Tuesday 26 November 2013

మృత్యువు – భయం



మృత్యువు అంటే ప్రతి ఒక్కడూ భయపడతారు.. కొంత మందైతే రాబోయే మృత్యువు కోసం ఇప్పటి నుండే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు....
మృత్యువు గురించి భయపడకూడదు. మృత్యువే మనల్ని చూసి భయపడే విధంగా మనం అన్నింటికి సిద్దమై ఉండగలగాలి. ఎవరు ఎంత భయపడినా లేక గింజుకున్నా రావాలనుకొన్న సమయంలో మృత్యువు మనల్ని వెతుక్కొంటూ వస్తుంది. దీన్ని ఎవరూ మార్చలేరు.... ఆపలేరు....

చదువుకొనే రోజుల్లో మృత్యువు గురించి నా పిలాసఫి ఇదీ.

మృత్యువంటే నేను ఏనాడూ భయపడేవాడిని కాదు. విపరీతమైన రద్దీగా ఉన్న రోడ్లపై బైక్ మీద వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు భయపడలేదు. కాకినాడ బీచ్ రోడ్డులో ఎన్నో సార్లు ప్రెండ్స్ తో బైక్ పోటిలు పెట్టుకొన్నప్పుడూ భయపడలేదు. ఎక్కడైనా భీభత్సమైన ప్రమాదం జరిగినపుడు అక్కడ ఉన్న రక్తసిక్తమయిన ప్రదేశమును చూసినప్పుడు గాని, రక్తమోడుతున్న క్రతగ్రాతులను చూసినపుడూ కూడా మృత్యువు గురించి ఆలోచించి భయపడలేదు.

మనమెందుకు భయపడాలి? భయపడితే మృత్యువు మన దగ్గరకి రావడం మానేస్తుందా? మా కొలీగ్ మురళి గారితో చాలా సార్లు ఈ విషయమై వాదించేవాడిని.  నా మాటలు విని ఆయన నవ్వి ఊరుకొనేవారు. ఒకసారి మా అన్నయ్యని బైక్ వెనకాలు కూర్చుబెట్టుకొని భీభత్సంగా డైవింగ్ చేయడం మొదలెట్టాను. నా డైవింగ్ కి తానేమీ భయపడలేదు కానీ, రేయ్ పెళ్ళాం, పిల్లలు ఉన్నోడిని కొద్దిగా జాగత్రగా చూసుకొని పోనియ్ రా అన్నాడు సౌమ్యంగానే...

అప్పుడు అన్నయ్య అలా అంటే నేను ఏమనుకొన్నాను? అన్నయ్యకి మృత్యువంటే ఎంత భయం! మనకు భూమ్మీద నూకలు చెల్లిపోయియుంటే మృత్యువుని ఎవరైనా తప్పించుకోగలరా! మృత్యువు రాసిపెట్టిఉంటే బైక్ మీద నెమ్మదిగా వెళ్ళినా, వేగంగా వెళ్ళినా పైకి పోవలసినదే కదా అనుకొన్నాను..

కొన్ని సార్లు బైక్ మీద నుండి పడి దెబ్బలు తగిలించుకొని పది రోజుల పాటు మంచం మీదే ఉన్నపుడు కూడా ఏమనిపించలేదే నాకు...

మరీ ఈ రోజు నా జీవితంలో తొలిసారి మృత్యువు గురించి భయపడ్డానేంటి? మృత్యువు గురించి ఒక రకమైన వైర్యాగం లాంటి ఫీలింగ్ వచ్చిందేమిటి?

రోజూలానే ఈ రోజు కూడా ఉదయమే లేచి వివేకానంద పార్క్ కి జాగింగ్ మరియు రన్నింగ్ కోసం బయలుదేరి వెళ్ళాను.  రెండు రౌండ్లు పూర్తి చేసి, మూడో రౌండ్ చేస్తున్నవాడిలా ట్రాక్ దగ్గర అల్లంత దూరంలో కొంత మంది మిగతా వాకర్స్ గుంపుగా ఉన్నారు. అందులో మురళి గారు కూడా ఉన్నారు. ఏంటబ్బా అంతమంది అక్కడ ఉన్నారు. ఏదో జరిగి ఉంటుంది అనుకొని గబాగబా చేరుకున్నాను అక్కడికి.  అక్కడకి ప్రక్కన ఉన్న టేబుల్ మీద ఒకాయన పడిపోయి ఉంటే మిగతా వాకర్స్ లో డాక్టరయిన ఒకాయిన ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు.

 మురళి గారిని అడిగాను ఏమయింది అన్నయ్య అని!

ఎవరో ఒక వాకర్ నడుస్తూ ఉన్నట్టుండి ముందుకు పడిపోయారు. తల నేలకు కొట్టుకోవడంతో చిన్న దెబ్బ తగిలింది అని చెప్పారు. ఒహ్.. అంతే కదా అనుకున్నాను... కానీ ఆయన అపస్మారకస్దితిలోకి వెళ్ళిపోవడంతో పార్క్ ఎదురుగా ఉన్న హస్పటల్ కి వెంటనే తీసుకెళ్ళి జాయిన్ చేసారు మిగతా వాకర్స్...
సరే అంతా బాగానే ఉంది కదా అనుకొని, నేను తిరిగి వాకింగ్ మొదలెట్టాను. ఇంకో రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అక్కడకి వచ్చేసరికి ఇందాకటి పడిపోయిన వాకర్ చనిపోయారని తెలిసింది.  ఆయన వయస్సు కూడా సుమారు 45 నుండి 50 లోపే ఉంటుంది. కారణం ఆయనకు ఆ సమయంలో హర్ట్ స్ట్రోక్ రావడం వల్లనని చూచాయగా తెలిసింది.

ఆ విషయం తెలిసి, ఎందుకో మనసులో చిన్న ఫీలింగ్ మొదలయింది. అప్పుడు మురళి గారు కూడా నాతోనే ఉన్నారు. ఉదయం నాలానే వాకింగ్ అని పార్క్ కి వచ్చిన ఆ వ్యక్తి, అంతలోనే ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా భాద కల్గించింది. నా ఆలోచన అతని యొక్క ఇంటి మీదకి వెళ్ళింది. బహుశా అతని కుటుంబ సభ్యులు వాకింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇలా విగతజీవిగా మారి వస్తాడని కలలో కూడా అనుకొని ఉండరు కదా అనిపించింది... వెంటనే నాలో మృత్యు భయం కల్గింది. నాకు కూడా ఏదో రోజు ఇలా జరగొచ్చుమో అన్న ఆలోచన నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేలా చేసింది....

ఎందుకంటే నాకు పెళ్ళయింది కాబట్టి... నన్ను నమ్ముకొని నా అర్దాంగి ఉంది కాబట్టి.......

ఒక్కప్పుడు నా స్వార్దం మాత్రమే చూసుకొనేవాడిని. నాకేమయినా అయితే ఏంటి? లేకపోతే ఏంటీ అనే తెగింపు ఉండేది. అందుకే ఏనాడూ మృత్యువు గురించి భయపడలేదు. కానీ ఈ రోజూ నేను నా కోసం కాకుండా నా అర్దాంగి కోణంలో ఆలోచించి మృత్యువుకి భయపడవలసివచ్చింది...

నిజమే.. చాలా మందిలానే నేను కూడా మృత్యువుకి ఇప్పుడు భయపడుతున్నాను ..... నేను ఏమయిపోతానన్న భయం మాత్రం కాదు.....



2 comments:

  1. This moment of realisation comes to everyone at point or the other in the lifetime

    ReplyDelete
  2. manaku badyatalu lenappudu alane alochistam, marriage ainataruvatha badhyathalu vachina taruvatha mana meeda aaadharapadinavallu vuntaru manaku yemaina aity valla parithithi yenti ane bhayam anedi shajam. meeru rasina post lo ady rasaru.

    pranam anedi baaga pandina pandu nundi thodima voodina antha easy ga potundi, adi matram nijam kani aa pranam poyina taruvatha manam yemi avutamu ani e sariram meeda vunna prema leda vyamoham inka mana chuttu vunna bandalu anubandalu ivanni kalasi oka rakamina bhayam kaligistai, e sariram meeda prema and bandalu anubandalu vadulukovadam antha easy kadu kani ala vadulukunnavadiki moksham siddistundi ani mana puranalalo cheppabadindi.

    ReplyDelete