Friday 28 December 2012

మాటలు రావడం లేదు..

సింగపూర్ లో చికిత్స పొందుతున్న మన సహోదరి
సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళిపోయింది......

తనకు ఇంకా బ్రతకాలని ఉన్నప్పట్టికి, దేవుడు
తనకి ఇది సరయిన స్దలం కాదని భావించి,
తనతో పాటుగా తీసుకెళ్ళిపోయాడు...

ఇక ఏ రాక్షసుడు తనను దరిచేరలేనంతగా
దూరంగా వెళ్ళిపోయింది....

జరిగిన అన్యాయం గురించి కించిత్ కూడా
విచారం వ్యక్తం చేయలేదు సరికదా..
మద్దతుగా వచ్చిన మహిళలు సింగారించుకొని
వచ్చారని ఒకడు,, అర్ద్దరాత్రి బయటకు వెళ్ళడం
ఆ అమ్మాయి తప్పే అని చెప్పేవాడింకొకడు....

ఇలాంటి వాళ్ళు పాలిస్తున్న దేశములో
ఎవరైనా సురక్షితంగా ఉండగలమని భావించగలమా...

దేవుడు భావించలేదు... అందుకే తనతో
తీసుకొనివెళ్ళిపోయాడు.....

నీ అత్మకి ఆ పై లోకంలో శాంతి కలగాలని
అందరూ కోరుకుంటున్నారు...

Thursday 27 December 2012

ప్రశ్నించే కొత్తతరం...

ఈ మధ్య ఆఫీసులో చాలా బిజీగా ఉండడం వలన, మరియు బయట కూడా సరయిన ఖాళీగా లేకపోవడం వల్ల ఇదివరకులా బ్లాగింగ్ చేయడానికి కుదరడం లేదు.
ఖాళీ దొరికినప్పుడు వ్రాద్దామంటే ఏమి తట్టడం లేదు.. కానీ ఈ మధ్య చాలా విషయాల మీద వ్రాద్దామని అనుకున్నా... కాని దేని మీద రాయడానికి కుదరడం లేదు...
ఢిల్లీ విద్యార్దిని రేప్ ఘటన, నరేంద్ర మోడీ విజయం, ఏపిపిఎస్సి అవినీతి భాగోతం ఇంకా చాలా విషయాల మీద రాద్దామని అనుకొన్నా.. కాని రాయలేకపోయా..
కాని ఢిల్లీలో విద్యార్దిని మానభంగంపై ఢిల్లీలో వెల్లువెత్తిన నయా యువతరం నిరసన చూసి రాయకుండా ఉండలేకపోతున్నా... నిజానికి ఇది జరిగి వారం రోజులయింది... కానీ లేటుగా ఆయిన నా అభిప్రాయాలు మీతో పంచుకోవలనిపించింది...

చాలా రోజుల క్రిందట, నా రూమ్మేట్ తో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాను.
ప్రపంచంలో ఉన్న అనేక విషయాలు గురించి చర్చించుకుంటున్నాము. అందులో పనికి వచ్చేవి, పనికిరానివి ఉన్నాయి..

ఈజిప్టులో విప్లవం, లిబియాలో విప్లవం దరిమిలా నియంతలు కుప్పకూలడం...గురించి టాపిక్ వచ్చింది..
మన దేశంలో రాజకీయనాయకులు విచ్చలవిడి అవినీతి చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడలేదేంటి అని అడిగా.... ఇది నిజంగా మన వ్యవస్దలో ఉన్న లోపము కదా అని కూడా అడిగాను..

దానికి మా రూమ్మేట్ చిన్నగా నవ్వి, ఏదైనా సమస్య మితిమీరితే ప్రజలు ఆలోచనసరళి మారుతుంది, తద్వార వ్యవస్ద తనంతతానుగా మారుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టడం తప్ప ఏమి చేయలేము అని అన్నాడు. అంతే కాదు... ఒకప్పుడు ఎమ్.ఎల్.ఎ., గాని ఎమ్.పి., గాని బయటకు వస్తే దారంతట ఉన్న ప్రజలు గౌరవసూచకంగా నిలబడి విష్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవడూ పట్టించుకోవడం లేదు కదా...

ఆ విధంగా రాజకీయ నాయకులకు ప్రజల మీద గౌరవం తగ్గినప్పుడు, ప్రజలు కూడా వారి ఉనికిని మర్చిపోతారు. అంటే వ్యవస్ద్ద దానికదే మారుతుంది అని అన్నాడు....

ప్రభుత్వాలు ప్రజలను ఏనాడో పట్టించుకోవడం మానేసాయి. అలాగే మెజారిటీ ప్రజలు ప్రభుత్వాన్ని పట్టించుకోవడం మానేసారు... కానీ ఏదోక రోజు వారిలో అసహనం ఒక్కసారే పుట్టుకొస్తుంది... ప్రజల్లో అసహనం వచ్చిన నాడు వ్యవస్ద ఆటోమేటిక్ గా దానంతట అదే మారిపోతుంది అని అన్నాడు.
అంటే ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మిగతావన్నీ అటోమేటిక్ గా అవే మారిపోతాయి అని చెప్పాడు.


అంటే ఇప్పటికప్పుడు మన వ్యవస్ద బాగుపడే మార్గం లేదా? అని అడిగాను...

ప్రశ్నించే వారు ఉన్నప్పుడు మారుతుంది అన్నాడు...


మొన్న ఢిల్లీలో వెల్లువెత్తిన నయా యువతరాన్ని చూసి అది నిజమేనేమో అనిపించింది.... మొన్నటికి మొన్న నా బ్లాగ్ లో తొంభై శాతం మంది భారతీయులు ఇడియట్సే అన్న కట్టూ వ్యాఖ్యలను సమర్దిస్తూ రాసాను. కాని ఢిల్లీలో తమ తోటి భారతీయురాలిపై జరిగిన ఆకృత్యానికి స్పందించిన యువతరాన్ని చూసి అది కరెక్ట్ కాదెమో అనిపించింది....
SHAKING SOCIETY’S CONSCIENCE: It is important for women to raise their collective voice, but it should be for all women and all victims of the violence embedded in our society. Photo: S. R. Raghunathan
ఏదోక రోజు ప్రజల్లో అసహనం వచ్చిన రోజు, వ్యవస్దలో అటోమేటిక్ గా మార్పు అదే వస్తుంది అని చెప్పిన నా రూమ్మేట్ మాట అక్షరసత్యం అనిపించింది.

తొలిరోజు కొంత మందితో ప్రారంభమయిన నిరసన, గంటలు, రోజులు గడిచేసరికి వేలు, లక్షలు యువత నిరసనలో పాల్గోన్నారు.. వీరంతా ఎవరికి వారు స్వచ్చందంగా వచ్చినవారే...

వీరి వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు... ఒక నాయకత్వం లేదు.. ఒక ప్లాన్ లేదు... కానీ వారందరూ ప్రశ్నించడానికి వచ్చారు... అంతే కాదు భాదితురాలికి అండగా నిరసన తెలిపారు. అది కూడా శాంతియుత పద్దతిలో.... భారతదేశంలో యువత అనిశ్చితిలో ఉందని ఎవరయినా అనగలరా ఈ జనసముద్రం చూసి?....

ఇంతకు ముందు పలుమార్లు ఢిల్లీలో ఇలాంటి అకృత్యాలు చాలానే జరిగినప్పటికీ, ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు శూన్యం... ప్రజలు కూడా భాదపడ్డారు తప్పితే బయటపడలేదు. ప్రభుత్వాలు పట్టించుకోవడమే మానివేసాయి...

ఇప్పుడయినా, ఢిల్లీ యువత రోడ్డెక్కపోయి ఉంటే, ఈ అకృత్యం కూడా పలు అకృత్యాల్లో భాగంగా రెండో రోజుకే తెరమరుగు ఆయిపోయేది.

కానీ ప్రశ్నించడానికి కొత్త తరం పుట్టుకొచ్చింది... ఒక్కడే ఆయితే వాడు గొంతు కొంత దూరం మాత్రమే వినబడుతుంది... అదే కొన్ని లక్షలు గొంతుకలు ఒక్క సారే వెలుగెత్తితే, అది ప్రభుత్వ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది....

ఎస్... ప్రశ్నించే పని మనం చేయనప్పుడూ, అభివృద్ది గురించి లేదా యితర అంశాలు గురించి మాట్లాడే హక్కు లేదు మనకు.....

జరిగిన అరాచకంపై యువతరం ప్రశ్నించిన  తీరుకు, చూపించిన తెగువకు ప్రభుత్వం మోకాళ్ళ మీద దిగజారుకుంటూ వచ్చింది... అది ప్రశ్నించడంలో ఉన్న పవర్.....

నేను చాలా గర్వంగా ఫీల్ ఆవుతున్నాను... రాష్ట్రపతి భవన్ వద్ద తోటి భారతీయురాలుకి జరిగిన ఆకృత్యంపై గొంతెత్తిన నయాయువతరానికి నా జోహర్లు... వారే కనుక గొంతెత్తి ఉండకపోతే, ఈ అంశం రెండు రోజులకే కనుమరుగు ఆయిపోయి ఉండేది... వారు ఇచ్చిన దెబ్బకి ప్రభుత్వం చట్టం బలోపతం కావడానికి తీసుకోవలసిన చర్యలకు ఉపక్రమించింది...

రేపైనా ఆడపిల్ల భద్రంగా ఉంటుంది కదా.....

మనం ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజు, వ్యవస్ద ఆటోమేటిక్ గా అదే మారుతుంది....
ఇది నిజం....

ఈ యువత నిరసనలపై కొంత మంది మేధావులనబడే నాయకులు (షిండే, బొత్స) కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసారు. అది వారి సంస్కారానికి వదిలేద్దాం... ఎందుకంటే ప్రజల్లో వారికున్న విలువను వారే పతనం చేసుకొంటున్నారు కాబట్టి.....



Tuesday 18 December 2012

మరి మిగతా ఆటగాళ్ల మాటేంటి?

సచిన్ కి ఆడాలని  ఉన్నప్పుడు అతనిని
రిటైర్ ఆవమని అడగడం ఉత్తమం కాదు.
తనకి ఆడాలని కోరిక ఉన్నప్పుడు మనం
అడ్డుకోవడం భావ్యం కాదు అని విశ్వనాధన్
ఆనంద్ పాటుగా చాలా మంది కామెంటిచ్చారు...

మరి ఇప్పటికీ కూడా ఆడగలిగే సత్తా మాత్రమే కాదు,
నిలబడి గెలిపించే సత్తా ఉన్న రాహుల్ ద్రావిడ్,
వి.వి.ఎస్.లక్ష్మణ్ విషయములో ఎందుకు చెప్పలేదు...

ఆడాలన్న కోరిక ఉండడానికి, తన వల్ల దేశానికి
గల ఉపయోగానికి  మధ్య ఉన్నతేడాని తెలుసుకోవాలి.
ఆడాలన్న కోరిక ఉన్నంతకాలం ఆటగాళ్ళను ఆడిస్తే
ఇక ఎవరూ రిటైర్ కానవసరం లేదు...

సచిన్ లెజెండర్ ప్లేయర్... ఇది ఎవరూ కాదనలేని
వాస్తవం.. కాని అది టీమిండియాకి ఉపయెగపడినంత
వరకే.... ఆటగాడు తన వ్యక్తిగత ప్రదర్శన దేశ క్రికెట్ కి
ఉపయెగపడినంత వరకే విలువుంటుంది.....

అందుకే రికి పాంటింగ్ కూడా సచిన్ కన్నా లారానే ఉత్తమ
క్రికెటర్ అని కితాబిచ్చాడు. ఎందుకంటే లారా ఆట
టీమ్ యొక్క లక్ష్యాలను బట్టి సాగుతుంది. క్రికెట్ అడడం
టీమ్ యొక్క లక్ష్యాలను బట్టి సాగాలే కాని తమ లక్ష్యాల బట్టి
సాగకూడదు.....


తాలిబాన్ల రాజ్యాంగం బెటరేమో

నిన్న న్యూఢిల్లీలో పారామెడికల్ విద్యార్ది పై
 జరిగిన అకృత్యానికి కారణమయిన కీచకులకు
తాలిబాన్ లు అమలుపరచిన శిక్షని అమలుపరిస్తే
బాగుంటుందేమో....

పది మంది ముందు తప్పు చేసిన నేరస్దులను
తాలిబాన్లు పబ్లిక్ గా దయదక్షిణాలు లేకుండా అతి
కిరాతకంగా చంపినప్పుడు అయ్యో పాపం అని
అనిపించింది కాని...

నిజానికి దేశములో మరే ఆడపిల్లకి ఇంకొకసారి
ఇలాంటి దారుణం జరగకూడదంటే, అలాంటి
కీచకుల విషయములో తాలిబాన్ల  రాజ్యాంగం
 అమలు చేయడమే ఉత్తమం ఏమో.......

Sunday 9 December 2012

భారతీయ “ఇడియట్స్”..


భారతీయుల్లో తొంభై శాతం మంది ఇడియట్స్ అని వ్యాఖ్యానించిన మార్కండేయ కట్టూ వ్యాఖ్యలు వింటే నాకు కరెక్టే అనిపించింది. అంతే కాకుండా వీరిని మతం లేదా కులం ప్రతిపాదికన చాలా ఈజీగా ప్రభావితం చేయవచ్చునని  అన్న మాటల్లో యదార్దం ఉంది. వీరిలో ఉన్నత వర్గాలు, విద్యావంతులు కూడా ఉండడం చాలా విచారకరం. చాలా మంది ప్రజలు లేదా విద్యావంతులుకు పార్లమెంటు చేసే చట్టాలు గురించి కనీస అవగాహన లేక సమాచారం లేనప్పటికీ, ప్రభుత్వాలు లేదా పార్టీలు చేసే మతపరమైన ప్రకటనలకు మాత్రం చాలా తొందరగా ప్రభావితం కావడం మన వ్యవస్దలో ఉన్న లోపం. అంతే కాకుండా తాము ఎన్నుకునే నాయకులను కూడా మత, కుల ప్రతిపాదకన ఎన్నుకోవడం ఏ విధముగా అనుకోవాలి. పైగా సదరు మత, కుల ప్రతిపాదకన ఎన్నిక కాబడిన నాయకులు దేశానికి ఏమి చేసారన్న దాని కన్నా, తమకు ఏమి చేసారన్న దానిమీదే దృష్టి ఉండడం ఇడియట్స్ లక్షణాలు కాకపోతే ఏమనాలి? న్యూడిల్లీలో మత ఘర్షణలు రేకేత్తించడానికి ఒక రెండు వేలు రూపాయలు చాలు. దానితో ప్రజల మధ్య ఉద్రికత్తలు సృష్టించవచ్చు. దానికి చేయవలసినదల్లా ఏదైన ఒక మత స్దలంను అపవిత్రం చేయడం అన్న ఖట్టూ వ్యాఖ్యలు చూస్తే అందులో వంద శాతం నిజముందని చెప్పవచ్చు. ముందుగా ప్రజలు వివేకంతో ఆలోచించగలగాలి. ఆ రోజే వాస్తవానికి ఏమి జరుగుతుందన్నది గమనించగలరు. ఆ వివేకం నేటి విద్యావంతుల్లో కూడా కొరవడడం చాలా విచారకరం.