Thursday 30 October 2014

అవినీతి-జనామోదం.


ఈ రోజు దేశంలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీ  ఎన్నికల సమయంలో అవినీతి నిర్మూలన/అంతమొందించడం లాంటి స్లోగన్ లేకుండా బరిలోకి దిగకుండా ఉండడం లేదు. ఆయితే ఆ స్లోగన్ పట్ల ఉన్న నిజాయితీని నాయకులుతో పాటుగా ప్రజలు కూడా పట్టించుకోవడం మానేసారు అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పలు ఉదంతాలు చూస్తుంటే.

జయలలిత, మాయావతి, జగన్ మెహన్ రెడ్డి, డి.రాజా, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్ etc.. ఇట్టా లిస్టు రాసుకుంటూ పోతే ఎన్ని పేజిలు పడుతుందో మీకు చెప్పవలసినది కాదు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ వారు అన్నారు కానీ, ఇప్పుడు దానిని ఇలా కూడా చెప్పుకోవచ్చు. “రాజకీయాలంటే ప్రజాసేవ కాదోయ్, రాజకీయాలంటే కుంభకోణాలు చేయడమేయ్”

అవినీతి అనేది మన దేశాన్ని ఎంతగా పట్టి పీడిస్తుందో దేశంలో సామాన్యుల తలరాతని, దేశ అభివృద్ధిని, రాజకీయ నేతలు మరియు ఉన్నతాధికారుల బ్యాంకు బ్యాలెన్సులను చూస్తే చాలా ఈజీగా చెప్పేసుకోవచ్చు. దేశంలో ఉన్న పలు సమస్యలకు ప్రధాన కారణం అవినీతి కంపే అని ప్రతి ఒక్కడికి తెలుసు.  అది నిజం కూడా...  చాలా మంది మేధావులు, చదువుకున్నవాళ్ళు(?) ఈ విషయమై చాలా మధనపడుపోతూ ఉంటారు. ఆయితే ఇలాంటి వారు కేవలం మధనపడతారు తప్పితే అవినీతికి వ్యతిరేకంగా చిత్తశుద్దితో తమ సపోర్టుని అందిస్తారని అనుకోవడానికి లేదు.

ఒకప్పుడు అవినీతి చేసినట్టు తేలితే ఆ నేతకు ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యమే. సంబంధిత పార్టితో పాటుగా ప్రజలు కూడా అలాంటివారిని దూరం పెట్టేవారు. అందువల్ల వెధవ పనులు చేసినా బయటకు తెలీకుండా జాగత్ర పడేవరు. ఇప్పుడు పరిస్దితులు చూస్తుంటే సీన్ పూర్తిగా రివర్స్ ఆయినట్టుగా అనిపిస్తుంది.

అవినీతి అనేది పెద్ద ఇష్యూగా ప్రజలు భావించడం లేదని ఈ మధ్యన జరుగుతున్న ఉదంతాలు బట్టి భావిస్తున్నా.  గత పదేళ్ళులో దేశంలో/రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాలు చేసిన అవినీతి/కుంభకోణాలు పాత రికార్డులన్నింటిని చెరిపేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాయి. కేంద్ర ప్రభుత్వంలో ఆయితే ప్రతి ఆరు నెలలకోమారు ఒక కుంభకోణం బయటకు వచ్చేది. మొదటిలో ప్రజలు వీటిని చాలా త్రీవంగా పరిగణించినప్పటికీ, అది పెద్దగా ప్రజలను కలచివేసినట్టుగా అనిపించలేదని మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టికి పోలయిన ఓట్లను పట్టి తెలుస్తుంది. కాంగ్రెసు ప్రభుత్వంలో జరిగిన పలు కుంభకోణాలు  కారణంగానే మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిందన్న విషయం ఈజీగా చెప్పొచ్చు. ఆయినప్పట్టికీ కొంత వరకు ఓట్లు పడ్డాయంటే, ఆ కొంత మందికి సదరు కుంభకోణాలు మీద ఎటువంటి అభ్యంతరం లేదని భావించవలసి వస్తుంది.

అదే విధంగా రాష్ట్రంలో వరుసబట్టి కేంద్రంలో మాదిరిగా సీరియల్ కుంభకోణాలు బయటపడనప్పట్టికీ తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేవలం రెండేళ్ళలోనే కోట్లకు పడగలెత్తిన జగన్ ఉదంతంపై సి.బి.ఐ., ఈ.డి. లాంటి పలు దర్యాప్తు సంస్దలు చార్జీషీటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  దేశ కుంభకోణాల్లోనే అత్యంత విలువైన కుంభకోణంగా సి.బి.ఐ. పేర్కోనడం పరిస్దితి త్రీవతను తెలియజేస్తుంది.

ఆయితే ఇవేవి సామాన్య ప్రజలకు పెద్దగా పట్టించుకోనే అంశం కాదని మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్.సి.పి. కి వచ్చిన ఎమ్మెల్యే స్దానాలను బట్టి రుజువు ఆయింది.  ఈ ఎన్నికల్లో అధికార పక్ష పార్టికి, ప్రతిపక్ష పార్టీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం ఇంచుమించుగా ఐదు లక్షలు మాత్రమే అని తేలడం అవినీతి కేసుల పట్ల మారిన ప్రజల ధృక్పదం క్లియర్ గా తెలుస్తునే ఉంది. దేశ ఎన్నికల చరిత్రలో ఏ ఎన్నికలకు ఖర్చు పెట్టనంత మొత్తం మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్.సి.పి. పార్టీ గుమ్మరించినదని పలు వార్తాకధనాలు వెలువడ్డాయి. అంటే దాని అర్ద్రం మిగతా పార్టీలు ఖర్చుపెట్టలేదని కాదు.

ఆయితే వైఎస్ జగన్ మీద ఎన్నికలకు ముందే పలు అవినీతి అరోపణలు వచ్చినప్పటికీ, పలు కేసులు దర్యాప్తు స్దాయిలో ఉండి, పదహారు నెలల పాటు జైలులో ఉన్నప్పట్టికీ రాష్ట్రంలో చాలా మంది ప్రజలకు అదొక ఇష్యూగా కనిపించకపోవడం చూస్తుంటే నేతలు చేసే అవినీతికి  కొంత వరకు జనామోదం ఉన్నట్టుగానే భావించాలి. 

మొన్నటికి మొన్న అక్రమ సంపాదన విషయంలో జరిమానాతో పాటుగా జైలు శిక్షకు గురయిన జయలలిత ఉదంతంలో, జయకు జైలు శిక్ష కు వ్యతిరేకంగా ఎన్ని రోజుల పాటుగా ఎంత మంది రోడ్ల పైకి వచ్చి ధర్నాలకు పాల్పడ్డరో వార్తాసాధనాల్లో చూసాము. అవినీతికి వ్యతిరేకంగా సినిమాలు తీసి అభినందనలు అందుకున్న పలువురు నటులు, దర్శకులు కూడా ధర్నాలో పాల్గోనడం విచిత్రం అనిపించినా పెద్దగా అశ్చర్యపోలేదు ఎవరూ... అవినీతి రుజువు కాబడి శిక్షకు గురయిన జయలలితకి బాసటగా నిలబడడానికి వీరిలో ఎవరికి బేషజాలు అడ్డు రాలేదు.  వారికి కావల్సింది తమ అభిమాన నేతే తప్ప, వారు చేసే అవినీతి కాదు అన్న సందేశంను ఇవ్వకనే ఇచ్చారు.

ఇదే కాదు, అవినీతిమయ నాయకులుగా ముద్రపడ్డ పలువురు నేతలకు పడుతున్న ఓట్ల శాతంను చూస్తుంటే వారి అవినీతిని ప్రజలు సమర్దిస్తున్నట్టుగానే భావించాలి. సదరు నేతలు నెగ్గారా, ఓడిపోయారా అన్నది అప్రస్తుతం.  వారికి పడ్డ ఓట్ల శాతం బట్టి అవినీతికి అమోదం ఇచ్చిన ప్రజల శాతంని చెప్పుకోవచ్చు.

అంటే ఇప్పుడు అధికారములోకి వచ్చిన రాజకీయ పార్టిలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నమాట! వారికి వచ్చిన ఓట్లు అవినీతికి వ్యతిరేకంగా వచ్చినట్టు భావించవచ్చునన్న మాట! అని మీకు డౌట్ రావచ్చు.

  మీకు వచ్చిన డౌటే నాక్కూడా వచ్చింది.  అవినీతి నేతలకు ఓట్లు వేసిన వారు మాత్రమే అవినీతిని అవాయిడ్ చేస్తున్నారు అనుకోవడానిక్లేదు. ఎందుకంటే గెలిచే ప్రతోడు నీతివంతుడే ఆయి ఉండ్కర్లేదు. కాకపోతే అటు, ఇటు అవినీతే నేతే పోటిలో ఉన్నప్పుడు జనాలు తెలివిగా చాయిస్ తీసుకుంటున్నారు. అంటే మతం, కులం వంటి వాటిని లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ లెక్కన అవినీతి నేతలు అన్నీ పార్టిల్లోను ఉన్నందున పార్టితో సంబంధం లేకుండా వారికి ఓట్లు వేసిన వారందరూ అవినీతికి అమోదం తెల్పినట్టుగానే భావించాలి.

అటు వైయస్సార్.సి.పి. అధినేత జగన్ తో పాటుగా ఇటు అధికార టి.డి.పి. పార్టిలోనూ కూడా కొంత మంది అవినీతిపరులు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసారు. ఇలాంటి చోట ఇరువైపులా పడ్డ ఓట్లు శాతంను అవినీతిని సమర్దిస్తున్న ప్రజల శాతముగానే భావించాలి. ఇలా ఓట్లు వేసే వారిలో నిరక్ష్యరాస్యులు, ఆమాయక పల్లెటూరు జనాలు మాత్రమే ఉన్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే.

మనం చెప్పుకుంటున్న అవినీతికి జనామోదం ఇస్తున్నవారిలో అత్యధికులు మేధావులని చెప్పుకొంటున్నవారు, చదువుకున్న వారే అధికం.  “ప్రస్తుతమున్న రాజకీయపార్టీలు అన్ని అవినీతిమయయిపోయాయి, వేరే చాయిస్ లేక ఎవరో ఒకరిని ఎన్నుకోవల్సి వస్తుందని” చాలా మంది సాధారణంగా చెప్పే మాట. ఆయితే ఇది కూడా రాంగే.

ఎటువంటి అవినీతి మరక లేని నేతలను ఎన్నికల్లో నిలబెడుతున్నామంటూ లోక్ సత్తా పార్టీ కొన్ని సం.రాలు క్రితమే ప్రత్యామ్నయంగా వచ్చింది. ఆయితే దానికి ప్రజల ఆదరణ ఏ మాత్రముందో మనకి తెలియంది కాదు. ఎందుకనో తెలీదు అవినీతి కలష్మం లేని రాజకీయాలు లక్ష్యంగా రాజకీయ రంగంలోకి దూసుకువచ్చిన జయప్రకాశ్ నారాయణ అంటే చాలా మంది చదువుకున్నవాళ్ళకి పడదు. ఆ విషయం సామాజిక మాధ్యమ్యాల్లో చాలా సార్లు గమనించాను. ఇప్పుడున్న పలు ప్రముఖ పార్టీల నాయకుల మోసపూరిత ప్రసంగాలు కన్నా జయ ప్రకాశ్ నారాయణ ప్రసంగాలంటే మండిపడివాళ్ళు ఎక్కువున్నారు. దానికి కారణం అంత ఇతమిద్దంగా చెప్పలేను.

ఈ రోజుల్లో అవినీతి కామన్ ఆయిపోయింది. అందుకే ఇప్పుడు నిజాయితీగా పనిచేసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని సత్తెకాలపు సత్తెయ్య అని తీసిపారేసేవాళ్ళు ఎక్కడికక్కడ కనబడుతునే ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు జనాలు మైండ్ సెట్ పూర్తిగా మారినట్టే అనిపిస్తుంది. సత్తెకాలపు సత్తెయ్యలంటే పరమ బోర్ ఫీలవుతున్నారు. ఇప్పుడంతా క్విడ్-ప్రో-కో తరహనే.... ఫలానా నేత నుండి మనకు వ్యక్తిగతంగా ఏదైనా లబ్ది పొందితే చాలు. ఇక అతని అవినీతి ట్రాక్ రికార్డుని పట్టించుకోవక్కర్లేదు..




1 comment:

  1. మనం అవినీతిని ఆమోదించేద్దామా?

    ReplyDelete