Friday 31 October 2014

రెహనా – అఖరి కోరిక



రెహనా విషాదంతం గురించి “పని లేక” బ్లాగులో ఇదివరకే డా.రమణ గారు ప్రచురించారు. ఆయితే రెహనా స్వయంగా తన తల్లికి పంపించిన వాయిస్ మెసెజ్ పూర్తి స్దాయిలో చదివిన తర్వాత చాలా చలించిపోయాను. మన భూమ్మీదే నరకం అంటే ఎలా ఉంటుందో రెహనా స్వయముగా చెప్పిన భావాలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

నరకం ఎక్కడో లేదు. ఇక్కడే ఉంది. మన భూమ్మీదే ఉంది.  ఇరాక్ లో ఆయితే ఇంకా గొప్పగా ఉంటుంది. రెహనా మాటల్లో.......

రేప్‌ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ సంఘటనపై అంతర్జాతీయంగా పెనుతుపాను చెలరేగింది. ఈ నేపథ్యంలో- తనకు మరణ శిక్ష పడిందని తెలిసిన తర్వాత రెహనా తన తల్లికి ఒక వాయిస్‌ మెసేజ్‌ను పంపింది. గత శనివారం ఆమెను ఉరితీసిన తర్వాత అధికారులు దీనిని విడుదల చేశారు. భగవంతుడి న్యాయస్థానంలో మనం ముద్దాయిలం కాదు అని తన తల్లికి ధైర్యం చెప్పటానికి ప్రయత్నించిన రెహనా తన శరీర అవయవాలను దానం చేయమని కూడా కోరింది. కరుడుగట్టిన హృదయాలను సైతం కరిగించే ఆమె పంపిన సందేశానికి తెలుగు అనువాదమిది..

డియర్‌షోలి, నేను క్విసాస్‌ (ఇరాన్‌ న్యాయవ్యవస్థలో ఒక అంశం)ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయిందనే విషయం ఈ రోజే నాకు తెలిసింది. ఈ విషయాన్ని నువ్వే నాకు చెప్పి ఉండాల్సింది. నా జీవితంలో ఆఖరి అధ్యాయానికి చేరుకున్నానని తెలిసిన తర్వాత నువ్వు నాకు ఈ విషయం చెప్పకపోవటం బాధ కలిగించింది. నాకు ఈ విషయం తెలుస్తుందని నువ్వు అనుకోలేదా? నువ్వు విషాదంగా ఉన్నావనే ఆలోచనే నన్ను ఇబ్బంది పెడుతోంది.. నీ చేతిని, నాన్న చేతిని ముద్దాడే అవకాశాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు.? ఈ ప్రపంచం నన్ను 19 ఏళ్లు బతకనిచ్చింది. నన్ను చంపేసి నా శరీరాన్ని నగరంలో ఏ మూలో విసిరేసి.. కొద్ది రోజుల తర్వాత మార్చురీలో నా శవాన్ని గుర్తించమని నిన్ను తీసుకువెళ్లేవారు. నన్ను రేప్‌ చేశారనే విషయం కూడా నీకు అప్పుడే తెలిసేది. నన్ను చంపిన వ్యక్తి ఎవరో కూడా ఎవ్వరికి తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే- వాళ్ల దగ్గర ఉన్నంత సంపద, శక్తి మన దగ్గర లేదు. ఆ తర్వాత నువ్వు సిగ్గుతో తలదించుకొని జీవితాన్ని గడపాల్సి వచ్చేది.. అలా గడిపి.. గడిపి.. బాధతో కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా మరణించి ఉండేదానివి. కథ అక్కడితో ముగిసిపోయి ఉండేది. 

అయితే ఒక్క దెబ్బతో మొత్తం కథంతా మారిపోయింది. నా శరీరాన్ని నగరంలో ఏ మూలో పడేయలేదు. మొదట ఈవిన్‌ జైలులోను, ఇప్పుడు శ్మశానంలాంటి షరార్‌ ఈ రే జైలులోను ఉంచారు. అయితే ఈ విషయాలు వేటికీ నేను ఫిర్యాదు చేయదలుచుకోలేదు. జీవితానికి మరణం ఒకటే ముగింపు కాదనే విషయం నీకు కూడా తెలుసు. ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కొన్ని అనుభవాలను సంపాదించుకోవటానికి, కొన్ని గుణపాఠాలు నేర్చుకోవటానికి, కొన్ని బాధ్యతలు నెరవేర్చటానికి వస్తాడని నువ్వు నాకు చెప్పేదానివి. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు మనం పోరాడాల్సి వస్తుందనే విషయాన్ని నేను నేర్చుకున్నా. నన్ను ఒక వ్యక్తి కొరడాతో కొట్టినప్పుడు అక్కడే ఉన్న మరొక వ్యక్తి ప్రతిఘటించాడు. అతనిని కూడా కొరడాతో కొడితే ఆ దెబ్బలకు అతను మరణించాడని నువ్వు నాకు చెప్పావు. ఒక వ్యక్తి చనిపోయినా పర్వాలేదు.. కానీ ఈ మరణం వెనకున్న కారణం, దానికున్న విలువ గురించి అందరికీ తెలియాలి.

స్కూలుకు వెళ్లినప్పుడు, దెబ్బలాటలు వస్తాయని.. ఫిర్యాదులు చేస్తూ ఉంటారని- వాటిని మనం ఎదుర్కోవాలని నువ్వు చెబుతూ ఉండేదానివి. మా ప్రవర్తనకు నువ్వు ఎంత ప్రాధాన్యం ఇచ్చేదానివో గుర్తుందా? అయితే నీ అనుభవం తప్పు. నన్ను ఒక వ్యక్తి రేప్‌ చేయటానికి ప్రయత్నించినప్పుడు నీ పాఠాలేమి పనిచేయలేదు. కోర్టులో హంతకురాలిగా చిత్రీకరించినప్పుడు అవి నన్ను కాపాడలేదు. కోర్టులో నన్ను ఒక హంతకురాలిగా చిత్రీకరించారు. నేను కోర్టులో ఏడ్వలేదు. నన్ను క్షమించమని ప్రాధేయపడలేదు. నేను న్యాయాన్ని నమ్మాను. అందుకే ఒక్క కన్నీరు బొట్టు కూడా కార్చలేదు. నేను ఎప్పుడూ దోమలను కూడా చంపలేదని నీకు తెలుసు. బొద్దింకలను కూడా వాటి మీసాలు పట్టుకొని బయటపడేసేదాన్ని. అంతే తప్ప చంపేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు ఒక కరుడుకట్టిన హంతకురాలిని అయిపోయాను. నాపై రకరకాల ఆరోపణలు మోపారు. న్యాయమూర్తుల దగ్గర నుంచి న్యాయం ఆశించటం కూడా ఆశావాద థృక్పథమేమో అనిపిస్తుంది. న్యాయమూర్తి నన్ను ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నన్ను ఇంటరాగేషన్‌ సమయంలో కొడుతున్నప్పుడు.. అత్యంత హీనంగా దుర్భాషలాడుతున్నప్పుడు ఎవ్వరూ నా వైపు మాట్లాడలేదు. నా అందానికి చిహ్నంగా నేను భావించే జుట్టును తీసేసి గుండు చేయించినప్పుడు నాకు దక్కిన బహుమానం ఏమిటో తెలుసా- జైలులో 11 రోజుల ఏకాంత నిర్భందం.

ఇదంతా వింటూ నువ్వు ఏడవకు. మొదటి రోజు పోలీసు ఆఫీసులో ఒక పెళ్లికాని ముసలి పోలీసు నా గోళ్లను విరిచేశాడు. అప్పుడు అందాన్ని ఇక్కడ హర్షించరనే విషయం అర్థమయింది. ఒక అందమైన ఆకృతి, అందమైన ఆలోచన, అందమైన భావన, అందమైన రాత, అందమైన చూపు, అందమైన గొంతు- వీటి వేటికి ఇక్కడ విలువ లేదు. అమ్మా, నా ఆలోచనా విధానం మారిపోయిందేమిటా అనుకోకు. దానికి నువ్వు బాధ్యురాలివి కావు. నా మనసులోంచి అనేక మాటలు ప్రవాహంలా వస్తున్నాయి. నువ్వు లేకుండా, నీకు తెలియకుండా నన్ను ఉరితీసినప్పుడు- నా జ్ఞాపకాలుగా నీకు మిగిలేవి ఈ మాటలే. నేను మరణించే ముందు నాదో కోరిక.. నీ శక్తిమేరకు దాని కోసం ప్రయత్నించు. నేను నిన్ను, ఈ దేశాన్ని కోరేది ఇదొక్కటే. దీనిని సాధించాలంటే కొంత సమయం పడుతుందని నాకు తెలుసు. అమ్మా.. ఏడవకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక విల్లు రాయాలనుకుంటున్నా
. జైలులో ఉత్తరం రాయాలన్నా అధికారి అనుమతి కావాలి. అందువల్ల నువ్వు కోర్టుకు వెళ్లి నా తరపున అభ్యర్థనను వారి ముందు ఉంచు. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావనే భావనే నన్ను ఇబ్బంది పెడుతోంది. అమ్మా.. నేను నిన్ను అభ్యర్థించేది ఇది ఒక్కటే. కోర్టులో నాకు శిక్ష వేయవద్దని న్యాయమూర్తులను అభ్యర్థించమని చాలా సార్లు చెప్పావు. కానీ నేను అంగీకరించలేదు. కానీ నా ఈ చివరి అభ్యర్థనను మాత్రం నువ్వు మన్నించాలి. అమ్మా.. నువ్వు నాకు నా జీవితం కన్నా ఎక్కువ. అందుకే నువ్వు నాకీ పని చేసిపెట్టాలి. మరణించిన తర్వాత నా శరీరం మట్టిలో కలిసిపోకూడదు. నా అందమైన కళ్లు, చలాకీగా పనిచేసే నా గుండె ఎందుకూ పనికిరాకుండా పోకూడదు. అందువల్ల- నన్ను ఉరితీసిన వెంటనే నా గుండె, కాలేయం, కళ్లు- ఇలా- అవయవ మార్పిడికి పనికొచ్చే అవయవాలన్నింటినీ ఈ ప్రపంచానికి నా బహుమతిగా ఇచ్చేయండి. అవి అమర్చిన వారికి నా పేరు తెలియనివ్వకండి. అంతే కాదు. నాకు నువ్వు సమాధి కట్టద్దు. దాని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. నా కోసం నువ్వు నల్లబట్టలు వేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను కష్టపడిన రోజులన్నీ మర్చిపోవటానికి ప్రయత్నించు.

ఈ ప్రపంచం మనల్ని ప్రేమించలేదు. అందుకే నేను మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నాను. భగవంతుడి న్యాయస్థానంలో- నన్ను కొట్టినందుకు ఇన్‌స్పెక్టర్‌ షామోలపైన, అతనిని నివారించలేకపోయినందుకు సుప్రీం కోర్టు జడ్జీలపైన కేసు పెడతాను. అదే కోర్టులో నా హక్కులను హరించినందుకు డాక్టర్‌ ఫార్వాడిపైన, ఖాసీం షబానీపైన కేసులు పెడతాను. కొన్ని సార్లు మనం నిజమనుకున్నదంతా నిజం కాదు. అమ్మా.. ఆ సృష్టికర్త ప్రపంచంలో నువ్వు నేను ఒకటి. మనం ముద్దాయిలం కాదు. మనపై ఫిర్యాదులు చేసిన వారందరూ ముద్దాయిలు. భగవంతుడు ఏం చేస్తాడో అప్పుడు చూద్దాం.. నేను మరణించేదాకా నిన్ను కౌగిలించుకోవాలని ఉంది.  ఐ లవ్ యూ..
ఇట్లు...
నీ రెహనా


సౌజన్యం: ఆంధ్రజ్యోతి

2 comments:


  1. ఇస్లామిక్ షరియా న్యాయ నిబంధనలు ఎంత స్త్రీ వ్యతిరేకమైనవో ,ఎంత అభ్యుదయ నిరోధకమైనవో తెలిసిందే.అందువలన ఆధునిక,అభ్యుదయకరమైన common civil code మనదేశంలో అన్ని మతాలవరికి,అన్ని జాతులవారికి వర్తింపజేయాలి.

    ReplyDelete
  2. A touching message not only to her mother but to the whole world
    I had the unfortunate experience of visiting inmates in Iranian prisons
    I am not surprised at the treatment she received
    I am sure she didn't want her mother know how horribly her precious daughter was tortured in EVIN, most notorious jail
    Rehana. May your soul rest in peace
    Hope you are living in somebo else's body
    Your life is a message to the world

    ReplyDelete