట్టాన్ని ఉల్లంఘించడమేమి తప్పు కాదు అనేది నా అభిప్రాయం”

“ఆయితే లంచాలు మేసి ఆక్రమంగా డబ్బులు కూడబెట్టడం తప్పు కాదంటవ్” అడిగాడు ఆశోక్.

 “తాను, తన కుటుంబం స్వార్దం గురించి మాత్రమే ఆలోచించి లంచాలు మేసి డబ్బులు కూడబెడితే అది తప్పు ఆవుతుంది... అందులో అతని వలన ఎవరైనా నష్టపోయి ఉంటే దానికి పాపం కూడా తగులుతుంది. అంతే” అని చెప్పడం ముగించాడు....