Wednesday 30 July 2014

సూపర్ సిటి - సమస్యలు



రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో నవ్యాంధ్ర రాష్ట్రం కొద్దిగా క్లిష్టమైన పరిస్దితిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. హైదరబాద్ ని పూర్తిగా తెలంగాణాకే కేటాయించడంతో నవ్యాంధ్రకు కొత్తగా రాజధాని వెతుక్కోవలసిన పరిస్దితి ఏర్పడింది. తెలంగాణాకి ఆ పరిస్దితి లేనందున వారికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు.

ఆయితే నవ్యాంధ్ర ప్రస్తుతం చేయవలసిన అతి ముఖ్యమైన పని, ఇప్పటి వరకు జరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలత్తెని విధంగా చర్యలు తీసుకోనవలసిన అవసరం ఉందని నవ్యాంధ్రలో ఉన్న ప్రతి సామాన్య వ్యక్తి కోరుకుంటున్నాడు.

తమిళనాడు నుండి విడిపోయి కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తదనంతరం హైదరబాద్ స్టేట్ ను, ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధానిని కర్నూలు నుండి హైదరబాదుకి మార్చడం వంటి చర్యలు కారణంగా ఏర్పడిన పరిస్దితితో నేటి పరిస్దితులను బేరిజు వేసుకొని ముందడుగు వేయవలసిన నవ్యాంధ్ర ప్రభుత్వం ఎందుకోగాని తిరిగి పాత తప్పునే పునరావృత్తం చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాల ఆలోచనను బట్టి భావించవల్సివస్తుంది.

రాజధానిని కర్నూలు నుండి హైదరబాదుకి మార్చే సమయానికి హైదరబాదు అప్పటికే నిజాం రాజ్యం ప్రధాన కేంద్రంగా వెలుగు వెలిగిన ప్రాంతం. నిజాం కాలములోనే ప్రణాళికబద్దంగా నిర్మించబడిన హైదరబాదులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి కావల్సిన భవనములు అందుబాటులో ఉండడంతో మరో ఆలోచన లేకుండా రాజధానిని కర్నూలు నుండి హైదరబాదుకి తరలించేసారు. ఆయితే నాకు తెలిసీ ఆ సమయానికి సీమాంధ్ర ప్రాంతం నుండి హైదరబాదులో ఎవరూ ఉండే అవకాశము లేదని నా ఉద్దేశం.

ఆయితే కొన్ని అవసరాల కోసం దశాబ్దం కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరబాదు మీద కన్నా పూర్వ రాజధానిగా ఉన్న చైన్నై మీదే ఎక్కువగా సీమాంధ్రులు ఆధారపడ్డారు. సీమాంధ్ర వారు హైదరబాదుని తమ రాజధానిగా భావించడానికి చాలా కాలమే పట్టింది. ఈ లోపులో తెలుగుపరిశ్రమను చెన్నై నుండి హైదరబాదుకు తరలించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు కల్పించవల్సివచ్చింది.  ఆయినప్పట్టికి చాలా మంది సినిమా నటులు, దర్శకులు, ఇతర టెక్నిషియన్లు చెన్నైలోనే ఉండిపోయారు. అప్పటి వరకు ముస్లింల చారిత్రక నగరంగా ఉన్న హైదరబాదు కాస్తా తెలుగువారి నగరంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిఒక్కడూ హైదరబాదు నాదే అన్న ఫీలింగు కల్పించుకున్నాడు. ప్రభుత్వాలు హైదరబాదులో సౌకర్యాలు మెరుగుపర్చడం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు రాజధానిలో స్దిరపడడం మరియు అక్కడ వ్యాపారాలు వృద్ది చేసుకోవడం ద్వారా హైదరబాదు అన్ని హంగులతో ఉన్న సూపర్ సిటిగా రూపాంతరం చెందింది.

అప్పటి వరకు కొంత వరకు చెన్నై మీద ఆధారపడిన తెలుగు వారు ఇక పూర్తిగా హైదరబాదుపై ఆధారపడడం మొదలెట్టారు.

పార్టిలతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా దృష్టిని హైదరబాదు మీదే కేంద్రీకరించడంతో పలు అంతర్జాతీయ సంస్దలు, దేశియ సంస్దలు తమ పెట్టుబడులను కుమ్మరించడం ద్వారా ఉద్యోగాల కల్పించే కల్పవృక్షంగా హైదరబాదు ఎదిగింది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు నిర్మించిన సైబరబాద్ హైదరబాదు యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్ళింది. పలు కంపెనీల రాకతో వచ్చిన ఆదాయంతో హైదరబాదు ముఖచిత్రం, వాణిజ్య చిత్రం తారాస్దాయికి వెళ్ళింది.

ఆయితే ఇక్కడ పార్టిలతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న ప్రతీ  ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం హైదరబాదు మాత్రమే అన్నట్టుగా అక్కడ అభివృద్ధిని చేసారు తప్పితే హైదరబాదు మినహ మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న దూరదృష్టి ఆలోచనను ఒకరూ కూడా చేయలేకపోయారు. అటు తెలంగాణాలో ఉన్న ప్రాంతాలను కానీ, ఇటు ఆంధ్ర లో ఉన్న ప్రాంతాలను కానీ ఏ విధంగానూ అభివృద్దిలో భాగస్వామ్యం కల్పించలేకపోయారు.

తదుపరి తెలంగాణాలో వచ్చిన ప్రత్యేక ఉద్యమం మూలంగా రాష్ట్రంను విభజించవల్సిన అవసరం రావడంతో అభివృద్దికి దూరంగా ఉండి, హైదరబాదు మీదే ఆధారపడిన మిగతా ప్రాంతాలు సహజంగానే ఉలిక్కిపడ్డాయి. ఆయితే హైదరబాదు బౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉండడంతో తెలంగాణాకి వచ్చిన ఇబ్బందేమి లేదు.

ప్రస్తుతమున్న ఇబ్బందంతా నవ్యాంధ్రకే..  ఒక ప్రాంతం వద్దనే అభివృద్ధిని కేంద్రికరించడం వలన జరిగిన నష్టంను హైదరబాదు రూపంలో కళ్ళారా చూసిన తర్వాత కూడా నవ్యాంధ్రకి రాజధానిగా మరో సూపర్ సిటి ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కల్గియుండడం ఎంతో కొంత అందోళను కల్గిస్తుంది.

చెన్నై, హైదరబాదు విషయంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నవ్యాంధ్ర ప్రజలు మరో సారి అటువంటి తప్పిదం జరగడానికి ఇష్టపడడం లేదు. హైదరబాదు తరహలో ఒకే ప్రాధాన్యత నగరం కాకుండా కొన్ని నగరాల్లో ప్రాధాన్యత గల కార్యాలయలను ఏర్పరచలని ప్రజలు కోరుకుంటున్నారు. 

శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా వార్తలు వచ్చాయి. శివరామకృష్ణన్ సూచించినట్టుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయలను వేర్వేరు నగరాల్లో ఏర్పాటు చేయాలి. అదే విధంగా 192 కేంద్ర కార్యాలయాలను ప్రాధ్యానతలను బట్టి  ఆయా నగరాల్లో ఏర్పాటు చేస్తే ఉత్తమంగా ఉంటుంది.

ఇక్కడ నా ఉద్దేశమేమిటంటే ప్రభుత్వ పనుల కోసం, యితర పనుల కోసం రాష్ట్రం నలుమూలలా నుండి వచ్చే ప్రజలందరూ ఒకే ప్రాంతానికి వెళ్ళేలా ఉండకూడదు అని. ఉదహారణకి హైకోర్టులో పని ఉన్న వారు, సచివాలయంతో పని ఉన్నవారు, హోంశాఖ కార్యాలయంతో పని ఉన్నవారు లేక మెరుగైన వైద్యం నిమిత్తం వెళ్ళగోరేవారు ఇలా అందరూ సూపర్ సిటికి వెళ్ళేబదులుగా ఆయా ప్రాంతాల్లో మిగతా నగరాలకు వెళ్ళడం బెటర్ కదా అని నా అభిప్రాయం.

దాని వలన రాజధానిపై పడే ట్రాఫిక్ భారం విపరీతంగా తగ్గుతుంది కదా..

హైకోర్టుని వైజాగ్ లోనో, సచివాలయం రాజధానిలోనో, అసెంబ్లీ మరియు హోంశాఖ కార్యాలయాలను కర్నూల్ లోనో, సాప్ట్ వేర్ జోన్ ను, శ్రీకాకుళంలోనో, హార్ట్ వేర్ హబ్ ని నెల్లూరులోనో, కేంద్ర కార్యాలయాలను ప్రాధాన్యతని బట్టి వేర్వేరు నగరాల్లోనో ఏర్పాటు చేసారనుకొండి. అప్పుడు ఏమవుతుంది హైకోర్టు పని ఉన్న వారు వైజాగ్ వెళ్తారు. అలానే మిగతా పనులు పడ్డవారు ఆయా నగరాలకు వెళ్తారు కదా... అప్పుడు నగరాల పై పడే జనాభా మరియు ట్రాఫిక్ ఒత్తిడి అదుపులో ఉంటాయి కదా....

అప్పుడు పట్టణాలకు వలస వచ్చేవారిని వేర్వేరు నగరాలకు వికేంద్రీకరించినట్టు అవుతుంది. అంతే కాకుండా అయా ప్రాంతాల్లో ప్రజలకు సదుపాయాలు కల్పించే హోటల్, బోర్డింగ్, టూరింగ్ రంగాలు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. తద్వారా పలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  సమీప భవిష్యత్తులో్ నగరాలకు వలసలు విపరీతంగా పెరుగుతాయని పలు సర్వేలు చెబుతున్నాయి.  రాజధానిగా ఒక సూపర్ సిటినే ఎంచుకొంటే దానికి భవిష్యతుల్లో విపరీతమైన వలసలు ఎదుర్కోవలసివస్తుంది. ఆ విధంగా వలస వచ్చేవారందరికి నివాసం ఏర్పాటు చేయడానికి భారీ స్దాయిలో కావల్సిన స్దలంను కేటాయించడం ప్రభుత్వాలకు తలకి మించిన భారమవుతుంది.

ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రస్తుతం ఎందులోనూ సభ్యుడు కానీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు విజయవాడ-గుంటూరు ప్రాంతం పై ఎందుకంత పట్టుదలగా ఉన్నారో అర్ద్రం కావట్లేదు.  సూపర్ సిటి పరిష్కారం కాబోదని శివరామకృష్ణన్ చెప్పిన తర్వాతయినా ప్రభుత్వ ఆలోచన మారాలి.

వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు యొక్క ప్రాతినిధ్యంతో కూడిన ప్రభుత్వపాలనా వ్యవస్ద కావాలి మనకి. ఆప్పుడే చెన్నై, హైదరబాదు తరహ సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయి. లేదంటే విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా చేసి సూపర్ సిటిగా రూపాంతరం చెందితే భవిష్యత్తులో కేసిఆర్ వారసులు విజయవాడకు వలస వచ్చి,  మా అత్మగౌరవం, మా సంపద, మేము క్రీస్తుపూర్వం నుండి కూడా ఇలానే ఉన్నాం, మధ్యలో మిగతా ప్రాంతాలు వారు వచ్చి దోచుకుతింటున్నారు అన్నా ఆశ్చర్యం చెందక్కర్లేదు.

నవ్యాంధ్రకి రాజధానిగా సూపర్ సిటిని నిర్మించడం ఎట్టిపరిస్దితుల్లోనూ మంచి ఉద్దేశం కాదని చెప్పగలను. అలాగే తెలుగువారందరిని సమైక్యభావంలో ఉంచడానికి రాష్ట్రం పేరును తెలుగునాడు గా మార్చవలసిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు ఈ ప్రాంతంను ప్రతిబింబించే విధంగా ఏ మాత్రం లేదని నాకు అనిపిస్తుంది. ఆంధ్రులు అన్న పేరు మనకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిఉంది. కానీ దానికి సంబందించిన సమాచారము ఎక్కడ దొరుకుందో తెలియరాలేదు.

No comments:

Post a Comment