Wednesday 30 July 2014

డౌట్ - సమాచారము కావలెను

గౌరవనీయులు/ప్రియమైన బ్లాగర్లకు,

నాదొక చిన్న సందేహం. మనం వ్రాస్తున్న బ్లాగుల నందలి అర్టికల్స్ పాఠకులకు చేరడానికి బ్లాగ్ అగ్రిగ్రేటర్స్ మాత్రమేనా వేదికగా ఉన్నాయి. లేక మరేదేనా వేదికలుగా ఉన్నాయా? నాకైతే వీటి మీద పెద్దగా అవగాహన లేదు. అలానే వీటి గురించి తెలుసుకోడానికి ప్రయత్నించనులేదు. కేవలం సరదా కాలక్షేపం కోసము భ్లాగింగ్ చేస్తున్నాను తప్పితే, వీటి మీద నాకు సంపూర్ణ అవగాహన లేదు.

మీ విలువైన సలహలు/సమాచారమును కామెంటు రూపములో తెలియజేయగలరు అని ఆశిస్తున్నాను.

రాజీవ్ రాఘవ్.




సూపర్ సిటి - సమస్యలు



రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో నవ్యాంధ్ర రాష్ట్రం కొద్దిగా క్లిష్టమైన పరిస్దితిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. హైదరబాద్ ని పూర్తిగా తెలంగాణాకే కేటాయించడంతో నవ్యాంధ్రకు కొత్తగా రాజధాని వెతుక్కోవలసిన పరిస్దితి ఏర్పడింది. తెలంగాణాకి ఆ పరిస్దితి లేనందున వారికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు.

ఆయితే నవ్యాంధ్ర ప్రస్తుతం చేయవలసిన అతి ముఖ్యమైన పని, ఇప్పటి వరకు జరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలత్తెని విధంగా చర్యలు తీసుకోనవలసిన అవసరం ఉందని నవ్యాంధ్రలో ఉన్న ప్రతి సామాన్య వ్యక్తి కోరుకుంటున్నాడు.

తమిళనాడు నుండి విడిపోయి కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, తదనంతరం హైదరబాద్ స్టేట్ ను, ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధానిని కర్నూలు నుండి హైదరబాదుకి మార్చడం వంటి చర్యలు కారణంగా ఏర్పడిన పరిస్దితితో నేటి పరిస్దితులను బేరిజు వేసుకొని ముందడుగు వేయవలసిన నవ్యాంధ్ర ప్రభుత్వం ఎందుకోగాని తిరిగి పాత తప్పునే పునరావృత్తం చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాల ఆలోచనను బట్టి భావించవల్సివస్తుంది.

రాజధానిని కర్నూలు నుండి హైదరబాదుకి మార్చే సమయానికి హైదరబాదు అప్పటికే నిజాం రాజ్యం ప్రధాన కేంద్రంగా వెలుగు వెలిగిన ప్రాంతం. నిజాం కాలములోనే ప్రణాళికబద్దంగా నిర్మించబడిన హైదరబాదులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి కావల్సిన భవనములు అందుబాటులో ఉండడంతో మరో ఆలోచన లేకుండా రాజధానిని కర్నూలు నుండి హైదరబాదుకి తరలించేసారు. ఆయితే నాకు తెలిసీ ఆ సమయానికి సీమాంధ్ర ప్రాంతం నుండి హైదరబాదులో ఎవరూ ఉండే అవకాశము లేదని నా ఉద్దేశం.

ఆయితే కొన్ని అవసరాల కోసం దశాబ్దం కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరబాదు మీద కన్నా పూర్వ రాజధానిగా ఉన్న చైన్నై మీదే ఎక్కువగా సీమాంధ్రులు ఆధారపడ్డారు. సీమాంధ్ర వారు హైదరబాదుని తమ రాజధానిగా భావించడానికి చాలా కాలమే పట్టింది. ఈ లోపులో తెలుగుపరిశ్రమను చెన్నై నుండి హైదరబాదుకు తరలించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు కల్పించవల్సివచ్చింది.  ఆయినప్పట్టికి చాలా మంది సినిమా నటులు, దర్శకులు, ఇతర టెక్నిషియన్లు చెన్నైలోనే ఉండిపోయారు. అప్పటి వరకు ముస్లింల చారిత్రక నగరంగా ఉన్న హైదరబాదు కాస్తా తెలుగువారి నగరంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిఒక్కడూ హైదరబాదు నాదే అన్న ఫీలింగు కల్పించుకున్నాడు. ప్రభుత్వాలు హైదరబాదులో సౌకర్యాలు మెరుగుపర్చడం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు రాజధానిలో స్దిరపడడం మరియు అక్కడ వ్యాపారాలు వృద్ది చేసుకోవడం ద్వారా హైదరబాదు అన్ని హంగులతో ఉన్న సూపర్ సిటిగా రూపాంతరం చెందింది.

అప్పటి వరకు కొంత వరకు చెన్నై మీద ఆధారపడిన తెలుగు వారు ఇక పూర్తిగా హైదరబాదుపై ఆధారపడడం మొదలెట్టారు.

పార్టిలతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా దృష్టిని హైదరబాదు మీదే కేంద్రీకరించడంతో పలు అంతర్జాతీయ సంస్దలు, దేశియ సంస్దలు తమ పెట్టుబడులను కుమ్మరించడం ద్వారా ఉద్యోగాల కల్పించే కల్పవృక్షంగా హైదరబాదు ఎదిగింది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు నిర్మించిన సైబరబాద్ హైదరబాదు యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్ళింది. పలు కంపెనీల రాకతో వచ్చిన ఆదాయంతో హైదరబాదు ముఖచిత్రం, వాణిజ్య చిత్రం తారాస్దాయికి వెళ్ళింది.

ఆయితే ఇక్కడ పార్టిలతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న ప్రతీ  ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం హైదరబాదు మాత్రమే అన్నట్టుగా అక్కడ అభివృద్ధిని చేసారు తప్పితే హైదరబాదు మినహ మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న దూరదృష్టి ఆలోచనను ఒకరూ కూడా చేయలేకపోయారు. అటు తెలంగాణాలో ఉన్న ప్రాంతాలను కానీ, ఇటు ఆంధ్ర లో ఉన్న ప్రాంతాలను కానీ ఏ విధంగానూ అభివృద్దిలో భాగస్వామ్యం కల్పించలేకపోయారు.

తదుపరి తెలంగాణాలో వచ్చిన ప్రత్యేక ఉద్యమం మూలంగా రాష్ట్రంను విభజించవల్సిన అవసరం రావడంతో అభివృద్దికి దూరంగా ఉండి, హైదరబాదు మీదే ఆధారపడిన మిగతా ప్రాంతాలు సహజంగానే ఉలిక్కిపడ్డాయి. ఆయితే హైదరబాదు బౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉండడంతో తెలంగాణాకి వచ్చిన ఇబ్బందేమి లేదు.

ప్రస్తుతమున్న ఇబ్బందంతా నవ్యాంధ్రకే..  ఒక ప్రాంతం వద్దనే అభివృద్ధిని కేంద్రికరించడం వలన జరిగిన నష్టంను హైదరబాదు రూపంలో కళ్ళారా చూసిన తర్వాత కూడా నవ్యాంధ్రకి రాజధానిగా మరో సూపర్ సిటి ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కల్గియుండడం ఎంతో కొంత అందోళను కల్గిస్తుంది.

చెన్నై, హైదరబాదు విషయంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నవ్యాంధ్ర ప్రజలు మరో సారి అటువంటి తప్పిదం జరగడానికి ఇష్టపడడం లేదు. హైదరబాదు తరహలో ఒకే ప్రాధాన్యత నగరం కాకుండా కొన్ని నగరాల్లో ప్రాధాన్యత గల కార్యాలయలను ఏర్పరచలని ప్రజలు కోరుకుంటున్నారు. 

శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా వార్తలు వచ్చాయి. శివరామకృష్ణన్ సూచించినట్టుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయలను వేర్వేరు నగరాల్లో ఏర్పాటు చేయాలి. అదే విధంగా 192 కేంద్ర కార్యాలయాలను ప్రాధ్యానతలను బట్టి  ఆయా నగరాల్లో ఏర్పాటు చేస్తే ఉత్తమంగా ఉంటుంది.

ఇక్కడ నా ఉద్దేశమేమిటంటే ప్రభుత్వ పనుల కోసం, యితర పనుల కోసం రాష్ట్రం నలుమూలలా నుండి వచ్చే ప్రజలందరూ ఒకే ప్రాంతానికి వెళ్ళేలా ఉండకూడదు అని. ఉదహారణకి హైకోర్టులో పని ఉన్న వారు, సచివాలయంతో పని ఉన్నవారు, హోంశాఖ కార్యాలయంతో పని ఉన్నవారు లేక మెరుగైన వైద్యం నిమిత్తం వెళ్ళగోరేవారు ఇలా అందరూ సూపర్ సిటికి వెళ్ళేబదులుగా ఆయా ప్రాంతాల్లో మిగతా నగరాలకు వెళ్ళడం బెటర్ కదా అని నా అభిప్రాయం.

దాని వలన రాజధానిపై పడే ట్రాఫిక్ భారం విపరీతంగా తగ్గుతుంది కదా..

హైకోర్టుని వైజాగ్ లోనో, సచివాలయం రాజధానిలోనో, అసెంబ్లీ మరియు హోంశాఖ కార్యాలయాలను కర్నూల్ లోనో, సాప్ట్ వేర్ జోన్ ను, శ్రీకాకుళంలోనో, హార్ట్ వేర్ హబ్ ని నెల్లూరులోనో, కేంద్ర కార్యాలయాలను ప్రాధాన్యతని బట్టి వేర్వేరు నగరాల్లోనో ఏర్పాటు చేసారనుకొండి. అప్పుడు ఏమవుతుంది హైకోర్టు పని ఉన్న వారు వైజాగ్ వెళ్తారు. అలానే మిగతా పనులు పడ్డవారు ఆయా నగరాలకు వెళ్తారు కదా... అప్పుడు నగరాల పై పడే జనాభా మరియు ట్రాఫిక్ ఒత్తిడి అదుపులో ఉంటాయి కదా....

అప్పుడు పట్టణాలకు వలస వచ్చేవారిని వేర్వేరు నగరాలకు వికేంద్రీకరించినట్టు అవుతుంది. అంతే కాకుండా అయా ప్రాంతాల్లో ప్రజలకు సదుపాయాలు కల్పించే హోటల్, బోర్డింగ్, టూరింగ్ రంగాలు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. తద్వారా పలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  సమీప భవిష్యత్తులో్ నగరాలకు వలసలు విపరీతంగా పెరుగుతాయని పలు సర్వేలు చెబుతున్నాయి.  రాజధానిగా ఒక సూపర్ సిటినే ఎంచుకొంటే దానికి భవిష్యతుల్లో విపరీతమైన వలసలు ఎదుర్కోవలసివస్తుంది. ఆ విధంగా వలస వచ్చేవారందరికి నివాసం ఏర్పాటు చేయడానికి భారీ స్దాయిలో కావల్సిన స్దలంను కేటాయించడం ప్రభుత్వాలకు తలకి మించిన భారమవుతుంది.

ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రస్తుతం ఎందులోనూ సభ్యుడు కానీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు విజయవాడ-గుంటూరు ప్రాంతం పై ఎందుకంత పట్టుదలగా ఉన్నారో అర్ద్రం కావట్లేదు.  సూపర్ సిటి పరిష్కారం కాబోదని శివరామకృష్ణన్ చెప్పిన తర్వాతయినా ప్రభుత్వ ఆలోచన మారాలి.

వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు యొక్క ప్రాతినిధ్యంతో కూడిన ప్రభుత్వపాలనా వ్యవస్ద కావాలి మనకి. ఆప్పుడే చెన్నై, హైదరబాదు తరహ సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయి. లేదంటే విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా చేసి సూపర్ సిటిగా రూపాంతరం చెందితే భవిష్యత్తులో కేసిఆర్ వారసులు విజయవాడకు వలస వచ్చి,  మా అత్మగౌరవం, మా సంపద, మేము క్రీస్తుపూర్వం నుండి కూడా ఇలానే ఉన్నాం, మధ్యలో మిగతా ప్రాంతాలు వారు వచ్చి దోచుకుతింటున్నారు అన్నా ఆశ్చర్యం చెందక్కర్లేదు.

నవ్యాంధ్రకి రాజధానిగా సూపర్ సిటిని నిర్మించడం ఎట్టిపరిస్దితుల్లోనూ మంచి ఉద్దేశం కాదని చెప్పగలను. అలాగే తెలుగువారందరిని సమైక్యభావంలో ఉంచడానికి రాష్ట్రం పేరును తెలుగునాడు గా మార్చవలసిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు ఈ ప్రాంతంను ప్రతిబింబించే విధంగా ఏ మాత్రం లేదని నాకు అనిపిస్తుంది. ఆంధ్రులు అన్న పేరు మనకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిఉంది. కానీ దానికి సంబందించిన సమాచారము ఎక్కడ దొరుకుందో తెలియరాలేదు.

Tuesday 29 July 2014

చెంపదెబ్బ


వందకి వంద వచ్చిన మార్కుల జాబితా పట్టుకొని నాన్నగారి దగ్గరికి సంతోషంగా వెళ్ళి జాబితా చేతికి అందించాను.  ఆయన ఆ మార్కుల జాబితాను చూసి తల పంకించి నిదానంగా లేచి నిలబడ్డారు. బహూశా మెచ్చుకోలుగా చూస్తారేమో అనుకున్నాను. కానీ ఆ కళ్ళు చూస్తుంటే అలా అనిపించలేదు. కొద్దిగా భయంగా అనిపించినా అలానే నిలబడ్డాను. నింపాదిగా లేచి నిలబడ్డ నాన్న నా వైపు కాసేపు ఎగాదిగా చూసి చెంప చెల్లుమనిపించారు.

నాకు తొలిసారి ఒక సబెక్టులో వందకి వంద రావడం ఎంత వాస్తవమో, నాన్న తొలిసారిగా నా చెంప చెల్లుమనిపించడం కూడా అంతే వాస్తవం.....

ఎందుకు, ఏంటో తెలుసుకోవాలంటే మనం గతంలోకి దూకాలి.

                                                ***

ఆ రోజు పొద్దున్నే వచ్చిన న్యూస్ పేపర్ లో ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ పరీక్షల ఫలితాల్లో నా హాల్ టికెట్ నెంబరు కనబడగానే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కల్గింది. వెంటనే స్నానం చేసి రెడీ ఆయిపోయి మార్కులు కోసం కాలేజి టైమ్ కన్నా ఒక గంట ముందే పోయి కూర్చున్నా... కాలేజి టైమ్ ఆయిన అరగంటకి గ్గానీ రాలేదు ఆఫీసు స్టాఫ్ ఎవరూ. ఆ తర్వాత ఆఫీసు స్టాఫ్ దగ్గరకు వెళ్ళి నా మార్కులు తీసుకున్నా.. అందులో నాకొచ్చిన మార్కులు చూడగానే నా కళ్ళింతలయ్యాయి. అప్పటి వరకు వ్రాసిన ఏ పరీక్షలోనూ కూడా అన్ని మార్కులు రాలేదు.  నాకు బాగా ఇష్టమైన  మ్యాధ్స్ లో కూడా. కాని ఇప్పుడు అదే మ్యాధ్స్ లో 100 కి 100 వచ్చాయి.

నమ్మలేకపోయాను.. ఆయినా కళ్ళెదుట ఉన్న మార్కులు అది నిజమని చెబుతున్నాయి.

నేను చిన్నప్పటి నుండి చదువులో యావరేజి స్టూడెంట్ నే.. ఏనాడు క్లాస్ ఫస్ట్ రాలేదు. అలాగని చివర నుండి ఫస్ట్ రాలేదు. ఏదో చదువుతున్నాము, మార్కులు వస్తున్నాయి అనే టైపు.  ఆయితే లెక్కల్లో మాత్రం నా ప్రతిభ ఆఘెఘం. ఈ మాట నేనంటున్నది కాదు.. క్లాస్ మారిన ప్రతిసారి, లెక్కలు మాస్టార్లు మారిన ప్రతిసారీ, వారి నుండి నాకొచ్చిన కాంప్లిమెంటు అది. అందుకనే నా పదవ తరగతి వరకు మాకు వచ్చిన ప్రతి లెక్కల మాస్టారుతోనూ నాకు అనుబంధం ఎక్కువే..   కానీ అదేం విచిత్రమే తెలీదు కానీ, ఏ క్లాస్ లో కానీ, ఏ పరీక్షలో కానీ లెక్కలు వందకి వంద మార్కులు వచ్చిన పాపాన పోలేదు.

నేను ఏడవ తరగతిలో ఉండగా అనుకుంటాను, మా ఊరి స్కూలుకి రంగారావు గారని లెక్కల మాస్టారు బదిలీ మీద వచ్చారు. కొద్ది కాలంలోనే ఆయనకు నేను బాగా దగ్గరయిపోయాను. నేనంటే ఎంతో ఇష్టం చూపించేవారయన. ఒక సారి రంగరావు మాస్టారు బ్లాక్ బోర్డు మీద శాంపిల్ ఒక లెక్క చెప్పి, టెస్ట్ బుక్ లో ఉన్న మిగతా లెక్కలను చేసి చూపించమని క్లాస్ లో ఉన్న విద్యార్దులందరీకి ఆదేశించారు.  

అందరి కంటే ముందుగా నేను పూర్తి చేసి మాస్టారుకి చూపించాను. నాతో పాటుగా అప్పారావు, రాజుబాబు కూడా వెంటనే పూర్తి చేసేసారు. కొద్ది సేపటికి మిగతావారు కూడా చూపించుకుంటూ పోతున్నారు. అప్పుడు నేను మాస్టారి వెనుక నిలబడియున్నాను. అదేంటొ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాగానే చేసి చూపిస్తున్నారు. అదే పరీక్షలో రాయవలసి వచ్చేసరికి ఒక్కడికి సరిగా బల్బు వెలగదు ఏమిటో అన్నా. మాస్టారు ఆ మాటలు విని, నిజమే గదరా ఇప్పుడు బానే చేయగల్గిన వారు పరీక్షలో మాత్రం బాల్చి తన్నేస్తారు ఏంటో అని నిటూర్చారు. .

నేనంటే ఎంత ఇష్టమె ఆయనకు అనుకొని ఎంతో సంతోషపడిపోయేవాడిని. 

ఆయితే అలాంటి వారిలో నేను ఒకడినే అని ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గానీ తెలియరాలేదు

త్వరలోనే ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పుడంటే పెద్దగా విలువ లేదగ్గాని, అప్పుడంటే ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు పెద్ద హంగామానే.  రంగారావు మాస్టారు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పరీక్షలో నాకు వచ్చిన మార్కులు 56. ఫస్ట్ క్లాస్ 65 మార్కులు అప్పారావు గాడికి వచ్చినవి. అంత కంటే మా స్కూలు నుండి ఎవరికీ ఎక్కువ మార్కులు రాలేదు. మా స్కూలులో ఏడవ తరగతి వరకు మాత్రమే ఉండడంతో మాస్టారికి అత్మీయ వీడ్కోలు వేడుక ఏర్పాటు చేసాము.

ఆ వేడుకలో రంగారావు మాస్టారు మాట్లాడుతూ నన్ను ఉద్దేశించి, నా సబ్బెక్టులో వందకి వంద మార్కులు తెచ్చుకొని నాకు గౌరవం తెచ్చిపెడతాడనుకున్నా. కానీ ఇంత తక్కువ మార్కులు తెచ్చి నాకు తలవంపులు తెస్తాడని అనుకోలేదు అని భాధపడ్డారు. ఆనాడు రంగారావు మాస్టారు ఆన్న మాటలకి నేను చాలా భాదపడిపోయాను. మాస్టారిని కల్సి పరీక్ష చాలా బాగా రాసానని, ఆయినప్పటికీ ఇంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయో అర్ద్రం కావడం లేదని ఆయన కాళ్ళ మీద పడిపోయినంత పని చేసాను. దానికి ఆయన నవ్వుతూ నీ మీద నాకు నమ్మకముందిరా... ఇందులో మార్కులు రానంత మాత్రనా నీకు లెక్కలు రావని ఎవడూ అనగలర్రా నిన్ను... నీవు ఎప్పుడూ నెంబర్ వన్ స్టూడెంట్ వే. నీవు ఇలా డీలా పడిపోతే ఎలా అని అనుసయించి ఇంకా బాగా చదువుకోమని దీవించి పంపించారు.  ఆయన చూపిన అభిమానం చూసి నా మీద  నాకే కోపం వచ్చింది. నా లెక్కల పేపర్ వాల్యూయేషన్ చేసినవాడిని తిట్టుకుంటూ ఎనిమిదో తరగతిలో జాయినవడానికి కాకినాడ వచ్చేసాను.

నాన్నగారు ఉద్యోగరీత్యా కాకినాడలో ఉంటూ అడిట్ శాఖలో పనిచేసేవారు.అప్పటి వరకు ఆయన ఒక్కరే ఎన్.జి.ఒ.హోమ్ లో రూమ్ తీసుకొని ఉండేవారు. వారాంతంలోను సెలవుల్లోను నాన్న ఇంటికి వచ్చేవారు. ఇక్కడ తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నేను, చెల్లి ఉండేవాళ్ళం.

అప్పటి వరకు నాన్న గారు ఉద్యోగరీత్యా మాతో ఉండకపోవడం వలన ఇంటికి వచ్చినప్పుడు నన్ను, చెల్లిని బాగా చూసుకొనేవారు. క్రమశిక్షణ అలవాటు చేయడానికి ఎవరో ఒకరు కఠినంగా ఉండాలి కాబట్టి, ఆ భాద్యత అమ్మ తీసుకుంది. అందువలన నా ఏడవ తరగతి ఆయ్యే వరకు కఠినంగా ఉండే అమ్మ కన్నా, ప్రేమతో కబుర్లు చెప్పే నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది నాకు. మా ఊర్లో ఏడవ తరగతి వరకే ఉండడంతో పై చదువులు కోసం నాన్న ఉంటున్న కాకినాడకి మకాం మారింది.

ఆయితే అప్పటి వరకు అమ్మ తీసుకున్న క్రమశిక్షణ బాధ్యతని నాన్న తీసుకోవడంతో, ఆయన మీద భయం పెరిగి అమ్మ అంటే ఇష్టం పెరిగింది. నాన్నకి మా మీద ప్రేమ ఉన్నప్పట్టికి మమకారం మమ్మల్ని ఎక్కడ తప్పుదోవ పట్టిస్తుందన్న భయంతో నాన్న మాత్రం కాఠిన్యతని మెయినుటెయిను చేసేవారు.

అది కాస్తా నాకు, నాన్నకి మధ్య మానసికంగా దూరం పెంచింది. అమ్మ మాత్రం నాతో చాలాసార్లు చెబుతుండేది, నాన్నకి నేనంటే చాలా ఇష్టమని. కానీ పైకి చూపించేవారు కాదు. ఆ విధంగా నాన్న మీద ప్రేమ కాస్తా భయం రూపంలోకి మారింది.

ఎనిమిదో తరగతి కార్పోరేటు కాన్వెంటులో చేర్పించారు. ఆయితే అక్కడ మాస్టార్లు అంతా యాంత్రికంగా పాఠాలు చెప్పుకుంటు పోవడమే తప్ప మాతో సన్నిహితంగా మెలిగే వాతావరణం అక్కడ కనిపించలేదు. దానితో ఎనిమిది నుండి పదో తరగతి వరకు ఏ లెక్కల మాస్టారితోనూ సాన్నిహిత్యం ఏర్పడలేదు.

ఆ తర్వాత ఐడియల్ కాలేజిలో ఇంటర్ జాయినయ్యాను. అక్కడ ఒక పూట మాత్రమే కాలేజి క్లాసులు జరిగేవి. మిగతా పూట ఖాళీనే.. ఆయితే కాలేజిలో నోట్సు తయారుచేసుకోవడానికి పెద్దగా అవకాశం లేకపోవడంతో బయట ట్యూషన్స్ జాయినయ్యాము. అదిగో అప్పుడే  మరల మంచి లెక్కల మాస్టారు పరిచయమయ్యారు.

ఆయన గిరిశం గారు. మనిషి కొద్దిగా పొట్టిగా ఉండేవారు. కానీ మనసు మాత్రం వెన్న. ఒంటి మామిడి జంక్షన్ నుండి అచ్యుతాపురం రైల్వే గేటు వైపు వెళ్ళే దారిలో గేటుకి ఇవతలి వైపు ఎడమచేతి వైపు ఉన్న సందులాంటి రోడ్డులో ఉండేది ఆయన చెప్పే ట్యూషన్ క్లాస్. లెక్కలు ఎంత చక్కగా భోదించేవారో, అదే విధంగా అంతే ప్రేమగా చూసేవారు. డౌట్ ఉంటే అర్ద్రం ఆయ్యేంత వరకు ఎన్నిసార్లు ఆయినా విశదికరించేవారు.  ఆయనకు కట్టవలసిన ఫీజు గురించి ఎవరినీ కూడా అడిగేవారు కాదు. ఎవరు తెచ్చి ఇస్తే వాటినే పుచ్చుకొనేవారు తప్ప ఏనాడు కూడా నోరు తెరిచి అడగలేదు. విద్యను భోధించడం బాధ్యతగానే చూసారు తప్ప కమర్షియల్ కోణంలో చూడలేదు.

ఏడవ తరగతిలో రంగారావు మాస్టారు తర్వాత, మరల ఇంటర్ లో గిరిశం గారితోనే నాకు అనుబంధం ఏర్పడింది.  నేను, వల్లీనాధ్, నాగూర్ బాబు అంటే అభిమానం చూపించేవారయన.. నాగూర్ బాబు అంటే సినీ నేపధ్యగాయకుడు కాదండోయ్... నా స్నేహితుడు మాత్రమే. ఇప్పుడు అతను టీచర్ గా పనిచేస్తున్నాడులెండి.
క్లాసులో మాకు కొన్ని లెక్కలు ఇచ్చి సాల్వ్ చేసి చూపించమనేవారు. నన్ను, వల్లీనాధ్, నాగూర్ బాబులను మాత్రము అందరికన్నా చివర చూపించమనే వారు. అదేంటి సార్! అని మేమడిగితే మీకు ఎలాగూ వచ్చు కదరా ఆ లెక్కలు అనేవారు. ప్రతి ఆదివారం మాకు ఎగ్జామ్ పెట్టేవారు. అందులో క్వశ్చన్స్ అన్నింటికి అన్సర్ చేసేవాడిని కానీ, ఎప్పుడూ పూర్తి మార్కులు వచ్చేవి కావు.


ఒక సారి గిరిశం గారు పిలిచి నా ఎగ్జామ్ పేపర్ చేతిలో పెట్టి దాని మీద ఉన్న నా పేరు చదవమన్నారు. నా పేరుని ఎప్పుడూ కూడా పూర్తిగా రాసే అలవాటు ఉండేది కాదు. అంటే రాజీవ్ రాఘవ్ ని ఇంగ్లీషులో రాసేటప్పుడు మొదటి మూడు అక్షరాలు మాత్రమే సరిగా రాసి మిగతా వాటిని గీతలా సాగదీసి పైన పెట్టిన పోటొలో పెట్టినట్టుగా పెట్టేసేవాడిని. అలాగే మ్యాధ్స్ పేపర్ లోని అంశాల వారీగా చేయవలసిన అన్సరింగ్ ని చాలా షార్ట్ కట్ లో చేసేసేవాడిని. అంటే ముందుగా ఆ లెక్కకు చెందిన ఫార్ములా వేయడం, దాని క్రింద వాల్యూస్ వేయడం, వెంటనే దాని క్రింద ఫైనల్ ఆనర్స్ వేయడం మాత్రమే చేసేవాడిని. అంతే కాని ఆ కొశ్చన్ కి ఇచ్చిన మార్కులు ఆధారంగా స్టెప్ బై స్టెప్ గా సవివరంగా చేసేవాడిని కాదు. ఎన్ని మార్కులు క్వొశ్చన్ ఆయిన సరే మూడు స్టెప్స్ లో మాత్రమే ఆన్సరింగ్ చేసేవాడిని. దానితో వాటికి పుల్ మార్కులు పడేవి కాదు.

నా పేరు రాసిన విధంగానే నేను ఎగ్జామ్స్ లో చేసే అన్సరింగ్ అలానే తగలాడింది అని సుతిమెత్తగా మందలించారు గిరిశం మాస్టారు. ఈ సారి ఎప్పుడైనా పేరు కానీ, ఆన్సరింగ్ కానీ పూర్తిగా చేయకపోతే జిరో మార్కులే వేయవల్సిఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చేసారు.

ఆ తర్వాత వచ్చిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మన హాల్ టికెట్ నెంబర్ కనబడ్లేదు. జీవితంలో మొదటి సారి ఫెయిల్ అంటే ఏంటో చూడడం. అన్ని సబ్జెట్టులు బాగానే రాసినా ఎందుకు ఫెయిల్ ఆయ్యానో అర్ద్రం కాలేదు. ఫెయిల్ ఆయ్యానన్న బాధ కన్నా నాన్న గారు ఎలా రియాక్ట్ ఆవుతారో అన్న భయం ఎక్కువయింది. ఆ సమయంలో నేను మా చిన్నాన్న గారి ఇంటి వద్ద ఉన్నాను. మా బంధు వర్గంలో నేను బాగా చదువుతానని కొద్దోగొప్పో పేరుండేది. ఇప్పుడు ఇలా ఫెయిల్ అవ్వడం చిన్నాన్నే నమ్మలేకపోయారు.

ఆయితే తిరిగి ఒక నెల రోజుల వ్యవధిలో సంప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆయితే నాకు తిరిగి కాకినాడ్ వెళ్ళడానికి ధైర్యం చాల్లేదు. దానితో చిన్నాన్న నన్ను తీసుకెళ్ళి, కాకినాడలో దింపి నన్ను ఏమనొద్దని నాన్న గారితో చెప్పి వెళ్ళిపోయారు. చిన్నాన్న వెళ్ళిపోయిన తర్వాత నాకు బ్యాండ్ బాజా గ్యారంటీ అనుకున్నా. కానీ ఆశ్చర్యకరముగా నాన్న గారు నన్ను ఏమనలేదు.

అంతకన్నా ఆశ్చర్యకరముగా నేను ఫెయిలయింది మ్యాధ్స్ సబ్జెట్టులో. నమ్మలేకపోయాను. ఆయితే ఇప్పటిలా రీవాల్యూయేషన్ చేయించడాలు అవీ అప్పుడు చాలా తక్కువ కాబట్టి ఆ సాహసం చేయలేదు. వెంటనే సంప్లిమెంటరీకి అప్లై చేసి వందకి వంద మార్కులు తెచ్చుకున్నాను. ఈ నెల రోజుల కాలంలో నాన్న గారు నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు.

ఆ ధైర్యంతో మరియు తొలిసారిగా మ్యాధ్స్ లో వందకి వంద వచ్చిన ఆనందంతో నాన్నగారి వద్దకి వెళ్తే ఆయన నాకు ఇచ్చిన బహుమతి “చెంపదెబ్బ”...

తలదించుకొని నేల దిక్కులు చూస్తూ ఉండిపోయాను. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. అమ్మ నా దగ్గరకి వచ్చి భుజం చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుంది.

తిరిగి కుర్చీలో కూర్చున్న నాన్నగారు అప్పుడు అన్నారు.  

చూడు రాజీవ్.. నాకు మార్కులు ఇంపార్టెంట్ కాదు. ఆయితే ఫస్ట్ మార్కులు వచ్చినా, ఫెయిల్ ఆయినా ఒకేలా తీసుకోవాలి. ఫెయిల్ ఆయినప్పుడు దూరంగా పారిపోయి చిన్నాన్న తో రికమెండేషన్ చేయించడంలు, ఫస్ట్ మార్కులు వచ్చినప్పుడు నా దగ్గరకి ఎగురుకుంటూ రావడం పద్దతి కాదు. నువ్వు ఫెయిల్ ఆయిన రోజే నా దగ్గరకి వచ్చి నాన్న గారు నేను ఇందులో ఫెయిల్ అయ్యాను అని చెబితే అర్ద్రవంతంగా ఉండేది. ఈ నెల రోజులు నన్ను తప్పించుకు తిరిగిన వాడివి ఈ రోజు ఎలా రాగలిగావు? అని అడిగారు.

నేనేమి మాట్లాడకుండా నేల దిక్కులు చూస్తున్నాను. సమాధానం చెప్పు అని రెట్టించారు నాన్నగారు...

ఫెయిలయినందుకు తిడతారని భయపడి ఈ నెల రోజులు మీకు కనిపించడానికి భయపడ్డాను’ అని తలదించుకొనే అన్నాను.

తప్పు జరిగినప్పుడు కనిపించకుండా దూరంగా ఉండాలని అనుకోవడం తప్పు కదరా... మంచి మార్కులు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా వచ్చి చెప్పగలిగావో, ఏదైనా పొరబాటు జరిగినప్పుడు కూడా అలానే ధైర్యంగా చెప్పగలగాలి కదా అని సముదాయించారు.

ఇందాక కొట్టిన చెంపదెబ్బ నువ్ తెలియక చేసిన తప్పుకు ఆయితే, ఇప్పుడు నీకు వచ్చిన మార్కులకు నేనిచ్చే బహుమతి ఇదిగో అంటూ ఒక కవర్ చేతికందించారు. అందులో నాకు నచ్చిన జీన్స్ ప్యాంటుతో కూడిన జత బట్టలు.. ఎప్పటి నుండో అడుగుతున్నా అమ్మని. అమ్మా!! జీన్ ప్యాంటు కొనుకుంటాను డబ్బులివ్వమని. అమ్మ డబ్బులు ఇవ్వలేదు కానీ, అడక్కుండానే నాన్న గారు కొనిచ్చారు..


క్రమశిక్షణ పేరుతో మాతో కఠినంగా ఉన్నా మేమంటే ఎంతో ప్రేమ కల్గిన నాన్నగారు ఇప్పుడు మా మధ్య లేకపోవడం మాత్రం నాకు పెద్ద లోటు...
...