Monday 8 July 2013

హత్య!!


కొన్ని కారణాల వల్ల నిన్న ఆదివారం ఇంటికి వెళ్ళడానికి కుదరల్లేదు..

సాయంకాలం బోర్ గా అనిపించి అమ్మకి ఫోన్ చేసినప్పుడు చెప్పింది ఆ విషయమును..

కొరుప్రోలు అచ్చిరాజులు..

మనిషి ఆరు అడుగులు ఉంటాడు. వయసు సుమారుగా డైబ్బది ఐదు పైనే ఉంటుంది. ఆయినప్పటికి ఆ వయసు తాలుకూ ప్రభావమెక్కడా బాడీ లాంగ్వేజీలో కనబడదు. ఇప్పటికి కూడా ఊత కర్ర సాయం లేకుండానే నిటారుగా నిలబడతాడు. అంతే కాదు వ్యవసాయ పనుల్లో ఇప్పటికీ చురుగ్గానే ఉంటాడు. మెడ క్రింద వరకు ఉండే తెల్లని ఉంగరాల జుత్తుతో ఉండడం అతనికున్న అదనపు ఆకర్షణ.. గాలికి చెదరకుండా పొద్దుట ఎలా దువ్వుకుంటాడో అలాగే పొద్దుపోయేవరకు ఉంటుంది చెదరకుండా ఆ తలకట్టు. ఒక రకముగా చెప్పాలంటే ఆ తలకట్టు కారణంగానే అతను నా మనసులో అతని యొక్క రూపం బలంగా నాటుకుపోయిందని నా నమ్మకం......

మా తాతయ్యతో కలసి ఎదిగి, తనతో విడదీయరాని స్నేహంను పంచుకొని,   ఆ తరానికు గుర్తుగా ఉన్న వ్యక్తి అతను..

చిన్నప్పుడు తాతయ్యతో కలసి రోజూ ఉదయాన్నే చేనుకి వెళ్ళేవాడిని. అదుగో అప్పటి నుండి నాకు ఎరుక అతను... అతనుతో పాటుగా మా తాతయ్య కూడా అరడుగులు ఎత్తు ఉండేవారు. అచ్చిరాజులుతో పాటు చుట్టు ఉన్న కొంత మంది వ్యవసాయదారులు మా తాతయ్యకి జట్టుగాళ్ళు.

అచ్చిరాజులు వాళ్ళ చేను మా చేనుకి అవతల వైపు ఉండేది.. అక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి.. అసలు ఎండే పడేది కాదు అంత గుబురుగా ఉండేవి చెట్లు.. అచ్చిరాజులు నివాసం కూడా అక్కడే ఉండేవాడు. చేను దాటి ఊర్లోకి వచ్చిన సందర్బాలు బహు తక్కువ.. ఏదైనా అవసరం పడితినే ఊళ్ళోకి వచ్చేవాడు....

ఎలిమెంటరీ చదువులు ఆయిపోయిన తర్వాత పట్టణానికి వచ్చేసిన తర్వాత, సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు, చేనుకు వెళితే నవ్వుతూ పలకరించేవాడు.. తాతయ్య, అచ్చిరాజులు కలసి చాలా విషయాలు మాట్లాడుకొనేవారు. నేను చూసి నవ్వుకొనేవాడిని.

తర్వాత కాలములో తాతయ్యకి అనారోగ్యం చేసి ఆరవది ఐదేళ్ళకే మమ్మల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి వరకు తాతయ్యే మొత్తం వ్యవసాయం చూసుకొనేవారు. తాతయ్యకి మగ పిల్లలెవరూ లేకపోయేసరికి వ్యవసాయంను శిస్తుకి ఇచ్చేయవలసివచ్చింది. అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళినా, చేనుకి వెళ్ళవలసిన అవసరముండేది కాదు. తాతయ్య ఉన్నప్పుడంటే ఆయనతో కలిసి సరదాగా వెళ్ళేవాడిని. అలా చేను, తోటల్లో త్రిప్పుతూ అన్ని విషయాలు చెప్పేవారు. అప్పుడూ తాతయ్యతో పాటుగా అచ్చిరాజులు ఉండేవాడు...

తాతయ్య పోయిన తర్వాత నేను దాదాపుగా చేనుకు వెళ్ళడం మానేసాను. దానితో అచ్చిరాజులును కలవడం కూడా పూర్తిగా తగ్గిపోయింది.   అప్పుడప్పుడు చేను వైపు వెళ్ళినపుడు కనబడి పలకరించేవాడు. నేను పెద్దవడం మూలంగానే లేక మరే యితర కారణం వల్లనో సరిగా మాట్లాడలేకపోయేవాడిని ఆచ్చిరాజులు తో.. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా చాలా అప్యాయంగా మాట్లాడేవాడు. మాటల్లో తాతయ్య గురించి చెప్పడం మాత్రం మర్చిపోయేవాడు కాదు...... ఇప్పటికి మా చేను చేస్తున్న రైతు సత్తిబాబు మరీ మరీ చెబుతుంటాడు. ఒరే అవి మా రాజీవ్ పొలం రా... జాగర్తతో చూడు ఒరే... అని చెప్పేవాడని మా రైతు సత్తిబాబు చెప్పేవాడు..

అలాంటి అచ్చిరాజులు మొన్న శనివారం తన చేను దగ్గర పాకలో పురుగుల మందు త్రాగి చనిపోయాడంట!!

మా అమ్మ ఈ విషయాన్ని ఫోన్ లో చెప్పినపుడు చాలా భాదనిపించింది... ఏదో ఆమూల్యమైనదాన్ని కోల్పోయిన బాధ కలిగింది....

డైబ్బది ఐదు సం.ల వయస్సులో ఎటువంటి అనార్యోగం లేని మనిషి, ఎటువంటి బాదరబందీ లేని మనిషి అత్మహత్య చేసుకోవలసిన అగత్యము ఏమోచ్చింది అనుకొన్నాను... అచ్చిరాజులు అత్మహత్య చేసుకోవడానికి గల కారణమును మా అమ్మ చెప్పినపుడు అది అత్మహత్య కాదు... హత్య అనిపించింది...

కొద్ది రోజుల క్రితం మా ఊరిలో ఒక వ్యక్తికి చెందిన గేదేకు ఆనారోగ్యమో లేక మరేదో సంభవించిందంట... దానికి కారణం అచ్చిరాజులు చెడుపు(చేతబడి లాంటిది అనే అర్దం వస్తుంది) పెట్టడం వల్లే అని అతను అరోపించడంట. మొదట్లో ఆ విషయమును అచ్చిరాజులు పెద్దగా పట్టించుకోలేదంట....  కానీ ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అనడంతో దాని గురించి కొద్దిగా ఎక్కువగా పబ్లిక్ లో మాట్లాడుకోవడం అచ్చిరాజులు తెలిసి, చాలా బాధపడ్డడంట....

చివరకు ఈ విషయమై పెద్దల సమక్షంలోకి పంచాయితీకి రమ్మని కబురు పెట్టరట అచ్చిరాజులకు....

అప్పుడు ఆ పెద్దలు అచ్చిరాజులతో, ఆ పెట్టిన చెడుపుని వెనక్కి తీసేసుకోమని చెప్పారట.. దానితో అచ్చిరాజులు మనస్దాపానికి గురయ్యి, ఇప్పటికి వరకు చాలా పరువుగా బ్రతికాను.. వెనుకటి తరానికి చెందిన వాడిని, నా గురించి ఇప్పుడు పుట్టిన పిల్లకాయలకు ఏమి తెలుసు? పెద్దలను గౌరవించడం ఏమి తెలుసు?  ఆయినా మచ్చ పడ్డ తర్వాత ఇక ఉండడం ఎందుకు అని మనస్దాపం చెంది పురుగుల మందు త్రాగి చనిపోయాడంట.....

ఇది తెలిసిన తర్వాత నాకు చాలా కోపమెచ్చింది.. వాస్తవానికి ఈ విషయాలేవి ముందుగా నాకు తెలియవు...

మా ఊర్లో అక్షరాక్షత శాతం తొంభై పైనే ఉంటుంది. అందులో చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, సాప్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్దిరపడి వేర్వేరు ఊర్లలో ఉంటున్నారు. మిగిలిన వాళ్ళలో కొంత మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిపోయిన  వాళ్ళందరూ చదువులు అబ్బక, ఏ పని చేతగాక ఊళ్ళలోనే పడియుంటున్నారు.  ఈ వెధవలకు వెనుకటి తరం వారు ఎవరూ తెలియదు.. తెలిసినా గౌరవించడం రాదు..

ఇందాకా చెప్పానే పెద్దలు పంచాయితీకి పిలిచారని..... ఆ పెద్దలంటే ఎవరో తెలుసా మీకు...

తాతయ్య కాలం నాటి వారందరూ కాలం చేయడంతో, మరియు పెద్ద కుటుంబాలు విచ్చిన్నం అవడం, మరియు మిగిలిన కొన్ని కుటుంబాలు రాజకీయాలంటే విముఖత చూపడంతో పని లేని బేవార్స్ వెధవలు రాజకీయాల్లోకి దిగి ఇలాంటి పెద్దలు అవతారమెత్తిన బాపతు....

మొన్నటి దాకా ప్రెసిడెంటు గిరి వెలగబెట్టిన మనిషి ఒకప్పుడూ మా తాతయ్య దగ్గర ఉండేవాడు. ఆ రోజు నుండీ అచ్చిరాజులు గురించి, అతని క్యారెక్టరు గురించి మొత్తం అతనికి తెల్సు...  ఆ సంగతి ప్రక్కన పెట్టండి...

ఊరి పెద్దగా ఉండవలసిన వ్యక్తి చేతబడి లాంటి వాటిని నమ్మొచ్చా?? వాటి గురించి ప్రజల్లో తప్పుడు ఆలోచన వచ్చే విధంగా మాట్లాడవచ్చా??? చేతబడి మీద అతనికి సంపూర్ణ సమాచారము ఏదైనా ఉందా?? తాను ఏదైనా నమ్మితే అది నిజమవుతుందా???

పరువే ప్రాణంగా బ్రతుకుతున్న అచ్చిరాజులు లాంటి వ్యక్తి మీద అభాండాలు వేసి అతను ఆత్మహత్య చేసుకోనేలా ప్రేరేపించినా వారిని పెద్దలు అనవచ్చా?? దానిని అత్యహత్య అనకూడదు.... హత్య అనే అనాలి...

వాస్తవానికి వీళ్ళకి పరిపాలించే తెలివితేటలు లేవు.. కానీ ప్రజల తెలియనితనాన్ని అసరాగా తీసుకొని వీరు పెద్దలుగా చెలామణి ఆయిపోతున్నారు. గతములో 30 సం.లు ప్రెసిడెంటు గిరి వెలగబెట్టిన మా పెద్దతాత ఆ తర్వాత ఈ పదిహేనేళ్ళు వెలగబెట్టిన మిగతా పెద్ద కుటుంబాలల్లోని వ్యక్తులు ప్రెసిడెంటు గిరి వెలగబెట్టినప్పుడు ఇలాంటి చర్యలు ఒక్కటీ జరగలేదు.....

మా పెద్ద తాత పోయిన తర్వాత మా తాతయ్యని నిలబడమంటే, నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పి, తన ఇంట్లో వారెవరిని కూడా రాజకీయాల్లోకి పంపలేదు. అలాగే మిగతా కుటుంబాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకొని బయటకు వెళ్ళిపోయారు. చదువుకున్న వారెవరికీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేది ఉండడం లేదు. వీటిని అసరగా తీసుకొని ఊరిలో ఇలాంటి చీడపురుగులు రాజ్యమేలుతున్నాయి.

ఇప్పుడనిపిస్తుంది నాకు... ఊరిలో రాజకీయాలు మనకెందుకు అనుకోకూడదని.... 

కానీ ఉద్యోగాల రీత్యా బయటకు వచ్చేసిన తర్వాత వేరే ఏమి చేయలేని పరిస్దితి....

ఈసారి ఇంజనీరింగు విద్యనభ్యసించిన ఒక వ్యక్తి ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడుతున్నారు.. ఆయన చదువుకున్న వ్యక్తిగా నా ఓటుని ఆయనకు వేసి, ఈ సారి నా ఓటుని తప్పకుండా వినియెగించుకోవలనుకుంటున్నాను....

ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఓటు హక్కు వినియెగించుకోలేదు....

కేవలం అచ్చిరాజులుకు జరిగినట్టు వేరేవరికి జరగకూడదు అన్న తలంపుతో........

No comments:

Post a Comment