వంశీ వ్రాసిన మా పసలపూడి కధలు చదివినోడికి ఉభయ గోదావరి జిల్లాలలో గోదారితో
పరిచయమున్నోళ్ళికి గోదారోళ్ళ కతలు ఎన్ని సార్లయినా వినబుద్దేస్తుంది....
ఎందుకంటే ఆయా కతల్లో అన్ని పాత్రలు మన కళ్ళ ముందే తిరిగినవి, చూసినవై ఉండడం
వల్ల కాబోసు.. పైగా గోదారోళ్ళు మంచి హస్యప్రియులు... మాట్టాడే ప్రతి మాటకు వెటకారంను
పప్పన్నంలో అవకాయ నంజుకున్నంత ఈజీగా
జోడించేస్తారు.
ఇయన్నీ ఎందుకు కానీ, వంశీ రాసిన పసలపూడి కతలు చదివినప్పుడల్లా, నేను ఎందుకు
కొద్దిగా లేటుగా పుట్టానా అనిపించని రోజు లేదు. ఎందుకంటే డైబ్బయి, ఎనభై దశకాల్లో
అంటే మా నాన్న గారి హయాంలో నాలాంటోళ్ళు
మంచి ఎంజాయి చేసియుంటారు. అసలు జీవితంలో టెన్షన్ అనే పదం విని ఉండరనుకుంటా... మరి
ఈ రోజు? పొద్దున్న లేచిన మొదలు రాత్రి ఆయేవరకు టెన్షన్ తో గడపడానికే రోజు మొత్తం
సరిపోతుంది.
ఆ రోజుల్లో ఓ పనా?? పాడా?? శుభ్రంగా ఉన్న ఊళ్ళోనే ఉండి, రాయల్ ఎన్ ఫిల్డ్
బుల్లెట్ ఒకటి యేసుకొని, మెడలో పులిగోరుతో చేసిన మందపాటి గొలుసు చొక్కా బొత్తాలను
దాటుకొని బయటకు కనబడుతూ ఉంటూ, రోడ్డు మీద వెళ్తుంటే ఆ దర్జా ఇప్పుడు ఎక్కడ
వస్తుందండీ.... ఇయన్నీ మా బాబు, ఆళ్ళ తమ్ముడు గార్లు చేసారండీ. అస్సం వంశీ కతల్లో
మల్లేనే.... పోనీ అలా రోడ్డు మీద తిరిగి వచ్చేసేవారా అంటే అదీ కాదు... వీళ్ళకు బయట
బోలేడు వ్యవహరాలు.....అయన్నీ ఆ రోజుల్లో దొరబాబులకు మామూలే అనుకొండి... వంశీ కూడా
అదే చెబుతారండీ... అయన్నీ ఇంట్లో పెద్దొళ్ళుకి తెలిసినా కూడా పల్లెత్తు మాటంటే
ఒట్టు. ఎందుకంటే వాళ్ళు మగమహరాజులు... ఏదన్నా చేత్తారు అనేవారు.
మరి ఈ రోజు.. ఇట్టాంటివి ఏవైనా చేసినట్టు గానీ, చేస్తున్నట్టు గానీ చిన్న
ఉప్పు అందడం పాపం... యమధర్మరాజు వారు కూడా జడుసుకొనేలా మనకి ఇక్కడ అభిషేకం
చేస్తుంటిరి.. ఏం.. మనం మగమహరాజులం కాదా? అనిపించడంలో తప్పు లేదనుకుంటా....
అందుకేనేమో, వంశీ కతలు చదువుతూ ఆ కతల్లో మనకి కూడా ఒక క్యారెక్టర్ సెట్
చేసేసుకొని అనందించడం మినహా అంతకన్నా ఏమి చేయలేకపోతున్నాము. ఎందుకు అంతలా ఫీల్
అవుతున్నామంటే, చెప్పలేం... కొన్నింటికి సమాధానాలు ఉండవు....
పెసరట్టు ఉప్పా తినాలంటే ఫలానా సెంటర్ లో సుబ్బయ్యమ్మ దగ్గరకి
వెళ్ళిపోవాలంటాడు ఆయన... వెంటనే మన దృష్టి ఎరుకలో ఉన్న అలాంటి సెంటర్ దగ్గరకు
పోతుంది... అలానే అంతర్వేది తీర్దంలో ఒక రోజు అనుకోకుండా రాజోలు అవతలు ఉన్న గోదారిలంకలోని
ఒక ఊరు నుండి ఒక నెరజాణ వచ్చిందంటాడు... అంతే మనం కూడా మా బుచ్చింపేట తీర్దంలోకి
వెళ్ళిపోయి అక్కడ మూడు రోజుల పాటు కునుకు లేకుండా చేసిన వేములపూడి నెరజాణ బ్రెయిన్
లోకి వచ్చేస్తుంది. అలాగే ఇంగ్లీషు సినిమా కోసమని కాకినాడ సత్యగౌరి సినిమాహలుకి
వెళ్ళడమనగానే.... మనం సత్యగౌరి సినిమాహాలులో చిరంజీవి గారి “మాస్టార్” సినిమాకి
పోయిన రోజులు కళ్ళ ముందు రీళ్ళలాగా గిర్రున తిరుగుతుంటయి ఎటువంటి మిషన్
లేకుండానే.....
గోదారి కతలు అంతే అనుకుంటా... అవి ఎక్కడో ఆకాశంలో నుండి ఊడిపడవు... మన దగ్గరే
మొదలయి మన చుట్టు తిరిగుతున్నట్టుగా ఉంటాయి. అందుకే గోదారి కతలుకు తిరుగుండదు...
వీడేంటి.. ఉన్నట్టుండి గోదారి కతలు మీద పడ్డాడు అన్న అనుమానం వచ్చిందా మీకు??
హి..హి... దానికో కారణముంది లెండి... ఎందుకంటే నిన్ననే ’గుండెల్లో గోదారి’
సినిమా చూసా..
ముందు రోజు సెలవు కావడం, మరియు ఈసారికి యింటికి వెళ్ళబుద్దేయక ఇక్కడే
ఉండిపోయా... కానీ ఇక్కడ ఏమి తోయలేదు. దానితో సినిమాకు వెళ్దామనుకొని, ఏ సినిమాకి
వెళదామా అని ఆలోచించా...
గుండెల్లో గోదారి తప్ప చూడవలసిన సినిమాలేవి లేవు... దానికి వెళ్ళడానికి
నాకున్న ధైర్యం చాలలేదు...
ఎందుకంటే అందులో ఉన్నది విశ్వవిఖ్యాత నటి ఆయిన మంచు లక్ష్మి మరీ.......
మొత్తానికి నా భయమే పై చేయి సాధించి, ఆ రోజుకి వెళ్ళడం మానేసా.... ఆ రాత్రి నాకు తెలిసిన స్నేహితులకు ఫోన్ చేసి
సినిమా ఎలాఉందో వాకబు చేసాను. ఎవరికి దగ్గర బ్యూరో రిపోర్ట్ లేదు...
మర్నాడు ఏదయితే అదే అయిందేలెమ్మని మార్నింగ్ షో కి చెక్కేసా... భయం
భయంగానే....
సినిమా మొదలయిన తర్వాత ఆ భయం నెమ్మదిగా పోయి ఆ స్దానంలోకి గోదారోడి కతలు
గుర్తుకు వచ్చాయి. నిజ్జంగానేనండీ... సినిమా ఒక మెస్తరు బాగానే ఉంది. ఎందుకంటే గోదారి
నేపధ్యం గల సినిమా అని కాదు. సినిమాను వాస్తవికంగా అయా పరిస్దితుల ఆధారంగా తీయడమే
నాకు నచ్చడానికి కారణం..... సినిమా ఎనభై దశకానికి చెందినది..... వాస్తవానికి ఆనాటి
పరిస్దితులు ఏ విధంగా ఉండేవో, అలానే వివిధ
హోదాల మనుషుల మధ్య మాటలు ఎలా ఉండేవొ, అచ్చు గుద్దినట్టుగా చూపించారు. ఆ
ఒరిజినాలిటియే నాకు నచ్చింది.... ఎక్కడా సినిమా నాటకీయత జొప్పించలేదు. ముఖ్యంగా
గోదావరి వరదల దృశ్యాలు బాగానే వచ్చాయి. పైగా గోదారి ప్రాంత పల్లెల ముఖచిత్రంను
చాలా దగ్గరగా తీసుకున్నాడు. పాత్రధారుల నివాసాలు కూడా వాస్తవికతకు దగ్గరగా ఉండే
విధంగా శ్రద్ద తీసుకున్నారు.

ఇలాంటి కధలతో ఇప్పటి వరకు సినిమాలు రాలేదని అనను. కానీ అ వచ్చిన సినిమాలన్నీ
వాస్తవికతకు దూరంగా తీసినవే అని నా ఉద్దేశం... ఉదహరణకి చిరంజీవి సినిమాలు చూడండి.
చాలా సినిమాల్లో కార్మికుడిగానే లేక పనోడుగానో నటించాడు. సినిమాలో యజమాన్యంను లేదా
ఊరిపెద్దని ఎదిరించడం దగ్గరి నుండి, తన బాస్ కూతురుని పెళ్ళి చేసుకోవడం వరకు చాలా
జిమ్మిక్కులు చూపిస్తారు. నిజజీవితంలో అసలు అలా జరుగుతాయని ఊహించుకోడానికి కూడా
చాన్సే లేదు. ఇప్పటి వరకు ఆ విధంగానే మన తెలుగు సినిమాలు ఆఘోరించాయి.
అఘోరిస్తున్నాయి... జనాలు అలాంటి వాటిని ఆదరించారు కాబట్టే వారు ఇమేజి
సంపాదించుకున్నారు... దీనికి కారణం చాలా మంది జనాలు తాను నిజజీవితంలో చేయడానికి
కూడా ఉహించసాధ్యంకాని పనులను సినిమాలో చూడడం ద్వారా సంతృప్తి చెందుతాడని ప్రముఖ్య
బ్లాగరు మరియు మానసిక వైద్యులు శ్రీ యా.రమణ గారు గతములో చెప్పినట్టు గుర్తు......
ఇందులో అలాంటి జిమ్మిక్కులు లేకుండా వాస్తవికత ప్రతిబించేలా చూపించాడు.
డైరెక్టరు కుమార్ నాగేంద్ర కొత్తవాడైనా సినిమా రూపకల్పనలో తగు శ్రద్ద
తీసుకొన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో ప్రధాన కధానాయకుడు ఆయిన ఆది
పినిశెట్టి పల్లెటూరి చేపలు పట్టేవాడిగా అద్బుతంగా నటించాడు. ముఖ్యంగా అహర్యంలో
గాని నడవడికలో గాని, మాటల్లోగాని నాటకీయత కనబడకుండా జాగత్తపడ్డారు. ఆనాటి కాలంలో
భూస్వామ్య వ్యవస్ద ఎలా ఉండోదో, పనివాళ్ళతో ఏ విధంగా ఉండేవారో, పనివాళ్ళు
తిరునాళ్ళకు వెళ్ళి ఏమిచేసేవారో, వారి పట్ల భూస్వామ్య కుటుంబాల్లోని యువకులు ఎలా
ప్రవర్తించేవారో ఉన్నదున్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. దానికి తగ్గట్టే తెర
వెనుక ఉండే చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోలేదు. ఇకపోతే తాప్సి పాత్రధారిని
చూస్తే వంశీ కధల్లో పెద్దింటోళ్ళ అమ్మాయే గుర్తుకువచ్చింది. అలాంటి సందర్బాలు నిజంగానే జరిగేవి అట ఆనాటి
కాలంలో... కొంత మంది పెద్దింటి అమ్మాయిలు బరితెగించి తమ పనివాళ్ళని ఇబ్బంది
పెట్టేవారు. ఆ పని వాళ్ళు అటువంటి సందర్బంని ఎలా ఎదుర్కోవాలో తెలియక
సతమయిపోయేవారు. ఆనాడు భూస్వామ్య వ్యవస్దలో ఇలాంటివి జరిగినట్టు తెలిస్తే పరిణామాలు
చాలా త్రీవంగా ఉండేవి. వాటినే కధలో చక్కగా చూపించాడు. పెద్దింటి అమ్మాయి పాత్రలో తాప్సి బాగానే చేసింది.
పక్కా కమర్షియల్ ఆయిపోయిన నేటి సినిమాకాలంలో
గోదారి నేపధ్య కధని ఎంచుకోవడం సాహసంగానే భావించాలి. ముఖ్యంగా రూపకల్పనలో
వంశీ కధల మార్కుని చెడగొట్టకుండా తీయడం కూడా బాగుంది. గోదారి కతలు అంతే మరి.....
ఇక రెండో భాగములో సందీప్ కిషన్, లక్ష్మిల పాత్రలు కూడా బాగా ప్రెజెంట్ చేసారు.
(లక్ష్మి పాత్ర వేరేకరు చేస్తే ఇంకా బాగుండేదేమో). ఆయినా కోడి పందాలు సీన్లు
చిత్రికరణకు సెన్సార్ వాళ్ళు పరిష్మన్ అంత ఈజీగా ఎలా ఇచ్చారో ఆశ్చర్యం వేసింది.
నిబంధనలు భరించలేక ఈ మధ్యన చాలా సినిమాల్లో జంతువులు లేక పక్షులను గ్రాఫిక్స్ లో
చూపించేస్తున్నారు. అలాంటిది సినిమా ద్వితియార్దమంతా కోడిపందాలు నేపధ్యంలో తీయడం
గొప్పే అనిపించింది.
అంతేందుకు.. మొన్నటికి మొన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా
వచ్చింది. నేపధ్యం గోదారి ప్రాంతమే...
వంశీ కధ కాకపోయినా, గోదారి ప్రాంత ఆచార వ్యవహరములను కొంచెం దగ్గరగా
చూపించారు. ఎంత ఆహద్లకరముగా ఉంటుంది ఆ సినిమాలో వాతావరణం. అభిమానం, అప్యాయతలు
చూపించడంలో మా ప్రాంత వాసుల తర్వాతే ఎవరైనా... అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న
బేధాబిప్రాయములు ఉన్నా సర్దుకుపోయే తత్వంతో చివరి వరకు ఎలా కలసి ఉండాలో, మరియు
సంతృప్తికరమైన జీవితం అంటే ఎలా గడపాలో ఈ సినిమాలో చూపించారు.
హిందిలో కుటుంబ కధా చిత్రాలంటే రాజశ్రీ ప్రోడక్షన్స్ వైపు ఎలా చూస్తారో.....
ఇక్కడ కుటుంబ కధా చిత్రాలు కావాలంటే గోదారి ప్రాంతానికి వచ్చేయవలసిందే...
పి.ఎస్: కాకి పిల్ల కాకికి ముద్దు... అలానే గోదారి కతలంటే మాకు ముద్దు....