Saturday 23 November 2013

మైసూర్ బజ్జీలను నిషేదించాలి...... అంతే...



పై పోటో చూస్తుంటే మీకేమనిపిస్తుందండీ... నోరు ఊరుతుందా.. మహా అయితే కుదిరినప్పుడు ఒకసారి తినాలనుకుంటారు అంతే కదా..... అదే నాకయితే ఏమనిపిస్తుందే తెలుసా... యమ అర్జంటుగా మైసూర్ బజ్జీలను నిషేధించేయాలి అనిపిస్తుంది....

అవునండీ మైసూర్ బజ్జీలను అన్ని హోటల్స్ లోని నిషేదించాలి. కుదరకపోతే మైసూర్ బజ్జీలు బాగా వేసే హోటల్స్ లో నైనా అర్జంటుగా నిషేదించేయాలండీ....

కొంత మంది అల్కహల్ కి బానిస ఆవుతారు, సిగరెట్టు తాగడానికి బానిస ఆవుతారు, డ్రగ్స్ కి బానిస ఆవుతారు, అమ్మాయిలకు బానిస ఆవుతారు, పేకాటకి బానిస ఆవుతారు... కానీ నేనేమిటండీ బాబూ... మైసూర్ బజ్జీలకు బానిసను ఆయిపోయాను.

ఎంతంత పని చేస్తుందండీ అది...  అరోగ్యానికి మంచిది కాదు, అవి తింటే త్వరగా జీర్ణం కాదు తద్వారా అకలి పుట్టదు, పైగా నూనెలో వేసి కాగుతారు కాబట్టి ఆయిల్ వుడ్ తినకూడదు అన్ని డాక్టర్లు ఆయినవారు మరియు డాక్టర్లు కానివారందరూ కూడా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతుంటే ఎన్ని సార్లు  కమిట్ అయ్యాను! ఇక చచ్చినా మైసూర్ బజ్జీలు తినకూడదు అని....

కానీ ఏమయింది??...
నేను చావలేదు కానీ, మైసూర్ బజ్జీలు తినడం మాత్రం అపలేదు....

చిన్నప్పుడు ఎంత బాగుండేదండీ.... శుభ్రంగా చద్దన్నం తిని అందులో నంజుకోవడానికి ఒక చిన్న బెల్లం ముక్కో లేక అవకాయ ముక్కో పడేస్తే ఎంత ఆనందంగా తినేవాళ్ళం.... ఆ చద్దన్నం చల్లదనం పాఠశాల మధ్యాహ్నం బెల్ కొట్టేవరకు ఉండేది..... పదవ తరగతి వరకు అదే ఆనందం... అప్పుడపుడు శుభ్రంగా రోట్లో రుబ్బిన పప్పుతో వేసిన మినప అట్లు, ఇడ్లీలు, పెసరట్టులు ఎంత రుచికరంగా ఉండేవి.... రోజూ చద్దన్నం తినేవాళ్ళమేమో కానీ, అప్పుడప్పుడు చేసే ఇలాంటి టిఫిన్స్ తింటే ఆ ఆనందానికి ఏ స్వర్గం సరిపోతుందండీ! ఇప్పుడంత టేస్ట్ ఎక్కడ ఏడ్చింది రోజూ మేసే టిఫిన్స్ లో.. అంతా గ్లెండర్ లోనో లేక మిక్సిలోనే ఆడించేయడమే......

నా పదవ తరగతి ఆయిపోయేంత వరకూ మైసూర్ బజ్జీ అనే ఒక టిఫిన్ ఉందనీ కూడా నాకు తెలియదు. మా ఊరిలో ఉన్న చిన్న హోటల్లో అలాంటి గడ్డిని ఎప్పుడూ పెట్టలేదులెండి... అందుకని మాకు తెలియలేదు... ఇక ఇంటర్ చదువు కోసం కాకినాడకి వచ్చి పడ్డాను చూసారా! అప్పుడు పరిచయం ఆయింది మైసూర్ బజ్జీ... మిగతా టిఫిన్స్ తో పోల్చుకుంటే గొప్పగా లేకపోయినా ఎందుకో అదంటే పిచ్చి.. నాకే కాదు నా జట్టుగాళ్ళకు అందరికి కూడాను.

కాకినాడలోని ఇంద్రపాలెం వద్ద నున్న ఐడియల్ కాలేజిలో జాయిన్ అయ్యాను ఇంటర్ కోసం. మా ఇల్లేమో గాంధీనగర్ లోని ఒంటి మామిడి సెంటర్ దాటిన తర్వాత ఉన్న తిరుమలరావు వారి వీధిలో ఉండేది.  ఉదయం ఆరు గంటలకే ఫిజిక్స్ ప్రెవేటు చెప్పించుకోవడానికి అచ్యుతపురం గేటు అవతలి వైపుకు వెళ్ళేవాళ్ళం. ఒక గంట క్లాస్ ఆయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పెరుగన్నమో లేక టిఫిన్ చేసేసి తిరిగి ఎనిమిది గంటల కల్లా కాలేజికి వెళ్ళిపోయేవాళ్ళం...

ఒంటి మామిడి జంక్షన్ నుండి గాంధీనగర్ పార్క్ మీదుగా రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో గాంధీనగర్ మార్కెట్టు దగ్గర సౌజన్య రెస్టారెంట్ అనే హోటల్ ఒకటి ఉండేది.. మా జట్టుగాళ్ళ అందరికీ అది అప్పుడు మంచి ఫేమస్ హోటల్... అక్కడ మైసూర్ బజ్జీ, అరటికాయ బజ్జీ, సేమియా టిఫిన్ ఇలాంటివి ఉండేవి..   అప్పటి వరకు పల్లెటూరిలో పెరిగిన నాకు ఇడ్లీ, పెసరట్టు, మినపట్టు, ఉప్మా ఇలాంటి సంప్రదాయక టిఫిన్స్ తప్ప మిగతావి తెలియవు.

అప్పుడు మా దగ్గర డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవి కాదు. అందుకని మా దగ్గర డబ్బులున్నప్పుడే ఎక్కువ టోకెన్స్ తీసుకొనేసేవాళ్ళం. అప్పుడు కౌంటర్ దగ్గర ఒకతను కూర్చుని టిఫిన్ టోకెన్స్ అమ్మేవాడు. ఆ టోకెన్ తీసుకొని లోపలకెళ్ళి టిఫిన్ తీసుకోవాలన్న మాట.  అప్పుడు మైసూరు బజ్జీ ప్లేట్ ధర ఐదు రూపాయలు.  వాటిని రోడ్డు మీద 60 కి.మీ.ల వేగంతో బైక్ మీద రయ్యిన దూసుకుపోయేవాడికి కూడా క్షణకాలంలోనైనా చూపుని ఒక్కసారి వాటి వైపు తిప్పుకోనేలా చేసే విధంగా బయటికి కనిపించేలా పెట్టేవారు. ఇక సైకిల్ మీద వెళ్ళే నాలాంటి వాడి గురించి చెప్పక్కలేదు కదా... 
ఉదయం ట్యూషన్ అవగానే తిన్నగా సౌజన్య రెస్టారెంట్ కి వెళ్ళడం, ముందుగా మైసూర్ బజ్జీల స్టాల్ చూడడం, అందులో ఎర్రని కార్క్ బాల్స్ తలదన్నే విధంగా బజ్జీలను చూసి  తృప్తిగా తలాడించి టోకెన్ తీసుకొని కడుపారా తినేయడం, తిరిగి ఇంటికి ఏమి ఎరగనట్టు వెళ్ళి అక్కడ పెట్టిన టిఫిన్ కూడా తినేయడం ఇలా ఉండేది నా టిఫిన్ దినచర్య... బయట తిన్నామని తెలిస్తే అమ్మ తోలు తీస్తుందని భయపడి ఇంట్లో చెప్పేవాడిని కాదు. ఒక్కోసారి రెండు సార్లు (సౌజన్యలోను, ఇంటిదగ్గరనూ) టిఫిన్ చేయడం కొన్ని సార్లు భారంగా అనిపించేది.

మా దగ్గర ఎప్పుడయినా డబ్బులున్నప్పుడు ఖర్చు ఆయిపోతాయని చెప్పి నాలుగు ఐదు టోకెన్స్  ఒకసారే కొనేసుకునేవాళ్ళం (హూ.. తెలివితేటలు)....  ఆ విధంగా డబ్బులు లేని రోజుల్లో తినాలనిపించినపుడు ముందుగా కొనుక్కొని దాచుకొన్న టోకెన్స్ పట్టుకెళ్ళ్లి తినేవాళ్ళం....
మేము ఒకేసారి ఐదారు టోకెన్స్ కొని పట్టుకుపోవడం వలన ఆ హోటల్ మేనేజర్ దగ్గర రోజూవారీ లెక్క చూసుకుంటే టోకెన్స్ తక్కువగా ఉండేవి. దాంతో టొకెన్స్ రద్దు చేసేసి, టిఫిన్ తిన్న తర్వాత బిల్లు పేమేంట్ చేసే సిస్టం ఏర్పాటు చేసాడు. దానితో మా టోకెన్స్ ప్లాన్ బెడిసికొట్టింది. అప్పటికి నా దగ్గర ఎనిమిది టోకెన్స్ ఉన్నాయి మరి!!! ఇదంతా మైసూర్ బజ్జీల మీద ఉన్న పిచ్చే...

ఇక డిగ్రిలోకి వచ్చిన తర్వాత జేబులో డబ్బులకి ఇబ్బంది లేకపోయేసరికి ట్వంటీ-ట్వంటీల్లో సిక్సర్ లకు కొదవలేనట్లు మా మైసూర్ బజ్జీ తిండికి కొరత లేకుండా పోయింది. అప్పటికే తినకండిరా మొర్రో అని ఎంత మంది చెప్పినా మనకి వినిపించలేదు.  ఇంట్లో అమ్మ కూడా నా చేత మైసూర్ బజ్జీలు తినిపించడం మానిపించాలని కంకణం కట్టుకొని ఇంట్లోనే చేయడం మొదలెట్టారు. ఇంతకీ నేను మైసూర్ బజ్జీలు తింటున్నాని అమ్మకి ఎలా తెలిసిపోయిందే నాకు తెలియదు.  కానీ అవి ఎర్రని కార్క్ బాల్స్ వలె కాకుండా నిమ్మకాయ డిప్పల్లా ఉండి హోటల్ చేసే విధంగా టేస్ట్ వచ్చేవి కావు. ఇక మన వల్ల కాదని చూసి చూసి మా అమ్మ పట్టించుకోవడం మానేసింది.

అప్పటికే నా ముఖం నిండా మన సర్కారీ రోడ్ల వలే అడుగు అడుగ్కి గుంతలు(మొటిమలు) పడిపోయాయి. మొటిమలు తగ్గేవరకు వాటి జోలికి వెళ్ళడం మానేసి శుభ్రంగా ఇంట్లో చేసిన టిఫిన్స్ చేసేవాడిని. మొటిమలు పోగానే మరల మామూలే...   తినగా తినగా పంచదార కూడా చేదేక్కినట్టు నాకు కూడా మైసూరు బజ్జీలను త్యజించలన్న కోరిక కల్గింది. వెంటనే దానిని అమలులో పెట్టడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఎంత ఇదిగా మనసు లాగినప్పటికి నిగ్రహం చేసుకొని హోటల్స్ వైపు వెళ్ళడం మానివేసాను. రోజూ ఇంట్లో టిఫిన్స్ మాత్రమే తింటుండంతో మా అమ్మ కూడా చాలా సంతోషించింది. మైసూర్ బజ్జీలు మానేయడం వల్ల నా ముఖం కూడా వాజ్ పేయి గారి స్వర్ణ చతుర్బజి రహదారుల వలె గుంతలు పోయి నున్నగా తయారయ్యాయి...

కానీ హోటల్స్ వారు ద్రోహులు.. వాటిని బయటకు కనిపించేలా అద్దాల షోకేస్లో పెట్టి రోడ్డు మీద అటుగా పోతున్న నన్ను రా.. రమ్మని అంటూ ఊరించడం.. ఎంత అర్జెంటు పని ఉన్నప్పటికీ, ఆ పనులన్నింటికి విరామం ప్రకటించి తోక ఊపుకుంటూ పోయి పుల్లుగా మొక్కటం ఎన్ని సార్లు జరిగిందో లెక్క కట్టాలంటే జగన్ ఆక్రమాస్దులను లెక్కకట్టడమంతా కష్టం....  కొన్ని సార్లు ఇంట్లో ఎవరూ లేక తప్పని సరయి టిఫిన్ కి బయటకు వెళ్ళవలసివచ్చేది. అప్పుడు ముందుగానే తినకూడదని కమిట్ ఆయి వెళ్ళేవాడిని. ఫలనా టిఫినే తినాలని నిశ్చయించుకొని హోటల్లో ఒక టేబుల్ ముందు కూర్చుని వెయిటర్ కోసం వెయిట్ చేస్తుంటే,  దురదృష్ట దేవత నాప్రక్కనే కూర్చునట్టు నా ప్రక్కన్ కూర్చున్నోడు మైసురు బజ్జీలు తింటూ కనబడడం, ఈ లోగా వచ్చిన వెయిటర్ కి ఇడ్లి అర్డర్ అనబోయి, నాకు తెలియకుండానే ఇ..... డీ..డీ.. మైసూరు బజ్జీ ఒక ప్లేట్ అనేవాడిని.... అలా ఉండేది నా కమిట్ మెంటు......

తర్వాత అమ్మ మా సొంత ఊరికి వెళ్ళిపోవడం, నేను జాబ్ రీత్యా కాకినాడలోనే ఉండవలసిరావడంతో ఎమ్.సి.ఎ. చదువుతున్న మా ఊరి కుర్రాళ్ళు కొంత మంది అదిత్య కాలేజి దగ్గర రూమ్ తీసుకొనే ఉండేవారు. నేను వారితో జాయిన్ ఆయిపోయాను. ఆ రూమ్ దగ్గరల్లోనే ఒక ముసలాతను, ముసలమ్మ కలిసి చిన్న హోటల్ నిర్వహించేవారు. అందులో టిఫినులు అన్నీ చాలా బాగుండేవి. ముఖ్యంగా ఊతప్పం ఉండేదండీ అక్కడ.. చూడగానే నోటిలో నీరు ఊరేది.... ఆ టేస్ట్ నేను చెప్పితే తెలెసేది కాదుగానీ మీకు.. వదిలేయండి... అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ ముసలాళ్ళు మైసూర్ బజ్జీలు కూడా వేసేవారు. లంచ్ & డిన్నర్ లోకి రోజూ వరి అన్నం ఎంత కామనో, ఉదయం టిఫిన్ కి మైసూర్ బజ్జీ అంత కామన్ ఆయిపోయింది....
ఇక ఇలాయితే లాభం లేదని చెప్పి రూమ్ లోనే ఉండిపోయి టిఫిన్ తెప్పించుకొనేవాడిని. ఆ విధంగా మైసూర్ బజ్జీలు జోలికి వెళ్ళకుండా ఉన్నాను. ఒక రోజు, రెండు రోజులు కాదు... ఏకంగా రెండు సంవత్సరాలు తినకుండా ఉన్నాను.

కాకినాడ మెయిన్ రోడ్డులో మసీదు సెంటరు దాటిన వెంటనే కుడివైపున భీమాస్ రెస్టారెంట్ అని ఒక హోటల్ ఉంటుంది.. అందులో సాంబారు చాలా అద్బుతంగా చేస్తారు.. కాకినాడ మొత్తమ్మీద కేవలం సాంబారు కోసమే ఆ హోటల్ వరకు వచ్చేవారు చాలా మంది ఉంటారు. అందులో నేను కూడా ఒకడినే... పొద్దున్నే ఏడింటికల్లా వాకింగ్ పూర్తి చేసుకొని వెళ్ళి సాంబారు ఇడ్లీ ఆర్డర్ వేసుకొని తింటే ఉంటుందండీ....అదిరిపోతుంది....  ఇక్కడే కాకుండా భానుగుడి సెంటర్ వద్దనున్ను వినాయక రెస్టారెంట్ లో కూడా సాంబారు బాగుంటుంది. కానీ భీమాస్ లోనే కొద్దిగా రుచి ఎక్కువగా ఉంటుంది.... ఇక్కడ సాంబారే కాదు.. చెట్నీ కూడా అదిరిపోతుంది. రెండు రకాల చెట్నీలు ప్రతి టేబులు మీద పెట్టబడి ఉంటాయి. మనం టిఫిన్ తినేటప్పుడు చెట్నీ కోసం పదేపదే సర్వర్ ని పిలవలసిన అవసరం లేదు. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కానీ బిల్లు కొద్దిగా ఎక్కువగా పడుతుంది... రేట్లు లెక్కలోకి తీసుకోకపోతే ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది.... సాంబారు ఇడ్లీ కోసం నాయుడుతో కలసి ప్రత్యేకంగా ఎన్ని సార్లు వెళ్ళిఉంటానో లెక్కేలేదు....

అప్పటికి భీమాస్ కి వెళ్ళి  చాలా రోజులు కావడం, వాతావరణం కూల్ గా ఉండడం మరియు ఇంట్లో వారు ఊరు వెళ్ళడంతో సాంబారు ఇడ్లీ కోసం భీమాస్ కి వెళ్ళాలని రెండు రోజులు ముందుగానే అనుకున్నాను. ఆ తర్వాతి రెండు రోజులూ ఎందుకనో అటు వెళ్ళడానికి కుదరలేదు. అనుకోకుండా ఒక రోజు వీలు చిక్కడంతో భీమాస్ కి వెళ్ళాను...  సాంబారు ఇడ్లీని అస్వాదించాలి, అస్వాదించాలి అనుకుంటూ కూర్చుని సర్వర్ కోసం ఎదురు చూస్తూ యధాలాపంగా ప్రక్కకు తిరిగి చూసాను. అక్కడ ఒక వెధవన్నర వెధవ కూర్చుని ఎర్రని కార్క్ బాల్ లా నిగనిగలాడిపోతున్న మైసూర్ బజ్జీ తింటున్నాడు.

సర్వర్ రావడం.. రెండు వెధవన్నర వెధవనయిన నేను మైసూర్ బజ్జీ అర్డర్ వేయడం ఆయిపోయింది..... సాంబారు ఇడ్లీ తినడానికి వచ్చిన నేను రెండేళ్ళ తర్వాత మళ్ళీ బుక్ ఆయిపోయాను....

అందుకే ఏదో చేయాలనుకోవడం.. చివరకి మైసూర్ బజ్జీకి బలయిపోవడం... అందుకే అర్జంటుగా నిషేదించేయాలి.. 




13 comments:

  1. మైసూరు బజ్జీలు తినని బతుకేల!

    కానీ మీరన్నట్టు తప్పదు నిషేధించాల్సిందే.

    ఇంతటి ద్వంద్వం ఏ విషయంలోనూ, చివరికి కాంగ్రెస్ కి కోస్తా-తెలంగాణా విషయంలో కూడా సాధ్యం కాదేమో.

    ReplyDelete
    Replies
    1. అవునండీ, మీరన్నది కరెక్టే..

      మొదటిసారిగా నా అర్టికల్ కి స్పందించినందుకు ధన్యవాదములు అండీ....

      Delete
  2. మైసూరు బజ్జి అయితే తిని తీరవలసిందే... కానీ ఇప్పుడు ఆ పేరుతొ వచ్చే పిండి బజ్జిలని నిషేధించవలసిందే...

    ReplyDelete
    Replies
    1. అందుకే కదండీ మైసూర్ బజ్జీలను తింటూనే ఉన్నాను...
      మీరన్నట్టు చాలా చోట్ల ఆ పేరుతో పిండి బజ్జీలను వేసి కలిషితం చేస్తున్నారు వాటిని.
      స్పందించినందుకు ధన్యవాదములు అండీ....

      Delete
  3. Replies
    1. రామకృష్ణ గారు...
      మీకు నచ్చినందుకు మరియు స్పందించినందుకు ధన్యవాదములు సార్..

      Delete
  4. you left kokila restaurant

    ReplyDelete
  5. Super post.But remove the word verification please.

    ReplyDelete
  6. బాగున్నాయండీ విశేషాలు.. వాటి రుచి యెప్పుడూ ఓ అద్భుతమే..యెడిక్షన్ సహజమే..

    ReplyDelete
  7. bajiilali entha story vumtundi ani eppude thelisindi

    ReplyDelete
  8. " ... సర్వర్ కోసం ఎదురు చూస్తూ యధాలాపంగా ప్రక్కకు తిరిగి చూసాను. అక్కడ ఒక వెధవన్నర వెధవ కూర్చుని ఎర్రని కార్క్ బాల్ లా నిగనిగలాడిపోతున్న మైసూర్ బజ్జీ తింటున్నాడు ... )

    కేకంటే కేక ... అంతే.
    just hilarious :::)))
    beautifully written ...

    ReplyDelete