Tuesday 26 June 2012

Girls = Problems (Photo Comment)

ఈ అమ్మాయిలున్నారే.... పెద్ద తలనొప్పి రా బాబూ... అని నాలాంటి చాలా మంది అనుకోవడం సహజమే కదా.....

ఇవన్నీ పనికిమాలిన మాటలు అని కొట్టిపారేస్తారు కొంత మంది పెద్దలు........

పనికిమాలిన మాటలు అని కొట్టిపారేసే వాళ్ళకు అమ్మాయిలతో సమస్యలు ఎలా అనే దానిని క్రింది వివరిస్తున్నాను.
చూడండీ...




ఇప్పటికైనా ఒప్పుకుంటారా నేను చెప్పింది కరెక్టని......



పి.ఎస్: పై ఈక్వేషన్ ను సరాదకి రాసాను. అమ్మాయిలు లైట్ తీసుకొండి. నచ్చిన అబ్బాయిలు ఆనందించండి.





Sunday 24 June 2012

ఓ తండ్రి డైరీలో చివరి పేజి.....

చిన్నా!
అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి. దయచేసి నన్ను అర్దం చేసుకో!

 బట్టలు వేసుకోవడం కష్టం, తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతూంటుందది, కసురుకోకు.

అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను. అసహ్యించుకోకు.

 నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోరా, బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినే వాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను. విసుక్కోకు, స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టకు.

 నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించే వాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు. కీళ్ళ నొప్పులు నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు, నీకు నడక వచ్చేవరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను.

 అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా!

 ఏదో ఒక రోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను, అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్దం చేసుకో... ఈ వయసులో బతకాలని ఉండదు, కాని బతకక తప్పదు. ముసలికంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకొని కూర్చో, నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్న నేను అలాగే దగ్గరకు తీసుకొనేవాడిని. నువ్వలా తీసుకుంటే, ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతానురా....



                                                       RESPECT  YOUR  PARENTS


ఫేసుబుక్ లో నా స్నేహితుడు వాల్ మీద ఉన్న ఈ పోటో మరియు లేఖను యధాతదంగా పైన యివ్వడమైనది. చదవగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. పేరేంట్సుని సరిగా పట్టించుకోనని నేటి తరానికి ఈ లేఖ ఏమైనా మేలుకొలువు తీసుకురావచ్చునన్న ఉద్దేశంతో.......


వ్యవసాయం దండగేనా? (వాస్తవ చిత్రం)

పై చిత్రం మీలో చాలా మంది మొన్న వచ్చిన ఈనాడు పేపర్ లో చూసే ఉంటారు.

కరవు తెచ్చిన కొత్త కొలువు శీర్షికతో వచ్చిన ఆ కధనం చూస్తే ప్రస్తుత రైతు ఎంత దీనస్దితిలో ఉన్నాడో తెలుస్తుంది.

నేడు వ్యవసాయం ఏ విధముగాను గిట్టుబాటు కాక, అప్పటి వరకు ఎవరికి తాకట్టు పెట్టని అత్మాభిమానాన్ని సైతం వదులుకొని పట్టణాలకు వలస వచ్చి తమకు అప్పటి వరకు చేతగాని అనేక పనులు చేస్తూ బ్రతుకు యిడ్చుతున్న రైతన్నలు నేడు కొకొల్లలుగా ఉన్నారు మన రాష్ట్రంలో...

"వ్యవసాయం దండగ" అని ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు గారు అన్నారని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. పలు పర్యాయములు ఆరోపించి, తాను మాత్రం తమ పాలనలో రైతులకు ఎటువంటి దుస్దితి కలిగించరో తెలుసుకోవడానికి ఆయన ఇంకా బ్రతికి ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది..

నిజంగా "వ్యవసాయం దండగ" అని చంద్రబాబు గారు అన్నారో, లేదో కాని నిజానికి ఆ మాట అక్షరసత్యం రైతుల పాలిట.

ప్రకృతి సహకారం లేనప్పుడు ప్రభుత్వాలు మాత్రం ఏమి చేస్తాయిలే అని తీసిపారేయడానికి లేదు ఈ నాటి రైతు దుస్దితికి....

కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలున్నట్టు, ఈ నాటి రైతు దుస్దితికి ప్రకృతి సహకారం లేకపోవడం ఒక్కటే కారణం కాదు.

వ్యవసాయం పట్ల ప్రభుత్వ విధానం, ఎరువుల కంపెనీలు ఇష్టారాజ్యం, కరెంటు కష్టాలు, నకిలీ విత్తనాలు, మద్దతు ధర లేకపోవడం వంటి అనేకనేక కారణాలతో నేడు వ్యవసాయం చేయడమనేది నిజంగానే శుద్ద దండగ....


గాడిమొగ రిఫైనరీ నుండి వెలికి తీసే గ్యాస్ ధర నిర్ణయించుకోవడానికి రిలయన్స్ కంపెనీకి అనుమతివ్వడంలో తప్పులేదు....
జనాల జీవితాలతో చెలగాటమాడుతూ ఇష్టానుసరముగా నకిలీ మందులను వార్కి నచ్చిన ధరలకు అమ్ముకోవడానికి మందుల కంపెనీలకు అనుమతివ్వడంలో తప్పు లేదు........
తాము తయారు చేస్తున్న వస్తువులకు ధర నిర్ణయించుకొనే స్వేచ్చ ఆయా బడా కంపెనీలకు అనుమతివ్వడంలో తప్పు లేదు........
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుదల పేరు చెప్పి దేశములో పెట్రోలు రేటు పెంచడానికి అనుమతివ్వడంలో తప్పు లేదు....


కాని రైతన్న, తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడం మాత్రం తప్పు మన ప్రభుత్వాలు దృష్టిలో.....


అన్ని పైపులా నుండి రైతన్న మీద దాడి చేస్తే, పాపం రైతన్న మాత్రం ఎంత వరకు ఓర్చుకోగలడు....


అందుకే వ్యవసాయంను శాశ్వతంగా వదిలివేసే దిశగా మెజారిటి రైతులు బయలుదేరుతున్నారు......

ఇంకొక ఇరవై సం.రాల తర్వాత దేశములో అసలు వ్యవసాయం చేసే వారు లేనప్పుడు, పంట ఉత్పత్తిలు పూర్తి స్దాయిలో పడిపోయినపుడు, అప్పుడు తెలుస్తుంది రైతన్న విలువ.... ఖచ్చితంగా తెలుస్తుంది తాము ఎంత తప్పు చేశామో.....

నాలాంటి వాళ్ళు ఏనాడో వదిలేసారు వ్యవసాయాన్ని.... రేపన్న రోజున్న మాకున పొలంలో మాకు మాత్రమే సరిపోయేలా వరి మరియు యితర కూరగాయలు పండించుకొని బ్రతుకుతాము. మిగతా రైతన్నలు కూడా అలా అలోచించే రోజులు ఎంతో దూరంలో లేవు...
 

Wednesday 20 June 2012

గోదారోడి రంగులరాట్నం

ఆ రోజు వచ్చిందంటే చాలు, ముఖ్యమైన పనులు చేయవలసింది ఏదో ఉందీవేళ అని మనసులో అనుకుంటా నేను...

ఎందుకంటే, ఆ రోజు స్వాతి వీక్లీ వస్తుంది కాబట్టి... అదేంటీ మనోడు స్వాతి లాంటి పుస్తకాలు కూడా చదువుతాడా అని అనుకోకండి..

ఎందుకంటే నేను చదువుతాను కాబట్టి..... కేవలం అందులో వచ్చే మా గోదారోడి నవల చదవడానికి చదువుతాను కాబట్టి..

ఆవునండీ... పదహారణాల మా గోదారి మనిషి ఆయిన వంశీ గారు వ్రాసే రంగుల రాట్నం సీరియల్ కోసం...
వంశీ గారు స్వాతి వీక్లిలో ప్రతి వారం వ్రాస్తున్న రంగుల రాట్నం సీరియల్ చదివితే ఎవరైనా ఇదే మాట అంటారు ఖచ్చితంగా..

ఆ రాతల్లో నేచురలిటి చాలా క్యాజువల్ గా ఉంటుంది.. ఆయన చెప్పిందంతా నిజంగానే జరిగిందా అన్నట్టుగా ఉంటుంది...

ఆయన మనల్లి కోటిపల్లి తీర్దం కాడ మొదలెట్టి రామచంద్రపురం, మండపేట, రాజమండ్రి మీదుగా గోదావరి లంకల్లోకి తీసుకెళ్ళడం చానా మంచి అనుభూతినిస్తుందండీ.....

ప్రస్తుతం నడుస్తున్న రామరాజు కాడ్నించి, ఆడి నాయన ఆయిన వీర్రాజును, ఆడి నాయన, సోమరాజు, ఆడి నాయన సత్తిరాజు వరకు వెనకటికి ఆయిదు తరాల కధను ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎక్కడా మనకు అలుపు రాకుండా గోదారి గట్టంతా గిరా గిరా త్రిప్పడం వంశీ కి కాక ఇక ఎవరికి సాధ్యం కాదండీ.... అందులోనే ముంగండ శాస్త్రి గారిని, కడియం నాయుడు గారిని, గోదారి లంకలో ఇసుక పాటలు పాడడానికి బొబ్బిలి నుండి వచ్చిన వెలమదొర కృష్ణమ నాయుడును ఇలా అందరిని అందులోనే చూపేస్తారు.

ముఖ్యముగా కోటిపల్లి తీర్దం చూడని వారెవరైన ఉంటే రంగుల రాట్నం సీరియల్ చదివితే, మీకు ఆ తీర్దం మొత్తం కళ్ళ ముందు చూపించేత్తారు. ఎక్కడో స్వాతంత్రం వచ్చిన దగ్గరి నుండి మొదలెట్టి నేటికి అయిదు తరాల కాలములో వచ్చిన మార్పులను ఆయన తన కధలో అంతర్ణీనంగా చెప్పిన విధానము చాలా అద్బుతంగా ఉంటుంది.

నాకు తెల్సి ఒక చిన్న సబ్జెక్టు తీసుకొని, దాన్ని ఎంత వరకు సాగదీయాలో అంత వరకు సాగదీసి మనల్ని పీడించే రచయితలనే చూసాము ఇప్పటి వరకు. అంటే దానర్దం మిగతా వారెవరు అంత బాగా రాయలేరని కాదు. కాని వారు రాసేవి అందరికి అర్ద్రం కాకపోవచ్చు అని.

కాని మన వంశీ రాసే కధలు ప్రతి సామాన్య జనానికి అర్ద్రమయ్యే రీతిలో చాలా సరళంగా వ్రాస్తారు. రంగుల రాట్నం చదివే ఏ పాఠకుడిని అడిగినా ఇదే విషయం చెప్తాడు.

పైగా రంగుల రాట్నం లో ఆయన కధను చాలా వేగంగా నడిపిస్తారు. ఒక సారి చెప్పిన కధ మరో రెండు వారాలు పూర్తయిసరికి ఉండదు. అంతలా ఉంటుంది ఆయన కధ చెప్పే తీరు.. అంతే కాదు కధతో పాటుగా మనల్లి కూడా మొత్తము తిప్పేస్తారు.

వీలయితే మీరు చదవండి. ఆయన రాసే విధానం నా లాంటి చాలా మంది యువతకు అర్ద్రం కాకపోవచ్చు. కాని ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇకపోతే వంశీ గురించి మా ముందు తరం వార్కి చెప్పవలసినది ఏమి లేదనుకుంటా...

 

Saturday 16 June 2012

ఉచిత ప్రచారం- ఇమేజి- బోడి చిప్ప...

మనలో కొంత మంది జనాలు మరీ బొత్తిగా ఖాళీగా ఉండలేరు...

వారికి రోజూ ఏదో ఒక హట్ టాపిక్ ఉంటేనే కాని నిదరవబుద్దికాదు.....

అలాంటి వార్కి ఈ సంవత్సరమంతా మంచి కాలక్షేపం దొరికింది... మన జగన్ రూపంలో....

వై.ఎస్. గారు కాలం చేసినప్పటి నుండి, నిన్న మొన్నటి వరకు ఓదార్పు పుణ్యమాని కొంత మంది జనాలకు, తాము తిన్నది అరగదీసుకోవడానికి మంచి టాపిక్ దొరికింది...

దాన్ని మాత్రం ఎంత కాలం సాగదీసుకుంటారు... తినగా, తినగా పంచదార కూడా చేదెక్కుపోతుంది కదా.....

అలాగే దీని మీద బోర్ కొట్టేసింది అనుకునే వాళ్ళకు ఉప ఎన్నికలు రూపంలో మంచి మేత దొరికింది.....

వాళ్ళకు తోడు మీడియా.... రోజూ పొద్దున్న లేవగానే పేపర్ నిండా అదే వార్తలు.... నాలాంటి వాడికి భూతద్దం పెట్టుకొని వెతికినా వేరే తరహా వార్తలు మచ్చుకైనా కనబడేవి కావు... ఆయితే జగన్, లేపోతే అక్రమాస్తులు, లేపోతే అరెస్టులు............ అంతే... ఇక అంత కన్నా వేరేమి ఉండేవే కావు.

పాపం... కాలక్షేపం కావాలనుకొనే జనాలు మాత్రం ఏమి చేస్తారు?? వాళ్ళకు కూడా కాలం గడవడానికి ఏదోక చెత్త కావాలి కదా.... ఇక దాంతో చూసుకోవాలి, మొన్నటి పోలింగ్ వరకు మన వాళ్ళ మాటలు.......

జీవిత గమనంలో మనము ఒక్కరిమే ఉండలేము కదా.... ఏదోక సందర్బంలో ఎవరో ఒకరితో మాట్లాడాలి కదా...... అందుకని ఎవరిని కలవడానికి వెళ్ళినా ముందుగా బాగున్నావా!! అని ప్రారంభించి, జగన్ నిజంగానే తప్పు చేశాడంటావా? అని అడిగేవారు... నాకు దాని మీద సరయిన నాలెడ్జి లేదండీ అని తప్పుంచుకోవలనుకుంటే, వెంటనే మరి కాంగ్రెసొల్లు పరిస్దితేంటి అని అడిగేవాళ్ళే....

ఇంటికి వచ్చి ఏ చానల్ పెట్టినా అదే రోద, పోనీ పేపర్ తిరగేద్దామన్న సేమ్ టూ సేమ్, భగవంతుడా ఏంటి నాకు ఈ శిక్ష...... అని అనుకొని భాదపడ్డా...ఆయినా వెంటనే సర్దుకొన్నా... ఎందుకంటే ఈ విషయము జగన్ కి ఎక్కడ తెలిసి నన్ను ఓదార్చడానికి వచ్చేస్తాడెమో అని..

అంతగా జగన్ మేనియా ఏర్పడిపోయిందీ మన అంద్ర ప్రదేశ్ లో...........

కాంగ్రెసు, తెలుగుదేశం, టి.ఆర్.ఎస్... ఈనాడు, ఆంద్రజ్యోతి.. ఇలా ఎవరైతేమేనిమి ఎవరూ చూసిన మన జగన్ ఘనకార్యాలు గురించి అడిగిన వాడికి, అడగని వాడికి కూడా చెవిలో కూర్చుని కోడై కూసారు...... వీళ్ళు చేసిన ప్రచారానికి, అసలు జగన్ అంటే ఎవరో తెలియని వాళ్ళకి, అసలు రాజకీయాలనే పట్టించుకోనని కొంత మంది అభ్యుదయవాదులకు, అఖరికి మా ఇంట్లో ఉన్న కుక్కకు కూడా తెలిసిపోయింది జగన్ అంటే ఎవరో... టి.వి.లో జగన్ చూడగానే మా కుక్క నిజంగానే గుర్తుపెట్టి భౌ...భౌ.. మని అరిచి, తాను నాకు కూడా తెల్సు అని అర్దమెచ్చేలా తోక ఊపుతుంది.

ఇంకా చెప్పాలంటే ఉప ఎన్నికల సందర్బంగా ఆయా పార్టిలు తాము ఏమి చేయగలమో చెప్పాకుండా, జగన్ ఏమి చేసాడో చెప్పడానికే వారి మేనిపోస్టో మొత్తము సరిపోయింది. ఏ నాయకుడు చూసిన, ఏ మైకు ముందు చూసిన అందరూ జగన్ పేరు తలచుకోనేవారే.....

ఎంత ఇమేజి కాకపోతే మాత్రం,,,,,,, అంత మంది కలసి జగన్ ఒక్కడి గురించి మాట్లాడుకుంటారు చెప్పండి....
అలానే అనుకున్నారు మన ప్రజలు కూడాను..... అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ఇంకా యితర చిన్న చితకా నాయళ్ళు, మీడియా వాళ్ళు అందరూ కలసి ఒక వ్యక్తిని గూర్చి పదే పదే చెప్పడంతో కొద్దో, గొప్పో ఉన్న జగన్ ఇమేజి ఒక్కసారిగా పెట్రోలు రేటు పెరిగినట్టుగా పైపైకి ఎగబాకిపోయింది..... అది ఏ రకమైనా ఇమేజి అని అడక్కండి. రాముడికి ఇమేజి ఉంది. అదే విధంగా రావణసురుడికి ఇమేజి ఉంది. సో..జగన్ ది ఏ రకమైన ఇమేజి అన్నది నాకు తెలియదు... అది ఎవరికి వారే అన్వయించుకోవాలి.

ఉదయం ఆరు గంటలకు మొదలు.. రాత్రి పొద్దుపోయే వరకు ఏ చానల్ పెట్టినా, ఏ పేపరు తిరగేసినా, ఏ రాజకీయ నాయకుడుని చూసిన జగన్ గురించి మాట్లాడకుండా ముగించటల్లేదు.... ఆ విధంగా జగన్ ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో సంపాదించుకొన్న క్రేజి కన్నా, ఈ విధంగా విపరీతమైన క్రేజి సంపాదించేసుకున్నాడు... అఖరికి జగన్ గురించి పబ్లిసిటి చేయడానికి ఢిల్లీ నుండి కూడా అరువు నాయకులను తీసుకువచ్చీ మరీ జగన్ నామస్మరణ చేస్తే కాని వదల్లేదు మన నాయకులు.

కాని ఇక్కడ అసలు ట్విస్టు ఏమిటంటే......

ఇవన్నీ ఓపిగ్గా (తప్పక) చూస్తున్న జనాలకు కూడా జగన్ పేరు వింటేనే కానీ, ఆ రోజుకి నిద్ర రాని పరిస్దితి వచ్చేసింది.. దానితో జనాలు ఏ రోజైనా మన రాష్ట్రంలో కిరణ్, బొత్స సత్తిబాబు, చంద్రబాబు అనే వ్యక్తులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయినప్పటికి, జగన్ పేరుని మాత్రం మర్చిపోలేని స్టేజికి వచ్చేసారు...

కానీ.. వారందరూ ఏ వ్యక్తి గురించి ఆయితే మాట్లాడుకుంటున్నారో, ఆ వ్యక్తిని మాత్రమే గుర్తించుకొన్నారు..... ఆయన చేసిన ఘనకార్యాలు గురించి మాత్రం జనాలు మర్చిపోయారు.... ఆయిన అదంతా గుర్తు పెట్టుకోవడానికి ఆ లిస్టు ఏమన్నా చిన్నదా ఏమిటీ? చాంతాడంత ఉన్న జగన్ గారి ఘనకార్యాలు గురించి మనకున్న మిడి మిడి తెలివి సరిపోదు అని అనుకొని... దాని గురించి పట్టించుకోవడం మానివేసారు.... మనకు అర్దమయిన దాని ప్రకారం జగన్ అనే వ్యక్తి గురించి పది మంది చెప్పుకుంటున్నారు... అంతే అనుకొని పోలేమని పోయి గుద్దేసారు... ఈ.వి.ఎమ్ ల మీద..

ఫలితం.......

ఉప ఎన్నికల్లో వైకాపా భారి విజయం నమోదు... పదిహేను సీట్లు కొల్లగెట్టేసి జలక్ ఇచ్చాడు.... తనకి ఉచితంగా పబ్లిసిటి చేసిన వెర్రి వెధవలు అందరికి....



అధికార, ప్రతిపక్ష పార్టిలకు బోడి చిప్ప మిగిలింది......

నీతి: ఏ పని చేసిన ఒక పరిధి వరకే చేయాలి. ఆ పరిధి దాటి చేస్తే మొదటికే మెసము వస్తుంది. (అధికార పక్షానికి, ప్రతిపక్షానికి, రామెజిరావు, రాధాకృష్ణలకు)



గమనిక: శ్రీధర్ గారి కార్టూన్ ఈనాడు పేపరు నుండి తీసుకోవడమైనది