Tuesday 2 July 2013

సదా మీ సేవలో... మీ ప్రియమైన ముఖ్యమంత్రి...


 
కేంద్ర హోమ్ శాఖ నుండి ఫోన్ రింగయ్యింది కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు ఆఫీసునకు.....

 

ఆ కాల్ అందుకున్న సెక్రటరీ వెంటనే కికురె (కిరణ్ కుమార్ రెడ్డి) వద్దకు వెళ్ళి కాల్ సారాంశం చెప్పగానే మన కికురె గారి కళ్ళు ఇంతలు ఆయినాయి... అదెలా సాధ్యం అనుకుంటూ బుర్ర బద్దలుకొట్టుకున్నాడు... నాకు తెలియకుండానే పరిపాలనలో ఎవరైనా జోక్యం చేసుకొని కధనం నడుపుతున్నారా అన్న అనుమానం.....

 

వెంటనే కికురే ఒక నిర్ణయానికి వచ్చాడు... కేంద్ర హోమ్ శాఖ నుండి వచ్చిన ఫోన్ కాల్ యొక్క విషయమై వెంటనే రిపోర్టు కావాలని తన నమ్మకస్దులకు పురమాయించాడు...

 

క్యాంపు హౌస్ లో తన గదిలో కూర్చుని అలోచించసాగాడు. సెక్రటరీ చెప్పిన మాటలను మరోసారి మననం చేసుకున్నాడు కికురె...

 

హోమ్ శాఖ ఫోన్ సారాంశం..

“ గత సం.ము కాలమునకు పైగా ఆంధ్రప్రదేశ్ లో దొంగతనాలు, దోపిడిలు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టి దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఘనత సాధించినందుకు ఉత్తమ భద్రత ఆవార్డ్ ని మన రాష్ట్రానికి ప్రకటించారు. దానిని అమోరికా అధ్యక్షుడు చేతుల మీదుగా అందుకోవలసినదిగా తెలియజేసియున్నారు”

 

తన ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు కికురె... తానెప్పుడూ రాష్ట్రంలో దోపిడి దొంగల నిరోధానికి మరియు భద్రత విషయమై పోలిసు బాసుతో కూర్చుని ఎటువంటి ఆదేశములు జారీ చేసినట్టుగా గుర్తు లేదు. కనీసం దాని గురించి ఆలోచన కూడా నాకు వచ్చియుండలేదు అనుకున్నాడు!

లేక తాను చీటికిమాటికి ఢిల్లీకి, హైదరబాదుకు కాలి కాలిన పిల్లిలా తిరుగుతుంటే, దానిని అదనుగా తీసుకొని తనకి తెలియకుండా ఉప ముఖ్యమంత్రి పోలిసు బాసుతో కుమ్మక్కు ఆయి చాటుమాటుగా ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్నారా అన్న అనుమానం బయలుదేరి, వెన్నులో కొద్దిగా చలి పుట్టింది.. ఇది చివరకు తన పదవికే ఎసరు పెట్టేలా ఉందనుకొని, తాను పంపిన నమ్మకస్దుడు తెచ్చే సమాచారం కోసం అతృతగా ఎదురుచూడసాగాడు.....

 

పొద్దు పోయాక రాత్రి ఎప్పుడో 11 దాటుతుండగా సదరు నమ్మకస్దుడు వచ్చాడు. అతృతగా అతను ఏమి చెప్తాడో అని అవయువలన్నీ అన్ని అలర్ట్ లో పెట్టుకొని రెడీగా ఉన్నాడు కికురె.

 

అతని ముఖం చూస్తే అందోళనగా ఉన్నట్టుగా కనబడడం లేదు.... పైగా కొద్దిగా వెటకారం లాంటిదేదో ముఖంలో కనబడుతుండేసరికి కొద్దిగా అసహనం ఫీలయ్యాడు కికురె... ఆయినా అవసరం తనది కనుక మిన్నకుండిపోయాడు....

 

చెప్పవయ్యా బాబూ అని అడిగాడు కాదు అరిచాడు...

 

“ అయ్యా, మీరనుకొన్నట్టు తెర వెనకాల మీకు తెలియకుండా ఏమి జరిగిపోవట్లేదు!” తాపీగా సమాధానమిచ్చాడు...

 

అలా ఆయితే మన రాష్ట్రంలో ఒక్క సారిగా దొంగతనాలు ఎందుకు తగ్గుముఖం పట్టాయి! అసహనంగా అడిగాడు కికురె....

 

“అదా సారు,, ఏమి లేదు సారు... వాతావరణ శాఖ వాడు వర్షం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పడదో చెప్పలేరన్నట్టుగా తమరు రాష్ట్రంలో  కరెంటు కోతలు ప్రకటించడంతో, అది కూడా రాత్రుళ్ళు సమయ, సందర్బాలు లేకుండా కరెంటు తీసేయడంతో నిద్రలు పట్టక, ఇళ్ళలో ఉండలేక జనాలు రోడ్ల మీద ఆటలు అడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటున్నారట... ఇలా జనాలు మెలకువగా ఉంటే దొంగలు దోపిడిలు చేయడానికి ఎలా వెళ్తారు. అందుకనే రాష్ట్రంలో మీ కరెంటు కోతలు పుణ్యమాని జనాలు నిద్రలు మానుకొని మెలకువగా ఉండేసరికి ఒక్కసారిగా దోపిడిలు శాతం తగ్గిపోయింది!! అది తెలియని కేంద్రం వోడు అదంతా మీ ఘనత అనుకొని మీకు అవార్డ్ ప్రకటించి యుంటారు” అని తేల్చేశాడు....

 

కికురె బుర్రలోంచి ఆలోచనలు తన్నుకుంటు వస్తున్నాయి.... క్లారిటీ రావడమే తరువాయి అన్నట్టుగా ఉంది ఆయన ముఖం....

 

వెంటనే ఛీప్ సెక్రటరీకి ఫోన్ చేసాడు... కరెంటు కోతల పధకానికి చట్టబద్దత కల్పించడానికి అవనసరమైన విధివిధానాలు రూపొందించి రేపటికి తన టేబుల్ మీద ఉండాలని అక్కడక్కడే ఆదేశాలు జారీ చేసిపడేశాడు కికురె....

 

తర్వాత తన గదిలోకి పోయి హాయిగా పడుకున్నాడు.....

 

అదే సమయంలోనే  రాష్ట్రంలో ప్రజలు కరెంటు లేక  జనాలు నిద్దరోవక ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ గడిపేస్తున్నారు...

 

దోపిడి దొంగలు ఇక ఇక్కడ గిట్టుబాటు కాక వేరే రాష్ట్రాలకు వలస పోయారు....

2 comments: