నిన్న ఆదివారం సాయంత్రం వాతావరణం చాలా కూల్ గా
ఉంది. తుఫాన్ ప్రభావమో లేక చలికాలం ప్రభావమో తెలియదు కానీ, పగలు కూడా చల్లని
గాలులతో వాతావరణం చాలా కూల్ గా ఉంది. B.Tech మెకానికల్
పూర్తి చేసిన ఆశోక్ చాలా రోజుల తర్వాత కాకినాడ రావడంతో నన్ను కలిశాడు.
ఇంట్లో ఉండడం బోర్ అనిపించి ఇద్దరము కలసి అలా
బయటకు బయలుదేరాము. వాతావరణం చల్లగా ఉంది కదాని వేడి వేడిగా చాయ్ తాగాలనిపించి
భానుగుడి జంక్షన్ వద్ద గల వినాయక కేఫ్ కి వెళ్ళాము. అప్పటికే అక్కడేదో జాతర
జరుగుతున్నట్టుగా జనాలతో కప్పబడిపోయి ఉంది వినాయక కేఫ్ వద్ద ఉన్న టీ కౌంటర్
దగ్గర....
ఏంటన్నా ఇక్కడేమన్నా ఉచితముగా టీ సరఫరా
చేస్తున్నారా! అని ఆశోక్ జోకేశాడు చీమలదండుల ఉన్న అక్కడ జనాలను చూసి....
ఈ లోపునే నాయుడుకి కూడా ఫోన్ చేసాను వినాయక్
కేఫ్ కి వచ్చేయమని చెప్పి. మేము వెళ్ళేసరికే నాయుడు ఎదురుచూస్తూ ఉన్నాడు మాకోసం...
నాయుడుకి టీ అంటే చాలా ఇష్టం... వినాయక కేఫ్ టీ అంటే ఇంకా ఇష్టం... అందుకే ఎన్ని
పనులున్నా వినాయక కేఫ్ అంటే వెంటనే వచ్చేస్తాడు.....
మూడు కప్పుల
టీ తీసుకొని కేంటిన్ లోపల ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర ముగ్గురం సెటిల్
ఆయ్యాము. ఆశోక్ తో నాయుడుకు కొద్దిగా పరిచయం ఉంది. దాంతో యెగక్షేమాలు
మాట్లాడుకున్నారు.
ఆ మాటా, ఈ మాటా మాట్లాడుకుంటూ ఉండగా కేంటిన్ లో
గోడకి అంటించి ఉన్న వినాయక స్వచ్చంద సేవ సంస్ద పోస్టర్ కనబడింది. దానిని ఆ
క్యాంటిన్ వాళ్ళే నడుపుతున్నారు. ఈ
క్యాంటిన్ వాళ్ళు స్వచ్చంద సంస్ద కూడా నడుపుతున్నారా? అని అడిగాడు ఆశోక్...
ఆవును కదా, చెప్పడం మరిచాను.. ఆశోక్ కొద్దిగా సున్నితస్వభావి.. ప్రతి చిన్న
విషయానికి అతిగా స్పందిస్తాడు. ముఖ్యంగా సామాజిక సేవ విషయంలో ఎప్పుడూ ముందు
ఉంటాడు. అధర్మం అన్నా, అవినీతి అన్నా సహించలేడు... అందుకే స్వచ్చంద సంస్ద పోస్టర్
కనబడగానే అత్రుతగా అడిగాడు......
అవునన్నట్టుగా ఇద్దరము తలాడించాము....
ఆశోక్ మాట్లాడుతూ ఇది చాలా మంచి విషయమని, ప్రతి
ఒక్కరూ ఎంతో కొంత సామాజిక సేవ కోసం పాటుపడాలని, అవినీతికి దూరంగా ఉండాలని, ప్రతి
ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని ఇలా తన అదర్శాలు చెప్పుకుంటూ పోతున్నాడు......
కుర్రాడు కదా, ఆ మాత్రమ్ ఊపు ఉంటుందిలే అని మిగతా మేమిద్దరం ఆశోక్ చెబుతున్నదీ
వింటూ కూర్చున్నాము.
తర్వాత దేశములో అవినీతి గురించి అందుకొని, అటూ
తిరిగి..ఇటు తిరిగి చివరకి వైజాగ్ లో తనుంటున్న రూమ్ ఓనర్ దగ్గరకి వచ్చి ఆగాడు. ఆ
ఇంటి ఓనర్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులో అధికారి స్దాయిలో పనిచేస్తున్నాడనీ,
అతను మేసే లంచాలకి అంతు లేదని ఇలాంటి వారి వలన దేశములో పాపాత్ముల సంఖ్య
పెరిగిపోతుందని వాపోయాడు. అంతే కాక ఆ ఓనర్ పెద్ద దైవ భక్తుడని, అన్నన్ని వెధవ
పనులు చేసి కూడా దేవుడి దగ్గరకి సిగ్గులేకుండా ఎలా వెళ్తారని ప్రశ్నించాడు!. పైగా
అదేదో తన తాతల అస్తి అన్నట్టు అక్రమ సొమ్ముతో అన్నదానాలు నిర్వహిస్తాడనీ...
చెప్పుకుంటూ పోతున్నాడు ఆశోక్....
ఈ లోగా నాయుడు టీ తాగడం పూర్తయింది....
అసలు ధర్మమంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి బ్రదర్
అనడిగాడు ఆశోక్ వాగ్దాటికి అడ్డుపడుతూ.....
తప్పులు చేయకుండా ఒప్పుగా ఉండడం, చట్టాన్ని
అతిక్రమించకుండా చట్టానికి లోబడి ఉండడం, లంచాలు తినకపోవడం, రాజకీయనాయకులు ప్రజలను
మెసం చేయకపోవడం.. ఇవన్నీ ధర్మం... అలా చేయకపోవడం అధర్మం అన్నాడు ఆశోక్......
తప్పులు చేసిన వాడి పాపములన్నీ ఆ దేవుడు లెక్కపెడుతునే ఉంటాడు. పాపాలు చేసి గుడికి
వెళ్ళి దణ్ణాలు పెట్టుకున్నంత మాత్రానా పాపాలు పోయినట్టు కాదు అన్నాడు....
ఆయితే నువు చెప్పినట్టు తప్పులు చేయకపోవడం,
చట్టానికి లోబడి ఉండడం చేస్తే పుణ్యం చేసినట్లేనా? వారందరూ తిన్నగా స్వర్గానికి
వెళ్ళిపోవచ్చు అన్న మాట అన్నాడు నాయుడు.... కొద్దిగా తటాపయిస్తూనే ఆవునని
సమాధానమిచ్చాడు ఆశోక్.....
చూడబ్బాయ్ ఆశోక్.. నువ్వు కుర్రాడివి.. ఆ
మాత్రం దూకుడు ఉండడం కామన్ అనుకో.. కానీ వాస్తవాలు అంటే నిజాలు కూడా
తెలుసుకోవల్సియుంది అబ్బాయ్ నువ్వు అని మొదలెట్టాడు కృష్ణుడు అర్దునుడికి
గీతాపదేశం చేసినట్టుగా......
ధర్మం వేరు... తప్పులు వేరు...
పాప, పుణ్యముల లెక్క భగవధ్గీత, బైబిల్, ఖురాన్
మరియు యితర మత గ్రంధాల్లో చెప్పారు. దాని ప్రకారం పాప పుణ్యములు మూట కట్టుకొని
పోయేటప్పుడు వాటిని అనుభవిస్తాము. అంతే
కాని మనం మన అవసరాల కోసం ఏర్పరచుకొన్న రాజ్యాంగాలు, చట్టాలు పాటించామా లేదా అన్న దాన్ని బట్టి పాప
పుణ్యములు లెక్కకట్టరు..... చట్టాలు, రాజ్యాంగాలనేవి మనకు మనం విధించుకున్న ఒక
క్రమశిక్షణ లాంటిది... ఒక క్రమశిక్షణ అనేది లేకపోతే ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు
అనేది ఉండదు. అందుకని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రజలందరికీ ఒక టైమ్ టేబుల్ లాంటిది
లేక క్రమశిక్షణ లాంటిది ఏర్పరచి అందుకు అనుగుణంగా ప్రజలను పాలించడం కోసం
పెట్టుకున్నదిదీ... అన్ని దేశాల్లో చట్టాలు ఒకేలా ఉండవు.. ఒక దేశంలో ఉన్న చట్టం,
ఇంకొక దేశములో ఉన్న వారికి కొత్తగా లేక అసంబద్దంగా అనిపిస్తాయి. అన్ని దేశాల
సంస్కృతులు ఒకేలా ఉండవు కాబట్టి.. ఆయా సంస్కృతులకు అనుగుణంగా చట్టాలు
రూపొందించబడతాయి....
ఉదహరణకి పశ్చిమ దేశాల్లో అమ్మాయిల, అబ్బాయిలు
డేటింగ్ అన్నది చాలా కామన్ వ్యవహరం... పిల్లలకు పది సం.రాల వయసు నుండే కొన్ని
విషయాల్లో స్వేచ్చ ఉంటుంది అక్కడ. కొంత మంది తమ బాయ్ ప్రెండ్ లేదా గర్ల్ ప్రెండ్
తో కలిసి స్వంత ఇంట్లోనే తల్లిదండ్రులతో కలసి ఉంటారు. దానిని ఎవరూ తప్పపట్టరు..
ఎందుకంటే అది వారి సంస్కృతి. అదే మన
దేశానికి వచ్చే సరికి పెళ్ళి కాకుండా డేటింగ్ చేయడాన్ని చాలా ఘోరమైన తప్పుగా
భావిస్తారు. ఎందుకంటే సంస్కృతుల మధ్య ఉన్న భేదం కారణంగా. అంతే కాని మనకు సభ్యత
కాని దానిని పశ్చిమ దేశాల్లో యువత చేస్తున్నారని వారందరూ పాపములు చేస్తున్నట్టు
కాదు. ఆ విధముగా చట్టాలు, రాజ్యాంగాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న సంస్కృతులు, జీవన
విధానము ఆధారంగా ఏర్పాటు చేసినవే కానీ పాప, పుణ్యముల ఆధారంగా తయారు చేసినవి
కాదు....
అంటే చట్టాలను అతిక్రమించి తప్పుడు పనులు
చేయడం, లంచాలు తినడం, తప్పుడు పనులు చేయడం వలన పాపములు అంటుకోవా! అని కొద్దిగా
రోషంగా అడిగాడు ఆశోక్.....
నాయుడు కొద్దిగా నవ్వి, పాపపు పనులు చేయడం,
తప్పుడు పనులు చేయడానికి చాలా తేడా ఉంది....
నువ్ చెప్పినట్టు మీ ఇంటి ఓనర్ నే
తీసుకుందాం... అతను ఆఫీసులో లంచాలు తింటాడు. అది తప్పని నేను అంటాను. నువ్వేమో అది
పాపం అంటావు... అది పాపం అని ఏ దేవుడు ఎక్కడా చెప్పలేదే!!
అవతలి వాడు ఇవ్వబట్టే కదా, ఇవతలి వాడు
పుచ్చుకుంటాడు... అంటే దీనిని ఇచ్చిపుచ్చుకొనే పద్దతి అనవచ్చు... ఒక్కప్పుడు
దేశంలో వస్తువలన్నింటినీ ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలోనే ఉండేవి. మన దగ్గర ఉన్న
వస్తువులు లేదా సామాగ్రిని వేరేకరికి యిచ్చి బదులుగా వారి వద్ద నుండి మనకి
కావల్సినది తీసుకోనేవారు. దానినే వస్తు మార్పిడి పద్దతి అనేవారు. ఆ తర్వాతర్వాత
ద్రవ్యం చెలామణిలోకి రావడంతో ఇచ్చిపుచ్చుకోవడమంతా డబ్బు రూపంలోనే సాగుతుంది. అదే
మీ ఓనర్ చేస్తున్నాడు.....
ఇకపోతే అవతలి పార్టివాడు లంచం ఇవ్వడం వల్లనే తన
పూర్తి ఆవుతుందని లేదా లాభం కలుగుతుందని భావిస్తేనే లంచం ఇవ్వడానికి సిద్దపడతాడు.
కాబట్టి ఇక్కడ ఎవరూ ఎవరిని మోసం చేయడం లేదు.......
అదెలా కుదురుతుంది? ప్రభుత్వం అతనిని
నియమించింది లంచాలు తినమని కాదు కదా! నిబంధనలు సక్రమంగా అమలు చేయమనే కదా జీతం
ఇస్తుంది! అలాంటప్పుడు దానికి విరుద్దంగా వ్యవహరించడం తప్పే కదా అన్నాడు ఆశోక్....
తరువాయి భాగానికి ప్రక్కన క్లిక్ చేయండి.. ఇంకావుంది...
తరువాయి భాగానికి ప్రక్కన క్లిక్ చేయండి.. ఇంకావుంది...
No comments:
Post a Comment