Friday 28 December 2012

మాటలు రావడం లేదు..

సింగపూర్ లో చికిత్స పొందుతున్న మన సహోదరి
సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళిపోయింది......

తనకు ఇంకా బ్రతకాలని ఉన్నప్పట్టికి, దేవుడు
తనకి ఇది సరయిన స్దలం కాదని భావించి,
తనతో పాటుగా తీసుకెళ్ళిపోయాడు...

ఇక ఏ రాక్షసుడు తనను దరిచేరలేనంతగా
దూరంగా వెళ్ళిపోయింది....

జరిగిన అన్యాయం గురించి కించిత్ కూడా
విచారం వ్యక్తం చేయలేదు సరికదా..
మద్దతుగా వచ్చిన మహిళలు సింగారించుకొని
వచ్చారని ఒకడు,, అర్ద్దరాత్రి బయటకు వెళ్ళడం
ఆ అమ్మాయి తప్పే అని చెప్పేవాడింకొకడు....

ఇలాంటి వాళ్ళు పాలిస్తున్న దేశములో
ఎవరైనా సురక్షితంగా ఉండగలమని భావించగలమా...

దేవుడు భావించలేదు... అందుకే తనతో
తీసుకొనివెళ్ళిపోయాడు.....

నీ అత్మకి ఆ పై లోకంలో శాంతి కలగాలని
అందరూ కోరుకుంటున్నారు...

Thursday 27 December 2012

ప్రశ్నించే కొత్తతరం...

ఈ మధ్య ఆఫీసులో చాలా బిజీగా ఉండడం వలన, మరియు బయట కూడా సరయిన ఖాళీగా లేకపోవడం వల్ల ఇదివరకులా బ్లాగింగ్ చేయడానికి కుదరడం లేదు.
ఖాళీ దొరికినప్పుడు వ్రాద్దామంటే ఏమి తట్టడం లేదు.. కానీ ఈ మధ్య చాలా విషయాల మీద వ్రాద్దామని అనుకున్నా... కాని దేని మీద రాయడానికి కుదరడం లేదు...
ఢిల్లీ విద్యార్దిని రేప్ ఘటన, నరేంద్ర మోడీ విజయం, ఏపిపిఎస్సి అవినీతి భాగోతం ఇంకా చాలా విషయాల మీద రాద్దామని అనుకొన్నా.. కాని రాయలేకపోయా..
కాని ఢిల్లీలో విద్యార్దిని మానభంగంపై ఢిల్లీలో వెల్లువెత్తిన నయా యువతరం నిరసన చూసి రాయకుండా ఉండలేకపోతున్నా... నిజానికి ఇది జరిగి వారం రోజులయింది... కానీ లేటుగా ఆయిన నా అభిప్రాయాలు మీతో పంచుకోవలనిపించింది...

చాలా రోజుల క్రిందట, నా రూమ్మేట్ తో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాను.
ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు గురించి చర్చించుకుంటున్నాము. అందులో పనికి వచ్చేవి, పనికిరానివి ఉన్నాయి..

ఈజిప్టులో విప్లవం, లిబియాలో విప్లవం దరిమిలా నియంతలు కుప్పకూలడం...గురించి టాపిక్ వచ్చింది..
మన దేశంలో రాజకీయనాయకులు విచ్చలవిడి అవినీతి చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడలేదేంటి అని అడిగా.... ఇది నిజంగా మన వ్యవస్దలో ఉన్న లోపము కదా అని కూడా అడిగాను..

దానికి మా రూమ్మేట్ చిన్నగా నవ్వి, ఏదైనా సమస్య మితిమీరితే ప్రజలు ఆలోచనసరళి మారుతుంది, తద్వార వ్యవస్ద తనంతతానుగా మారుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టడం తప్ప ఏమి చేయలేము అని అన్నాడు. అంతే కాదు... ఒకప్పుడు ఎమ్.ఎల్.ఎ., గాని ఎమ్.పి., గాని బయటకు వస్తే దారంతట ఉన్న ప్రజలు గౌరవసూచకంగా నిలబడి విష్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవడూ పట్టించుకోవడం లేదు కదా...

ఆ విధంగా రాజకీయ నాయకులకు ప్రజల మీద గౌరవం తగ్గినప్పుడు, ప్రజలు కూడా వారి ఉనికిని మర్చిపోతారు. అంటే వ్యవస్ద్ద దానికదే మారుతుంది అని అన్నాడు....

ప్రభుత్వాలు ప్రజలను ఏనాడో పట్టించుకోవడం మానేసాయి. అలాగే మెజారిటీ ప్రజలు ప్రభుత్వాన్ని పట్టించుకోవడం మానేసారు... కానీ ఏదోక రోజు వారిలో అసహనం ఒక్కసారే పుట్టుకొస్తుంది... ప్రజల్లో అసహనం వచ్చిన నాడు వ్యవస్ద ఆటోమేటిక్ గా దానంతట అదే మారిపోతుంది అని అన్నాడు.
అంటే ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మిగతావన్నీ అటోమేటిక్ గా అవే మారిపోతాయి అని చెప్పాడు.


అంటే ఇప్పటికప్పుడు మన వ్యవస్ద బాగుపడే మార్గం లేదా? అని అడిగాను...

ప్రశ్నించే వారు ఉన్నప్పుడు మారుతుంది అన్నాడు...


మొన్న ఢిల్లీలో వెల్లువెత్తిన నయా యువతరాన్ని చూసి అది నిజమేనేమో అనిపించింది.... మొన్నటికి మొన్న నా బ్లాగ్ లో తొంభై శాతం మంది భారతీయులు ఇడియట్సే అన్న కట్టూ వ్యాఖ్యలను సమర్దిస్తూ రాసాను. కాని ఢిల్లీలో తమ తోటి భారతీయురాలిపై జరిగిన ఆకృత్యానికి స్పందించిన యువతరాన్ని చూసి అది కరెక్ట్ కాదెమో అనిపించింది....
SHAKING SOCIETY’S CONSCIENCE: It is important for women to raise their collective voice, but it should be for all women and all victims of the violence embedded in our society. Photo: S. R. Raghunathan
ఏదోక రోజు ప్రజల్లో అసహనం వచ్చిన రోజు, వ్యవస్దలో అటోమేటిక్ గా మార్పు అదే వస్తుంది అని చెప్పిన నా రూమ్మేట్ మాట అక్షరసత్యం అనిపించింది.

తొలిరోజు కొంత మందితో ప్రారంభమయిన నిరసన, గంటలు, రోజులు గడిచేసరికి వేలు, లక్షలు యువత నిరసనలో పాల్గోన్నారు.. వీరంతా ఎవరికి వారు స్వచ్చందంగా వచ్చినవారే...

వీరి వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు... ఒక నాయకత్వం లేదు.. ఒక ప్లాన్ లేదు... కానీ వారందరూ ప్రశ్నించడానికి వచ్చారు... అంతే కాదు భాదితురాలికి అండగా నిరసన తెలిపారు. అది కూడా శాంతియుత పద్దతిలో.... భారతదేశంలో యువత అనిశ్చితిలో ఉందని ఎవరయినా అనగలరా ఈ జనసముద్రం చూసి?....

ఇంతకు ముందు పలుమార్లు ఢిల్లీలో ఇలాంటి అకృత్యాలు చాలానే జరిగినప్పటికీ, ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు శూన్యం... ప్రజలు కూడా భాదపడ్డారు తప్పితే బయటపడలేదు. ప్రభుత్వాలు పట్టించుకోవడమే మానివేసాయి...

ఇప్పుడయినా, ఢిల్లీ యువత రోడ్డెక్కపోయి ఉంటే, ఈ అకృత్యం కూడా పలు అకృత్యాల్లో భాగంగా రెండో రోజుకే తెరమరుగు ఆయిపోయేది.

కానీ ప్రశ్నించడానికి కొత్త తరం పుట్టుకొచ్చింది... ఒక్కడే ఆయితే వాడు గొంతు కొంత దూరం మాత్రమే వినబడుతుంది... అదే కొన్ని లక్షలు గొంతుకలు ఒక్క సారే వెలుగెత్తితే, అది ప్రభుత్వ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది....

ఎస్... ప్రశ్నించే పని మనం చేయనప్పుడూ, అభివృద్ది గురించి లేదా యితర అంశాలు గురించి మాట్లాడే హక్కు లేదు మనకు.....

జరిగిన అరాచకంపై యువతరం ప్రశ్నించిన  తీరుకు, చూపించిన తెగువకు ప్రభుత్వం మోకాళ్ళ మీద దిగజారుకుంటూ వచ్చింది... అది ప్రశ్నించడంలో ఉన్న పవర్.....

నేను చాలా గర్వంగా ఫీల్ ఆవుతున్నాను... రాష్ట్రపతి భవన్ వద్ద తోటి భారతీయురాలుకి జరిగిన ఆకృత్యంపై గొంతెత్తిన నయాయువతరానికి నా జోహర్లు... వారే కనుక గొంతెత్తి ఉండకపోతే, ఈ అంశం రెండు రోజులకే కనుమరుగు ఆయిపోయి ఉండేది... వారు ఇచ్చిన దెబ్బకి ప్రభుత్వం చట్టం బలోపతం కావడానికి తీసుకోవలసిన చర్యలకు ఉపక్రమించింది...

రేపైనా ఆడపిల్ల భద్రంగా ఉంటుంది కదా.....

మనం ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజు, వ్యవస్ద ఆటోమేటిక్ గా అదే మారుతుంది....
ఇది నిజం....

ఈ యువత నిరసనలపై కొంత మంది మేధావులనబడే నాయకులు (షిండే, బొత్స) కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసారు. అది వారి సంస్కారానికి వదిలేద్దాం... ఎందుకంటే ప్రజల్లో వారికున్న విలువను వారే పతనం చేసుకొంటున్నారు కాబట్టి.....



Tuesday 18 December 2012

మరి మిగతా ఆటగాళ్ల మాటేంటి?

సచిన్ కి ఆడాలని  ఉన్నప్పుడు అతనిని
రిటైర్ ఆవమని అడగడం ఉత్తమం కాదు.
తనకి ఆడాలని కోరిక ఉన్నప్పుడు మనం
అడ్డుకోవడం భావ్యం కాదు అని విశ్వనాధన్
ఆనంద్ పాటుగా చాలా మంది కామెంటిచ్చారు...

మరి ఇప్పటికీ కూడా ఆడగలిగే సత్తా మాత్రమే కాదు,
నిలబడి గెలిపించే సత్తా ఉన్న రాహుల్ ద్రావిడ్,
వి.వి.ఎస్.లక్ష్మణ్ విషయములో ఎందుకు చెప్పలేదు...

ఆడాలన్న కోరిక ఉండడానికి, తన వల్ల దేశానికి
గల ఉపయోగానికి  మధ్య ఉన్నతేడాని తెలుసుకోవాలి.
ఆడాలన్న కోరిక ఉన్నంతకాలం ఆటగాళ్ళను ఆడిస్తే
ఇక ఎవరూ రిటైర్ కానవసరం లేదు...

సచిన్ లెజెండర్ ప్లేయర్... ఇది ఎవరూ కాదనలేని
వాస్తవం.. కాని అది టీమిండియాకి ఉపయెగపడినంత
వరకే.... ఆటగాడు తన వ్యక్తిగత ప్రదర్శన దేశ క్రికెట్ కి
ఉపయెగపడినంత వరకే విలువుంటుంది.....

అందుకే రికి పాంటింగ్ కూడా సచిన్ కన్నా లారానే ఉత్తమ
క్రికెటర్ అని కితాబిచ్చాడు. ఎందుకంటే లారా ఆట
టీమ్ యొక్క లక్ష్యాలను బట్టి సాగుతుంది. క్రికెట్ అడడం
టీమ్ యొక్క లక్ష్యాలను బట్టి సాగాలే కాని తమ లక్ష్యాల బట్టి
సాగకూడదు.....


తాలిబాన్ల రాజ్యాంగం బెటరేమో

నిన్న న్యూఢిల్లీలో పారామెడికల్ విద్యార్ది పై
 జరిగిన అకృత్యానికి కారణమయిన కీచకులకు
తాలిబాన్ లు అమలుపరచిన శిక్షని అమలుపరిస్తే
బాగుంటుందేమో....

పది మంది ముందు తప్పు చేసిన నేరస్దులను
తాలిబాన్లు పబ్లిక్ గా దయదక్షిణాలు లేకుండా అతి
కిరాతకంగా చంపినప్పుడు అయ్యో పాపం అని
అనిపించింది కాని...

నిజానికి దేశములో మరే ఆడపిల్లకి ఇంకొకసారి
ఇలాంటి దారుణం జరగకూడదంటే, అలాంటి
కీచకుల విషయములో తాలిబాన్ల  రాజ్యాంగం
 అమలు చేయడమే ఉత్తమం ఏమో.......

Sunday 9 December 2012

భారతీయ “ఇడియట్స్”..


భారతీయుల్లో తొంభై శాతం మంది ఇడియట్స్ అని వ్యాఖ్యానించిన మార్కండేయ కట్టూ వ్యాఖ్యలు వింటే నాకు కరెక్టే అనిపించింది. అంతే కాకుండా వీరిని మతం లేదా కులం ప్రతిపాదికన చాలా ఈజీగా ప్రభావితం చేయవచ్చునని  అన్న మాటల్లో యదార్దం ఉంది. వీరిలో ఉన్నత వర్గాలు, విద్యావంతులు కూడా ఉండడం చాలా విచారకరం. చాలా మంది ప్రజలు లేదా విద్యావంతులుకు పార్లమెంటు చేసే చట్టాలు గురించి కనీస అవగాహన లేక సమాచారం లేనప్పటికీ, ప్రభుత్వాలు లేదా పార్టీలు చేసే మతపరమైన ప్రకటనలకు మాత్రం చాలా తొందరగా ప్రభావితం కావడం మన వ్యవస్దలో ఉన్న లోపం. అంతే కాకుండా తాము ఎన్నుకునే నాయకులను కూడా మత, కుల ప్రతిపాదకన ఎన్నుకోవడం ఏ విధముగా అనుకోవాలి. పైగా సదరు మత, కుల ప్రతిపాదకన ఎన్నిక కాబడిన నాయకులు దేశానికి ఏమి చేసారన్న దాని కన్నా, తమకు ఏమి చేసారన్న దానిమీదే దృష్టి ఉండడం ఇడియట్స్ లక్షణాలు కాకపోతే ఏమనాలి? న్యూడిల్లీలో మత ఘర్షణలు రేకేత్తించడానికి ఒక రెండు వేలు రూపాయలు చాలు. దానితో ప్రజల మధ్య ఉద్రికత్తలు సృష్టించవచ్చు. దానికి చేయవలసినదల్లా ఏదైన ఒక మత స్దలంను అపవిత్రం చేయడం అన్న ఖట్టూ వ్యాఖ్యలు చూస్తే అందులో వంద శాతం నిజముందని చెప్పవచ్చు. ముందుగా ప్రజలు వివేకంతో ఆలోచించగలగాలి. ఆ రోజే వాస్తవానికి ఏమి జరుగుతుందన్నది గమనించగలరు. ఆ వివేకం నేటి విద్యావంతుల్లో కూడా కొరవడడం చాలా విచారకరం.

Thursday 15 November 2012

సాయపడే మనసులింకాయున్నాయి......


మొన్న ఆ మధ్య రౌతులపూడిలోని మా పొలంలో చేస్తున్న పనులను చూడడానికి రమ్మని మా బావ ఫోన్ చేస్తే, సరే ఒకసారి చూసి వద్దామని బయలుదేరాను.. బడలిక దృష్ట్యా బైక్ మీద వెళ్ళేకంటే బస్సు మీద వెళ్ళడం బెటరనిపించి రౌతులపూడి మీదుగా వెళ్ళే కోటనందూరు బస్సులో బయలుదేరాను.

అప్పటికి సాయంత్రం మీదన పనులు పూర్తయిన వాళ్ళందరితో బస్సు కిక్కిరిసి పోయింది.. నాకు మాత్రము బస్సులో కండక్టరు వెనక రెండు లైన్ల వెనక కిటికి ప్రక్కన సీటు దొరికింది....

హమ్మయ్య అనుకొని దొరికిన సీటులో కూర్చుని, బస్సు ముందుకు వెళుతుంటే రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లు వెనక్కు పరిగెడుతున్న దృశ్యం చూసి చాలా ఆనందం వేసింది...

అప్పటికి బస్సులో సరదాగా ప్రయాణించి చాలా రోజులయ్యింది... కొంతసేపటికి బస్సు కత్తిపూడి చేరుకుంది. అప్పటికి బస్సులో జనం తగ్గలేదు సరికదా ఇంకొంత మంది జనం తోడయ్యారు...

బస్సు బయలుదేరిన తర్వాత యదాలాపంగా జనంలోకి చూసిన నాకు అక్కడ రోజుల వయసున్న బిడ్డతో ఒకామె మరియు ఆవిడ తల్లి గారు అనుకుంటాను, ఇద్దరు కలసి ఆ బస్సులో ఆ జనాల తోపులాటలో నిలబడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు... వెంటనే లేచి ఆ బిడ్డ తల్లికి సీటు ఇస్తే బాగుంటుందనిపించింది.

కాని తను నాకు చాలా దూరంలో యుంది. మరియు ఆ గందరగోళ పరిస్దితులో నా పిలుపు వారికి అందలేదు.... ఇక లాభం లేదని పైకి లేచి నిలబడదామనుకొనేసరికి కండక్టర్ వెనక సీటులో ఉన్న యువకుల్లో ఒకతను లేచి ఆ బిడ్దల తల్లికి స్దానం ఇచ్చాడు... కొద్ది సెకనుల్లోనే ప్రక్కనే ఉన్న ఇంకో యువకుడు కూడా లేచి ఆమె తల్లికి సీటు ఇచ్చాడు.... ఆ దృశ్యం చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది...

ఎందుకంటే అంతకు ముందు స్టేజిలోనే సీటు గురించి ఒక పెద్ద మనిషితో గొడవపడి మరి ఆ సీటులో కూర్చున్నాడు. అప్పుడు అనుకొన్నా... ఏంటి మనవాళ్ళు మరి ఇంతగా స్వార్దపరులవుతున్నారని..... కాని అదే యువకుడు ఇప్పుడు ఒక బిడ్ద తల్లికి సీటు ఇచ్చి మనలోని విలువలు ఇంకా బ్రతికేయున్నాయని తెలియపరిచాడు... అంటే మనలో చాలా మందికి స్వార్దమున్నప్పటికి, అవసరమైనప్పుడు సహయము చేయడానికి కూడా మన తెలుగు వారు ఎంత ముందు ఉంటారో తెలిసింది....

అందుకనే ఇప్పుడు అంటున్నా సాయపడే మనసులింకాయున్నాయి అని......

 

సమాధానం దొరకని ప్రశ్న....


వారాంతపు శెలవులకు అడపాదడపా ఇంటికి వెళ్ళడం నాకు అలవాటు..

ఇది వరకూ సాయంత్రం ఆఫీసు కాగానే బైక్ మీద వెళ్ళిపోయేవాడిని. గత సంవత్సర కాలము నుండి బైక్ మీద మానివేసి, ఆర్టీసి బస్సులో వెళుతున్నాను. ముడి చమురు వినియోగము తగ్గించుకొని, సాధ్యమైనంత వరకు ప్రజా రవణా వ్యవస్దను ఉపయోగించుకొనమని ప్రభుత్వం వారు బ్రతిమాలుతున్నారని నేను ఆ పని చేయట్లేదు.. ఇది వరకులా బైక్ రైడింగ్ ని ఎంజాయ్ చేయలేకపోవడం మరియు ఇతరత్ర కారణాలతో బస్సు ప్రయాణానికి అలవాటు పడ్డా...

మా ఊరు వెళ్ళాలంటే ముందుగా తుని వెళ్ళి, అక్కడ నుండి పదహారు కిలోమిటర్లు లోపలికి వెళ్ళాలి. బస్సు సౌకర్యం లేదు. ఇప్పటికీ చాలా పల్లెలకు బస్సు సౌకర్యం లేదు కదా, చాలా దౌర్బగ్యం అని ఫీలవ్వకండి. ఎందుకంటే మా ఊరికి నేను పుట్టక ముందు నుండే బస్సులు తిరిగేవి. ప్రపంచికరణ జరిగి ఈ హైటైక్ యుగంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తుంటే, సరైన గిరాకీ రావట్లేదని ఆరు సం.ల నుండి ఆర్టీసి బస్సులు మా ఊరికి ముఖం చాటేసాయి. దానితో ఆటోలదే రాజ్యం... ఇష్టమున్నోడు ఆటోలో సర్కస్ ఫీట్స్ చేస్తూ, వేలబడుతూ, ఊగుతూ, బుర్ర ఆటో పై రాడ్ కి కొట్టించుకుంటూ వెళ్తాడు. ఇష్టం లేని నాలాంటోడు ఊరి నుండి ఎవరినన్నా బైక్ మీద రమ్మని చెప్పి వాడితో కూడా వెళ్తాడు. నాకు ఆ సమస్య లేదు లెండి. ఎందుకంటే నాకు తునిలో ఒక బైక్ ఉంది.  దాని మీద వెళ్తుంటాను. (ఆ ముక్క కూడా బస్సు ఉంటే, ఎంచక్కా బస్సే ఎక్కిసేవాడిని).

కాకినాడ బస్సు కాంప్లెక్స్ కి వెళితే అక్కడ విశాఖపట్నం వైపు వెళ్ళే సర్వీసు బస్సులు ఉంటాయి. అంతే కాకూండా డొక్కు బస్సులు, సూపర్ డొక్కు బస్సులు ఉంటాయి తుని వెళ్ళడానికి. (నేనోదో వెటకారానికి అనలేదు, నిజంగానే అవి డొక్కు బస్సులు). డొక్కు బస్సులు చేయేత్తిన ప్రతి చోట ఆపుతాడు. సూపర్ డొక్కు బస్సులు డ్రైవర్ కి మూడ్ వచ్చిన చోటల్లా ఆపుతాడు. సాధ్యమైనంతవరకు ఇవి ఎక్కను ఎందుకంటే, ఇవన్నీ పిఠాపురం ఊర్లో నుండి వెళతాయి. ఆయితే ఏంటంట అనుకుంటున్నారా?

ఇప్పుడు మీరు హైదరబాద్ నుండి ముంబాయి వెళ్ళాలనుకొండి? ఎలా వెళ్తారు. డైరెక్టుగా ముంబయి ఫ్లయిట్ ఎక్కుతారా లేక న్యూడిల్లి వెళ్ళి అక్కడ నుండి ముంబయి వెళ్తారా? తిక్క ప్రశ్న అని అనుకోకండి...

న్యూడిల్లీలో పని ఉన్నవాడు మాత్రమే అలా వెళ్తాడు. మిగతా వారు తిన్నగా పోతారు కదా అంటారు...

ఇది కూడా అలాగే. పిఠాపురంతో పని ఉన్నోడు మాత్రమే పిఠాపురం టౌన్ లోకి వెళ్ళడానికి సాహసిస్తాడు. పని లేనోడు డొక్కు బస్సు ఎక్కి వెళ్ళాడనుకొండి.. వాడికి ఒక గంట హాంఫటే....

అందుకని సాధ్యమైనంత వరకు పిఠాపురం ఊళ్ళోకి వెళ్ళని ఎక్సెప్రెస్ బస్సులే ఎక్కుతాను. దాని వలన ఒక గంట టైమ్ మిగులుతుంది.

ఇకపోతే ఇక అసలు విషయానికి వస్తాను....

ఎక్సెప్రెస్ సర్వీసు బస్సులన్నీ హైవే మీద ఉన్న బస్సు కాంప్లెక్స్ మీదుగా వెళ్ళిపోతాయి. తుని టౌన్ లోకి వెళ్ళవు. మా చెల్లాయి తునిలోనే ఉంటుంది. తనని చూడడానికి అప్పుడప్పుడు వెళ్తుంటాను. దాని కోసం అన్నవరంలో దిగిపోయి అక్కడ నుండి డొక్కు బస్సు ఎక్కి తుని టౌన్ లో ఉన్న మా చెల్లాయి ఇంటికి వెళ్తుంటాను. డొక్కు బస్సులు బస్సు కాంప్లెక్స్ కి వెళ్ళవు. టౌన్ లోకే వెళ్తాయి.

అలా ఒకసారి తుని టౌన్ లోకి వెళ్ళడానికి డొక్కు బస్సు  కోసం అన్నవరం బస్ కాంప్లెక్స్ లో ఎదురుచూస్తుండగా, యధాలాపంగా నా దృష్టి ఫ్లాట్ ఫారం చివర నుండి లోపలికి వస్తున్న ఒక వ్యక్తి మీద ఫోకస్ ఆయింది. అతనికి పోలియో అనుకుంటా.. కాళ్ళు రెండు చచ్చుపడిపోయిఉన్నాయి. ఒంటి మీద బట్టలు కూడా బాగోలేదు. స్నానం చేసి చాలా రోజులయినట్టుంది. దేక్కుంటూ వాటర్ ట్యాంక్ వద్దకి వచ్చి చేతులు కడుక్కొని, నా ఎదురుగా ఉన్న ఒక కొట్టు ప్రక్కకి వచ్చి వున్నాడు. నేను అతడినే దొంగ చాటుగా గమనిస్తున్నాను. అతనికి బహుశా సుమారు ఇరవై ఏళ్ళు ఉండోచ్చు అనుకుంటాను. నాకు చాలా భాద అనిపించింది. ఇంతలో ఎవరో ఒకతను వచ్చి టిఫిన్ అందించి వెళ్ళిపోయాడు. దానిని శుభ్రంగా తిని, చేతులు కడుక్కొని తిరిగి ప్లాట్ ఫారం చివరకు వెళ్ళిపోయాడు. మానసిక స్దితి చాలా చక్కగా ఉంది.

మనకు అన్ని అవయువాలు బాగా ఉండి, కష్టపడుతూ డబ్బు సంపాదించుకుంటూ, బ్రతుకుతూ ఉన్నప్పట్టికి, మనలో ఏదో అసంతృప్తి రాజ్యమేలుతుంటుంది. ఎవరి గురించో ఎందుకులెండీ... నా గురించి చెప్పుతున్నా....

నిజానికి నేను ఇప్పటికీ హ్యాపిగా ఉన్నానని చెప్పలేను. దానికి కారణం ఏమిటన్నదీ కూడా మనకి తెలియదు. జస్ట్ అంతే.... ఏదో తెలియని అసంతృప్తి... జీవితాన్ని ఆనందంగా అనుభవించలేని మానసిక రోగులం.....

అలా అతనిని దొంగ చాటుగా చూస్తున్నా... తన స్దితికి అతను ఏమైనా ఫీల్ అవుతున్నాడా అని చూసా... కాని అతని కళ్ళలో అలాంటిది ఏమి కనబడలేదు. పైగా నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించాయి. చటుక్కున ముఖం త్రిప్పివేసేసుకున్నాను. మరల చూసా అతని ముఖంలోకి తరచి తరచి... ఏ కోశానా కూడా తన స్దితి గురించి భాదపడుతున్నట్టుగా లేవు.. ఆ కళ్ళలో జీవం తొలకలడుతుంది. అతని చిరునవ్వులో ఎన్నో విషయాలు దాగున్నాయి అనిపించింది... మరి నేనేందుకు అతనిలా అనందంగా ఉండలేకపోతున్నాను?? సమాధానం దొరకడం లేదు. ఇంతలో డొక్కు బస్సు రావడంతో వెళ్ళిపోయాను.

మరల ఇంకొకసారి వచ్చినప్పుడు, మరల వచ్చినపుడు, ఇంటికి వెళ్ళిన ప్రతీసారీ అన్నవరం బస్ కాంప్లెక్స్ కి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతాయి. అతను కనిపించిన తర్వాత ముందుగా అతని కళ్ళలోకి చూస్తా...  ఎప్పుడూ చూసిన అదే పవర్... అదేంటో నాకు అర్ద్రం కావడం  లేదు. ఒకసారి నేను చూసినపుడే, అతను కూడా నావైపు చూసాడు. అతని ప్రశాంత మనసు అతని కళ్ళలో ప్రతిబింభిస్తుంది... చిన్నగా నవ్వాడు...

ఆ నవ్వు నాలో బోలెడన్నీ ప్రశ్నలు మిగిల్చింది..... ఒరే ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.. దేవుడిచ్చిన జీవితంను అస్వాదించండి. అంతే కాని లేనిపోని ఆలోచనలతో మనసుని పాడుచేసుకోకండీ..... ప్రతిక్షణం ఆనందంగా ఉండండి అని చెబుతున్నాడా? ఏమో నాకైతే తెలియదు. ఎందుకు అతను అంత నిశ్చలంగా ఉండగలుగుతున్నాడో.....

దేవుడు అందరికీ అన్నీ సమానంగా ఇవ్వలేదు... అందరికీ ఎంతో కొంత పెడతాడు. ఎంతో కొంత పెట్టడు.... కాని మనసుని జయించగలిగిన విద్య ఎవరికి ఇస్తాడో, వారే జీవితాన్ని జయిస్తారు.

నాకు నా స్దితి గురించి పూర్తిగా తెలియకుండానే, ఇంకొకడి మీద జాలి చూపించాను. నేను ఎవరి మీదయితే జాలిపడ్డానో, అతను దానిని ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే నన్ను అలోచింపదేసింది. మన జాలి మీద అధారపడేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.  పైగా అతనే నా పరిస్దితి చూసి జాలిపడ్డాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి మీద జాలి పడాలో...... సమాధానం దొరకని ప్రశ్న ఇది...

అతను నన్ను బాగా ప్రభావితం చేసాడని మాత్రం చెప్పగలను....

Saturday 3 November 2012

రాంబాబూ.... ఇలా ఆయిపోయావేంటి?


నా ఇంటర్ మీడియట్ చదివే రోజులు.... అప్పటి వరకు కార్పోరేటు కాన్వెంటులో చదివి, మన ప్రమేయం లేకుండానే జీవితమంతా ఒక అర్డర్ ప్రకారం జరిగిపోయేది...

ఇంటర్ కి వచ్చాకా, స్వేచ్చా ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తున్న రోజులవి. అందులో ఇప్పుడు మాట్లాడబోయేది సినిమా లోకం గురించి...

అప్పటి వరకు నాన్న గారు దయతలచి సినిమాకు తీసుకువెళ్తే్ అదే పండుగ. మరలా ఎప్పుడు తీసుకువెళ్తారో మనకు తెలియదు. ఆయన ఏ సినిమాకు తీసుకువెళ్తే, ఆ సినిమానే నోర్మూసుకొని చూడాలి. నా సినిమా నాలెడ్జ్ ఎలా ఉండేదంటే, టి.వి.లో వచ్చే పాటలను చూసి ఆ సినిమా రిలీజ్ ఆయిందో, లేదో కూడా తెలేసేది కాదు. 

అలాంటి సమయంలో నేను ఇంటర్ లోకి వచ్చాను. నాకు టెన్త్ లో మంచి మార్కులు రావడంతో మంచి గవర్నమెంటు కాలేజిలో సీటు వచ్చింది. దానితో మా నాన్నగారు ఏమీ ఆలోచించకుండా జాయిన్ చేసేశారు. అంతే కాదు క్రమశిక్షణలో కూడా కొద్దిగా సడలింపు యిచ్చారు. కాని నేను ఏనాడు దానిని దుర్వినియెగం చేయలేదు. 

మేము ఇంటర్ గవర్నమెంటు కాలేజిలో చేరడంతో, నోట్సు కోసం బయట వేరేగా సబ్బెక్సు కోసం ట్యూషన్ లకి వెళ్ళేవాళ్ళము. కాలేజి ఒక పూటే ఉండేది.  సాయంకాలం సమయములో ట్యూషన్స్ కి వెళ్ళేవాళ్ళము. ట్యూషన్స్ ఆయిపోయిన తర్వాత సైకిలు మీద వెళ్తూ సినిమా వాల్ పోస్టర్స్ ని గమనిస్తూ వెళ్ళేవాళ్ళము. అలా నాకు సినిమాలంటే లైక్ ఏర్పడింది. సినిమాను సినిమాగా కాకుండా అందులో ఉన్న సాంకేతిక అంశాల మీద కూడా లైక్ ఏర్పడింది. దానితో ప్రతి సినిమా వాల్ పోస్టర్ ని గమనించి, ఆ సినిమా బాగుంటుందో , లేదో అని గెస్ చేసేవాడిని.

అలా ఉండగా, ఒక రోజు ట్యూషన్స్ ఆయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే, ఒక పోస్టర్ ని చూడమని నా స్నేహితుడు చెబితే, చూసా... చూడగానే ఆ పోస్టర్ మీద మంచి అభిప్రాయం కలగలేదు. అది “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”.  హిరో ఎవరో తెలియదు. అచ్చోచ్చిన వెధవలు అందరూ సినిమాల్లో నటిస్తే ఇలాగే ఉంటుంది అని అనుకొన్నాను.

ఏం పేరా అని చూస్తే కళ్యాణ్ బాబట....

ఇంకొక ఆరు నెలలు గడిచిన తర్వాత, అదే హిరోతో “గోకులంలో సీత” అనే సినిమా వచ్చింది. నా స్నేహితుడు ఆ పోస్టర్ చూపించి, అందులో హిరో చిరంజీవి తమ్ముడంట. సినిమా బాగానే ఉందట అని చెవిలో ఊదాడు. దానితో ఒక రోజు ఖాళీ చేసుకొని, ఇంటిలో చెప్పి ఆ సినిమాకు వెళ్ళా... ఏంటో సినిమా అంతా అదోలా అనిపించింది. బాగుందని కాదు.. బాగోలేదని కాదు... చిరంజీవి తమ్ముడు కాబట్టి పర్లేదులే అని అనిపించింది.

అలా ఇంకోక ఆరు నెలలు గడిచింది, ఈ సారి సుస్వాగతం సినిమా రిలీజ్... చాలా రోజుల వరకు ఆ సినిమా గురించి పట్టించుకోలేదు. కాని కాలేజిలో మాత్రం ఆ సినిమా గురించి గోల గోల ఆయిపోయింది. ఇంటిలో చెప్పి సినిమాకు వెళ్ళా... బయటికొచ్చిన తర్వాత అనుకున్నా... సెంటిమెంటు సీన్స్ అదరగొట్టేసాడు. ప్రకాశ్ రాజ్ ఇరగదీసేశాడు అనుకున్నాను. బానే ఉందిలే అనుకున్నాను.

మరల సంవత్సరం గడిచింది... ఈ సారి “తొలిప్రేమ” రిలీజ్... రిలీజ్ నుండి యూత్ మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకోవడం. అప్పటికే కళ్యాణ్ బాబు మీద ఒక బెస్ట్ ఇంప్రెస్ ఏర్పాడంతో, సినిమా చూసా. బయటికి వచ్చాక మైండ్ బ్లోయింగ్...

ఎందుకంటే ఈ సారి సినిమాలో నటించింది కళ్యాణ్ బాబు కాదు... పవన్ కళ్యాణ్....

వావ్.. ఏం తీసాడు. చాలా సీన్లు నన్ను చూసి కాపీ కొట్టినట్టుగా కూడా అనిపించింది.... కాదు కాదు... నేనే ఆ సినిమాను కాపీ కొట్టానేమో అనిపించింది. చాలా సీన్లు నిజజీవితంలో జరిగినట్టుగా ఎంత నేచురల్ గా యాక్ట్ చేసాడు. ముఖ్యంగా పాటలు... అబ్బో... ఎక్కడ చూసిన అవే.... అప్పటి మా నాలెడ్జ్ కి అదే సూపర్ క్లాసికల్ సినిమాగా కనబడింది. మరల మరల చూడాలనిపించేది. చెల్లిగా నటించిన దేవకి, ప్రియురాలుగా నటించిన కీర్తిరెడ్డి సూపర్ గా యాక్ట్ చేసారు. రెండో సారి చూడాలనిపించి మరల వెళ్ళా, అమ్మకి చూపించాలని మరల వెళ్ళా, చెల్లికి చూపించాలని మళ్ళి వెళ్ళా... అలా పద్దెనిమిది సార్లు చూసా ఆ సినిమాను(ఇంట్లో తెలియదులెండి)...

అప్పటికి పవన్ కళ్యాణ్ స్టైల్ కి పూర్తిగా ఫిదా ఆయిపోయా.....

ఆ స్టైల్, కళ్ళలో ఆ పవర్, బాడీ లాంగ్వేజీ ఇలా అన్ని కూడా తనను మిగతా హిరోల నుండి వేరు చేసేవి.

ఆ తర్వాత ఇంకొక సంవత్సరం పోతే కాని రాలేదు “తమ్ముడు” సినిమా... అది కూడా సూపర్ హిట్టే.. ముఖ్యంగా కాలేజికి బంక్ కొట్టి చదువులో వెనుకబడిన వారిని బాగా సంతృప్తి పరిచింది.( నేను అప్పుడు కూడా ’ఎ’ క్లాస్ విద్యార్దినే). ముఖ్యంగా పాటలు... అందులోను రమణ గోగుల అందించిన “వయ్యారిభామ నీ హంస నడక....” మాట సూపర్ హిట్... అది కూడా సూపర్ హిట్ మూవీ ఆయి కూర్చుంది.. మా కాలేజి మొత్తం పవన్ కి ఫిదా ఆయిపోయారు.

మరల ఇంకో సంవత్సరం గ్యాప్...

ఆయినా సినిమా రాదే... వాడికి ఇంత బద్దకమేంటిరా బాబూ అనుకొనేవాళ్ళం.

ఎటువంటి హడావుడి లేకుండా “బద్రి” సినిమా రిలీజ్.... తొలిరోజే సినిమాకి వెళ్ళిపోయా.... ఆయిపోయిన తర్వాత అనిపించింది. సినిమా కిరాక్ ఎక్కించాడనిపించింది. అంతే కాదు పాటలు, స్టెప్స్, మేనరిజమ్స్ అన్ని పవన్ కి కొత్త స్టైల్ ని సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ “ఐయామ్ ఇండియన్...” మాకు బాగా కనెక్ట్ అయింది. నాకు తెలిసి అప్పటి నుండి తన ప్రతి సినిమాలో దేశభక్తి పాటను పెట్టుకునే హిరో ఒక పవన్ మాత్రమే...

“నువ్వు నంద ఆయితే, నేను బద్రి.. బద్రినాధ్.. ఆయితే ఏంటి”” డైలాగ్ టచ్ ఆయింది బాగా మాకు...
 

ఇక “ఏ చికితా..” సాంగ్ లో వేసిన కౌబాయ్ గెటప్, ఆ పాటలో స్టిల్స్, మేనరిజమ్స్ అంతా కొత్తకొత్తగా సాగిపోతుంది.... ధండర్ బర్డ్ బైక్ పై పాటలు ఇలాంటివన్నీ పవన్ కే సాధ్యమయ్యాయి.

మరల సంవత్సరం గ్యాప్ తర్వాత వచ్చింది

“ఖుషి” సినిమా..... పవన్ ని ఆగ్రస్దానానికి తీసుకువెళ్ళిన సినిమా ఇది. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్... దేశభక్తి సాంగ్.... తర్వాత “ఆడువారి మాటలకు అర్దాలు వేరులే...” పాట రీమిక్స్.... భూమిక అందాలు వెరసి సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాయి.

అక్కడితో పవన్ మేనియా నెమ్మదించింది... కాని పాపులారిటీ మాత్రం తగ్గలేదు...

ఆ స్టైల్ ని జనాలు మర్చిపోలేదు... తర్వాత ఎన్ని ప్లాప్స్ ఇచ్చిన జనాలకు అతనంటే క్రేజ్ తగ్గలేదు.

అలా ఒక సంవత్సరం కాదు... పది సంవత్సరాలుగా ప్లాప్స్ ఇస్తునే ఉన్నాడు.... ఆయినప్పటికి పీల్డ్ లో ఇప్పటికీ కౌబాయే.... ఎందుకంటే చాలా మంది పవన్ సినిమాల కంటే, అతని మేనరిజమ్స్ ని ఇష్టపడేవారు.

చివరికి పది సం.రాల తర్వాత గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టాడు...

కాని అది రొటీన్ సినిమాగానే అనిపించింది నాకు.... అందులో గత పవన్ కళ్యాణ్ కనబడలేదు. పైగా ముఖంలో డల్ నెస్... మెడ క్రింద మడతలు, ముందుకు తన్నుకువచ్చిన పొట్ట మొత్తానికి ఇది వరకు పవన్ లో ఉన్న ఫైర్ లేదు అనిపించింది...

తర్వాత ఆరు నెలలు తిరక్కుండానే “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా రిలీజ్ అయింది...
 

సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొంది. వారం రోజుల తర్వాత గానీ చూడడానికి కాని కుదరలేదు నాకు... సినిమా చూసిన తర్వాత నాకు ఏమనపించలేదు....

ఏంటీ.. అతను పవన్ కళ్యాణేనా? అని డౌటయితే మాత్రం వచ్చింది....

ఒకప్పుడు ఎలా ఉండే వాడు పవన్ కళ్యాణ్... చూరకత్తుల లాంటి చూపులు, పర్ ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్, ఢిపరెంట్ వాకింగ్ స్టైల్ అని వెరశి యంగ్రియంగ్ మ్యాన్ లా ఉండేవాడు...

మరి ఇప్పుడు? చూడలేకపోతున్నాను... ఆనాటి పవన్ ని నేడు ఈ విధంగా చూడలేకపూతున్నా.,...

వయసు ప్రభావం సహజమే అనుకోండి? కాని నాకే ఒప్పుకోబుద్ది కావడం లేదు.. ఏం నాగార్జున లేడా, సల్మాన్ ఖాన్ లేడా, సైఫ్ అలీ ఖాన్ లేడా యంగ్ గా?

అందుకే ఇక్కడి నుండి పవన్ సినిమాలకి సెలవు ఇద్దామనుకుంటున్నా.....

అందుకే అడుగుతున్నా నా అభిమాన నటుడుని...

ఏంటి రాంబాబూ... అలా ఆయిపోయావు? అని

Saturday 20 October 2012

దెబ్బతిన్నవి ఎవరి మనోభావాలు...


నిన్నంతా టి.వి.లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గురించే....

ఆ సినిమాలో తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలున్నయనేది తెలంగాణావాదుల అరోపణ....

నేను ఇప్పటివరకూ ఆ సినిమా చూడలేదు....

ఆయినా, నాకు తెలియక అడుగుతాను... దెబ్బతిన్నది తెలంగాణా ప్రజల మనోభావాలా లేక తెలంగాణా నాయకుల (అని అనుకుంటున్న) మనోభావాలా??

తెలంగాణా ప్రజలు వేరు... తెలంగాణా పేరు చెప్పి దౌర్జన్యం చేస్తున్న నాయకులు వేరు....

వీళ్ళకి, వాళ్ళకి సంబంధమే లేదు. నిజానికి అక్కడ ప్రజలకు మిగతా ప్రాంతాల ప్రజల మీద ద్వేషమే లేదు. ఉన్నదల్లా నాయకులకే..... అదే విషయాన్ని సినిమాలొ చూపిస్తే తప్పేవరిది?

గుమ్మడికాయల దొంగలు ఎవరు బే? అని అడిగితే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది తెలంగాణా వాదుల నిర్వాకం...

వీరు నిజంగా తెలంగాణా ప్రజల కోసమే పనిచేస్తున్నారనుకుందాం.... మిగతా ప్రాంతాల వారిని ద్వేషించడం లేదు అనుకుందాం........ అలాంటప్పుడు వారు హిరోలుగా ఫీలవ్వాలి. కాని విలన్ మీద ఏవో సన్నివేశాలుంటే, వాటిని తమను ఉద్దేశించే తీసారని భావిస్తే, లోపం ఎవరిలో ఉన్నట్టు?

తాము నిజంగా సినిమాలో చూపించినట్టుగా లేక మాట్లాడినట్టుగా చేసియుండకపోతే, ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా అనుకోకుండా... మరల అక్కడ కూడా తెలంగాణా ట్యాగ్ లైన్ ఒకటి తగిలించి, రాద్దాంతం చేయడం వలన ఎవరికి నష్టం.....

ఆలోచించుకొండి తెలంగాణా రాజకీయనాయకులు.......

ఇరుప్రాంతాల ప్రజలు బాగానే ఉన్నారు. వారు గౌరవప్రదమైన తెలంగాణా రాష్ట్రంను కోరుకుంటున్నారన్న విషయమును మిగతా ప్రాంతీయులు కూడా గుర్తించారు...

కాని గుర్తించనది రాజకీయ నాయకులుగా చెలామణి ఆవుతున్న తెలంగాణావాదులే.....

ముందు మీరు హిరోలుగా ఫీలవ్వండి... విలన్ కి అపాదించిన లక్షణాలు తమకు కూడా పోల్చుకున్నారంటే ఇక్కడ ఎవరు వెదవలే ఆలోచించుకొండి....
 

Tuesday 16 October 2012

లాస్ట్ చాన్స్ ఎవరికి?



అలోచించిండి....
మనకి కావలసినది వ్యక్తులు కాదు..... మెరుగైన వ్యవస్ద.... నేడు మనం కోరుకోనే మెరుగైన వ్యవస్దే రేపటి తరానికి మంచి బాట కాబడుతుంది.....

వ్యక్తుల మోజులో పడి వ్యవస్దని అపహస్యం చేయడం ఎంత వరకు సబబు.....

కులాలు, మతాలు, వ్యక్తుల మోజులో పడి వ్యక్తులను కోరుకుంటారో........,  అభివృద్ది పేరు చెప్పి మంచి వ్యవస్దని ఏర్పాటు చేస్తారో... అంతా మన చేతుల్లోనే ఉంది.....

ఒక్కసారి ఆలోచించండీ.....
రేపటి మన భవిష్యత్తు గురించి.....  అంతేకాని వ్యక్తుల భవిష్యత్తు గురించి కాదు......
 

Friday 12 October 2012

దటీజ్ నరేంద్ర మోడీ...

2002 నాటి అల్లర్ల నేపధ్యంలో నరేంద్ర మోడీ ని మరియు గుజరాత్ ని బహిష్కరించిన బ్రిటన్ ప్రభుత్వం, ఇప్పుడు పదేళ్ళ తర్వాత బంధాన్ని పునరుద్దరించే చర్యలకు శ్రీకారం చుట్టడం హర్షనీయం...

ఇది కేవలం ఒక ప్రాంతంనో లేక ఒక వ్యక్తినో చూసి తీసుకున్న నిర్ణయం కాదు....

అల్లర్ల నేపధ్యంలో, అందులో ప్రధాన భూమిక పోషించారన్న నిందతో మోడీతో పాటుగా రాష్ట్రంతో పూర్తి స్దాయి తెగతెంపులు చేసుకున్న బ్రిటన్, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోవడం వెనుక వున్న బలమైన కారణం...

గుజరాత్ లో గత పదేళ్ళలో జరిగిన అభివృద్దే అనడంలో సందేహం లేదు....
దానికి అద్యుడైన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ యొక్క కృషిని గుర్తించింది....

ఆనాడు తన మీద నిందతో ఆగ్రరాజ్యాలన దగ్గ దేశాలు నిషేధం విధించినప్పటికీ, వెరవక తనకున్న అసలు బలం ప్రజాబలం అని భావించి, గుజరాత్ లో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధిని పండించారు.

తనపై పడిన నిషేదం గురించి ఆయన ఇసుమంతైన పట్టించుకోలేదు. తాను అనుకున్న పనిని నిస్వార్దంగా చేసారు.
అందుకే నేడు మోడీ అడక్కుండనే ఆగ్రరాజ్యాలే మోడీ ని తమ దేశానికి రావలసినదిగా ఆహ్హనిస్తున్నాయి.

అది భారతీయుడు పవర్.....

ఇది నరేంద్రమోడీ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక భారతీయుడుగా సాధించిన ఘనత.....

ప్రతి భారతీయుడు ఇలానే ఆలోచిస్తే, ప్రపంచమే మన ముందు మోకారిల్లుతుందనడానికి మోడీ ఉదంతంను ఉదహరించవచ్చు.

అంతేకాని మన ప్రస్తుత ప్రభుత్వం విదేశియులు ముందు మోకారిల్లునట్టు కాదు.....


 

Tuesday 9 October 2012

జిల్లా కలెక్టరు, కాకినాడ వార్కి ధ్యాంక్స్

తూర్పుగోదావరి జిల్లా రాజధాని కాకినాడ అంటే ఒక రకమైన బ్రాండ్..

కాకినాడకి సెకండ్ మద్రాస్ మరియు పెన్షనర్స్ ప్యారడేజ్ అనే పేరు ఉండడం కూడా మీకు తెలుసు..

రాష్ట్రంలో ఏ నగరానికి లేని విధంగా ప్రణాళికబద్దమైన రహదారులు, మరియు రూపురేఖలు కాకినాడకి సొంతం

ఇంకొక విషయము... కాకినాడ మొత్తం చెట్లతో నిండి పచ్చదనంతో ఉంటుంది.. ఇప్పుడు కాదు ఒకప్పుడు..

నేను కాకినాడకి చదువుకోవడానికి వచ్చిన కొత్తలో రోడ్డుకిరుపైపులా ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లతో పచ్చదనంతో కలకలలాడేది.

రాను రాను పనికిమాలిన రాజకీయనాయకులు, అధికారులు కాకినాడకు తగులుకోవడంతో గత కొన్ని సం.రాలు గా పాత కళ కోల్పోయింది.


ప్రణాళికబద్దంగా నిర్మించబడ్డ నగరం క్రమేణా రాజకీయ నాయకులు నిర్లక్ష్యం మరియు అపరిపక్వ నిర్ణయాల మూలంగా గందరగోళం ఆయిపోయింది.

ఎప్పటి నుండో నగరవాసులకు చల్లదనాన్ని ఇచ్చిన చెట్లను రోడ్ల విస్తరణా పేరుతో నరికేశారు. వాస్తవానికి కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్ల రోడ్ల విస్తరణకు చెట్లు అడ్డంకి కానే కాదు.

కాని తాము అనుకున్నది తప్ప ఇంకొకటి చేయడానికి ఇష్టపడని అధికారులు మొత్తం చెట్లను నరికేసారు. ఫలితంగా నిండుగా ఉన్న కాకినాడ బోడిగా అయిపోయింది.

పోని రోడ్లు వేసిన తర్వాత, మొక్కలు వేసారా? అంటే లేనే లేదు...

ఈ లోపులో కాకినాడ జనాభా పోలోమని పెరిగిపోయింది.

వేసవిలో కూడా చల్లగా ఉండే కాకినాడలో ఉండలేక మొన్న వేసవికి వెస్టిండీస్ పోవలనిపించింది....

ముఖ్యంగా జిల్లా కలెక్ట్రరు కార్యాలయం నుండి, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం మీదుగా జనరల్ హస్పటల్ దాటి బాలాజి చెర్వు వరకు ఉండే పెద్ద పెద్ద చెట్లు చూస్తే ఆకాశానికి పందిరి వేసినట్టుగా ఉండి సూర్య కిరణాలను నేల మీదకి రానిచ్చేవికావు.

అవన్నీ కనీస కనీకరమన్నదే లేకుండా తీసిపారేశారు ఐదు సం.ల క్రిందట.....

 
మొన్న ఆ రోడ్డు మీద నుండి వెళ్తుంటే కొత్తగా నాటిన చెట్లు నన్ను అకర్షించాయి. జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా ఉన్నాయి. చాలా ఆనందం అనిపించింది. కనుక్కొంటే జిల్లా కలెక్టరు శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ గారు సదరు మొక్కలను నాటించారని తెలిసింది. అంతే కాకుండా సిటి మొత్తం నాటించారు.

నిజంగా ఎంత మంచి పని చేసారండీ ఆవిడ.... నాకు చాలా ఆనందం వేసింది.....
అందుకే పదే పదే కృతజ్ణతలు తెలుపుకుంటున్నాను...

ఇప్పుడు కాకపోయినా, ఇంకో నాల్గు సం.లో  ఆ చెట్లు పెద్దవి ఆవుతాయి. అప్పుడు మరల పాత కాకినాడని చూడోచ్చు.

నగరానికి ఎంతో మంది కలెక్టర్సు వచ్చారు. కాని ఎవరూ చేయలేని పనిని చేసారు..

పి.ఎస్: ఎవరో వస్తారని చూసే బదులు నువ్వు కూడా ఎంతో కొంత చేయెచ్చు కదా అని అడుగుదామనుకుంటున్నారా? నేను మా ఊరిలో ఎక్కడ చిన్న స్దలం కనబడిన మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్నాను. అక్కడ నాది కాబట్టి చెల్లుతుంది. కాని కాకినాడ సిటిలో అలా చేయాలంటే కుదరదు కదా..... ఇలాంటివి పవర్ ఉన్న పెద్ద అధికారులు చేస్తే వర్కవుట్ ఆవుతుందని నా అభిప్రాయం
 

Monday 8 October 2012

కేబినెట్లోకి ఎఫ్.డి.ఐ.లు

అర్దిక సంస్కరణలు పేరు చెప్పి చిల్లర వర్తకం మరియు కొన్ని రంగాల్లోకి ఎఫ్.డి.ఐ.లను అనుమతించిన ప్రభుత్వం..

రాజకీయ సంస్కరణలు పేరు చెప్పి కేబినెట్ లోకి కూడా ఎఫ్.డి.ఐ.లను అనుమతిస్తే బాగుంటుదేమో...

కేంద్రప్రభుత్వం వైఖరి పై శరద్ యాదవ్ విసిరిన చణుకు..

Saturday 29 September 2012

కేంద్రంలో మరో కోతగాడు....


దేశములో ప్రభుత్వ సొమ్ముతో తేరగా పోషిస్తున్న కోతగాళ్ళలో ఇప్పటికే మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఉన్నారు..

ఇప్పటికే మన దేశంలో అసలు పేదరికమే లేదని కనిపెట్టి తేల్చిచెప్పిన పెద్దాయన ఈయన....

 

ఇప్పుడు ఈయనకు తోడు మరో కోతగాడు తయారయ్యాడు...

అయనే విజయ్ కేల్కర్...
 

ఈయన గారు దేశంలో ప్రస్తుతం వంటగ్యాస్, కిరోసిన్, డిజీల్, చౌక దుకాణాల్లో యిచ్చే ఆహర ధాన్యాలకు యిచ్చే సబ్బీడిలను పూర్తిగా తొలగించాలని సెలవిచ్చారు. అలాగే పెట్రోలియం ఉత్తతిలో రాయితీలను దశల వారీగా ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి హితభోద చేసారు.

భారత అర్దిక వ్యవస్ద పలు దేశియ, అంతర్జాతియ కారణాలతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, అందుకు ప్రతిగా ప్రభుత్వం యిస్తున్న అన్ని రాయితీల కోతలో ధైర్యంగా వ్యవహరీంచాలని సెలవిచ్చారు.

ఆయినా, నాకు తెలియక అడుగుతాను.. వారు  సబ్బీడి రూపములో యిస్తున్న డబ్బు ప్రజల నుండి వసూలు చేసింది కాదా? లేక వాడి అబ్బ సొమ్మా?

సరే.. రాయితీలు యివ్వడం అర్దిక వ్యవస్దకి భారంగా ఉందనుకుందాము... రాయితీల కోత ఆన్ని వర్గాలకి వర్తించాలి కదా? కేవలం సామాన్యుడు ఎక్కువగా ఆధారపడే అంశములపైనే రాయితీల కోత విధించాలా? మరి ధనవంతులకు, కార్పోరేట్లకు యిచ్చే రాయితీల మాట ఏమిటి?

సరే, అది కూడా ప్రక్కన పెడదాం...

ప్రజ్యాస్వామ్య ప్రతినిధులుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి వారు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? సమాధానం చెప్పడం కష్టం వాళ్ళకు....

 ప్రభుత్వం వారు దేశ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, మోజారిటి ప్రజలు స్వయంవృద్ది మీద బ్రతుకుతున్నారు.

 వ్యవసాయం మీద మోజారిటి ప్రజలు ఆధారపడేవారు. రైతులు కష్టమైన, నష్టమైన వ్యవసాయం చేసుకోనేవారు. అంతే తప్ప ఏనాడు ప్రభుత్వం వారి మీద ఆధారపడలేదు. కాని ప్రభుత్వం ఏమి చేసింది! దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం మీద అధారపడడం వలన అర్దిక వృద్ది పెరగడం లేదని భావించి, వ్యవసాయ రంగంనకు చేయూత యివ్వడం మాట దేవుడెరుగు.. ఉన్న రంగంను అస్దవ్యస్దం చేసేలా చర్యలు తీసుకున్నారు.

 

పోనీ, వ్యవసాయరంగం నుండి మరలిన ప్రజలకు వేరే జీవనధారం ఏమైనా చూపించిందా? అది లేదు...

దానితో చాలా మంది స్వయం ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు.. చాలా మంది కిరణా కొట్టు దారులుగా, చిన్న పరిశ్రమల యజమానులగా రూపాంతరం చెందారు. కొంత మంది బాగా చదువుకొని పట్టబద్రులయ్యారు.  ఇక్కడ కూడా ప్రభుత్వం వీరికి ఏమి సాయం చేయలేదు.....

ప్రభుత్వం ఇంకా ఏమి చేసింది ప్రజల జీవన ప్రమాణాల మెరుగవ్వడం కోసం?...

స్వంతంగా అర్దిక అవలంబన ఏర్పాటు చేసుకొసుకొన్న కిరాణాకొట్టు దారుల మూలాలు దెబ్బతీయడానికి ఎఫ్.డి.ఐ. లను అనుమతించింది.

చిన్న పరిశ్రమల యజమానులగా రూపాంతరం చెంది, ఇంకో కొద్ది మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలను దెబ్బతీయడానికి, కరెంటు సరాఫరాలో కోతలు విధించింది.....

బాగా చదువుకొని పట్టబద్రులయ్యి, ఏదోక సంస్దలో ఉద్యోగం సంపాదించుకోవలనుకొన్న యువతకు ఏమి చేసింది? దేశంలో అసలు పారిశ్రామికకరణ అభివృద్దే లేకుండా, స్వంతంగా ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులుగా పడుకోబెట్టింది...

అసలు సక్రమయిన ప్రభుత్వ రవాణా వ్యవస్ద అనేది లేని దేశములో ప్రజలు స్వంత వావానముల మీద ఆధారపడితే, ప్రభుత్వం ఏమి చేసింది? పెట్రోలు ధరల్లో సబ్బీడి ఎత్తేసింది......

ప్రజలకి వారు ఏమి చేయకుండా, ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం మానేస్తున్నారా? ముక్కు పిండి మరీ అన్ని రకముల పన్నులను పిండుకుంటున్నారు. పన్నుల ద్వారా వచ్చిన డబ్బును సబ్బీడి రూపంలో తిరిగి ప్రజలకు యివ్వకూడదని మన విజయ కేల్కర్ గారి అభిప్రాయం......

ఇలాంటి కోతల రాయుళ్ళు ఉన్నందునే దేశ అర్దిక వ్యవస్ద సమస్యల్లో ఉన్నదని ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటే మేలు...

ముందుగా వారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పమనండి.. ఆ తర్వాత  సబ్బీడిల్లో కోతల గురించి మాట్లాడమనండి.

 

వ్యవసాయరంగంనకు చేయూత యివ్వక పోయిన పర్వాలేదు... నిర్వీర్యం చేసే చర్యలు తీసుకోకుండా ఉంటే చాలు

సక్రమయిన ప్రజా రవాణా వ్యవస్దను ఏర్పాటు చేయండి.. అప్పుడు ముడి చమురుపై సబ్బీడి యివ్వవలసిన అవసరం లేదు....

కిరణా కొట్టుదారులు, మరియు ఇతర చిన్న చితకా దుకాణాదారులను వాళ్ళ మానాన వాళ్ళను ఉండనీయండి... ఎఫ్.డి.ఐ.లను అనుమతించకుండా ఉంటే చాలు......

ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి.... కానీ నాకే టైమ్ సరిపోవడం లేదు..

నిజానికి, మన అర్దికవేత్తల, రాజకీయ నాయకులు ఘనకార్యల గురించి ఎవరికి టైమ్ సరిపోతుందిలెండి....

ఎవడి పిచ్చి వాడికానందం..... నా గోల నాకు ఆనందం.. ఏమి చేస్తాం....

అంతా అపై వాది దయ....

కాదు...కాదు...

అంతా ఏలికల వారి దయ...

Friday 28 September 2012

నీతి, నిజాయితి, నిబద్దతల ప్రతినిధి


నాలుగో తరగతి ఉద్యోగిగా ముంబయి హైకోర్టులో ఫైళ్ళు మోసిన కుర్రాడు,

ఎనిమిదేళ్ళ తరువాత అదే కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, గత రెండేళ్ళుగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ నిన్న రిటైరైన నీతి, నిజాయితీలకు ప్రతిరూపం

శ్రీ సరోష్ హోమీ కపాడియా...
 

“నేను ఓ పేద కుటుంబం నుండి వచ్చాను. నాల్గో తరగతి ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన నాకున్న ఆస్తుపాస్తులల్లా నీతి, నిజాయితీ, నిబద్దతలే” అని విన్రమంగా పలికిన శ్రీ సరోష్ హోమీ కపాడియా గారిని స్పూర్తిగా తీసుకొని మరెందరో పనిచేయాలని కోరుకుంటూ... శ్రీ కపాడియా గార్కి తమ శేష జీవితం ఆనందంతో కొనసాగాలని కోరుకుంటున్నాను.
 

Thursday 27 September 2012

జీవ వైవిధ్యం.... తెలుసుకోవలసిన విషయం


మరి కొద్ది రోజుల్లో రాజధాని హైదరబాద్ లో ప్రపంచ స్దాయి జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్న తరుణంలో అసలు జీవ వైవిధ్యం అంటే ఏమిటి? దాని గురించి విస్తృత సమాచారము ఈనాడు దినపత్రికలో రోజూ ఇస్తున్నారు.

ఇప్పటి వరకు జీవ వైవిధ్య సదస్సు అంటే ఏమిటో అనుకునేవాడిని. అదేదో సైన్సుకు సంబందించిన మీట్ ఏమో అనుకున్నాను. కాని దినపత్రికలో చదివిన తర్వాత తెలిసింది. ఆ సదస్సు ప్రపంచంలో అనేకానేక జాతుల జీవనం, అంతరించడం అనే విషయమ్మీద అని.

జీవ వైవిధ్యం పేరుతో ఈనాడు దినపత్రికలో ఈ మధ్య వరుసగా కధనాలు ఇస్తున్నారు. చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.

నిజానికి గ్లోబలికరణ పేరుతో మనము ప్రకృతి ఎంతలా నాశనం చేస్తున్నామో, తద్వారా అనేక జాతుల మధ్య ఉన్న లింక్ ను నాశనం చేయడం వలన మనకు ఎంత నష్టం వాటిల్లుతుందో తెలిసింది. ఒక సారి ఆలోచించి చూస్తే మన చిన్నప్పుడు కళ్ళ ముందు తిరిగిన అనేక జీవజాతులు నేడు చాలా అరుదుగా కనిపించడం గమనిస్తున్నాము.(నిజం చెప్పాలంటే కాకులు కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి). ప్రకృతి ప్రకోపం, కరువు లేక యితర కారణాల వలన ఒక జాతి అంతరించాలంటే ఇంచుమించుగా కొన్ని వందల సం.రాలు పట్టోచ్చు.

అడవుల్లో ఉన్న జాతులు గురించి ప్రక్కన పెట్టండి. మా చిన్నతనంలొ మేము చూసిన అనేక జాతులు ఇప్పటికే కనుమరుగు కావడం చాలా బాధగా ఉంది. బహుశా ఒక ఇరవై సం.ల వ్యవధిలో అనుకుంటా ఇలా జరగడం. అంతరించిపోవడం అనే ప్రక్రియ ఎంత వేగంగా ఉందో అర్ద్రం అవుతుంది.

నా చిన్నతనంలో ఉన్న వాటిలో పిచ్చుకలు, రామచిలుకలు, గ్రద్దలు, రాబందులు, కముజు పిట్టలు ఇంకా నాకు పేర్లు గుర్తుకు రావడం లేదు కానీ చాలా ఉన్నాయండీ...అవన్నీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కనబడడం లేదు.
 
 

ఇక కప్పలు..... ఎక్కడ పడితే కనిపించే కప్పలు కూడా అసలు కనబడడం లేదండీ..
 

నాకు బాగా గుర్తు... మా అన్నయ్య కు కప్పంటే చాలా భయం. అది తెలిసి నేను కప్పను చేతితో పట్టుకొని మా అన్నయ్య వెనకాల పరిగెట్టడం నాకు ఇప్పటికి బాగా గుర్తు.

రోజులు ఎలా మారిపోతున్నాయో...ఏంటో...  కొన్నాళ్ళకు మానవ జాతి మాత్రమే ఉండేలా ఉంది...