Monday 9 December 2013

అవినీతి అధర్మమేమి కాదు.....2


అవినీతి అధర్మమేమి కాదు.....1  తర్వాతి భాగం క్రిందన....

“సరే బ్రదర్.. నువ్వు చెబుతున్నది కరెక్ట్ అనుకుందాం.... నువ్వు ఆ మధ్య బైక్ కొన్నావ్ కదా ఎలా ఉంది?” అడిగాడు నాయుడు......

“చాలా బాగుందన్నయ్యా... నాకు నచ్చిన బైక్ కొనుకొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అన్నాడు ఆశోక్....

“మరి దానికి చట్టపరంగా ఉన్న రికార్డులన్నీ ఉన్నాయా?” అడిగాడు నాయుడు......

“ఇన్సూరెన్స్ తప్ప అన్ని ఉన్నాయి ఆన్నయ్యా.. ఇన్సూరెన్స్ కి కూడా అప్లయ్ చేసాను. అది ఇంకా రావాలి” అన్నాడు ఆశోక్.

“మరి చట్టపరంగా రికార్దులన్ని లేకుండానే బైక్ మీద ఎలా తిరుగుతున్నావ్ ఆశోక్ నువ్వు” తూటాల వచ్చింది నాయుడు నోట్లోంచి.....

“దాని వలన ఎవరికి నష్టం లేదు. ఒక వేళ ఎక్కడైనా చెకింగ్ లో పట్టుబడితే ఫైన్ కడతాను. దాని వలన నేనే నష్టపోతాను తప్ప వేరేకరు కాదు కదా” అన్నాడు ఆశోక్....

“సో.. నీ ఉద్దేశం ప్రకారం మనకి మనం నష్టపోయినా తప్పు లేదు కదా” అన్నాడు నాయుడు. ఏమి మాట్లాడలేదు ఆశోక్... 

చట్టాన్ని అతిక్రమించినోళ్ళు అందరూ పాపాత్ములు కాలేరు. అలాగే చట్టాన్ని ఖచ్చితంగా పాటించేవారందరూ పుణ్యాత్ములు కాలేరు...  అవతలి వాడికి మంచి జరుగుతుందని భావిస్తే చట్టాన్ని అతిక్రమించిన పర్వాలేదు బ్రదర్ అది తప్పు కావచ్చు కాని, అధర్మం మాత్రం కాబోదు....  అంతే కాని అవతలి వాడు ఏమైపోయినా పర్లేదు చట్టాన్ని మాత్రం అతిక్రమించకూడదు అనుకుంటే అది అధర్మం క్రిందకి వస్తుంది నాయనా...

అంతెందుకు, కురుక్షేత్ర యుద్దం జరుగుతున్న సమయంలో కురుపాండవుల గురువైన ద్రోణాచార్యుడిని నిలువరించడం కోసం ధర్మవంతుడైన ఏనాడు అబద్దం పలుకని పాండవ అగ్రజుడు ధర్మరాజే అబద్దం కాని నిజంని చెప్పలేదు!! ద్రోణాచార్యుడుని నిలువరించడానికి “ఆశ్వద్ధామ చనిపోయాడు” అని ధర్మరాజు ద్రోణుడుకి వినబడేలా అనలేదా? అది విన్న ద్రోణుడు స్దాణువై అస్త్రసన్యాసం చేయలేదా? నిజానికి అక్కడ చనిపోయినది ఆశ్వద్దామ అనే పేరు గల ఏనుగు!  కానీ ధర్మ విలువర్దం జరుగుతున్న యుద్దంలో అపాటి చిన్న అబద్దమాడి తప్పు చేయడం సమంజసమే కదా! పైగా శ్రీకృష్ణ పరమాత్ముడే ముందుండి నడిపించాడీ ఈ తతంగం మొత్తాన్ని....
అలాగే శ్రీ రాముడు వాలీ, సుగ్రీవలు యుద్దంలో తలపడుతున్నపుడు చాటుగా బాణం వేసి వాలిని నేలకూల్చలేదా? అది ధర్మమవుతుందా? కాదు కదా! కానీ శ్రీరాముడు ఎందుకు అలా చేసాడు.... అక్కడ వాలి తన తమ్ముడి విషయంలో  చేసినది తప్పు కాబట్టి అలా చేయడంలో అధర్మం కాదు కదాని భావించడం వలనేగా!!!

ఆ విధంగా ప్రజలకు మేలు కల్గుతుందని భావించినపుడు అధికారులు, రాజకీయనేతలు రాజ్యాంగం లేక చట్టానికి అతీతంగా చేసినా అది అధర్మం కాజాలదు....

ఒక అధికారి లంచం తీసుకొని నిబంధనలకు విరుద్దంగా ఏదైనా పని చేసినప్పుడు, దాని వలన ఎవరికి నష్టం కలగనప్పుడు అది పాపం లెక్కలోకి రాదు. దాన్ని కేవలం చట్ట ప్రకారం తప్పు చేసినట్టిగానే భావించాలి.. ఒక వేళ  ఆ అధికారి లంచం తినడానికి వ్యతిరేకి ఆయినా సరే ఎవరికి నష్టం లేదని భావించినపుడు నిబంధనలు ఉల్లంఘించిన పర్లేదు....

ఉదహారణకి మన రాఘవ్ గురించే మాట్లాడుకుందాము...

ఏదో ఆలోచనలో ఉన్న నేను సడెన్ గా వారి సంభాషణలో నా పేరు వినబడే సరికి ఈ లోకంలోకి వచ్చాను... ఏంటి అన్నట్టుగా ప్రశ్నార్దకంగా చూసాను నాయుడు వైపు...

నాయుడు తిరిగి చెప్పడం  మొదలెట్టాడు...
రాఘవ్ నిజాయితీగా పనిచేస్తాడు. లంచాలు తీసుకోడు. ఆ సంగతిని ఒప్పుకుంటాన్నేను... కానీ దాని వలన ఎవరికి ఉపయెగం!! నిబంధనలను బట్టి కాకుండా మానవతకోణంలో ఆలోచించగలిగిన వాడే గొప్పవాడు అవుతాడు.
 రాఘవ్ ప్రావిడెంట్ ఫండ్ విభాగములో పనిచేసేటప్పుడు, మా ఊరి మాస్టారు ఒకాయనకి వాళ్ళ అమ్మాయి పెళ్ళి నిమిత్తం డబ్బులు కావల్సి వచ్చింది. దానితో తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుండి లోను తీసుకుందామని భావించి రాఘవ్ కి నాతో చెప్పించాడు. నేను ఫోన్ చేసి మనోడే కొద్దిగా ఎక్కువ మొత్తం వచ్చేటట్టుగా చూడమని రిఫర్ చేసాను. కాని రాఘవ్ ఏమి చేసాడు!! రూల్స్, రెగ్యులేషన్స్ తొక్క తోలు అని చెప్పి మాస్టారు అడిగిన మొత్తంలో సగం మొత్తం మాత్రమే మంజూరు చేసాడు...  ఇక్కడ రాఘవ్ తాను రూల్స్ ని ఫాలో అయ్యాను అనో లేక సిన్సియారిటి అనో ఏదో వంక చెబుతాడు... కానీ అక్కడ మాస్టారి అమ్మాయి పెళ్ళికి సరిపడ డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు... పోనీ ఆ డబ్బులు ఏమైనా ప్రభుత్వానివా! తన జీతం నుండి నెలా, నెలా చెల్లించేదే కదా! తన స్వంత డబ్బులే కదా! ఆ డబ్బులు కూడా ఇవ్వడానికి కూడా రూల్స్ రెగ్యూలేషన్స్ అని పట్టించుకోవడం అవసరమా? దాని వలన మనోడికి ఏమైనా పుణ్యం పెరిగిపోతుందా? ఎదుటి వాడికి సాయపడలేని సిన్సియారిటి ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒకటే.....

నాయుడు చెప్పింది విని ఆలోచించాను నేను... నిజమే! ఆ మాస్టారి కూతురి పెళ్ళికి ఎలిజిబులిటి ఎమౌంట్ ని మాత్రమే మంజూరు చేసాన్నేను... ఆ సంగతి నాక్కుడా గుర్తుంది.. కానీ ఆ సమయంలో నేను నా బాధ్యత గురించి మాత్రమే ఆలోచించాను కానీ, అవతలి వ్యక్తి అవసరం గురించి ఆలోచించలేదు.. నాయుడు చెప్పినట్లు నా వైపు నుండి చేసినదీ నాకు కరెక్టే గానే అనిపించినా ఎందుకనో అవతలి కోణంలో నుండి ఆలోచించినపుడు తప్పు చేసానన్న ఫీలింగ్ కల్గింది... వాస్తవానికి నిబంధనలకు విరుద్దంగా మాస్టారు అడిగిన మొత్తమును మంజూరు చేయవచ్చు.. అది పెద్ద సమస్య కూడా కాబోదు...

తిరిగి నాయుడు చెప్పడం కొనసాగించాడు.
ఎదుట వాడికి మనం సాయం చేయగలిగి చేయలేకపోవడం ఆధర్మం క్రిందకి వస్తుంది.. మీ ఓనర్ లంచాలు మేసినంత మాత్రం పాపాత్ముడు కాడు.. పైగా అతను అన్నదానాలు చేస్తుంటాండని అంటున్నావు కాబట్టి అది పుణ్యఫలం క్రిందే వస్తుంది.....

“అంటే ఆక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇలా దానధర్మాలు చేసుకుంటూ పోతే పుణ్యం సంపాదించుకోవచ్చంటావ్, అంతేగా” అనడిగాడు ఆశోక్....

“ఆ దానధర్మాలు ఎదుటివాడికి ఉపకారం కల్గేలా ఉండాలి. అంతే కాని ఆడంబరం కోసమో, లేక పేరు కోసమో చేస్తే ప్రతిఫలం మాత్రము దక్కదు” అన్నాడు నాయుడు......

“ చివరగా నేను చెప్పేదేమిటంటే ఎదుటివాడికి ఉపకారం కల్గుతుంది అంటే చట్టాన్ని ఉల్లంఘించడమేమి తప్పు కాదు అనేది నా అభిప్రాయం”

“ఆయితే లంచాలు మేసి ఆక్రమంగా డబ్బులు కూడబెట్టడం తప్పు కాదంటవ్” అడిగాడు ఆశోక్.

 “తాను, తన కుటుంబం స్వార్దం గురించి మాత్రమే ఆలోచించి లంచాలు మేసి డబ్బులు కూడబెడితే అది తప్పు ఆవుతుంది... అందులో అతని వలన ఎవరైనా నష్టపోయి ఉంటే దానికి పాపం కూడా తగులుతుంది. అంతే” అని చెప్పడం ముగించాడు....


2 comments:

  1. రాఘవ్ గారు,
    రాముని గురించి మీరు చెప్పిన దానిలో కొంచెం సమస్య ఉంది. చెట్టుచాటునుండి కూల్చడం ధర్మం కాదు కాని తప్పదు కాబట్టి అలా చేసాడు అన్నారు. కానీ వాలిని ఆయన చంపిన విధానం ఎలా ధర్మమో ఆయనే చెప్పాడు. వాలి కూడా ఒప్పుకున్నాడు. ఆయన బాణం వాలి గుండెల్లో దిగింది. అంటే వెనకనుండి కొట్టలేదు. వాలి వానరజాతికి చెందినవాడు అంటే శాఖామృగం. అలాంటప్పుడు చాటుగా చంపవచ్చు, మాటుపెట్టి పట్టుకోవచ్చు, వలవేసి పట్టుకోవచ్చు. ఇదే పాటించాడు. పైగా వాలి ధర్మం తప్పాడు . తమ్ముడు బతికుండగా బలవంతంగా తమ్ముని భార్యను చెరబట్టాడు. అందుకు చంపాడు రామచంద్రమూర్తి. కాబట్టే నా అన్న ధర్మాత్ముడైతే ఇప్పుడు నేను వదిలే ఈ బాణం ఇంద్రజిత్తుని వధించాలి అని లక్ష్మణుడు వదిలిన బాణం ఇంద్రజిత్తుని చంపగలిగింది. ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృడవ్రతః అని వాల్మీకి అడిగిన ప్రశ్నకి నారదులవారు రాముని గురించి చెప్పేవారూ కాదు.

    కాబట్టి దయచేసి పూర్వాపరాలు తెలుసుకుని రాముడిది ధర్మమో అధర్మమో ఆలోచించుకోండి తప్ప, ఎవరో చెప్పిందో ఎక్కడో విన్నదో కాదు.

    ReplyDelete
  2. మనోహర్ గార్కి,
    మీరు తెలియపర్చిన రామాయణంలో వాలి, సుగ్రీవల వృత్తాంతం అక్షర సత్యం.... పైన సదరు విషయాన్ని సాధారణ సంభాషణల్లో భాగంగా వాడడం వలన కుదించి రాయడం జరిగింది.. అంతే తప్ప మరోలా కాదని భావించగలరు. రామాయణంలో ఉన్న చాలా విషయాల్లో కొన్ని అసంబద్దంగా ఉన్నప్పట్టికి, వాటి వెనుక వున్న నిగూఢంని తెలుసుకుంటే శ్రీరామచంద్రమూర్తి వారు ఎంత గొప్పవారో సులువుగా అర్ద్రం చేసుకోవచ్చు... దురదృష్తశావత్తు చాలా మంది పురాణాలను పై, పైన చదివి అపోహలు పెంచుకుంటున్నారు... మొదట్లో నేను విన్నప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు చేసిన పనుల్లోనే కొన్ని నాకు అసంత్రప్తిగా అనిపించాయి. కాని వాటి వెనుక వున్న అర్దంను మా అమ్మమ్మ గారు చెప్పినపుడు తెలిసింది రామయ్య ప్రభువు ఎంతొ గొప్పవాడో..... అదే మా అమ్మ గారిని అడిగితే చెప్పలేరు... అమ్మమ్మ గారి దగ్గర ఉన్న జ్ణాన సంపదని తర్వాత తరాలకు కూడా అందించగలిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు...
    స్పందించినందుకు ధన్యవాదములతో......

    ReplyDelete