Thursday, 16 June 2016

అమ్మ, భార్య.... దేవుడు...


చిన్నప్పుడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడిని ఏం మొక్కుకున్నావ్ కన్నా అని అడిగేది అమ్మ...
.
గుడికి వెళ్తే దేవుడిని ఏదైన కోరుకోవాలని తెలీదు అప్పటికి.. అదే చెప్పేవాడిని అమ్మతో.. నేనేమి మొక్కుకోలేదే అని...
.
అదేంటి కన్నా.. మరేమి చేసావ్ గుడికి వెళ్ళి.. అని అడిగేది అమ్మ...
.
స్నేహితులుతోను, సోదరితోను సరదాగా గెంతుతూ, తుళ్ళుతూ అలా గుడి చుట్టు పరిగెడుతూ, నడుస్తూ, గెంతుతూ (ప్రదక్షిణలు) తిరిగి దేవుడిని చూస్తూ దణ్ణం పెట్టుకొని వచ్చేసానంతే అమ్మా అనేవాడిని...
.
అలా కాదురా.. గుడికి వెళ్ళినపుడు దేవుడిని ఏదైనా కోరుకోవాలి రా.. అనేది
.
అంటే? ఏమని కోరుకోవాలి అమ్మా....అనడిగేవాడిని.
.
చదువు బాగా రావాలని... లేదా మన మామిడితోటకి సం.రం కాపు బాగా రావాలని... ఇలా అన్నమాట.. అనేది అమ్మ...
.
అమ్మ చెప్పిందన్నమాటే కానీ... గుడికి వెళ్ళేటప్పుడు దేవుడిని చూసిన తర్వాత అమ్మ చెప్పినవేవి గుర్తుండేవి కావు.... దణ్ణం పెట్టుకోవడం , వచ్చేయడం అంతే..
ఆయినా నాకు చదువు బానే అబ్బింది.. అలాగే మామిడి తోట బానే కాపు కాసేది.
.
.
.
అలా పెద్దాడ్నిఅయ్యాకా, పెళ్ళి అయ్యాకా...
గుడికి వెళ్ళొచ్చిన తర్వాత, చిన్నప్పుడు అమ్మ అడిగిన ప్రశ్నే నా భార్య నుండి వచ్చేది...
నవ్వేసి.. చిన్నప్పుడు అమ్మకి ఏదైతే చెప్పానో, అదే చెప్పేవాడిని...
దానికి తను.. అలా ఆయితే ఎలా... ఏదొకటి అడగాలి కదా... అడగకపోతే ఆయన మాత్రం ఎలా ఇస్తాడు? అనేది....
అడగకపోతే అమ్మ ఆయినా అన్నం పెట్టదు కదా! నీకు ఆకలిగా ఉందన్న విషయం నువ్ చెబితేనే కదా తెలుస్తుంది! అలానే దేవుడి విషయం కూడా అంది.....
..
..
అవునా!! 
నాలో అలోచనలు.... 
చిన్నతనం నుండి పెద్దయ్యే వరకు తీరని కోరికలు కొన్ని వుండేవి. ఏనాడు దేవుడిని అది కావాలి అనడగలేదు.. అందుకే ఇవ్వలేదెమో అనుకున్నా..
..
..
సరే, అలాగే అనుకుందాం....
అడిగితేనే దేవుడు ఇస్తాడు.
..
..
మరి అడగని వాటిని దేవుడి ఎందుకిచ్చాడు నాకు? 
అంటే 18 ఏళ్ళకే నాన్నని నాకు దూరం చేయడం...
వెంటనే బాద్యతలు మెయవలసి రావడం. ఉద్యోగంలో చేరడం....
నాకిష్టమైన తాతయ్య త్వరగానే వెళ్ళిపోవడం...
ఉన్నత చదువుని చదివీ కూడా మనసుపడ్డ సాప్ట్ వేర్ ఫీల్డ్ కి వెళ్ళలేకపోవడం..
వగైరా.. ఇలా చాలానే ఉన్నాయి...
..
..
అడిగితేనే దేవుడిస్తాడు అన్నది కరెక్ట్ ఆయితే, అడగనిది దేవుడు ఇవ్వడు అన్నది కరెక్ట్ కావాలి కదా....
..
..
నేను అడక్కుండానే దేవుడు కొన్ని యిచ్చాడు.. నేను వద్దన్ననని దేవుడు కొన్ని నా దగ్గర నుండి తీసేసుకోవడం మాన్లేదు.....
.
.
నేను జీవితాన్ని లైట్ గా తీసుకున్నా.తీసుకుంటా కూడా....
.
అందుకే నా జీవితంలో విషయం గురించి కూడా దేవుడి పేరు చెప్పి భాదపడలేదు.. అలా అని సంతోషపడలేదు.
దేవుడంటే.. జస్ట్. రకమైన అరాధన...
ఆయన్ని చూడాలి..అనందించాలి అంతే....
;;
ఏది తప్పు.. ఏది ఒప్పు అంటారు....

3 comments:

 1. దేవుడా ఓ మంచి దేవుడా....

  అడక్కుండానే మంచి అమ్మనిచ్చావు,ఉద్యోగాన్నిచ్చావు,భార్యనిచ్చావు,బ్లాగునిచ్చావు,ఈ దేశాన్ని ఉద్దరించాలని ఈ భూమి మీదకు వస్తే మీ అమ్మానాన్నలతోపాటు నీ ఫ్యామిలీ అంతా సేఫ్ గా ఉండాలి, నువ్వు గెలిచి నీ శతృవు ఓడిపోవడం కాకుండా ఒక్కసారైనా నువ్వు ఓడిపోయి నీ శతృవుని గెలిపించు .... అలాగే నీ ఆరోగ్యం జాగ్రత్త !

  ReplyDelete
 2. మీ దృక్పథం సరైనదే.
  మీకు దేవుడంటే ఆరాధనా భావం ఉంది. మంచిదే.
  అందుకే వీలు చూసుకొని దైవదర్శనం చేసుకోవాలని గుళ్ళకు వెళ్తున్నారు. బాగుంది.

  అది కావాలీ ఇది కావాలీ అని సతాయించటం కోసం వెళ్ళటం దేవుడికి ఆఙ్ఞలు జారీచేయటానికి వెళ్ళటం‌లాంటిదే. అది అంత ఉచితం కాదు. మీకలా చేయబుధ్ధి కాదు. ఇది చాలా మంచి సంగతి.

  నా కిదివ్వు నీ‌కదిస్తా లాంటి బేరసారాలకోసమో దేవుణ్ణి చూడటానికి వెళ్ళటంలో హర్షణీయత లేదు. మీరలా బిజినెస్ ప్రపోజల్స్ తీసుకొని వెళ్ళటం లేదు దేవుణ్ణీ చూడటానికి. అది చాలా సరైన పని.

  దేవుడు సచ్చిదానందస్వరూపుడు. అయన ఇవ్వగలిగినంత ఆనందం మరెవ్వరూ ఇవ్వలేదు ఎన్నటికీ‌ ఇవ్వలేరు. ఇంద్రియాలతో పొందే సుఖానుభూతులన్నీ‌ తాత్కాలికానందాన్నిచ్చేవే. పరిపూర్ణానందం దేవుడే ఇస్తాడు. కేవలం ఆయన్ను ఆరాధనా భావంతో తలచుకుని సంతోషపడినా చాలు.

  కామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు వైరక్రియా
  సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్,
  బ్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రింగంటి మెట్లైన ను
  ద్ధామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

  అన్న భావవతంలోని పద్యం సాక్షిగా, ఆరాధనా భావం చాలును. ఆడంబరాల అవసరం లేదు. వాటి వలన పెద్దగా ప్రయోజనమూ లేదు.

  ReplyDelete
 3. మొదటిసారి..మీ బ్లాగ్ చదవడం..ఇదీ కారణం అని యెనలైజ్ చేయలేను కానీ..మీ భావ వ్యక్తీకరణ చాలా నచ్చింది..గో ఆన్..

  ReplyDelete