మూడేళ్ళు వయసు ఉన్నప్పుడు
ప్రక్కనున్న టౌనులో ఉన్న హస్పటలులో చెల్లాయి పుట్టిందని నన్ను కూడా తీసుకు
వెళ్ళినట్టుగా గుర్తు.. ఆ తర్వాత మా అమ్మ చెప్పింది లెండీ..
ముద్దుగా, బొద్దుగా ఉన్న
చెల్లాయిని చూసి ముద్దు చేసి, నా చేతుల్లో కాసేపు పెట్టి నీకు ఇక్కడ నుండి
ఆడుకోవడానికి ఓ తోడు వచ్చిందిరా అని మా అమ్మమ్మ అంటుంటే, ఏమో కాబోలు అనుకొన్నా. ఆ
తర్వాత ఖాళీగా ఉన్నాం కదాని అందరూ సినిమాకు వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళారు..
సినిమా హిరో, పేరు ఏవీ గుర్తులేవు గానీ,
అందులో ఉన్న ఒక బాబు మాత్రం బాగా గుర్తుండిపోయాడు. కొద్దిగా పెద్దయిన తర్వాత మా
ఇంట్లో వాళ్ళు చెప్పారు ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన “పచ్చని సంసారం” అని.
అలా నాకు ఊహ తెలిసి నా
సినీ ప్రయాణం పచ్చని సంసారం సినిమాతో ప్రారంభమయింది.
ఆ తర్వాతర్వాత ఆరేళ్ళు వచ్చేంత వరకు ఏవైనా సినిమాలు చూసానా
లేదా అన్న సంగతి గుర్తులేదు.. ఆరేళ్ళు వయసు వచ్చిన తర్వాత ఊరిలో సంతబయలులో ఉన్న
ఖాళీ స్దలంలో ఏవైనా పెళ్ళిళ్ళు సందర్బంలో గానీ, పండుగల సందర్బంలో గానీ రెండు పెద్ద
రాట్లను నిలబెట్టి దానికి అటు ఇటుగా తెల్లటి తెర కట్టి దాని మీద సినిమాలు
ప్రదర్శించేవారు.
ఆ సమయానికి మా ఊరిలో
సినిమా ధియేటరు లేదు. సినిమాకు వెళ్ళాలంటే ప్రక్కనున్న టౌన్ కి వెళ్ళలసిందే..
ఏదైనా ఎంటరుటైనుమెంటు
ఉందంటే నాటకాలు, బుర్ర కధలు మాత్రమే... అవి వేసినప్పుడు మిస్సవకుండా మా బ్యాచంతా
కలసి వెళ్ళేవాళ్ళం.. వెళ్ళడమే కాని చివరికంటా చూసిన సందర్బాలైతే మటుకు లేవనే
చెప్పాలి. చూస్తూ కూర్చోవడానికి
తెచ్చుకొన్న చాపల మీదే ఒకడి మీద ఇంకొకడు కాళ్ళు వేసుకొని నిద్రపోయేవాళ్ళం.
నాటకం/బుర్రకధ పూర్తయిన తర్వాత మా బ్యాచులోను మిగతా పెద్దొళ్ళు మమ్మల్ని నిద్రలేపి
ఇళ్ళకు తీసుకెళ్ళేవారు. పేరుకు చూడ్డమే
గానీ అవీ అసలు అర్ద్రమయ్యేవే కావు.
అర్ద్రం చేసుకొనేంత బుర్రల్లేవు.. అందరితో పాటుగా నేను కూడా వెళ్ళానా లేదా అన్నదే
కావాలి.
కానీ ఎంత సేపు అవే
నాటకాలను అందులో పద్యాలను, బుర్రకధలను ఎంత కాలమని చూడగలము. ఏదైనా కొత్తరకం ఎంటరుటైనుమెంటు
ఉంటే బాగుంటుంది అనుకోనేవాళ్ళం. మాకు కావల్సినంత ఎంటరుటైనుమెంటు అంతా సినిమాల్లో
ఉంటుందని మా నమ్మకం.. దానికి తగ్గట్టుగానే ఎన్టీయార్, కృష్ణ, శోభనబాబుల సినిమాల్లో
గాల్లోకి ఎగిరెగిరి చేసే పైట్లు,
విన్యాసాలు పిచ్చపిచ్చగా నచ్చేచేవి. ఎఏన్నార్ సినిమాల్లో అవి ఎక్కువుండవు కాబట్టి
పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం కాదు. (ఆయితే అయనవి అద్బుతమైన కధాబలం ఉన్న
కుటుంబ సినిమాలని తెలియడానికి మాకున్న నాలెజ్డ్ సరిపోలేదు.)
ఏ మాటకామాట ఇప్పటికీ కూడా
తిన్నగా చూడబుద్దేయదు. ఆ కధలు, విన్యాసాలు, యాక్టింగులు చూస్తుంటే నాటకాల్లో వేసే
పాత్రధారుల్లనే అసహజంగా అనిపిస్తుంది ఏమిటో నాకు.
నిజానికి చెప్పాలంటే
ఆనాటి మా బుర్రలకి ఆ పైట్ల విన్యాసాలు తప్ప మిగతావేవి అంతగా అర్ద్రమవేవి కాదు. అంత
వయసు కూడా కాదు. సినిమా వేసినప్పుడు తెరకు కొద్దిగా దూరంలో ఇటు వైపు ఉన్న
ప్రాజెక్టరు వైపు వింతగా చూసేవాళ్ళం. ఆ ప్రాజెక్టరు నుండి లైటులాంటిది తెర మీద
పడుతుంటే బొమ్మ పడుతుండడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అసలు తెర మీద అన్నొటి మనుషులు, వాహనాలు, పొలాలు
ఎలా వస్తుంటాయో, పోతుంటాయో అర్ద్రమయ్యేవి కావు.
మా అక్కని అడిగితే అదిగో అందులో నుండి వస్తుంటాయి అని, ప్రాజెక్టరుని చూపించింది. చూస్తే ఒక పొడవు చెక్క బల్ల మీద ప్రొజక్టరు
పెట్టి, దానిలో ఉన్న రీలును చేత్తో ఒకడు తిప్పుతూ ఉంటే బొమ్మ తెర మీద పడేది. అంత చిన్న ప్రాజెక్టరులో అవన్నీ ఎలా పడతాయో
అర్ద్రమయ్యేది కాదు.
ఎనిమిదేళ్ళు వయసు
వచ్చేనాటికి అంటే నేను మూడో క్లాసులో ఉండగా మా ఊరిలో ధియేటరు కట్టించారు వెంకట రమణ
గారు. ఇగ ధియేటరులో మొదటి బొమ్మ వేసిన రోజు తిరునాళ్ళ లెక్కనే ఉంది అక్కడ
వాతావరణం.
అప్పటి వరకు సినిమా అంటే
సంతబయలులో తెర మీద వేయడమే తప్పితే ఇలా దానికి ప్రత్యేకంగా ఒక గొడేన్ లా కట్టి
అందులో ప్రదర్శించడం కొత్త కదా చాలా మందికి.. నాకు మాత్రం కొత్త కాదు, చిన్నప్పుడే
ప్రక్కనున్న టౌనులో చూసేసాను అన్న ఫోజు నా మొహంలో కనబడుతునే ఉంది. కాకపోతే ధియేటరు కోసం టౌన్ కి వెళ్ళక్కర్లేదు.
ఇప్పుడు మా ఊరిలోనే ఉంది కాబట్టి, మా ఊరు కూడా టౌన్ ఆయిపోయిందన్న ఫీలింగుతో
కొద్దిగా పొంగిపోయాను. ఆ ధియేటర్ లో కుర్చీ క్లాసు, బెంచీ క్లాసు, నేల
క్లాసులని ఉండేవి.. కుర్చీ క్లాసు ధర ఐదు రూపాయలు, బెంచీ క్లాసు ధర మూడు రూపాయలు,
నేల క్లాసు ధర రూపాయిగా ఉండేది. ఎంత మంది
వస్తే అంత మందిని ధియేటర్ లోకి పంపడమే. అంతే కాని ధియేటర్ పుల్లు ఆయిపోయిందన్న
మాటే ఉండేది కాదు. చెప్పాలంటే హౌజ్ పుల్ అన్న బోర్డే లేదక్కడ. కుర్చీలు ఆయిపోతే
అదనంగా బెంచీలు తెచ్చి ఖాళీలు ఉన్న చోట సర్దేయడమే.
“నా పిలుపే ప్రభంజనం” అనే సినిమాను మొదటి
బొమ్మగా తెచ్చారు. ఆ రోజు తాతయ్య దగ్గరుండి మమ్మల్లి సినిమాకి తీసుకెళ్ళారు. సినిమా
అయ్యేంతవరకు ధియేటరు అంత గోల గోలే...
సినిమా చూసి వచ్చాను
గానీ, ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మది నిండా సూపర్ స్దార్ కృష్ణే... ఆ
పాటలు, డైలాగులు, పైట్లూ రివైండ్ చేసుకుంటునే ఉన్నాను. అన్నింటికన్నా నన్ను బాగా
ఆలోచింపజేసిన విషయమేమిటంటే సినిమాలో ఒక పాటలో కృష్ణ గారు తెరపై ఒకేసారి పది సార్లు
ఎలా కనిపించారా అని.
పొద్దున్న స్కూల్ కి
వెళ్ళగానే ఎప్పుడూ మొదటి వరుసలో కూర్చునేవాడిని చివర వరుసలో కూర్చుని రాత్రి నాతో
పాటుగా సినిమా చూసిన మరో దోస్త్ గాడిని కదిపి గుసగుసగా అడిగేసా.. అవును కదా!
నిజమే, ఆ పాటలో కృష్ణ గారు అన్ని సార్లు ఒకే సారి ఎలా కనిపించారా అని వాడికి, నాకు
ఉన్న మట్టి బుర్రలకు అర్ద్రమయి చావలేదు. ఎవర్ని అడిగితే తెలుస్తుంది అని
ఎదురుచూడడం మొదలెట్టాం.
అప్పటికి అదే సూల్లో మా
కజిన్ బుల్లిబాబు ఏడో తరగతి చదువుతూ ఉండేవాడు. సాయంత్రం కర్ర-బిల్లా ఆడుకుంటు ఉంటే
అటువైపుగా వచ్చిన మా బుల్లి అన్న మా డౌట్ తీర్చగలిగే పెద్ద బాలశిక్షలా కనిపించాడు.
వెంటనే నేను, మా దోస్త్ గాడు కలిపి కర్ర,
బిల్లా తలో చోట విసిరేసి మా బుల్లి అన్న మీద పడ్డాము. మా డౌట్ విన్న బుల్లి అన్న
పాఠం చెప్పబోయే ముందు గంభీరంగా ఎక్సెప్రెషన్స్ పెట్టే మా వీర్రాజు మాస్టారులా పోజు
పెట్టి, ఏదో ఆలోచిస్తున్నట్టుగా కొద్దిసేపు ఆకాశంలోకి, నేలలోకి చూసి కొద్దిసేపు
దిక్కులు చూసి ఏదో టక్కున వెలిగిన వాడిలా..” ఏ లేదు తమ్మూడు, రాత్రి సినిమాలో
కృష్ణ గారు పదిసార్లు ఎప్పుడు కనిపించారు” అని “కృష్ణ భగవాన్” గారి స్టైల్ లో
అడిగాడు...
ఒక సారి రాత్రి చూసిన
సినిమాలోకి వెళ్ళిపోయి గుర్తు చేసుకొని, ఆ.. ’ పాట పాడుతున్నప్పుడు అన్నాం కోరస్
గా ఇద్దరం....
అదగ్గది సంగతీ, అంటే ఆ
పాట పాడితే ఎవరైనా అలా పది సార్లు కనబడతారు అన్నాడు పెద్ద విశేషం చెప్పినవాడిలా!!!
ఏడో తరగతి చదువుతున్న మా
బుల్లి అన్న అంత తెలివున్నోడు ఆయితే మూడో తరగతి చదువుతున్న మాకేమాత్రం
తెలివుంటుంది.. కాబటి మావోడు చెప్పింది విని నిజమే కాబోలు అనుకున్నాం...
అప్పటి నుండి అడపా దడపా
ధియేటర్లో సినిమాలు చూస్తునే ఉన్నాము. డౌట్లు వస్తునే ఉండేవి... కొన్నాళ్ళ వరకు
ఓపిగ్గా తనకు తోచిందేదో చెప్పే మా బుల్లి అన్న కూడా చిరాకు పడసాగాడు. దానితో మా
డౌట్లు మాతోనే ఉండిపోవేవి.
అసలు సినిమా పాటల్లో హిరో
హిరోయిన్లులు ఐదారు జతల బట్టలు అప్పటికప్పుడూ ఎలా మార్చుకోనేవారు? ఇంతలోనే
ఎక్కడికెళ్ళి మార్చుకొనేవారు? ఫలానా విలన్
గాడు మొన్న చూసిన సినిమాలో చచ్చిపోయాడు కదా! మళ్ళీ ఈ సినిమాలోకి ఎలా వచ్చాడు!
లాంటివి అర్ద్రం అయ్యేవి కావు. ఎందుకంటే మేము సినిమా కధలను నిజం అనుకునేవారం...
అప్పడు సూపర్ స్టార్
కృష్ణ మంచి ఫామ్ లో ఉండేవారనుకుంటా... ఎక్కువగా కృష్ణ గారి సినిమాలే వచ్చేవి. సహజంగానే
నేను కూడా కృష్ణ గారి ఫ్యాన్ ని ఆయిపోయాను. కృష్ణ గారి సినిమాలు కాకుండా వేరే
ఎవరవన్నా వస్తే ఎవరూ చూడకుండా గోడల మీద అంటించిన పోస్టరులను చింపేసేవాడిని.
ముఖ్యంగా అప్పుడు కృష్ణ అభిమానులు చిరంజీవిని యాంటీగా చూసేవారు. దానితో ఒకసారి
ఖైదీ సినిమా పోస్టర్ చింపివేయడం ఇప్పటికీ బాగా గుర్తుంది నాకు. ఆయినా ఇప్పటి వివిధ
అభిమాన సంఘాల ముసుగులో కొట్టుకు చస్తున్న వాళ్ళతో పోలిస్తే ఇది చాలా బెటరే లెండి.
కొద్దిగా ఎదిగిన తర్వాత,
జనవరి ఒకటో తారీఖుకి గ్రీటింగులు ఇచ్చిపుచ్చుకొనే అలవాటు వచ్చింది. అప్పుడు మాకు
గ్రీటింగులంటే సినిమా తారల బొమ్మలే.. రకరకాల తారల బొమ్మలు కలెక్ట్ చేసుకొని దాని
వెనకల ఎవరికి ఇవ్వలనుకుంటున్నామో వారి పేరు రాసి ఇచ్చేవాళ్ళం. ఎవరికి ఎక్కువ
గ్రీటింగులు వస్తే వాళ్ళు చాలా గొప్ప అన్న మాట. పెద్దొళ్ళకి మాత్రం దేవుడు బొమ్మలు
ఉన్న గ్రీటింగులు ఇచ్చేవాళ్ళం. నేనైతే ఇంట్లో వారందరికీ గ్రీటింగులు ఇచ్చేవాడిని.
తాతయ్యకి, అమ్మమ్మకి, అమ్మకి, నాన్నకి, చెల్లికి ఇలా అందరికి ఇచ్చి న్యూఇయర్
గ్రీటింగ్స్ చెప్పేవాడిని.
ఐదు దాటి ఆరో తరగతిలోకి
వచ్చిన మనకి కొద్దిగా లోక జ్ణానం అబ్బింది(అనుకోవడమే). అప్పటికి సినిమాల మీద ఉన్న
చాలా డౌట్లు తీరిపోయాయి. కృష్ణ గారు బోరు కొట్టేసి చిరంజీవి గారి ఖాతాలోకి
దూకేసాను. ఎందుకంటే కృష్ణ గారి కన్నా చిరంజీవి గారు బాగా డాన్సులు చేస్తున్నారు,
పైట్లు చేస్తున్నారు కాబట్టి. అలా అని చెప్పి
కృష్ణ గారి పోస్టర్లు ఎక్కడా చింపలేదు.
ప్రతి కొంత కాలానికి
సినిమాల్లో ట్రెండ్ మారుతుంది అన్నట్ట్లు, మేము ఇష్టపడే సినిమాల విషయాల్లో ట్రెండ్
మారుతూ ఉండేది. శ్రావణ శుక్రవారం, బాల
నాగమ్మ లాంటి సినిమాలను భీభత్సంగా చూసేసేవాళ్ళం. ముఖ్యంగా బేబి షామిలి
ముఖ్యపాత్రల్లో ఉన్న సినిమాలన్నీ మా ఫేవరెట్టుగా ఉండేవి. చిన్నపిల్లలకు చిన్నపిల్లలున్న సినిమాలు
నచ్చుతాయన్న సూత్రం అనుకుంటా. ఏనుగులు, కోతులు, గొర్రెలు ప్రధాన పాత్రలుగా ఉన్న
సినిమాలు తెగ నచ్చేసేవి నాకు. ఇంటికి వచ్చిన తర్వాత మనం కూడా ఒక ఏనుగునో, కోతినో
పెంచుకుందాం అని అమాయకంగా అడిగివాడేని మా అమ్మని... నవ్వుకొనేది కానీ సరే అని
ఎప్పుడూ అనేది కాదు మా అమ్మ.
సంపూర్ణ రామాయణం, లవకుశ
సినిమాలకి మాత్రం మేము అడగకుండానే మా తాతయ్య దగ్గరుండి తీసుకెళ్ళేవారు. రంగు
రంగుల్లో ఉండే ఆ సినిమా అన్న, అందులో రాముడన్న, ఎన్టీయార్ అన్న వల్లమాలిన అభిమానం
ఏర్పడిపోయింది.
కొత్త సినిమాలు ముందుగా
పట్టణాల్లో పేరు మోసిన ధియేటర్లో మొదటి రిలీజ్ ఆవుతాయని, మా ఊర్లోకి వచ్చేవి సెకండ్ రిలీజ్ వనీ తెలిసేది
కాదు. మా ఊరికి వచ్చే సినిమాలు మొదటి రిలీజనే అనుకునేవాళ్ళం.
చివరి తోక:- ఇదో అసంపూర్తి పోస్టు.
ముందుగా మీకు థాంక్సండీ..ఇంత అందంగా మీ అనుభూతులు పంచుకుంటున్నందుకు.. అక్కడెక్కడో రాసిన "1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం" చూసి, వెతికి ఇక్కడ తేలాను.. మాంచి ఙాపకాలు సొంతం చేసుకున్నాను :-) చాలా బాగుంది.
ReplyDelete