Monday 15 July 2013

ష్.. అలా అర్ద్రమయిందా!!



మా ఊరిలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో బి.టెక్. చదువుకున్న వ్యక్తి తన భార్యను సర్పంచ్ అభ్యర్దిగా నిలబెడుతున్నారు.....

గత కొన్ని ఏళ్ళుగా ఊరిలో సరయిన పాలకులు లేక అభివృద్ధి కుంటు పడి, చిల్లర మల్లర గొడవలుతో ఎప్పుడూ అశాంతిగా ఉండేది...

దానితో ఈ సారి ఎన్నికల్లో చదువుకున్న వారు, నిజాయితీ పరులు సర్పంచ్ పదవికి నిలబడితే బాగుణ్ణు అనుకున్న సమయంలో ఈయన నిలబడడంతో ఆనందమేసింది...

ఆయనను కలిసినప్పుడు ఊరి అభివృద్ధి విషయములో అవసరమైన సాయం చేయడానికి నేను ఎప్పుడైనా రెడీ అని మాట ఇచ్చాను... ఆ మాట అన్నందుకు సంతోషించారు ఆయన.... అలాగే ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టకండీ అని అడిగా’. ఏమీ మాట్లాడలేదు ఆయన..

మర్నాడు మా నూకరాజు అన్నయ్య పోన్ చేసాడు... ఏంటి బాబూ మేటర్ అని అడిగితే....

“నిన్న మన సర్పంచ్ అభ్యర్దిని కలిసినప్పుడు, అవసరమైన సాయం చేస్తానని మాట ఇచ్చావట కదా”  అన్నాడు...

ఆ” అన్నాను.... మరి మన వార్డు మెంబర్ కి సంబందించి ఖర్చు పెట్టుకుంటావా? అని అడిగాడు...

ఖర్చు అంటే? అనడిగా.... మందు పంపిణీకి, ఓట్లు కొనడానికి అవసరముంటుంది కదా! అన్నాడు.....

 

నాకు నవ్వొచ్చింది.... ఊరి అభివృద్ధికి అవసరమైన సాయం చేస్తా అని నేను అంటే, వారికి ఇలా అర్ద్రమయిందా! అనుకున్నాను.....

ఇప్పటి వరకు నా ఆలోచనలన్నీ అవినీతికి, లంచం తీసుకోవడానికి వ్యతిరేకముగా ఉన్నాయి. అలాగే ఊరు అభివృద్ధి జరగాలని ఎంతో కోరుకుంటున్నాను. ఇప్పటి వరకే కాదు, తర్వాత కూడా నా అలోచనలు ఇలానే ఉంటాయి....

అలాంటిది ఇలాంటి అక్రమ వ్యవహరములకు నేను డబ్బులు ఇవ్వగలననీ ఎలా అనుకున్నారో అర్ద్రం కావడం లేదు...

ఆయినా ఇంత చదువుకున్నోళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టి, ఓట్లు కొనుక్కొని పదవిని పొందిన తర్వాత, ఊరికి ఏమైనా చేయగలరా అన్న డౌట్ పట్టుకుంది నాకు....
 
నోట్లతో ఓట్లను కొనుక్కొన ఊరిలో డెవలప్ మెంట్ సాధ్యమవుతుందా?

ఎవరైనా నా డౌట్ తీర్చగలరా??/

కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనిపిస్తుంది..
 

నా మొదటి బాలయ్య ప్రసంగం....


నిన్న, మొన్న వరుసగా సెలవులు రావడంతో శుక్రవారం మధ్యాహ్నమే బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయా...

వర్షాకాల ప్రభావం మూలంగా అనుకుంటా వాతావరణం చాలా చల్లగా అహద్లకరముగా ఉంది. పైగా పల్లెటూరు కూడానూ...

ఎక్కడికీ బయటకు వెళ్ళకుండా అలానే ఇంట్లోనే గడిపేస్తున్నాను..  ఈ లోపులో మా రవి మామ వచ్చాడు, చేతిలో ఓటర్లు లిస్టు పట్టుకొని... పంచాయితీ ఎన్నికలు కదా ఇప్పుడు.. మనోడు మా వార్డుకి మెంబరుగా పోటీ చేస్తున్నాడట..

వచ్చినతనిని పలకరించకపోతే బాగుండదు కదా అని పలకరించి, కొద్ది సేపు మాట్లాడి తిరిగి లోపలికి పోయి టి.వి. ముందు సెటిలయ్యా.... ఆ తర్వాత రవి మామ మా అమ్మమ్మతో కూర్చుని డిస్కషన్స్ లో పడిపోయాడు...

సాయంకాలం ఆయ్యేసరికి రాము మాస్టారు నుండి ఫోన్ వచ్చింది. రాము మాస్టారంటే నా చిన్నప్పటి గురువుగారు... చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. నేనంటే అభిమానం ఆయనకు...

ఏంటి సార్’ ఫోన్ చేసారని అడిగా... 

ఇదిగో శ్రీనివాస్ గారు మాట్లాడతారట అని ఫోన్ ని శ్రీనివాసు గార్కి యిచ్చారు. ఈయన ప్రస్తుతం మా ఊరికి సర్పంచ్ పదవికి పోటి చేస్తున్నారు”.  ఏంటి విషయమంటే, ఒకసారి మాట్లాడే పనియుంది. కలుద్దాం అన్నారు... సరేనండీ అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను,  కానీ ఆ సంగతే మర్చిపోయాను....

మర్నాడు ఇంట్లో కోడి పలావు వండారు.  మా ఇంట్లో కోడిపలావు వండారంటే ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటాడు. మా అమ్మమ్మ వండినట్టు తెలిసినవారిలో ఎవరూ కూడా చేయలేరు... కాకపోతే తినేవాళ్ళు కొద్దిగా గట్టి పిండాలయిఉండాలి. లేకపోతే పలావు లోని కారం గాటుకి అట్నుంచి అటే పైకి టపా కట్టేయడం ఖాయం.  అంత ఎక్కువగా మసాలా దట్టించి తయారు చేస్తారు.. ఎంత కారంగా ఉన్నప్పట్టికి ఆ టేస్ట్ ముందు అవన్నీ పట్టించుకోకుండా కడుపు పగిలేలా తినడం మాత్రం గ్యారంటీ....

అలాంటి పలావు చేసేసరికి ఇక బయటికి ఏమి వెళ్ళలనిపిస్తుంది?... వాతావరణం కూడా చల్లగా ఉండి వెచ్చదనం కోరుకుంటుంది... ఇక పలావు ఎప్పుడు ఆవుతుందా? ఎప్పుడు మొదలెడదమా అని ఉదయం 10 గం.ల నుండి ఎదురు చూపులే... చివరకి 12.30 గంటలకు భోజనాల గది నుండి పిలువు వచ్చింది.  పిలుపు అందుకోవడం పాపం డైనింగ్ టేబుల్ మీద పడి శరణార్ద శిబిరంలో శరణార్దిలకు మంచి భోజనం దొరికితే ఎలా విభృంజిస్తాడో అలా కడుపు నిండా తినేసాను....

సాయంకాలం ఆయ్యేసరికి పలావు మరో పట్టు పడదాం అనుకోనేంతలో శ్రీ రామస్వామి వచ్చాడు ఇంటికి. యితను నాకు నాలుగేళ్ళు సీనియర్.. మా ఊరే... నాకు బాగా సన్నిహితుడు... ఏంటయ్యా సడెన్ గా ఇలా చెప్పాచేయకుండా వచ్చేసావు అని అడిగా....

సర్పంచ్ గా పోటీ చేస్తున్న శ్రీనివాసు గారు సాయంకాలం కలవమన్నారు మనల్ని.;  ఒకసారి కలిసి వద్దాం రా అని పిలుచుకువెళ్ళాడు... ఆవును కదా సుమీ నిన్న పోన్ చేసారు కదా, మర్చేపోయాను దాని సంగతి! అని అనుకొని  బయలుదేరాను  సాయంకాలం ఐదు గంటలకు....

దేని గురించయ్యా మనతో మాట్లాడేది అని అడిగా రామస్వామిని. పంచాయితీ ఎన్నికలు కదా, దాని గురించి మాట్లాడదమని అనుకుంటున్నారేమో అని అన్నాడు... పంచాయితీ ఎన్నికలు గురించయితే మనతో మాట్లాడేముంది తొక్క అనుకున్నా స్వగతంలో....

శ్రీనివాసు గార్కి ఊరిలో ఒక కాన్వెంటు ఉంది. ఆ కాన్వెంటు ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసారు. నేను అప్పటి వరకు ఆయన, మరికొందరు మాత్రమే ఉంటారెమో అనుకున్నా.... కానీ అక్కడ చూస్తే చిన్న సైజు సమావేశం ఏర్పాటు చేసియుంది.... మనకెందుకురా బాబు అనుకున్నప్పట్టికీ, అక్కడ వరకూ వచ్చిన తర్వాత కూర్చొక తప్పింది కాదు.

సమావేశం ప్రారంభమయింది. స్టేజి మీద ఓ నాల్గు కుర్చీలు వేసారు. మిగతా వారు కూర్చోవడానికి కాన్వెంటు బెంచీలు ఏర్పాటు చేసారు. కొత్తగా ఓటర్లయిన వారు మరియు వివిధ క్లాసుల కాలేజి విద్యార్దులతో నిండిపోయియుంది. నేను చివర్లో ఒక బెంచీ మీద కూర్చుని గమనించసాగాను. సమావేశం ప్రారంభమయింది. వ్యాఖ్యాత అవతారమెత్తిన దేవుడు మాస్టారు ప్రసంగం మొదలెట్టి, స్టేజి మీద ఉన్న మిగతా వారందరి చేత మాట్లాడించారు.. ఎలక్షన్స్ గురించి... ఓట్లు గురించి ప్రసంగం కొనసాగుతుంది... అందరూ వాళ్ళకి తోచినట్లు బాగా చెబుతున్నారు. అన్నీ శ్రద్దగా వింటున్నాను ( మనసులో మాత్రం ఇంట్లో ఉన్న బిర్యానీ మీదే ఉందిలెండి దృష్టి)

సడెన్ గా నన్ను పిలిచారు స్టేజి మీదికి మాట్లాడవలసినదిగా కోరుచూ దేవుడు మాస్టారు....

గుండెల్లో రాయి పడింది.. ఏంటి రా బాబూ సడెన్ గా ఇలా బుక్కు ఆయిపోయానని.... నాకు ఇప్పటి వరకు స్టేజి మీద మాట్లాడిన అనుభవం లేదు.. ఇప్పటికిప్పుడు సడెన్ గా మాట్లాడమంటే ఎలా అని??

నేను గబ గబా స్టేజి మీద దేవుడి మాస్టారి వద్దకి వెళ్ళి చెవిలో గుసగుసలాడుచూ ఏంటి సార్, నాకు అసలే మాట్లాడడం రాదు.. నేను మాట్లాడలేను అని చెప్పి వెళ్ళిపోయాను. సరే అని చెప్పి మిగతా వారిని ప్రసంగం చేయవలసినదిగా కోరారు...

అమ్మయ్య.. గండం గడిచింది.. అని ఊపిరి పిల్చుకొని వెళ్ళుపోబోతుంటే, దేవుడు మాస్టారు ఆపివేసి మొదటి లైన్ లో బలవంతంగా కూర్చోబెట్టేసారు....

అప్పటికే చీకటి పడిపోయింది... ఆ అవరణలో లైట్లు కూడా పనిచేయలేదు ఆ సమయంలో... చీకట్లోనే సమావేశాన్ని కంటిన్యూ చేసేసారు...  స్టేజీ మీద వ్యాఖ్యాతలు ప్రసంగాలు పూర్తవగానే క్రిందన కూర్చున్న కొంత మంది విద్యార్దులు మరియు కుర్ర టీచర్లతో కూడా మాట్లాడించారు....

ఇలా అందరూ మాట్లాడడం ఆయిపోయిన తర్వాత, అనుకోకుండా దేవుడు మాస్టారు సడెన్ గా నా చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయి, ఎలాగైనా మాట్లాడివలసినదే అని కోరారు.. అందరూ నా వైపే చూస్తున్నారు... నాకు నోరు పెగలడం లేదు... ఇదేంటి రా బాబూ, శుభ్రంగా ఇంట్లో బిర్యానీ తింటూ హ్యాపీగా ఉండవల్సిన వాడిని.. ఇలా ఇరుక్కుపోయానా అని భాదపడసాగాను... 

ఎలాగైనా మాట్లాడవలసినదే అని దేవుడి మాస్టారు మరియు స్నేహితులు  ఫోర్స్ చేయడం మెదలెట్టారు... ఇక తప్పించుకోవడానికి కుదిరే పరిస్దితి కనిపించలేదు... తప్పదనుకొని మొదలెట్టా మాట్లాడడం (బాలయ్య స్పీచ్ మరియు బలుపు సినిమాలో రవితేజ స్పీచ్  బ్రెయిన్ లో మొదలుతుండగా)..... ఎలా మొదలెట్టానో, ఏమి చెప్పానో, ఎలా ముగించానో తెలియకుండా ( నా డౌట్ అసలు నేను ఎలక్షన్స్ గురించే మాట్లాడానా లేదా అని) ప్రసంగం ఇచ్చేసా...
 

మాట్లాడడం ఆయిపోయిన తర్వాత సమావేశంలో చప్పట్లు హోరు మొదలయింది... నేను ఏమి మాట్లాడానో నాకే అర్ద్రం కాలేదు. ఆయితే వీళ్ళకి కూడా అర్ద్రం ఆయి యుండదు. దానినే చప్పట్లు రూపంలో తెలియజేశారన్న మాట అని అనుకున్నాను. అందరికీ ధన్యవాదములు తెలిపి సెలవు తీసుకున్నాను.....

బయటికి వచ్చిన తర్వాత కొంత మంది వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా బాగా మాట్లాడావని అభినందించారు.... బహుశా అవి ఫార్మాలిటిస్ అనుకుంటా..... బాలయ్య ప్రసంగం ఆయిపోయిన తర్వాత ఆయనకు కూడా అందరూ అలానే షేక్ హ్యాండ్ ఇస్తారు కదా........

ఇంటికి వెళ్ళేసరికి టైమ్ రాత్రి 9.30....

బిర్యానీ అప్పటికే ఆయిపోయింది..... ఇక ఏమీ లేదు......

 

Monday 8 July 2013

హత్య!!


కొన్ని కారణాల వల్ల నిన్న ఆదివారం ఇంటికి వెళ్ళడానికి కుదరల్లేదు..

సాయంకాలం బోర్ గా అనిపించి అమ్మకి ఫోన్ చేసినప్పుడు చెప్పింది ఆ విషయమును..

కొరుప్రోలు అచ్చిరాజులు..

మనిషి ఆరు అడుగులు ఉంటాడు. వయసు సుమారుగా డైబ్బది ఐదు పైనే ఉంటుంది. ఆయినప్పటికి ఆ వయసు తాలుకూ ప్రభావమెక్కడా బాడీ లాంగ్వేజీలో కనబడదు. ఇప్పటికి కూడా ఊత కర్ర సాయం లేకుండానే నిటారుగా నిలబడతాడు. అంతే కాదు వ్యవసాయ పనుల్లో ఇప్పటికీ చురుగ్గానే ఉంటాడు. మెడ క్రింద వరకు ఉండే తెల్లని ఉంగరాల జుత్తుతో ఉండడం అతనికున్న అదనపు ఆకర్షణ.. గాలికి చెదరకుండా పొద్దుట ఎలా దువ్వుకుంటాడో అలాగే పొద్దుపోయేవరకు ఉంటుంది చెదరకుండా ఆ తలకట్టు. ఒక రకముగా చెప్పాలంటే ఆ తలకట్టు కారణంగానే అతను నా మనసులో అతని యొక్క రూపం బలంగా నాటుకుపోయిందని నా నమ్మకం......

మా తాతయ్యతో కలసి ఎదిగి, తనతో విడదీయరాని స్నేహంను పంచుకొని,   ఆ తరానికు గుర్తుగా ఉన్న వ్యక్తి అతను..

చిన్నప్పుడు తాతయ్యతో కలసి రోజూ ఉదయాన్నే చేనుకి వెళ్ళేవాడిని. అదుగో అప్పటి నుండి నాకు ఎరుక అతను... అతనుతో పాటుగా మా తాతయ్య కూడా అరడుగులు ఎత్తు ఉండేవారు. అచ్చిరాజులుతో పాటు చుట్టు ఉన్న కొంత మంది వ్యవసాయదారులు మా తాతయ్యకి జట్టుగాళ్ళు.

అచ్చిరాజులు వాళ్ళ చేను మా చేనుకి అవతల వైపు ఉండేది.. అక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి.. అసలు ఎండే పడేది కాదు అంత గుబురుగా ఉండేవి చెట్లు.. అచ్చిరాజులు నివాసం కూడా అక్కడే ఉండేవాడు. చేను దాటి ఊర్లోకి వచ్చిన సందర్బాలు బహు తక్కువ.. ఏదైనా అవసరం పడితినే ఊళ్ళోకి వచ్చేవాడు....

ఎలిమెంటరీ చదువులు ఆయిపోయిన తర్వాత పట్టణానికి వచ్చేసిన తర్వాత, సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు, చేనుకు వెళితే నవ్వుతూ పలకరించేవాడు.. తాతయ్య, అచ్చిరాజులు కలసి చాలా విషయాలు మాట్లాడుకొనేవారు. నేను చూసి నవ్వుకొనేవాడిని.

తర్వాత కాలములో తాతయ్యకి అనారోగ్యం చేసి ఆరవది ఐదేళ్ళకే మమ్మల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి వరకు తాతయ్యే మొత్తం వ్యవసాయం చూసుకొనేవారు. తాతయ్యకి మగ పిల్లలెవరూ లేకపోయేసరికి వ్యవసాయంను శిస్తుకి ఇచ్చేయవలసివచ్చింది. అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళినా, చేనుకి వెళ్ళవలసిన అవసరముండేది కాదు. తాతయ్య ఉన్నప్పుడంటే ఆయనతో కలిసి సరదాగా వెళ్ళేవాడిని. అలా చేను, తోటల్లో త్రిప్పుతూ అన్ని విషయాలు చెప్పేవారు. అప్పుడూ తాతయ్యతో పాటుగా అచ్చిరాజులు ఉండేవాడు...

తాతయ్య పోయిన తర్వాత నేను దాదాపుగా చేనుకు వెళ్ళడం మానేసాను. దానితో అచ్చిరాజులును కలవడం కూడా పూర్తిగా తగ్గిపోయింది.   అప్పుడప్పుడు చేను వైపు వెళ్ళినపుడు కనబడి పలకరించేవాడు. నేను పెద్దవడం మూలంగానే లేక మరే యితర కారణం వల్లనో సరిగా మాట్లాడలేకపోయేవాడిని ఆచ్చిరాజులు తో.. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా చాలా అప్యాయంగా మాట్లాడేవాడు. మాటల్లో తాతయ్య గురించి చెప్పడం మాత్రం మర్చిపోయేవాడు కాదు...... ఇప్పటికి మా చేను చేస్తున్న రైతు సత్తిబాబు మరీ మరీ చెబుతుంటాడు. ఒరే అవి మా రాజీవ్ పొలం రా... జాగర్తతో చూడు ఒరే... అని చెప్పేవాడని మా రైతు సత్తిబాబు చెప్పేవాడు..

అలాంటి అచ్చిరాజులు మొన్న శనివారం తన చేను దగ్గర పాకలో పురుగుల మందు త్రాగి చనిపోయాడంట!!

మా అమ్మ ఈ విషయాన్ని ఫోన్ లో చెప్పినపుడు చాలా భాదనిపించింది... ఏదో ఆమూల్యమైనదాన్ని కోల్పోయిన బాధ కలిగింది....

డైబ్బది ఐదు సం.ల వయస్సులో ఎటువంటి అనార్యోగం లేని మనిషి, ఎటువంటి బాదరబందీ లేని మనిషి అత్మహత్య చేసుకోవలసిన అగత్యము ఏమోచ్చింది అనుకొన్నాను... అచ్చిరాజులు అత్మహత్య చేసుకోవడానికి గల కారణమును మా అమ్మ చెప్పినపుడు అది అత్మహత్య కాదు... హత్య అనిపించింది...

కొద్ది రోజుల క్రితం మా ఊరిలో ఒక వ్యక్తికి చెందిన గేదేకు ఆనారోగ్యమో లేక మరేదో సంభవించిందంట... దానికి కారణం అచ్చిరాజులు చెడుపు(చేతబడి లాంటిది అనే అర్దం వస్తుంది) పెట్టడం వల్లే అని అతను అరోపించడంట. మొదట్లో ఆ విషయమును అచ్చిరాజులు పెద్దగా పట్టించుకోలేదంట....  కానీ ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అనడంతో దాని గురించి కొద్దిగా ఎక్కువగా పబ్లిక్ లో మాట్లాడుకోవడం అచ్చిరాజులు తెలిసి, చాలా బాధపడ్డడంట....

చివరకు ఈ విషయమై పెద్దల సమక్షంలోకి పంచాయితీకి రమ్మని కబురు పెట్టరట అచ్చిరాజులకు....

అప్పుడు ఆ పెద్దలు అచ్చిరాజులతో, ఆ పెట్టిన చెడుపుని వెనక్కి తీసేసుకోమని చెప్పారట.. దానితో అచ్చిరాజులు మనస్దాపానికి గురయ్యి, ఇప్పటికి వరకు చాలా పరువుగా బ్రతికాను.. వెనుకటి తరానికి చెందిన వాడిని, నా గురించి ఇప్పుడు పుట్టిన పిల్లకాయలకు ఏమి తెలుసు? పెద్దలను గౌరవించడం ఏమి తెలుసు?  ఆయినా మచ్చ పడ్డ తర్వాత ఇక ఉండడం ఎందుకు అని మనస్దాపం చెంది పురుగుల మందు త్రాగి చనిపోయాడంట.....

ఇది తెలిసిన తర్వాత నాకు చాలా కోపమెచ్చింది.. వాస్తవానికి ఈ విషయాలేవి ముందుగా నాకు తెలియవు...

మా ఊర్లో అక్షరాక్షత శాతం తొంభై పైనే ఉంటుంది. అందులో చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, సాప్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్దిరపడి వేర్వేరు ఊర్లలో ఉంటున్నారు. మిగిలిన వాళ్ళలో కొంత మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిపోయిన  వాళ్ళందరూ చదువులు అబ్బక, ఏ పని చేతగాక ఊళ్ళలోనే పడియుంటున్నారు.  ఈ వెధవలకు వెనుకటి తరం వారు ఎవరూ తెలియదు.. తెలిసినా గౌరవించడం రాదు..

ఇందాకా చెప్పానే పెద్దలు పంచాయితీకి పిలిచారని..... ఆ పెద్దలంటే ఎవరో తెలుసా మీకు...

తాతయ్య కాలం నాటి వారందరూ కాలం చేయడంతో, మరియు పెద్ద కుటుంబాలు విచ్చిన్నం అవడం, మరియు మిగిలిన కొన్ని కుటుంబాలు రాజకీయాలంటే విముఖత చూపడంతో పని లేని బేవార్స్ వెధవలు రాజకీయాల్లోకి దిగి ఇలాంటి పెద్దలు అవతారమెత్తిన బాపతు....

మొన్నటి దాకా ప్రెసిడెంటు గిరి వెలగబెట్టిన మనిషి ఒకప్పుడూ మా తాతయ్య దగ్గర ఉండేవాడు. ఆ రోజు నుండీ అచ్చిరాజులు గురించి, అతని క్యారెక్టరు గురించి మొత్తం అతనికి తెల్సు...  ఆ సంగతి ప్రక్కన పెట్టండి...

ఊరి పెద్దగా ఉండవలసిన వ్యక్తి చేతబడి లాంటి వాటిని నమ్మొచ్చా?? వాటి గురించి ప్రజల్లో తప్పుడు ఆలోచన వచ్చే విధంగా మాట్లాడవచ్చా??? చేతబడి మీద అతనికి సంపూర్ణ సమాచారము ఏదైనా ఉందా?? తాను ఏదైనా నమ్మితే అది నిజమవుతుందా???

పరువే ప్రాణంగా బ్రతుకుతున్న అచ్చిరాజులు లాంటి వ్యక్తి మీద అభాండాలు వేసి అతను ఆత్మహత్య చేసుకోనేలా ప్రేరేపించినా వారిని పెద్దలు అనవచ్చా?? దానిని అత్యహత్య అనకూడదు.... హత్య అనే అనాలి...

వాస్తవానికి వీళ్ళకి పరిపాలించే తెలివితేటలు లేవు.. కానీ ప్రజల తెలియనితనాన్ని అసరాగా తీసుకొని వీరు పెద్దలుగా చెలామణి ఆయిపోతున్నారు. గతములో 30 సం.లు ప్రెసిడెంటు గిరి వెలగబెట్టిన మా పెద్దతాత ఆ తర్వాత ఈ పదిహేనేళ్ళు వెలగబెట్టిన మిగతా పెద్ద కుటుంబాలల్లోని వ్యక్తులు ప్రెసిడెంటు గిరి వెలగబెట్టినప్పుడు ఇలాంటి చర్యలు ఒక్కటీ జరగలేదు.....

మా పెద్ద తాత పోయిన తర్వాత మా తాతయ్యని నిలబడమంటే, నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పి, తన ఇంట్లో వారెవరిని కూడా రాజకీయాల్లోకి పంపలేదు. అలాగే మిగతా కుటుంబాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకొని బయటకు వెళ్ళిపోయారు. చదువుకున్న వారెవరికీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేది ఉండడం లేదు. వీటిని అసరగా తీసుకొని ఊరిలో ఇలాంటి చీడపురుగులు రాజ్యమేలుతున్నాయి.

ఇప్పుడనిపిస్తుంది నాకు... ఊరిలో రాజకీయాలు మనకెందుకు అనుకోకూడదని.... 

కానీ ఉద్యోగాల రీత్యా బయటకు వచ్చేసిన తర్వాత వేరే ఏమి చేయలేని పరిస్దితి....

ఈసారి ఇంజనీరింగు విద్యనభ్యసించిన ఒక వ్యక్తి ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడుతున్నారు.. ఆయన చదువుకున్న వ్యక్తిగా నా ఓటుని ఆయనకు వేసి, ఈ సారి నా ఓటుని తప్పకుండా వినియెగించుకోవలనుకుంటున్నాను....

ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఓటు హక్కు వినియెగించుకోలేదు....

కేవలం అచ్చిరాజులుకు జరిగినట్టు వేరేవరికి జరగకూడదు అన్న తలంపుతో........

Thursday 4 July 2013

రాబోయే ఐదేళ్ళ భవిషత్తు ముఖచిత్రం మన చేతుల్లోనే....


 
 
ఆవును. పంచాయితి ఎన్నికల నగరా మోగింది. రాబోయే ఐదేళ్ళ మన ఊరి భవిష్యత్తు ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. మనకి ఎలా కావాలంటే, ఎవరికి కావాలంటే వారికి పట్టం కట్టొచ్చు.  ఇప్పటి వరకు మనకి ఇబ్బంది కల్గించిన అనేక అంశాల్లో ప్రభుత్వ వైపల్యాలను, వాటి పని తీరును విమర్శించుకుంటున్నాము. సదరు నడుస్తున్న ప్రభుత్వమును ఐదేళ్ళ క్రితం మనమే ఎన్నుకున్నాం. అంటే మనచే ఎన్నుకోబడిన నాయకులే ప్రజల బాగోగులు పట్టించుకోకుండా విమర్శల పాలవుతున్నారు.

ఎక్కడైనా, ఏదైనా సందర్బంలో ప్రభుత్వ వైపల్యం కనబడినప్పుడు, ప్రభుత్వ పనితీరు మీద అసహనం వెళ్ళగక్కుతాము.  వీరు ఇలాగేనా చేస్తారు అని ఈసడించుకుంటాము. కానీ సదరు ప్రభుత్వంను ఎన్నికవడంలో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది.  వాళ్ళను ఎన్నుకొనే సందర్బంలో అతని యొక్క యెగ్యత, పనితీరు, నిజాయితీ, పరిపాలనా దక్షత వంటి లక్షణాలను చూడకుండా కేవలం పార్టి, మతం, కులం, వర్గం, బంధుత్వం ఆధారంగా ఎన్నుకోవడం వలనే నేడు ఇలాంటి దుస్దితి ఏర్పడిందని అందరికి తెలుసు...

రేపు ఏదైనా ప్రజా వ్యతిరేక చర్యలు ప్రభుత్వము తీసుకున్నప్పుడు, దానిని విమర్శించే ముందు ఎన్నికల్లో మనము సరయిన అభ్యర్దికి ఓటు వేసామా లేదా అనేది అత్మపరిశీలన చేసుకోవాలి. అంటే రేపు మనం ఎదుర్కోబోయే ఎటువంటి పరిణామాలకైనా మనదే భాధ్యత అనేది గుర్తెరగలి...

మరి కొద్ది రోజుల్లో పంచాయితీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మనము తీసుకోబోయే నిర్ణయమును బట్టే మన భవిష్యత్తు ఆధారపడి యుంటుందని అందరూ గుర్తుంచుకోవాలి.

పంచాయితీ ఎన్నికల్లో పోటి చేయాలంటే ఒక్కొ అభ్యర్ది రమారమి ఆరు నుండి ఎనిమిది లక్షలు ఖర్చు చేయవలసియుంటుంది. ఆ ఖర్చు ఎందుకంటే ఎన్నికల ప్రచార కాలములో కార్యకర్తలకు మందు, బిర్యానీ సప్లయి చేయడానికి, ఓటర్లకు రకరకాల బహుమతులు, ఓట్లను కొనడం వంటి కోసం ఖచ్చితంగా ఖర్చు చేస్తున్నాయి.

ఒక్క అభ్యర్ది తన సొంత డబ్బు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి పంచాయితి ఎన్నికల్లో గెలుపొంది, తిరిగి తాను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకోకుండా ఉండగలడా?(రాబట్టుకోక పోతే అతను దివాలా తీస్తాడు).  అలాంటి వ్యక్తి నుండి ఊరి బాగు కోసం మనం ఏమి ఆశించగలము?

అలాగని డబ్బులు ఖర్చు చేయకుండా గెలవగలడని ఊహించగలమా?

అస్సలు ఊహించలేము.. ఎందుకు? డబ్బు ఖర్చు పెట్టలేకపోతే జనాలు అతడిని పట్టించుకోనేకోరు. అంటే ఇక్కడ మనము ఏమి చేస్తున్నాము? డబ్బు ఖర్చు పెట్టగలిగే వాడినే ప్రొత్సాహిస్తున్నాము. అలాంటి వాడు తాను ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి సంపాదించుకోడానికే చూస్తాడు. అంటే గ్రామాభివృద్ధికి అవసరమైన ఎనిమిది లక్షలు సదరు అభ్యర్ది జేబులోకి పోవడం గ్యారంటీ.. అది అంతటితో అగితే సరి.. కాని ఆగదు కదా.... ఖర్చు పెట్టిన ఎనిమిది లక్షలు తిరిగి సంపాదించుకోవడంతో ఆగకుండా అది అలా పరిగెడుతునే ఉంటుంది... అదంతా గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టవలసిన సొమ్మే కదా.......

అంతే కాదు ఆ మధ్యన కొన్ని గ్రామ పంచాయితీల్లో సర్పంచ్ పదవులను వేలం వేసారని విన్నాను. వేలం ద్వారా వచ్చిన డబ్బును పంచాయితి అభివృద్ధికి ఉపయెగిస్తారని అంటున్నారు. నిజానికి అలా జరిగితే మంచిదే. కానీ సర్పంచ్ పదవిని వేలంలో కొనుక్కొన్న అభ్యర్ది, ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సర్పంచ్ పదవిని ఎందుకు అంతంత డబ్బు తగలెట్టి కొంటాడు? ఒక సారి ఆలోచించిండి... ఇలాంటి చర్యలు మనకి ఏ  విధంగా ఉపయెగపడతాయో....

అటువంటప్పుడు మన ఓట్లతో గెలిచిన వ్యక్తి చివరకు ఊరికి ఏమి చేయలేదు అని తిట్టుకోవడం వలన ప్రయెజనం ఏముంది? ఒకప్పటి మీద నేడు పల్లెల్లో కూడా అక్షరాక్షత శాతం బాగా పెరిగింది. ఓటర్లు కూడా అందరూ చదువుకున్నోల్లే ఆయివున్నారు. వారందరూ అలోచించి సరైన అభ్యర్దిని ఎన్నుకుంటే స్వాత్రంత్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాతైనా అభివృద్దిలో కొద్దిగా ముందుకైనా వెళ్ళగలము...

లేదంటే గత 56 సం.ల భారతదేశ చరిత్రలో రాబోయే ఐదేళ్ళ కాలమును కలిపేయాల్సియుంటుంది.....

చదువుకున్న పల్లె యువతల్లారా అలోచించండీ... భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.... అభివృద్ధి జరిగితే దేశం ఎలా ముందుకెళ్తుందో మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు... ముందుగా మీరు స్వార్దం వీడీ, బంధుప్రీతి, కుల ప్రీతి, పార్టి పిచ్చి వదిలి సరయిన అభ్యర్దిలను ప్రొత్సాహించండి......

మీ ఓట్లను డబ్బులకు కాని మరే ఇతర ప్రలోభాలకు గాని మార్పిడి చేసుకోకండి....

మీ ఓట్లను కేవలం అభివృద్ధి చేయగలగేవారికి మాత్రం తాకట్టు పెట్టండి....

ప్రలోభం వలన కేవలం తాత్కాలిక ఆనందం మాత్రమే కల్గుతుంది. అదే సరయిన నిర్ణయం వలన దీర్ఘకాలిక ఆనందం మన వశం అవుతుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చిన వారిమి ఆవుతాము....

ఈ సారి మా ఊరిలో చదువుకున్న వ్యక్తులు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారు.  వాళ్ళలో మంచి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఓటు వేయాలని అనుకుంటున్నాను. అంతే కాదు, రేపటి అభివృద్ధి చేసే విషయములో ముందస్తుగా అతని వద్ద హమీ తీసుకుంటాను. అలాగే మీరందరు ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర అభివృద్ధి చేస్తామని హమీ తీసుకొండి.

చివరగా ఒక మాట... మనవల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు....

అందుకనే మంచి వ్యక్తులకు ఓటు వేయకపోయినా పర్లేదు కాని, చెడు వ్యక్తులకు మాత్రం ఓటు వేయకండి....

 

Tuesday 2 July 2013

సదా మీ సేవలో... మీ ప్రియమైన ముఖ్యమంత్రి...


 
కేంద్ర హోమ్ శాఖ నుండి ఫోన్ రింగయ్యింది కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు ఆఫీసునకు.....

 

ఆ కాల్ అందుకున్న సెక్రటరీ వెంటనే కికురె (కిరణ్ కుమార్ రెడ్డి) వద్దకు వెళ్ళి కాల్ సారాంశం చెప్పగానే మన కికురె గారి కళ్ళు ఇంతలు ఆయినాయి... అదెలా సాధ్యం అనుకుంటూ బుర్ర బద్దలుకొట్టుకున్నాడు... నాకు తెలియకుండానే పరిపాలనలో ఎవరైనా జోక్యం చేసుకొని కధనం నడుపుతున్నారా అన్న అనుమానం.....

 

వెంటనే కికురే ఒక నిర్ణయానికి వచ్చాడు... కేంద్ర హోమ్ శాఖ నుండి వచ్చిన ఫోన్ కాల్ యొక్క విషయమై వెంటనే రిపోర్టు కావాలని తన నమ్మకస్దులకు పురమాయించాడు...

 

క్యాంపు హౌస్ లో తన గదిలో కూర్చుని అలోచించసాగాడు. సెక్రటరీ చెప్పిన మాటలను మరోసారి మననం చేసుకున్నాడు కికురె...

 

హోమ్ శాఖ ఫోన్ సారాంశం..

“ గత సం.ము కాలమునకు పైగా ఆంధ్రప్రదేశ్ లో దొంగతనాలు, దోపిడిలు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టి దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఘనత సాధించినందుకు ఉత్తమ భద్రత ఆవార్డ్ ని మన రాష్ట్రానికి ప్రకటించారు. దానిని అమోరికా అధ్యక్షుడు చేతుల మీదుగా అందుకోవలసినదిగా తెలియజేసియున్నారు”

 

తన ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు కికురె... తానెప్పుడూ రాష్ట్రంలో దోపిడి దొంగల నిరోధానికి మరియు భద్రత విషయమై పోలిసు బాసుతో కూర్చుని ఎటువంటి ఆదేశములు జారీ చేసినట్టుగా గుర్తు లేదు. కనీసం దాని గురించి ఆలోచన కూడా నాకు వచ్చియుండలేదు అనుకున్నాడు!

లేక తాను చీటికిమాటికి ఢిల్లీకి, హైదరబాదుకు కాలి కాలిన పిల్లిలా తిరుగుతుంటే, దానిని అదనుగా తీసుకొని తనకి తెలియకుండా ఉప ముఖ్యమంత్రి పోలిసు బాసుతో కుమ్మక్కు ఆయి చాటుమాటుగా ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్నారా అన్న అనుమానం బయలుదేరి, వెన్నులో కొద్దిగా చలి పుట్టింది.. ఇది చివరకు తన పదవికే ఎసరు పెట్టేలా ఉందనుకొని, తాను పంపిన నమ్మకస్దుడు తెచ్చే సమాచారం కోసం అతృతగా ఎదురుచూడసాగాడు.....

 

పొద్దు పోయాక రాత్రి ఎప్పుడో 11 దాటుతుండగా సదరు నమ్మకస్దుడు వచ్చాడు. అతృతగా అతను ఏమి చెప్తాడో అని అవయువలన్నీ అన్ని అలర్ట్ లో పెట్టుకొని రెడీగా ఉన్నాడు కికురె.

 

అతని ముఖం చూస్తే అందోళనగా ఉన్నట్టుగా కనబడడం లేదు.... పైగా కొద్దిగా వెటకారం లాంటిదేదో ముఖంలో కనబడుతుండేసరికి కొద్దిగా అసహనం ఫీలయ్యాడు కికురె... ఆయినా అవసరం తనది కనుక మిన్నకుండిపోయాడు....

 

చెప్పవయ్యా బాబూ అని అడిగాడు కాదు అరిచాడు...

 

“ అయ్యా, మీరనుకొన్నట్టు తెర వెనకాల మీకు తెలియకుండా ఏమి జరిగిపోవట్లేదు!” తాపీగా సమాధానమిచ్చాడు...

 

అలా ఆయితే మన రాష్ట్రంలో ఒక్క సారిగా దొంగతనాలు ఎందుకు తగ్గుముఖం పట్టాయి! అసహనంగా అడిగాడు కికురె....

 

“అదా సారు,, ఏమి లేదు సారు... వాతావరణ శాఖ వాడు వర్షం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పడదో చెప్పలేరన్నట్టుగా తమరు రాష్ట్రంలో  కరెంటు కోతలు ప్రకటించడంతో, అది కూడా రాత్రుళ్ళు సమయ, సందర్బాలు లేకుండా కరెంటు తీసేయడంతో నిద్రలు పట్టక, ఇళ్ళలో ఉండలేక జనాలు రోడ్ల మీద ఆటలు అడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటున్నారట... ఇలా జనాలు మెలకువగా ఉంటే దొంగలు దోపిడిలు చేయడానికి ఎలా వెళ్తారు. అందుకనే రాష్ట్రంలో మీ కరెంటు కోతలు పుణ్యమాని జనాలు నిద్రలు మానుకొని మెలకువగా ఉండేసరికి ఒక్కసారిగా దోపిడిలు శాతం తగ్గిపోయింది!! అది తెలియని కేంద్రం వోడు అదంతా మీ ఘనత అనుకొని మీకు అవార్డ్ ప్రకటించి యుంటారు” అని తేల్చేశాడు....

 

కికురె బుర్రలోంచి ఆలోచనలు తన్నుకుంటు వస్తున్నాయి.... క్లారిటీ రావడమే తరువాయి అన్నట్టుగా ఉంది ఆయన ముఖం....

 

వెంటనే ఛీప్ సెక్రటరీకి ఫోన్ చేసాడు... కరెంటు కోతల పధకానికి చట్టబద్దత కల్పించడానికి అవనసరమైన విధివిధానాలు రూపొందించి రేపటికి తన టేబుల్ మీద ఉండాలని అక్కడక్కడే ఆదేశాలు జారీ చేసిపడేశాడు కికురె....

 

తర్వాత తన గదిలోకి పోయి హాయిగా పడుకున్నాడు.....

 

అదే సమయంలోనే  రాష్ట్రంలో ప్రజలు కరెంటు లేక  జనాలు నిద్దరోవక ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ గడిపేస్తున్నారు...

 

దోపిడి దొంగలు ఇక ఇక్కడ గిట్టుబాటు కాక వేరే రాష్ట్రాలకు వలస పోయారు....