సలీం.. సుమారుగా అరవై సం.లు పైబడి ఉంటుంది
వయసు.. చేసేది అగర్ బత్తిలు వ్యాపారం..
మీసం లేకుండా గడ్డం మాత్రమే పెంచుకొన్న ముఖం,
నెత్తి మీద టోపి అతను ముస్లిం అని చెప్పకనే చెబుతుంటాయి.
ప్రతి రోజూ వివిధ కంపెనీల అగర్ బత్తి
ప్యాకెట్లను ఒక పెద్ద బ్యాగులో పెట్టుకొని తన మోపెడ్ పై తిరుగుతూ ప్రభుత్వ
కార్యాలయల్లో పని చేసే సిబ్బందికి అమ్ముతూ ఉంటాడనుకుంటాను..
ఎందుకంటే అతనిని నేను చాలా సార్లు మా ఆఫీసులో
చూసాను. వారానికో, రెండు వారాలకు ఒకసారో మా అఫీసుకు అగర్ బత్తిలు అమ్మడానికి
వస్తుంటాడు. మా ఆఫీసునకు అనుకొని ఇంజనీరింగు విభాగము, క్వాలిటి కంట్రోల్ విభాగము
కూడా ఉండడంతో తరచుగా అతను ఇక్కడికి వస్తుంటాడు. అతని రాక కంటే ముందే అతని బ్యాగు నుండి
విడుదలయ్యే అగర్ బత్తిల సుగంధ పరిమళం మన ముక్కుపుటలకు చేరడం ద్వారా తెలిసిపోతుంది.
మనిషి చూడగానే మృదుస్వభావి అని మనకి
అర్ద్రమవుతుంది. చాలా వినయంగా కార్యాలయంలో అందరి వద్దకు వెళ్ళి మీకైమనా అగర్
బత్తీలు కావాలా అని మర్యాదగా అడగడం అతని యొక్క వ్యాపార అణుకువను తెలియపర్చుతుంది.
అతని వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తంలోనే అగర్ బత్తిలు కొనుగొలు చేస్తుంటారు. నేను
ఆ మధ్య వరకు బ్యాచిలర్ గానే ఉండడంతో నాకెప్పుడూ వాటిని కొనవలసిన అవసరం రాలేదు.
దానితో ఎపుడూ అతని దగ్గర ఏమి కొనలేదు.
మా అన్నయ్య స్వంత ఊరి రాజకీయాల్లో చాలా బిజీ
మనిషి. అప్పుడప్పుడు కాంట్రాక్ట్ పనులు
కూడా చేస్తుంటాడు. ఒక సారి మంజూరు ఆయిన ఒక పనికి సంబందించి అగ్రిమెంటు
రాయించుకోవడానికి మా ఆఫీసునకు అనుకొని ఉన్న ఇంజనీరింగు విభాగమునకు వచ్చాడు. తాను
ఫోన్ చేస్తే కనిపించడానికి అని చెప్పి నేను కూడా అక్కడకి వెళ్ళాను. అక్కడ మా
అన్నయ్య ఇవ్వవలసిన ఫార్మాలిటిస్ అన్ని నా కళ్ళ ముందే అక్కడ ఉన్న అధికారులకు
ఇవ్వడం, వారు అగ్రిమెంటు కాఫీ తయారుచేయడంలో మునిగిపోవడంతో నేను, మా అన్నయ్య
మాట్లాడుకుంటూ అక్కడ కూర్చున్నాము.
అదిగో, అప్పుడే సలీం తన అగర్ బత్తీల బ్యాగ్
పట్టుకొని ఆ విభాగములోకి అడుగుపెట్టాడు.
నేను తరచుగా చూసే మనిషే కాబట్టి అతని రాక పెద్ద విశేషంగా అనిపించలేదు. అక్కడ ఉన్న అధికారులు సలీం దగ్గర ఉన్న అగర్ బత్తీలు
ప్యాకెట్లలను పరిశీలించి మూడు
ప్యాకెట్టులు తీసుకొన్నారు. సలీం వారు తీసుకొన్న ప్యాకెట్టుకలు లెక్కగట్టి 198 రూపాయలుగా లెక్కకట్టాడు. వెంటనే ఆ అధికారి తన
జేబులో నుండి మా అన్నయ్య నుండి అంతకు ముందే తీసుకొన్న డబ్బుల నుండే 200 రూపాయలు తీసుకొని ఇచ్చాడు.
ఏమనుకున్నాడో.. ఏమో.. సలీం మరల చేతిలో ఉన్న
కాగితం మీద తన పెన్నుతో ఏవో లెక్కలు, కూడికలు చేసుకొని, ఆ అధికారితో అతి వినయంగా
అయ్యా, మన్నించండి, ఇందకా నేను లెక్క తప్పుగా కూడాను. వాస్తవానికి బిల్లు 193 రూపాయలు మాత్రమే ఆయిందని చెప్పి ఆయన యిచ్చిన
రెండు వందలు తీసుకొని మిగతా ఏడు రూపాయలు చిల్లర తీసుకొని తిరిగి యివ్వబోయాడు. ఆ
అధికారి చిల్లరను ఉంచుకోవలసినదిగా ఆదేశిస్తునట్టుగా సలీం తో చెప్పాడు.
కానీ సలీం మాత్రం నవ్వుతూ మీ డబ్బులు నాకు
ఎందుకయ్యా, నా సరుకు కొన్నందుకు యిచ్చిన ప్రతిఫలం నాకు చాలు, నాది కాని ఒక
అర్దరూపాయి ఆయినా సరే నాకు, నా కుటుంబానికి చేటు చేయదా అయ్యా! అని చెప్పి చిల్లరను
ఆ అధికారికి ఇచ్చేసాడు. ఈ సంఘటనతో ఆ అధికారి ముఖంలో రంగులు మారిన వైనం నా దృష్టికి
రాకుండా పోలేదు. మా అన్నయ్య కూడా ఆ సంఘటనతో నా వైపు చూసి చిన్నగా నవ్వాడు..
మాతో పాటుగా ఈ సంఘటనను అక్కడే ఉన్న ఒక బడా
కాంట్రాక్టర్ కూడా చూస్తూ ఉన్నాడనుకుంటాను. ఆ విభాగము నుండి వెళ్ళిపోతున్న సలీంను
పిలిచి ఒక అగర్ బత్తి ప్యాకెట్టు తీసుకొని 500 రూపాయల నోటు
ఇచ్చాడు. అంతే కాకుండా మిగిలిన మొత్తం ఉంచుకోమని ఆఫర్ చేసాడు. ఆ బడా కాంట్రాక్టర్
తీసుకొన్న అగర్ బత్తి ప్యాకెట్టు విలువు 40 రూపాయలు. బడా
కాంట్రాక్టర్ మాటలకు సలీం ఒక చిన్న వినయపూర్వకమైన చిరునవ్వు నవ్వి, అయ్యా మీరు
చాలా గొప్పొళ్ళులా ఉన్నారు. మంచి మనసు కూడా కల్గి ఉన్నవారిలా ఉన్నారు. భగవంతుడు
మీకు ఇలాంటి మంచి మనసు ఇచ్చినందుకు మీ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులై ఉంటారు. మీకు, మీ మంచితనానికి సలాం సాబ్ అని చెప్పి
మిగిలిన 440 రూపాయలు ఆ బడా కాంట్రక్టర్ చేతిలో ఉంచాడు.
ఉంచుకోమని బడాకాంట్రాక్టర్ బలవంతం చేసినప్పటికీ మరొక సారి సలాం చేసి నిదానంగా
అక్కడి నుండి నిష్కమించబోయాడు. అప్పుడు ఆ కాంట్రాక్టర్ అతనిని ఆపి నువు ఇందాక
అక్కడున్న అధికారికి చిల్లర తిరిగి ఇచ్చినపుడే అనుకున్నాను నీ గొప్పతనం గురించి.
అందుకే నా డబ్బులు నువు ఉంచుకోకుండా తిరిగి వెనక్కి ఇచ్చేస్తావని నాకు తెలుసు.
అందుకే మిగిలిన చిల్లర నిన్ను ఉంచుకోమని చెప్పాను. నువు వాటిని తిరిగి
ఇచ్చేస్తావని ముందే అనుకున్నాను అని అన్నాడు.
ఆ బడా కాంట్రాక్టర్ ఆ చర్యను ఎలా రిసీవ్
చేసుకున్నాడో నాకు తెలీదు, అలాగే ఆ అధికారి ఎలా రిసీవ్ తీసుకున్నాడో తెలియదు కానీ
నా కళ్ళలో ఒక రకమైన విజయగర్వం కల్గింది. అది మా అన్నయ్యకి కనిపించింది. ఈ రోజుల్లో
ఇలాంటి వారు కూడా ఉంటారా తమ్ముడు అని నా కళ్ళలో చూస్తూ అన్నాడు. మరల నా వైపు
తిరిగి నీలాంటోళ్ళు ఇంకా ఉన్నరన్న మాట అన్నాడు.....
మనసులోనే సలీంకి ధన్యవాదములు తెల్పాను...
ఇప్పుడు మనకి కావల్సినది నీలాంటి వాళ్ళే సలీం భాయ్... మనదైన కోసం ఆరాటపడాలి
తప్పితే, మనది కాని అర్దరూపాయి మీద కూడా మనం ఆశ పెట్టుకోకూడదు అని ఎంత చక్కగా
అర్ద్రమయ్యేలా చేసావు..
అందుకే సలీం భాయ్... నీకు సలాం....
సలీం కే సలాం కాదు ఈ మంచితనం పరిమళించిన రచన చేసిన రాజీవ్ రాఘవ్ కు కూడా నా సలాం!
ReplyDeleteమీరిచ్చిన ప్రశంసకు ధన్యవాదములు సార్.... అలాగే
Deleteమీరిచ్చిన ప్రశంస మన చుట్టునే ఉన్నప్పట్టికీ మనం గమనించలేని సలీం లాంటి వ్యక్తులకే చెందుతుంది సార్....