Friday 30 December 2011

ఐ హేట్ టు 2011

యస్. ఇప్పటి వరకు నేను ద్వేషిస్తున్న సంవత్సరముల్లో 2011  సంవత్సరము కూడా ఉంది. నాకు మాత్రమే కాకుండా,  చాలా మందికి కూడా ఈ సంవత్సరము కలసి రాక ద్వేషిస్తూ ఉండొచ్చు. నాకు మాత్రము ఈ సంవత్సరము మానసికంగా చాలా ఇబ్బందికర పరిస్దితులు కల్గించింది. నాకు ఎంతో ఇష్టమైన కుటుంబ సభ్యులను కొంత మందిని దూరము చేసింది ఈ సంవత్సరమే. నేను మొదటి నుండి కూడా కుటుంబంతో ఉన్న క్షణాలను పూర్తి స్దాయిలో అస్వాదించేవాడిని. సరిగ్గా రెండేళ్ళ ముందునాటికి ఉన్న పరిస్దితికి, నేటికి ఎంతో మార్పు వచ్చేసింది. మార్పు ఎప్పుడైనా సహజమే అనుకొండి. కాని ఆ మార్పు నన్ను ఇబ్బంది పెట్టే స్దాయిలో ఉండడమే సమస్య. అదీ కుటుంబ సమస్య కావడమే అన్నింటికన్నా బాధాకరం.  అందరికి ఉన్న సామాజిక సమస్యలు నాకూ వచ్చాయి. కాని వాటిని ఎప్పుడూ సమస్యలుగా భావించలేదు. కాని నా కుటుంబ సభ్యులలో వచ్చిన కొన్ని మార్పులు మానసికంగా ఇబ్బంది కల్గించాయి. రెండేళ్ళ క్రితం వరకు మానసికంగా నేను చాలా హ్యాపిగా ఉండేవాణ్ణి.  ఎందుకంటే నా సోదరి మధుమతి, కజిన్ బ్రదర్స్ వేణు, ఆశోక్, మధు మరియు మా అత్తయ్య గారి పిల్లలుతో కలసి మొత్తముగా ఒక గ్రూప్ గా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందులో బాగా తమ్ముడు మధుబాబు గాడితో అనుబంధం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మాలో ఎపరికన్నా కమ్యూనికేషన్ గ్యాప్ లేక చిన్నచిన్న మనస్పర్దలు ఏమైనా వస్తే వాటిని దగ్గరుండి పరిష్కరించి కలిపేవాడు. పైగా వాడు మాకు దగ్గరలోనే ఉన్న యానాం రీజెన్సీ కాలేజిలో ఇంజనీరింగ్ చదివేవాడు. దానితో ప్రతి అదివారము కాకినాడలో ఉంటున్న మా ఇంటికి వచ్చేసేవాడు. ఇక ఆ అదివారమంతా ఇక్కడే ఉండేవాడు. తర్వాత మా చెల్లితో కూడా ఎంతో అప్యాయతతో ఉండేది. ఇకపోతే తర్వాత చెప్పవలసినది ఆశోక్ గురించి. తాను కూడా నేనంటే చాలా అభిమానము చూపించేవాడు. అంత హ్యాపిగా ఉన్న మా అనుబంధం చాలా వేగముగా విచ్చిన్నమయిపోయిందంటే నమ్మలేకున్నా. చెల్లి పెళ్ళి జరగడంతో తనతో ఉన్న ఎటాచ్ మెంట్ కొద్దిగా తెగిపోయింది. తర్వాత సంవత్సరమే మధుబాబు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. దానితో నా ఎంజాయ్ మెంట్ లైఫ్ లో శూన్యత ప్రవేశించింది. మా బ్యాచ్ కుదించుకుపోవడంతో ఇక మిగిలిన ఆశోక్ తో ఎటాచ్ మెంట్ బాగా పెరిగింది. ఎంతగా అంటే చాలా ఎక్కువగా, ప్రతి విషయము తనతో పంచుకోనిదే పడుకోకపోవడమంతగా....
 కాని పెరుగుట విరుగుట కొరకే అన్న నానుడిని నేను ఆలోచించలేకపోయాను. ఎంతో అన్యోనంగా ఉన్న మా మధ్య చిచ్చులేపింది ఈ సంవత్సరమే. అసలే నా సోదరి, నా తమ్ముడు చేసిన ఖాళిని పూరించలేక మానసికంగా ఇబ్బంది పడుతుంటే, దానికి తోడు ఇప్పుడు ఇంకో తమ్ముడితో మనస్పర్దలు. అదే ఇప్పుడు మా తమ్ముడు మధుబాబు గాడు ఉంటే ఈ విధముగా మనస్పర్దలు వచ్చిఉండేవి కావేమో. అశోక్ తో ఒక విషయములో వచ్చిన మనస్పర్ద కారణంగా తననే కాకుండా ఇంకో ఇద్దరిని దూరము చేసుకొన్నాను ఈ సంవత్సరము. అందులో నేను పెళ్ళి చేసుకోవాలనుకొన్న ఒక అమ్మాయి కూడా ఉండడం నా దౌర్బాగ్యాం. దేవుడు నాతో ఈ సంవత్సరము ఎందుకు ఇలా అడుకొన్నడా అని అనుకొని సందర్బం లేదు. ఇప్పటికి వాడితో మాట్లాడి సుమారు ఐదు నెలలు కావస్తుంది. నిశ్చయమైన పెళ్ళిని కాన్సిల్ చేసుకొని, అ అమ్మాయిని కూడా దూరం చేసుకొన్నాను. దీనికంతటికి కారణం మా తమ్ముడు ఆశోక్ లో ఉన్న చిన్న అనుమానము. ఆ అనుమానము నా అత్మాభిమానమును దెబ్బతీసి, వారందరిని దూరం చేసుకోవలన్న స్దితికి తెచ్చింది. అదంతా ఈ సంవత్సరము చేసుకొన్న పుణ్యమే. ఈ రోజు కంప్లీట్ గా నేను ఒక్కడినే ఆయిపోయాను. నా సంతోషాలు, బాధలు చెప్పుకోని సేదదీరే అత్మీయులు లేక మానసికంగా యాతన పడుతున్నాను.  ప్రస్తుతము నేను ఒక్కడినే రూమ్ లో ఉంటూ సోలో లైఫ్ ని అనుభవిస్తున్నాను. అనుబంధాలు, అత్మీయతల మధ్య పెరిగిన నాలాంటి వాడికి, ఒక్కసారే అలాంటి వాటికి దూరము కావడంలో ఉన్న కష్టమేమిటో అనుభవించిన వాడికే తెలుస్తుంది.  రూమ్ లో ఒక్కడినే ఉండి, నా మెబైల్ నుండి నా అత్మీయులు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండునని ఎదురుచూస్తున్నాను..... 

Monday 26 December 2011

పల్లె పాడవుతుంది.....

ఈ రోజు వృత్తిరీత్యా పట్టణాల్లో ఉంటున్న వారందరికి తప్పకుండా ఏదో ఒక సమయములో పల్లెలో గడిపిన నేపధ్యముంటుంది. వారందరిని ఒకసారి కదిపి చూస్తే, వాళ్ళ అంతరంగాల్లో పల్లెతో మమేకమైన అనేక అనుభూతులు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ప్రతి ఒక్కరికి తమ, తమ ఊళ్ళలో గడిపిన విషయాలు తల్చుకోవడం ద్వారా రీచార్జి ఆవుతుంటారు. ఎందుకు వారందరికి తమ తమ ఊరు లేక పల్లె లంటే ఇష్టం? ఇలా అడిగితే సమాధానము చెప్పడము కష్టం కదా! అంటారు. ఎందుకంటే పల్లెతో ముడిపడిన మన బాల్యం యొక్క ప్రతి తీపి గురుతు ఇప్పటికీ మన మనసుల్లో మెదలుతూ ఉంటుందీ కాబట్టి. ఉదయాన్నే తాతయ్య, నాన్నలతో కలసి చేనుకి వెళ్తాని మారాం చేసి వెళ్ళడం, అక్కడ గేదేలు మరియు యితర పశుపక్షాదులను చూడడం, లేగ దూడని కట్టు వివ్పేసి తల్లి గేదే దగ్గర వదిలేయడం. అది చూసి పెద్దవాళ్ళు మందలించడం. బడికి వెళ్ళడానికి మారాం చేస్తే, అమ్మ మన జేబులు నిండా తినుబండారాలు నింపి పంపడం, బళ్ళో ఎక్కాలు సరిగా చెప్పలేదని పంతులు గారు గోడ కూర్చిలు వేయించడం, చింత బద్ద తో తొట్టు తేలేలా కొట్టడం, బడి ఆయిపోయాక పొలం గట్టులంటా పరిగెట్టి ఊరి చివరనున్న చెరువులో దూకడం. ఇలా చెప్పుకుంటే పోతే, వాటనన్నిటిని రాయడానికి ఈ పేజి సరిపోదు., ముఖ్యంగా చెప్పుకోవలసినది, ఆనాడు పల్లెల్లో ఉన్న అనుబంధాలు గురించి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వలన వ్యక్తుల మధ్య అనురాగాలు ఏ విధముగా ఉండేవో చెప్పన్నక్కర్లేదు. అంతే కాదు.. కుటుంబం మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. వారందరిని కూడా ఏదో ఒక వరుస కలపి అక్క, బావ, అత్త, పెద్దమ్మ, పిన్నమ్మ, చిన్నాన్న, మావయ్య అనే పేర్లుతోనే పలుకరించేవారు. భోజనాలు ఆయిపోయాక చుట్టుప్రక్కలా ఆడాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకొనే సందర్బాలు చూడడానికి చాలా బాగుండేవి. కష్టసుఖాలు అన్ని అందులోనే మాట్లాడుకొనేవారు. ఇక పోతే గురు శిష్య బంధముల గురించి. బళ్ళో మాస్టారంటే అందరికి ఉచ్చే.. అంత భయముండేది మాకు మా మాస్టార్లంటే... ఏ మాత్రము చిన్న తప్పు జరిగినా, దానికి తగిన శిక్ష ఖచ్చితముగా ఉండేది. పైగా ఆ విషయము ఇంట్లో తెలియకుండా జాగత్తపడేవాళ్ళం. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే మమ్మల్లే తప్పుబడతారని భయపడేవాళ్ళం.
కాని ఇప్పుడు అదే పల్లెలకు వెళ్ళి చూడండి.. పైన చెప్పినవేవి ఇప్పుడు కనబడడం లేదు. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. చుట్టుప్రక్కల వాళ్ళతో మాట్లాడాలంటే ప్రెస్టేజి. అందరితో బంధుత్వాలు కలుపుకొని మాట్లాడలంటే దాన్ని అతిచనువుగా భావించడం. ఆడాళ్ళందరూ ప్రక్కవాళ్ళ మీద చాడీలు చెప్పి గొడవలు పడడం. ఇలా చెప్పుకుంటే పోతే ఈ పేజి చాలాదేమో రాయడానికి. కాలముతో పాటు ఎన్ని మార్పులు వచ్చినప్పటికి మనకు మాత్రము మన పల్లెంటే ఉన్న మమకారము పోదు కాబట్టి, ఇంకా ఖాళి దొరికినప్పుడు, పల్లెకి వెళ్ళి కూసింత మనశ్శాంతి కోరుకుంటాము. కాని అక్కడ పరిస్దితులు పట్టాణాల కన్నా దారుణంగా తయారయ్యాయి. మొన్న ఆ మధ్య మా ఊరు వెళ్ళినప్పుడు, అక్కడ మా స్కూల్ లో జరుగుతున్న ఒక భాగోతం గురించి నా స్నేహితుడు చెప్పినప్పుడు ఒకింత షాక్ కి గురయ్యాను. అదేమిటంటే, మా ఊరి హైస్కూల్ లో తొమ్మిది మరియు పదవ తరగతి అమ్మాయిలను ఆ స్కూల్లో పని చేస్తున్న కొంత మంది మాస్టార్లు లొంగదీసుకొని వాడుకుంటున్నారని. ఎంత దౌర్బాగము ఈ పరిస్దితి. బంధాలన్నింటిల్లోను అత్యంత పవిత్రమైన గురుశిష్యుల బంధం ఈ స్దాయికి దిగజారుతుందని కలలో కూడా ఊహించలేదు. విద్యార్ది జీవితమును గాడిలో పెట్టి సరయిన దిశానిర్దేశము చూపించవలసిన గురువులు ఇటువంటి నీచపనులకు తెగబెడడం ఎంత దారుణమో తెలుస్తుంది. ఇంకా ఇంత కన్నా దుర్బరమేమిటంటే, విద్యార్దినులు కూడా ఈ రకమైన చర్యలకు ఉత్సాహము చూపించడం. విద్యార్దినిలకు తెలిసి, తెలియకో చేస్తున్న తప్పులను తల్లిదండ్రులు గుర్తీంచకపోవడం. ఈ విధమైన వాతావరణం వల్ల అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతుంది. ఈ విధముగా స్కూల్ స్దాయి నుండి బయటకు వచ్చిన విద్యార్దినిలు సదరు చర్యలను ఇంటర్ స్దాయిలో కూడా కొనసాగించడం చాలా దారుణం. ఇది మీకు నమ్మదగినదిగా కనబడకపోవచ్చు. కాని చాలా పల్లెల్లో ప్రస్తుతం ఇటువంటి పరిస్దితే రాజ్యమేలుతుంది. నిజానికి చెప్పాలంటే పల్లెటూర్ల అమ్మాయిల కన్నా, పట్టణాల అమ్మాయిలే కొంత నయము అనేపించేలా ఉన్నాయి ఈ సంఘటనలు. అలాగని పల్లెల్లో అందరూ అమ్మాయిలు అలాగే తయారయ్యరని చెప్పలేము. కొన్ని, కొన్ని పెద్ద కుటుంబాల్లోని పెద్దలు తమ పిల్లలను కనిపెట్టుకొని ఉండడం మరియు మంచి, చెడులు వివరించడం ద్వారా కొంత మంది పద్దతిగానే పెరుగుతున్నారు. మిగతా కుటుంబాలులోని తల్లిదండ్రులిరువురూ పని నిమిత్తము కూలి పనులకు వెళ్ళిపోవడం, మరియు తమ పిల్లలపై సరయిన దృష్టి పెట్టడం తదితర కారణాల వల్లన, కొంత మంది ఉపాధ్యాయులు ఇలాంటి విద్యార్దినులను ఎంచుకొని లొంగదీసుకుంటున్నారని తెలిసింది. ఇది ఎలాంటి నీచమైన సంసృతికి దారితీస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయమై పిల్లల తల్లిదండ్రులు కూడా కలసికట్టుగా రావడం లేదు. మనది కానప్పుడు మనకెందుకొచ్చిన గొడవలే అని తప్పించుకుంటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళ ఇంట్ళొ పిల్లకే ఆ ఘోరం జరిగినప్పుడు ఏంటి పరిస్దితి?? ఈ విధమైన పరిస్దితిని ఆ ఉపాధ్యాయులు గమనించి, తమ పనులను నిర్బయంగా కొనసాగించగలుగుతున్నారు. చివరికి విసిగివేసారి సీనియర్ స్టూడెంట్స్ కొంత మంది సదరు స్కూలుకి వెళ్ళి ప్రదానొపాధ్యాయలు వారిని నిలదీస్తే, ఆయన తనకు ఈ విషయము తెలియదని చెప్పారంట.. మీరే చెప్పండి ఇప్పుడు... పల్లె పాడవుతుందా... లేదా.........

Tuesday 20 December 2011

రష్యన్ కోర్టు భగవద్గితని నిషేదించడం ద్వారా హైందవ సంస్కృతికి వచ్చిన నష్టమేమి లేదు................

రష్యన్ కోర్టు ఒకటి, గీతాసారాంశమును ఉన్మాద చర్యగా అభివరిస్తూ నిషేదము విధించిన వార్త భారతదేశములో హైందవుల విపరీతమైన కోపానికి కారణమయింది. దీనిపై దేశములో అన్ని పక్షాలు తమ నిరశనను తెలియజేసాయి. మరియు అన్ని టి.వి. చానల్స్ లోనే దీనిపైనే చర్చ. పని ఉన్నోడు, లేనోడు ప్రతి ఒక్కడూ వచ్చి తమకు తెలిసిన చరిత్రనంతా గడబిడ వాగేస్తున్నారు. కాని గీత సారాంశమును ఏ ఒక్కరో నిషేదించినంత మాత్రాన, దాని యొక్క పవర్ తగ్గిపోదు. దాని యొక్క అద్బుత శక్తి నాశనమయిపోదు.
 ఎవడూ ఉన్నా, పోయినా, ప్రపంచం ఉన్నా, లేకపోయినా దానిని మార్చగలిగే శక్తి ఎవరికి లేదు. నా ఉద్దేశములో అరచేతితో సూర్యున్ని ఆపడం ఎంత కష్టమో, భగవధ్గీత మీద విషము చిమ్మడం కూడా అంతే. ప్రపంచంలో ఏదో ఒక కోర్టు భగవధ్గీత మీద విమర్శలు చేసినంత మాత్రానా భగవద్గీతకి ఉన్న పవిత్రతకి నష్టమేమి లేదు. నిజానికి ఈ విధమైన విమర్శలు ఈ నాటివి కాదు. ప్రపంచం మొత్తం మీద అత్యంత పురాతనమైన సంస్కృతి హైందవ సంస్కతే అన్న సంగతి ప్రతి ఒక్కడికి తెలుసు. అటువంటి పురాతనమైన హైందవ సంస్కృతి పై చాలా కాలము నుండే దాడి మొదలయింది. ఆ దాడి, గత శతాబ్దములో జనించిన యితర మత సంస్దల నుండే కావడం చాలా దురదృష్టం. హైందవ సంస్కృతి అత్యంత పురాతనమైనప్పటికి పరమత సహనం పాటించింది. హైందవ మతము ఏ యితర మత గ్రంధాల జోలికి గాని, మత నియమాల జోలికి కాని వెళ్ళిన సందర్బాలు లేనేలేవు అని చెప్పవచ్చు. మొన్న ఆ మధ్యన వాటికన్ సిటి అధికార వర్గాలు యోగా అభ్యాసముపై విమర్శలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి యోగా అనేది మానవ ఆరోగ్య పరిరక్షణకి సంబందించినదని అందరికి తెలుసు. 
 అటువంటి యోగాకి ఈ మధ్యన ప్రపంచమంతా విపరీతమైన ప్రాచుర్యం పొందింది. దేశ విదేశాలలో అనేక మంది యోగాను అభ్యసించడం ద్వారా దానికి విశేష ప్రాచుర్యం వచ్చింది. అంతే కాకుండా విదేశాలలో కొన్ని యూనివర్శిటిలలో యోగా మీద స్పెషల్ కోర్సులు కూడా ప్రారంభించారు. అటువంటి యోగా మేనియా ప్రపంచం మంతటా విస్తరించడంతో దానికి మతపరమైన రంగుని పులిమి, వివాదస్పదం చేయడానికి వాటికన్ సిటి అధికార వర్గాలు పాల్పడ్డాయని తెలుస్తుంది. దీనికి కారణం యోగా ని హైందవ సంస్కృతిలో భాగంగా వారు పరిగణించడమే. వారికి చెందిన వ్యక్తులే తాజాగా భగవధ్గితలో గీతా సారాంశమును ఉన్మాద చర్యగా పరిగణించి, దానిపై చర్యలకు కోరడం జరిగినదని వార్తసాధనాల ప్రసారాల ద్వారా తెలుస్తుంది. చాలా దశబ్దాల క్రిందటే, అంటే విదేశియులు మన దేశములో ప్రవేశించేనాటికే మన దేశములో ఉన్న హైందవ సంస్కృతిని తుడిచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కాని అవేవి సఫలం కాలేదు. పైగా అందులో చాలా మటుకు హైందవంలో కలసిపోయిన దాఖలాలు ఉన్నాయి. హైందవం ఎప్పుడూ తన మతప్రచారము చేసుకోలేదు. యితర మతస్దులను తమ మతములోకి రమ్మని ఏనాడు పిలవలేదు. పిలవదు కూడా. ఎవరికైనా తమంతట తామే హైందవ సంస్కృతికి ఆకర్షితులై ఇందులోకి రావాలి తప్ప, ఎవరూ రమ్మని ఫోర్స్ చేయరు. కాని ఈ విషయములో భగవధ్గీత మీద విమర్శలు గుప్పిస్తున్న సంస్దలు సమాధానం చెప్పగలవా?? చాలా మంది విదేశియులు భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతికి దాసోహామయి హైందవంలోకి మారారు. ఇంకా మారుతున్నారు. అందులో అనేక మంది సెలబ్రీటిలు ఉన్నారు కూడా... వారెవరిని ఇందులోకి రమ్మని పిలవలేదు. వారంటవారే వచ్చారు. అదీ హైందవ మతము గొప్పతనము. ఈ విధముగా హైందవ సంస్కృతికి పెరుగుతున్న ఆదరణ చూసి కొన్ని యితర మత సంస్దలకు గిట్టకపోవడం సహజమే. కాని అది ఈ రకమైన దుగ్దకి కారణమవుతుందని నేనుహించలేదు.


ఇకపోతే హైందవ సంస్కృతికి ఈ దుస్దితి రావడం చాలా వరకు హిందువుల పాత్ర కూడా ఉంది. అద్యాత్మిక స్వేచ్చ ఉండడం వలన మతపరమైన నిబంధనలను అందరూ పాటించడం లేదు. మరియు చాలా మందికి తమ సంస్కృతికి సంబందించిన పూర్తి సమాచారము తెలియదు. సంస్కృతి తరతరాలకి మెసుకువెళ్ళవలసిన పెద్దవాళ్ళు, సదరు భాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడం వలన సంస్కృతి యొక్క గొప్పతనమును తర్వాత తరమునకు అందించలేకపోతున్నారు. నిజానికి ఈ నిర్లక్ష్యమే హైందవ సంస్కృతికి నిజమైన శత్రువు.
హైందవ సంస్కృతి పై విమర్శలు చేయడం ద్వారా తమ మత ప్రాప్తిని పెంచుకొందామనుకొనే మత సంస్దలకు నేను చెప్పేదొక్కటే. గీత సారాంశము పై మీరు విమర్శలు చేసినంత మాత్రానా దాని యొక్క శక్తి నశించిపోదు. దాని వలన దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుందని యిందుమూలముగా యితర మతసంస్దలకు తెలియజేస్తున్నాను. మిగతా మతసంస్దల్లో లొసుగులు చెప్పాలంటే, ఇప్పటికిప్పుడే పలు అంశాలు చెప్పగలను. కాని వాటిని నేను ఎన్నటికి తెలియజెప్పను. ఎందుకంటే నా సంస్కృతి పరమత సహనము పాటించమని చెప్పింది. మరియు అన్ని మతాల సారాంశమొక్కటే అని చెప్పింది. ఈ సూక్తిని అన్ని ధార్మిక సంస్దలు పాటిస్తే చాలా మంచిది.
ధర్మమును నీవు రక్షిస్తే, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది

Wednesday 14 December 2011

మూలాలు వదిలి పరిగెడితే ఇలాగే ఉంటుంది...............

ఒక అర్దికవేత్త అత్యంత ముఖ్యమైన ప్రధానమంత్రి పదవిలో ఉంటే ఇలాగే జరుగుతుంది. ఈ రోజు దేశములో పారిశ్రామికరంగం అభివృది రేటు దారుణంగా పడిపోవడంతో మన దేశ కరెన్సీ విలువ చాలా కిందకి దిగజారిపోవడంతో దేశ అర్దిక పరిస్దితి సంకటంలో పడింది. దేశాన్ని అభివృద్ధి పధంలో పరిగెట్టించడానికి ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేసింది ప్రస్తుత ప్రదాని అర్దిక మంత్రిగా ఉన్న సమయములోనే... ఏ దేశానికైనా, ఆ దేశంలో ఎప్పటినుండో నడుస్తున్న అర్దిక విధానాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారానే ఎదగగలుగుతుంది.. కాని మన పరిపాలకులైన అర్దికవేత్తలు మూలాలు వదిలి పరిగెట్టి, ప్రస్తుత దేశ అర్దిక స్దితిని ఇబ్బందికరమైన స్దితికి తెచ్చారు. మన దేశములో అర్దిక రేటులో ఎప్పటి నుండో అధిక శాతము కల్గిన వ్యవసాయ రంగంను ప్రతి ప్రణాళిక సంఘంలోను నిర్లక్ష్యం చేసి, అభివృద్ధి పేరిట పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేసారు. అది తప్పని నేననడం లేదు. ఒక దేశ పాలకులుగా ప్రదానమంత్రి వారు దేశములో ఉన్న అన్ని రంగాలను సమాన దృష్టితో చూసి వాటి ఎదుగుదలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కాని మన ప్రధాన మంత్రి తన అర్దిక మేధో సంపత్తితో ఆలోచించి, దేశ అభివృద్దికి ఒక పారిశ్రామిక రంగం మాత్రమే సరయినదని భావించి మిగతా రంగాలను ముఖ్యముగా వ్యవసాయ రంగంను నిర్వీర్యం చేయడానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపోందించారు. 
 ప్రభుత్వ విధానాలు కారణంగా వ్యవసాయ రంగంతో పాటుగా చాలా దేశియ చిన్న స్దాయి పరిశ్రమలు అనేకం కనుమరుగైపోయాయి. ఇక ప్రభుత్వాలు వృద్ధి రేటు, ద్రవోల్బణం అదుపు అంటు సామాన్యులకు అర్దం కాని అనేక ప్రతిపాదనలు పెట్టి బడా పారిశ్రామిక వేత్తలను విపరీతముగా ప్రోత్సహించారు. వారు అడిగిన, అడగకపోయినా ప్రభుత్వము మాత్రము వారి మీద తమ ప్రేమను తగ్గించుకోలేదు. నిలబెట్టినంత కాలము పారిశ్రామిక రంగం అభివృద్ధి బాగానే సాగింది. కాని ప్రతికూల పరిస్ధితులు ఎదురవగానే మొత్తము వృద్ది రేటు మందగించి, మన కరెన్సీ విలువను పాతాళానికి తీసుకెళ్ళాయి. నిజానికి చెప్పాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి పేరిట ప్రభుత్వము చేపట్టిన ఉద్దీపణలు, ప్యాకెజీలు కొంత మంది మిలియనర్లగా అవతరించడానికి దోహదపడ్డాయని ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. భారిగా పెరిగిన వారి ఆదాయాలను చూపి మన దేశము అభివృద్ధి చెందుతుందన్నదానికి నిదర్శనంగా చూపారు. ఎప్పుడు లేనిది ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల స్దానాలు ఎక్కువ కావడం కూడా ప్రభుత్వ విధానాలు వారికి దోహదం చేసాయని చెప్పోచ్చు. కాని మిగతా రంగాల్లోని వారు చాలా హీన స్దితికి దిగజారడానికి కారణం ప్రభుత్వ విధానాలే.
అప్పట్లో ఒక సామెత ఎక్కువగా వినబడేది. "భారతదేశము చాలా ధనిక దేశము. కాని భారతీయులు మాత్రము పేదవారు" అని. ఎన్ని అటుపోట్లు ఎదురయినప్పటికి, మరియు ప్రభుత్వాల నుండి సరయిన సహకారము లేకపోయినప్పటికి వ్యవసాయ రంగము మరియు యితర చిన్న పరిశ్రమలు తమ మనుగడను కొనసాగించడం ద్వారానే ఈ మాత్రము అర్దిక స్దిరత్వం ఉందని చెప్పవచ్చు. సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధి పధంలో పరిగెట్టిస్తామని చెప్పిన అర్దికవేత్త మహశయులు, నేటి అర్దిక దుస్దితికి ఏమని సమధానము చెపుతారు?? తాము చేసిన చర్యలు ఫలితముగానే నేడు ఈ దుస్దితి దాపురించిదని చెపుతారా??? చెప్పరు..... ఎందుకంటే తాము అర్దికవేత్తలు కాబట్టి. దీనికి కారణముగా ప్రపంచ మార్కెట్టులో పతనంను ఒక కారణంగా చూపిస్తారు. అటువంటప్పుడు మన అర్దిక వ్యవస్దను ప్రపంచ మార్కెటుకి అనుబందంగా ఎందుకు తయారుచేసారని అడిగితే, సమాధానము ఉండదు. ఏది ఏమైనా దేశ అర్దిక వ్యవస్ద అనేది ఏదో ఒక రంగం మీద ఆధారపడియుండ కూడదు. అదే విధముగా వేరొక దేశ అర్దిక వ్యవస్ద ఆధారముగా ఉండకూడదని ఈ ఉందతమ్ తెలియజేస్తుంది
...

ఐ.ఎ.ఎస్. లు రాజ్యాంగ అతీతులా?? వారిని విచారించకూడదా??

ఎమ్మార్, ఓబుళాపురం మైనింగ్ ఆక్రమాలు తదితర కేసులలో సి.బి.ఐ. దర్యాప్తు చేపట్టిన దరిమిలా, ఈ మధ్యన అయా కుంభకోణాలతో సంబందం ఉన్న అప్పటి ఐ.ఎ.ఎస్. అధికారులను సి.బి.ఐ. అధికారులు విచారణ నిమిత్తము పలు పర్యాయములు తమ కార్యాలయాలకు పిలిపించుకోవడం, మరియు అవసరమైతే అరెస్టులు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు రాజగోపాల్ మరియు శ్రీలక్ష్మి తదుతరులను అరెస్టు చేసారు. ఇందులో రాజగోపాల్ ఇదివరకే రిటైర్ కాగా, శ్రీలక్ష్మి విధినిర్వహణలో ఉండగా అరెస్టు జరిగింది. ఇది జరిగిన తర్వాత ఐ.ఎ.ఎస్.లు అందరూ సదరు అరెస్టులను ముక్తకంఠంతో ఖండించి, సదరు అరెస్టుల విషయములో సి.బి.ఐ.కి ముకుతాడు వేయవలసినదిగా ప్రధాన కార్యదర్శిని కోరడం వరకు వెళ్ళింది. దానితో ప్రదాన కార్యదర్శి వారు సదరు సి.బి.ఐ. వారితో సమావేశము ఏర్పాటు చేసి, తమ వారిని ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని సూచించారు. ఇదంతా చదివిన తర్వాత అహా.... ఏమి ఔదార్యం... తోటి ఐ.ఎ.ఎస్.లు అవినీతి వ్యవహారముల్లో పీకలదాక మునిగితేలి ఉంటే, ఆ విషయాలను చూసి చూడనట్టు వదిలేయాలని సి.బి.ఐ. వార్కి సూచించడం ఏ సంస్కారము క్రిందకి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. సామాన్య ఉద్యోగులు ఏ మాత్రము చిన్న అవినీతికి పాల్పడిన కఠినంగా వ్యవహరించే ఈ ఐ.ఎ.ఎస్.లు, తన దాకా వచ్చిన తర్వాత దానిని యిబ్బందులగా అభివర్ణిస్తారా?? సామాన్యుడు తప్పు చేస్తే ఒకలా, వీరు తప్పు చేస్తే ఒకలా చూడాలా?? వాస్తవానికి సామాన్య ఉద్యోగి కన్నా, పై స్దాయి అధికారులే నిబద్దత కల్గిఉండవలసిన అవసరము లేదా?? పై అధికారి నిబద్దతతో ఉంటే వారి క్రింద స్దాయి సిబ్బంది నిబద్దతతో ఉండరా?? ఇండియన్ సివిల్ సర్వీసు అధికారులుగా వారు ప్రభుత్వానికి, రాజ్యాంగానికి రక్షణగా వ్యవహరించవలసిన వారు డబ్బులు కోసము తమ కున్న అధికారాలను కుంభకోణాలు చేయడానికి ఉపయెగిస్తారా??? అవినీతి కుంభకోణాలకు జరగడానికి అస్కారమిచ్చిన జి.ఒ.లను విడుదల చేసిన వారిని ఏమనకూడదట....... పైగా వాటనన్నింటిని రాజకీయ ఒత్తిళ్ళు వల్లనే అని వివరణ ఇచ్చుకోవడం చూస్తుంటే, ఇక ఆ అధికార స్దానాలలో వారు ఎందుకు??? తప్పు చేసిన వాడు ఎవడన్న సరే శిక్ష అనుభవించవలసినదే..... ఎమ్మార్, ఓబుళాపురం గనుల కుంభకోణాల విషయములో ముఖ్యమైన జి.ఒ.ల విడుదల విషయములో సంబందిత మంత్రులతో బాటుగా ఐ.ఎ.ఎస్.ల పాత్రను కూడా ఖచ్చితముగా చూపవలసినదే... అదే ప్రస్తుతం సి.బి.ఐ. చేస్తుంది..... కాని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మరియు ఐ.ఎ.ఎస్.ల సంఘం అధ్యక్షులు కలసి సి.బి.ఐ. జాయింట్ సెక్రటరీతో తమ వారిని యిబ్బంది పెట్టడం మానుకోవాలని సూచించడం చూస్తుంటే, అది చూస్తున్న ప్రభుత్వం, కోర్టులు ఏమి స్పందించకపోవడం ఏంటొ నాలాంటి సామాన్యుడికి అర్దం కావడం లేదు.

Friday 2 December 2011

నాగచైతన్యకి సూట్ కాని ’బెజవాడ’

అందరిలాగే నేను కూడా రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపుదిద్దుకొన్న బెజవాడ సినిమా మీద అంచనాలు పెట్టుకున్నాను. కాని సినిమా చూసిన తర్వాత గొప్ప అనుభూతి ఏమీ కలగలేదు. నాగార్జునతో శివ సినిమా తీసి సక్సెస్ ఆయిన దగ్గరి నుండి రామ్ గోపాల్ వర్మ తను తీసే ప్రతి సినిమా శివ సినిమా నేపద్యం ఉండేలా చూసుకుంటున్నాడు. అది కొన్ని సార్లు సక్సెస్ ఆయింది. కొన్ని సార్లు విఫలమయింది. ఇక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాను కేవలం నాగ చైతన్య ను మాస్ హిరోగా నిలబెట్టడం కోసమే తీసినట్టుగా అనిపించింది. సినిమా అద్యంతం నటులందరూ వారి వారి పాత్రలో ఇమిడిపోయారు. కాని సీరియస్ నెస్ లేని ముఖంతో నాగ చైతన్య తన పాత్రకి పూర్తి న్యాయం చేయలేకపోయాడు. శివ సినిమాలో నాగార్జున చూపించిన ధీరత్వం, గాయం సినిమాలో జగపతిబాబు చూపించిన సీరియస్ నెస్, రక్తచరిత్ర సినిమాలో వివేక్ ఒబేరాయ్ చూపించిన కర్కశత్వంలను నాగచైతన్య ఏ స్దాయిలోను చేయలేకపోయాడు. ఐదో తరగతి చదువుకొనే బుడతడు మన ముందుకు వచ్చి పౌరుషమైన డైలాగులు చెప్తే ఎలాగుంటుందో, బెజవాడ సినిమాలో నాగచైతన్య నటన అలాగుంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ సినిమాలో హీరో పాత్రధరికు కావలసినటువంటి గంభీరమైన ముఖం నాగచైతన్యకి లేకపోవడమే. అతను చెప్పిన ప్రతి డైలాగు, అతని బాడీ లాంగ్వేజికి సూట్ కానట్టుగా అనిపించింది. ఇదే సినిమాను ప్రభాస్ తోనే, లేక ఎన్టిఆర్ తోనే తీస్తే బాగుండునేమో అనిపిస్తుంది. నాగచైతన్యలో ఇంకా పసితనపు చాయలు పోలేదు. దాని వలన అతనికి తన వయసుకు తగ్గట్టుగా ప్రేమ కధా చిత్రాలు చేసుకుంటే బాగుంటుంది. తనకు ఇంకా వయసు వచ్చిన తర్వాత ఇలాంటి బరువైన పాత్రలు చేయవచ్చు. ఇక్కడ ప్రాబ్లెమ్ ఏమిటంటే, నాగార్జున శివ సినిమాతో హిట్ హీరోగా మారడడంతో, తన కొడుకు కూడా అలాంటి సినిమాతో హిట్ హీరోని చేయాలని అత్రుతపడుతున్నారనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చేయడానికి నాగచైతన్యకి ఇంకా సమయము ఉంది. కాబట్టి ప్రస్తుతానికి తన వయసు తగ్గ పాత్రలను ఎంచుకొని విజయాలు సాధిస్తే మంచిదని నాగార్జున ప్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దానికి ఉదహారణగా ఏ మాయ చేసావే, 100% లవ్ సినిమాలను ఉదహారిస్తున్నారు.